భగవన్నామము యొక్క ప్రభావము19.05.2011 గురువారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంథువులకు బాబావారి ఆశీర్వాదములు.
7 మాసముల సెలవు తరువాత మరలా తిరిగి ఉద్యోగంలో ప్రవేశించడం జరిగింది. అందుకనే ప్రతీరోజు ఒక లీల ఇద్దామన్నా కూడా వీలు లేకుండా పోతోంది. సమ్యం చిక్కినప్పుడల్లా వీలు చూసుకుని పోస్ట్ చేస్తున్నాను.
అంతా బాబాయే చేయిస్తున్నారు. ప్రతీ రోజు యేదోఒకటి పోస్ట్ చేస్తె అదొక తృప్తి. కాని యేది పోస్ట్ చేసినా అది అందరికీ ఉపయోగకరంగా ఉండాలి. పోస్ట్ చేసేది యేదో చదవడానికి కాదు. మనం చదివేది మనకి, మనం మళ్ళీ యతరులకి చెప్పదగ్గదిగా ఉండాలి.
ఈ రోజు మనం నామ జపం గురించి తెలుసుకుందాము. రాముడైనా, కృష్ణుడైనా అంతా బాబాయే.
నామమును జపించుట, కీర్తించుట, శ్రవణము చేయుట, స్మరించుట వలన పూర్వము చేసుకున్న సమస్త పాపములు నశిస్తాయి. అజ్ణానంతో మనలో ఉన్నటువంటి అహంకారము, మమకారములు, రాగ ద్వేషాలు, కామక్రోథములు, లోభమోహములు మొదలైన దుర్గుణాలన్నీ కూడా సమసిపోతాయి. వాటినుండి విముక్తులమవుతాము. అన్ని దురలవాట్లు కూడా మనలని విడిచిపోతాయి. దుఖములన్నీ పూర్తిగా తొలగిపోతాయి. నామ జపము వల్ల పరమాత్మని తప్పక పొందవచ్చు.
హనుమంతుడు పావనమైన శ్రీ రాముని తన వశమందుచుకొనగలిగాడు. ఆర్తుడైన గజేంద్రుడు, చిలుకకు రామ నామము నేర్పిన గణికాంగన శ్రీ హరినామ మహిమతో ముక్తిని పొందారు.
లోపల, బయట కూడా ప్రకాశముము కోరుకున్నట్టైతే ముఖమనెడి ద్వారమున నాలుక అనే గడపపై రామనామము అనే మణిద్వీపాన్ని ఉంచాలి.
ఒక కవి ఇల్లా చెప్పారు
"యెండుగడ్డిమీద నిప్పుకణిక పడినచో అది దగ్ధమైనట్లు భగవన్నామమును హృదయమునందు జపించినచో పాపములన్ని నశించును."
శ్రీ మద్భాగవతంలో :
అజ్ణానాదథవా జ్ణానాదుత్తమశ్లోకనామ యత్
సంకీర్తితమఘం పుంసో దహేదేథో యథానలహ
" అగ్ని కఱ్ఱలను కాల్చివేయును. అట్లే తెలిసి అయినను, తెలియక అయినను ఉత్తమ శ్లోకుడగు శ్రీహరినామమును కీర్తించిన వారియొక్క పాపములన్నియు నశించును."
శ్రీ చైతన్య మహా ప్రభువు యిలా చెప్పారు:
"భగవంతుడు తన అనేక నామములను ప్రకటించెను. వాటిలో తన శక్తినంతయు జొప్పించెను. వానిని స్మరించుటకు కాలనియమేదియును చేయలేదు. మనుష్యుడు యెల్లవేళల భగవన్నామమును స్మరింపవచ్చును. దీనికి యే ఆటంకము ఉండదు.
శ్రీమద్భగవద్గీతలో శ్రీ కృష్ణపరమాత్మ యిలా చెప్పారు.
"మిక్కిలి దురాచారుడైనను అనన్య భక్తితో నన్ను భజించినచో అతనిని సత్పురుషునిగానే భావించదగును. యేలననగా అతడు నిశ్చయ బుథ్థి గలవాడు. అనగా పరమాత్ముని సేవించుటతో సమానమైనది మఱియొకటి యేదియును లేదని గట్టిగా నిశ్చయించుకొనినవాడు.కౌంతేయా ! అతడు శీఘ్రముగా థర్మాత్ముడగును. శాశ్వతమైన పరమశాంతిని పొందును. నా భక్తుడెన్నడును నష్టమునకు గురికాడు"
నామము నామి నుండి వేరు కాదు.
నామము అంటే పేరు; ఆ నామము కలవాడు నామి.
నామమును జపించుటవలన నామి యొక్క స్మరణము సహజముగ అప్రయత్నముగ జరుగుచుండును.
వాక్కు ద్వారా భగవన్నామమును జపించుటకంటె మనస్సులో థ్యానించుట వలన అది వందరెట్లు అథిక ఫలాన్నిస్తుంది. ఆ మానసిక జపము కూడా శ్రథ్థాభక్తులతో చేస్తే కనక దానివలన అనంతఫలము లభిస్తుంది. దానిని గుప్తముగా నిష్కామభావముతో చేసిన యెడల అది శీఘ్రముగా పరమాత్మ ప్రాప్తిని కలుగచేస్తుంది.
నామ జపము వలన పాపములు నశించుచుండును కదా అని తలచి పాపములను ఆచరించుట, ప్రజలముందు ప్రదర్శించుటకు నామజపమును నెపముగా చేసుకొని, రహశ్యంగా పాపములు చేయుట, భగవన్నామము పేరుతో పాపము చేయుట యివి అన్నీ డాంబికముగా ప్రవర్తించుటయే అవుతుంది.
నామ రహశ్యమును తెలుసుకున్నవాడు దోషరహితుడు అవుతాడు.
అంతా చదివారు కదా. ఇందులో ముఖ్యంగా మనము గమనింపవలసినది యేమిటంటే ఆ భగవన్నామౌ, శ్రీరామునిది కావచ్చు, శ్రీకృష్ణపరమాత్మునిది కావచ్చు, షిరిడీ సాయిబాబాది కావచ్చు. కాని ఆ నామము సదా మన మనసులో జపం చేయబడుతూ ఉండాలి. నామ జపానికి కాల నియమమేదీ లేదు. యే సమయంలోనైనా జపించుకోవచ్చు.
ఆఖరికి మనము స్నానాల గదిలో స్నానం చేస్తున్నా కూడా "సాయి సాయి" అని నామ స్మరణ చేసుకోవచ్చు. నామ జపము చేసిన వాడికి అంతకంటే ముక్తికి దగ్గిర దారి మరొకటి లేదు. కాని ఆ నమ జపం చేయడం మనం యితరులు చూడటానికి కాదు . "ఆహా ! ఈయన యెంతటి బాబా భక్తుడొ అని అనిపించుకోవడానికి కాదు. మనము మన్స్పూర్తిగా బాబామీదే మనసు లగ్నం చేసి సాయి నామ స్మరణ నిరంతరం మనసులోనే జపిస్తూ ఉంటే ఆయన మన మనసులో స్థిరంగా ఉంటారు. మనకి తక్షణ సహాయం అందిస్తారు.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.
0 comments:
Post a Comment