29.10.2011 శనివారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాబంధువులకు బాబావారి శుభాసీస్సులు
ఇంతవరకు మనము సాయి.బా.ని.స అనుభవాలను చదివాము. ఈ రోజు నుంచి సాయి.బా.ని.స. ఏర్చి కూర్చిన ఆయన చెప్పిన ఆణి ముత్యాలను తెలుసుకుందాము.
శిఖరాలు - లోయలలో శ్రీ సాయి
మానవ జీవితము గురించి శ్రీ షిరిడీ సాయి ఆలోచనలు
కూర్పు: సాయి. బా. ని. స
1. జీవితము ఒక తెల్లకాగితము వంటిది. దానిమీద మంచి విషయాలు వ్రాస్తే ఆ కాగితాన్ని నెత్తిమీద పెట్టుకుంటాము. చెడు విషయాలు వ్రాస్తె చింపి పారవేస్తాము.
శిరిడీ సాయి 18.09.92
2. జీవితములో ఆధ్యాత్మిక చింతన అనే నిచ్చెన కొంత వరకు ఎక్కిన తరవాత అక్కడ జాగ్రత్తగా నిలబడాలి. అక్కడనుండి క్రిందకు దిగజారకూడదు.
శిరిడీ సాయి 22.08.92
3. జీవితము ఆటల పోటీవంటిది. చిన్న పిల్లల మధ్యన ముసలివాడు కూడ సంతోషముగా ఆటలు ఆడాలి.
శిరిడీ సాయి 09.04.92
4. జీవితములో చేసిన తప్పులను సరిదిద్దుకొని మంచి మార్గములో నడిచేవాళ్ళు అన్నము పెడితే కాదనకుండ స్వీకరించు.
శిరిడీ సాయి 02.08.92
5. జీవీతము అనే నాటకములో నీ పాత్ర - "ఇతర పాత్రలను ఈ ప్రపంచానికి పరిచయము చేయటం వరకే" అని గుర్తుంచుకో.
శిరిడీ సాయి 30.09.92
6. జీవితములో ఆధ్యాత్మిక జీవనము ప్రారంభించిన తర్వాత జీవత భాగస్వామి నీకన్న ముందుగా నా సన్నిధికి చేరితే బాధ పడకుండ శేష జీవితము పూర్తి చేసి నీవు నా సన్నిధికి చేరు.
శిరిడీ సాయి 14.09.92
7. జీవితము ఒక విద్యుత్ అయస్కాంతము. దానితో నీముందు ఉన్న మంచి, చెడులలో మంచినే గ్రహించేలాగ చూసుకో.
శిరిడీ సాయి 24.10.92
8. జీవితము ఒక పరుగుపందెము లాంటిది. భగవంతుడు అందరికి ఆలోచనా శక్తి కలిగిన మెదడును బహుమతిగా ఇచ్చి నిండు నూరు సంవత్సరాల దూరాన్ని మంచి నడవడికతో పరుగు ఎత్తమంటే ఎంతమంది గమ్యము చేరుకుంటున్నారు.
శిరిడీ సాయి 18.11.92
9. జీవిత శిఖరాల పై ఉన్న ప్రాపంచిక మంటలలో బాధపడే కన్న జీవితలోయలలోని ఆధ్యాత్మిక సెలయేరుల ప్రక్కన ప్రశాంతముగా జీవించటము మిన్న.
శిరిడీ సాయి 27.06.92
10. జీవితము ఒక పెద్ద నది కానవసరము లేదు. అది ఒక చిన్న సెలయేరు కావచ్చును. ఆ చిన్న సెలయేరు కూడ ఆఖరికి సముద్రములో (నాలో) కలవాలి కదా.
శిరిడీ సాయి 15.07.92
11. జీవితము కొబ్బరి చెట్టులాగ పెరిగి సంఘానికి ఉపయోగపడాలి. అంతేగాని సీమచింత చెట్టులాగ ఎదిగి ఏమి చేయాలి?
శిరిడీ సాయి 10.12.92
12. జీవితము పచ్చటి వరిపైరులాగ ప్రతి సంవత్సరము పంటలు పండించుతూ సంఘానికి ఉపయోగపడాలి. ఒకసారి రాయి త్రవ్విన తర్వాత పనికి రాని రాతిగ మారితే ఎవరికి ఉపయోగము?
శిరిడీ సాయి 10.12.92
13. జీవితము కష్ట సుఖాల మయము. నీవు సుఖమును సంతోషముగా కోరినప్పుడు కష్టాలను కూడ నీవు సంతోషముగా స్వీకరించాలి.
శిరిడీ సాయి 13.12.92
14. జీవితము అనే నదికి ప్రతిరోజు పండగే. ఈ పండగలో జనాలు స్నానానికి వస్తూ పోతూ ఉంటారు. ఈ జన సమ్మేళనలో మితృలు కలుస్తారు. శతృవులు ఎదురు అవుతారు. అందరితోను కలసి మెలసి తిరగాలి తప్పదు.
శిరిడీ సాయి 01.06.93
15. జీవితములో బంధాలు తెంచుకోవటము అంత సులభము కాదు. నీ విధి, నీబాధ్యతలను నీవు నిర్వర్తించు.
శిరిడీ సాయి 17.12.92
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
(ఇంకా ఉంది.)
0 comments:
Post a Comment