03.11.2011 గురువారము
శిఖరాలు - లోయలలో శ్రీ సాయి
మానవ జీవితము గురించి శ్రీ షిరిడీ సాయి ఆలోచనలు.
కూర్పు : : సాయి. బా. ని. స.
76. జీవితములో శ్రీ సాయి కవచములేనపుడు పొందిన అవమానాలు, పగ, వైషమ్యాలు - శ్రీ సాయి కవచము ధరించిన తర్వాత పొందిన విజయాలతో నీవు సులువుగా మర్చిపోగలవు. శ్రీ సాయి కవచము ధరించినవారికి ప్రతీకార ఇచ్చ ఉండదు అని గ్రహించు.
24.09.94
77. జీవితములో నీకు సహాయము చేసినవారు, వారి యింట శుభకార్యాలలో భోజనము చేయటానికి ఆహ్వానము వచ్చిన, సంతోషముగా వెళ్ళి భోజనము చేయి. ఆ విధముగా పిలిచినవారు నీకంటే గొప్పవారా లేక బీదవారా అని మాత్రము ఆలోచించకు.
17.10.94
78. జీవితములో మనకు కష్టము, సుఖము కలిగినపుడు ఆ కష్టసుఖాల వెనుక యున్న శక్తి గురించి ఆలోచించుతూ ఉంటాము. ఆ ఆలోచనలనే మతము అంటాము. భగవంతుని గురించి తెలుసుకోవటానికి మతము చాలా అవసరము.
06.09.97
79. జీవితము అనే పొలములో అజ్ఞానము అనే కలుపు మొక్కలను తీసివేయుట నావంతు. ఇక మిగిలిన జ్ఞానము అనే మొక్కలను పెంచి పెద్ద చేయుట నీవంతు.
26.09.97
80. జీవితములో మమతలు, మమకారాలు, మనమన్సుకు సంతోషము, విచారము కలిగించటానికే పరిమితము అయినవి. అటువంటి సంతోషముతో మనకు లభించేది ఏమీలేదు. ఆ విచారములో మనకు పోయినది ఏమీ లేదు. అటువంటప్పుడు మమతలు, మమకారాలు మధ్య కొట్టుమిట్టు ఆడటములో అర్ధము లేదు.
17.11.97
81. జీవితములో మనము తప్పుడు పనులు చేస్తున్నామని గ్రహించిన తర్వాత కూడ తప్పుడు పనులు చేస్తున్నపుడు ఆ పనులువలన కలిగే పరిణామాలు స్వీకరించటానికి సిధ్ధపడాలి. నీవు చేసే తప్పుడు పనులకు నీ ఆత్మ నీకు సాక్షి అని గుర్తించు.
13.12.97
82. జీవితములో జరిగిపోయిన సంఘటనలకు నీవు సాక్షీభూతుడివి. గత జీవిత ఆలోచనలకు విలువ ఇవ్వరాదు. వర్తమానాన్ని నమ్ముకొని ప్రశాంతముగా జీవించు.
10.01.98
83. జీవితములో నీపై నీకు నమ్మకము కలిగేలాగ జీవించటము నేర్చుకో. నీ స్వశక్తిమీద నీవు ఎంత పని చేయగలవు అనేది నీకు తెలిసిన రోజున నీవు నీ పై అధికారి ప్రాపకము కోసము ప్రయత్నము చేయనవసరము లేదు. నీ శక్తికి తగిన పని చేసి జీవితములో సుఖశాంతులు పొందు.
21.01.9884. జీవితములో నరుడిని పూజించిననాడు అతడు నిన్ను బానిసగా చూస్తాడు. అదే నీవు నారాయణుడిని పూజించిన ఆయన నీకు ప్రత్యక్షమై "నేను నీ బానిసను" అని అంటారు.
(శిఖరాలు - లోయలలో శ్రీ సాయి సమాప్తం)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment