05.11.2013 మంగళవారం
సాయిబంధువులందరికీ కాస్త ఆలశ్యమయినా దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ రోజు సాయితో మధురక్షణాలలోని 24వ.క్షణం ప్రచురిస్తున్నాను.
సర్వీసునుండి రిటైర్మెంట్ అయాక ప్రతీరోజు ప్రచురణ చేద్దామని తలిచాను గాని, కొన్ని కొన్ని అనుకున్నవి అనుకున్నట్లు జరగవు. హైదరాబాదు వచ్చి గృహసంబంధ వ్యవహారాలు, పనులలో ఉన్నందువల్ల ప్రచురణకి సాధ్యపడటంలేదు. అదీకాక మధురక్షణాలను ఆంగ్లం నుండి తెలుగులోనికి కూడా అనువాదం చేయాలి. దానికి కూడా సమయం తీసుకుంటుంది. అందుచేత అవి అనువాదం చేస్తూ చిన్న చిన్న లీలలు కొన్ని ప్రచురించడానికి ప్రయత్నం చేస్తాను.
మనం బలవంతులమే కావచ్చు, బలహీనులమే కావచ్చు, మనకు కావలసిన శక్తి ఆసాయినాధులవారే ఇస్తారు. ఒక్కొక్కసారి మనకు ప్రమాదకరమయిన పరిస్తితులు ఎదురు పడచ్చు. అటువంటి పరిస్తితులలో నమ్మకం, విశ్వాసంతో సాయినాధులవారిని స్మరించి బాబా నీవే దిక్కు, నన్నీ కష్టం నుండి గట్టెక్కించు అని మనసారా ప్రార్ధిస్తే ఆయన తప్పక సహాయం చేస్తారు. బలహీనులను కూడా శక్తిమంతులుగా మారుస్తారు. ఈ రోజు మీరు చదవబోతున్న క్షణం దాని గురించి వివరిస్తుంది. ముందుగా
శ్రీవిష్ణుసహస్రనామం 91వ.శ్లోక, తాత్పర్యం..
శ్లోకం : భారభృత్కధితో యోగీ యోగీశః సర్వకామదః
ఆశ్రమః శ్రమణః క్షామః సుపర్ణోవాయువాహనః
తాత్పర్యం: పరమాత్మను నీ సమస్త భారమును వహించువానిగా, నీ జీవితమందలి కధలుగా వర్ణింపబడువానిగా ధ్యానము చేయుము. నీలో నున్న యోగి అతడే. ఆయన అన్ని సమస్యలనూ పరిష్కరించు యోగీశ్వరుడు. ఆయనయే నీకు ఆశ్రమము. మరియూ నీ పనులను నీవే నిర్వర్తించుకొనగల సామర్ధ్యము విష్ణువే. నీవు ఉపవాసము చేసినచో నీయందు కృంగి కృశించువాడతడే. ఆయనయే గరుత్మంతుడు. వాయువే వాహనముగా గల అగ్ని ఆయనయే.
శ్రీసాయితో మధురక్షణాలు - 24
సాయి - బందీ
అమెరికాలోని డెట్రాయిట్ నగరం. ఆరోజు 21.02.1985 గురువారం. అన్ని రోజులలాగే ఆరోజు కూడా ఎటువంటి ప్రత్యేకతా లేకుండా సామాన్యంగానే ఉంది. నేను పనిచేస్తున్న సూపర్ మార్కెట్ అండర్ గ్రౌండ్ లో ఉన్న సరకులన్నిటినీ కన్వేయర్ బెల్ట్ మీద పైకి పంపిస్తున్నాను.
నాకు బేస్మెంట్ లోనే పని చేయడం చాలా ప్రశాంతతనిస్తుంది. ఎవరిగోలా ఉండదు. ఇంకొకరి సమస్యలలో తలదూర్చడం నాకిష్టం ఉండదు. ఒక సాయి భక్తురాలిగా అది అనుచితం, పైగా చాలా స్వార్ధం. హటాత్తుగా ఎవరో మెట్లమీదనుంచి క్రిందకు పరిగెత్తుకుంటూ వస్తున్న చప్పుడు వినబడింది. వచ్చినది క్యాషియర్ షిర్లే. ఆమె వస్తూనే ఎవరో దోపిడీ దొంగలు వచ్చి షాపుని లూటీ చేస్తున్నారని చెప్పి మరలా వేగంగా పైకి వెళ్ళిపోయింది.
నేను ఇక్కడ క్రింద బేస్ మెంట్ లో ఉన్నానే విషయం ఎవరికీ తెలీదు. అందుచేత పైన జరుగుతున్న లూటీ జరుగుతుంటే నాకేమి సంబంధం? ఈ విధంగా ఆలోచించి నాపనిలో నేను మునిగిపోయాను. ఇంతలో నావెనుక కొంత గందరగోళం వినపడింది. మెట్లమీదనుండి నలుగురు మనుషులు దిగుతూ వస్తుండడం కనపడి బెదరిపోయాను. వారిలో ఒకరు జిమ్మీ (గుమాస్తా, ఇంకొకరు దోరా (క్యాషియర్) మిగిలిన యిద్దరూ ఆగంతకులు. వారిద్దరూ జిమ్మీ, దోరా తలలకి తుపాకులు గురిపెట్టారు.
నేను సాయిబాబాను తలచుకొని, 'బాబా వీరినెందుకు ఇక్కడికి తీసుకొని వచ్చావు అని మనసులో అనుకొని వారు చెప్పినట్లే చేసి వారి విషయంలో జోక్యం చేసుకోరాదనుకున్నాను.
తుపాకులు పట్టుకున్నవారిలో ఒక వ్యక్తి 'బయటకు వెళ్ళే దారేది?' అని అరిచాడు. అతను పొట్టిగా చూడటానికి పిల్లవాడిలా ఉన్నాడు. మరొకతను కాస్త పొడవుగా ఉన్నాడు. వయస్సు 20 సంవత్సరాలు ఉండచ్చు. నేను వారి తుపాకులవైపు చూశాను. ఏమీ మాట్లాదవద్దన్నట్లుగా నాలో సాయిబాబా ప్రేరణ కలిగించారు. వారు అన్ని తలుపులు తెరవడానికి చూశారు గాని ఏమీ తెరచుకోలేదు. వారు జిమ్మీ చేయిపట్టి లాగుతూ తొందరగా మెట్లమీదుగా వెళ్ళారు. దోరా హిస్టీరియా వచ్చినదానిలా ఏడుస్తూ నిలబడిపోయింది. నేనామెని ఏమీ అనలేను . కారణం ఆమె 5 నెలల గర్భవతి.
మెట్లమీదుగా మరింతగా అడుగుల చప్పుడు విబడింది. ఈ సారి దోపిడీదొంగలు మాత్రం వచ్చారు. బయటకు పోవడానికి కాపలాలేని దారి ఎంతవెదకినా దొరకకపోవడం వల్ల క్రిందకు వచ్చారు. జిమ్మీ ఎలాగో తప్పించుకొని ఉంటాడు.
'బయటపోలీసులు ఉన్నారు.మనకి ఒక బందీ అవసరం' పొట్టిగా ఉన్న వ్యక్తి ఆందోళన నిండిన స్వరంతో అన్నాడు. దోరాని చేయి పట్టుకొని లాగాడు.
నేను 1984 సంవత్సరంలో అమెరికాలో అడుగు పెట్టినప్పటినించి 'బందీ' అనే మాట వింటున్నాను. బందీగా ఉండటమంటే, అది చాలా ప్రమాదకరం కూడా. కాని నాకు ఈ విధంగా యిటువంటి సంఘటనను ప్రత్యక్షంగా అనుభవించే స్థితిని సాయిబాబా కల్పిస్తాడని ఏమాత్రం ఊహించలేదు. ఒక్క క్షణం నాకు చాలా భయం వేసింది.
ఆగంతకుడు దోరా చేయిపట్టి లాగినపుడు ఆగు అని గట్టిగా అరిచాను. నేనేనా ఇలా గట్టిగా మాట్లాడింది? అసలు ఈ వ్యవహారంలో సాహసం చేయాలని, జోక్యం చేసుకోవాలని అనుకోలేదు. కాని, ఆమె గర్భంలో ఉన్న శిశువు క్షేమం నాకు ముఖ్యం . అవును అదే ముఖ్యం. అప్పుడనిపించింది నాకు, నేనెందుకలా ప్రవర్తించానో.
ఇక ఏవిషయం పట్టించుకోకుండా ఒక సాయి భక్తురాలిగా సాయినే నమ్ముకొన్నాను. నమ్మకం నా జీవిత పరమార్ధం. సాయిబాబా నాలోనుండి చెబుతున్నట్లుగా అనిపించింది, 'ఏదో ఒకటి చేయ్యి . ప్రత్యక్షసాక్షిగ ఊరికే చూస్తూ కూర్చోకుండా బాబా నన్ను యింకా ధైర్యంగా ఏదో చేయమంటున్నారని అర్ధం చేసుకొన్నాను. తాత్యా పాటిల్ ను బ్రతికించడానికి సాయిబాబా తన జీవితాన్నే ధారపోశారు. నా సహోద్యోగిని రక్షించడానికి నాకిది మంచి అవకాశం.
నేనొక అడుగు ముందుకు వేసి 'ఆమె గర్భవతి. ఆమెను వదలిపెట్టి కావాలంటే నన్ను బందీగా తీసుకువెళ్ళండి' అన్నాను. వారిద్దరూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకొని దోరా చెయ్యి వదలి నన్ను లాగారు. ఎయిర్ కండిషన్ సామానులు ఉంచే చిన్న గదిలో నన్ను బందీగా ఉంచారు. దొంగలిద్దరూ బాగా చెమటలు కక్కుతున్నారు. అయినా వాళ్ళిద్దరూ నామీదకు తుపాకులు గురిపెట్టి ఉంచారు. నాతో సహా అందరినీ రక్షించమని సాయిబాబాని యిలా ప్రార్ధించాను. 'సాయిదేవా! నువ్వు ఎప్పుడు నావెంటే ఉన్నావని తెలుసు. నాకు ధైర్యాన్ని ప్రసాదించు.'
పైన ఒక్కడే పోలీసు ఉన్నప్పుడే మనం కాల్చి ఉండాల్సింది పొడవుగా ఉన్న వ్యక్తి అన్నాడు.
'అవును, ఇప్పుడు మనల్ని చమపేస్తారు పొట్టిగా ఉన్న వ్యక్తి అన్నాడు.
వారు తుపాకీ పేల్చడానికి సిధ్ధంగా ఉన్నారు. నేను నిస్సహాయురాలిని. సాయిబాబాను ప్రార్ధిస్తూ ఉన్నాను. అకస్మాత్తుగా నాలో సాయినాధుని ప్రేరణ కలిగింది. మీరెందుకులా ప్రవర్తిస్తున్నారని వారినడిగే ధైర్యం వచ్చింది. కాస్త రిలీఫ్ గా అనిపించింది.
'నీకు భర్త, పిల్లలు ఉన్నారా' పొట్టిగా ఉన్న వ్యక్తి అడిగాడు.
నామదిలో నాభర్త, నామేనల్లుడు రవి మెదిలి ఉన్నారనీ జవాబు చెప్పాను.
'బాగుంది, నాకిద్దరు పిల్లలు ఇంకొకడు రాబోతున్నాడు అన్నాడు.
'మేము బందిపోటులం కాదు. మాకు ఉద్యోగం లేదు. మాకు డబ్బవసరం. నేను కాలేజీలో చేరదా మనుకుంటున్నను. మేము ఎవరినీ చంపదలచుకోలేదు పొట్టిగా ఉన్నతను అన్నాడు.
'అవును. ఆవిధంగా చేయకూడదు. మీరు తుపాకులను వదిలేసి నన్ను బయటకు పంపిస్తారా?' అని అడిగాను.
'లేదు! మాకు ఒక బందీ కావాలి పొడవుగా ఉన్న వ్యక్తి అన్నాడు.
పోలీసులు అండర్ గ్రౌండులోకి అప్పటికే వచ్చేశారు. వారు దొంగలని షూట్ చేయడం వారి శరీరాలన్నీ బుల్లెట్ లు తగిలి పడిపోతున్నట్లుగా ఊహించుకొన్నాను. 'సాయినాధా! యిలా ఏమీ జరగకుండా చూడు. నేను ఇందులో చిక్కుకుపోయాను. ఈ యిద్దరికీ నాకు చేతనయినంతగా సహాయం చేయగలిగే శక్తినివ్వమని బాబాని ప్రార్ధించాను.
నేనొక క్షణం తొందరగా వారితో యిలా అన్నాను. 'మీకు మీప్రాణాలు చాలా ముఖ్యం. మీరు మీకుటుంబాలగురించి ఆలోచించాలి. దోపిడీ దొంగలుగా మారి మీజీవితాలనెందుకు నాశనం చేసుకుంటున్నారు? మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి. యిదొక్కటే మార్గం'.
'కాని పోలీసులు మమ్మల్ని ఎలాగైనా షూట్ చేస్తారు పొట్టిగా ఉన్న వ్యక్తి అన్నాడు.
'అయితే ఆ తుపాకులు నాకివ్వండి. నేను బయటకు వెడతాను అన్నాను.
'కాని నిన్ను చంపేయచ్చు,' ఆమాటలు నాకు సూటిగా తగిలి చలించిపోయాను. నాజీవితం వాళ్ళ జీవితంకన్నా ఎక్కువా? నేను వారికోసం ఏమయినా చేయగలనా? యింతకు ముందెప్పుడూ నాకు యిటువంటి భావన వచ్చినట్లుగా నాకు గుర్తు లేదు.
'ఈ గోడకున్న రంధ్రం ద్వారా మీతుపాకులను బయటకు విసిరేస్తే ఎలా ఉంటుంది?' అన్నాను.
కొద్ది సెకండ్లు వారు నావైపు తేరిపార చూశారు. తరువాత తమ తుపాకులని నాచేతిలో పెట్టారు. గోడకున్న రంధ్రంలోనుండి తుపాకులని బయటకు విసిరేస్తున్నానని పోలీసులతో చెప్పాను. కొద్ది నిమిషాల తరువాత మేము బయటకు వచ్చాము. ఆవిధంగా ఒప్పందం జరిగింది. అదంతా ఎంత వేగంగా జరిగిపోయిందో నేను నమ్మలేకపోయాను. నేను చేయవలసిన పని సాయిబాబా నాచేత చేయించారు. నేనేమిటో నాకు తెలిసింది. నేనెంతో సాహసం చేశాను. అది ఖచ్చితం.
కాని ఎవరైనా ఒక విషయంలో తలదూర్చారంటే అందులొ అపాయం ఉంటుందని తెలుసు. యిప్పుడు నేను సాహసం చేయదల్చుకున్నాను. తమ శక్తేమిటో, తనెవరో తెలుసుకోనివారికి సాయినాధుడు వారిచెంత ఉండి రక్షిస్తారని అర్ధమయింది.
సత్యమార్గంలో చెప్పబడిన ఒక సూక్తిని వివరిస్తూ ముగించదల్చుకున్నాను. 'ఎంత ఆనందం నాలోనుండి వ్యక్తమవుతుందో, ఎంత ప్రేమయితే నానుండి ప్రవహిస్తుందో, నేనెంత దయతో ఉంటానో, నెనెంతవరకు సహనంతో ఉంటానో , నాజీవిత సారం కూడా అదే విధంగా వృధ్ధి పొందుతుంది.'
అనుకోని పరిస్థితులలో వాటిని తట్టుకునే శక్తి ధైర్యం, ఆమెకు బాబామీద ఉన్న నమ్మకం, విశ్వాసం కలిగించాయి.
సాయిసుధ, 1989
శ్రీమతి ఉషా రంగనాధన్
కర్నాటక
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment