16.10.2013 బుధవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
30,09,2013 న బ్యాంకు సర్వీసునుండి రిటైర్ అయ్యాను. ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నాను. బ్లాగులో ప్రచురణకు కొంత ఆలశ్యం తప్పటల్లేదు. కాస్త ఓపిక పట్టి ఇంతకు ముందు ప్రచురించిన బాబా లీలలను మరలా ఒకసారి చదువుకొని ఆనందాన్ని అనుభూతిని పొందండి.
ఈ రోజు మీరు చదవబోయే సాయితో మధురక్షణాలలో బాబాగారు శ్రీసాయి సత్ చరిత్రలో వివరించిన శిష్యులలోని రకాల గురించిన ప్రస్తావన వస్తుంది. గురువుమీదనే అచంచలమైన విశ్వాసం పెట్టుకొని ఇక ముందూ వెనకా ఆలోచించకుండా గుడ్డి నమ్మకంతో చేసిన పని కూడా అసాధ్యమనుకున్నది కూడా సాధ్యం చేస్తుందని వివరిస్తుంది ఇప్పుడు మీరు చదవబోయేది.
ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 90వ.శ్లోకం, తాత్పర్యం
శ్లోకం: అణుర్భృహత్కృశః స్ఠూలో గుణభృన్నిర్గుణోమహాన్
అధృతః స్వధృతః స్వాస్ఠ్యః ప్రాగ్వంశోవంశవర్ధనః
తాత్పర్యం: పరమాత్మను అణువుగా, మరియూ విశ్వముగా, పలుచనివానిగా మరియూ స్ఠూలమైనవానిగా, గుణములు గలవానిగా, మరియూ గుణములు లేనివానిగా,ఆయనను ధ్యానము చేయుము. ఆయన తనని తాను ధరించుటవలన గొప్పవాడగుచున్నాడు. ఆయనను సం హరింపగలవారెవ్వరునూ లేరు. ఆయనలోనికి సమస్తమునూ చేరి పూర్వపు స్థితిని పొందుచున్నవి. ఆయన మన వంశములు ప్రారంభమగుటకు ముందే యున్నాడు. మరియూ మన వంశములను వర్ధిల్ల చేసినవాడు.
సాయితో మధుర క్షణాలు - 23
సిజేరీన్ ఆపరేషన్ నివారించిన బాబా - అధ్బుతమైన లీల
మనకు ఒక ఆలోచన గాని, అభిప్రాయం గాని వచ్చిందంటే దానికి తగ్గ ప్రాధమిక కారణాలను గమనించదగ్గ అంశమేదీ లేదు. గుడ్డి నమ్మకం కూడా అసాధ్యమైన పనిని కూడా సాధ్యాన్ని చేస్తుంది. శ్రీసాయి సత్ చరిత్రలో హేమాడ్ పంతు శిష్యులని మూడు రకాలుగా వర్ణించాడు. 1) ఉత్తములు, 2) మధ్యములు 3) సాధారణులు.
1) గురువుకేమి కావాలో గుర్తించి వెంటనే వారాజ్ఞాపించక పూర్వమే దానిని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు 2) గురుని యాజ్ఞానుసారము ఆలసింపక అక్షరాల నెరవర్చువారు మధ్యములు 3) అడుగడుగునా తప్పులు చేస్తూ సద్గురుని ఆజ్ఞను వాయిదా వేసేవారు.
గురువు చెప్పిన మాటలను పరీక్షించడానికి కాక నమ్మకంతో శిష్యుడు అమలు చేసినపుడు గురువు తన శిష్యుని రక్షణకు స్వయంగా వస్తారు.
అటువంటి ప్రగాఢమయిన నమ్మకం విశ్వాసం ఉన్న భక్తులలో జబల్ పూర్ లోని మహారాష్ట్ర యువ దంపతులు ఒకరు. వారు తమ గురువుగారు చెప్పకుండా ఏవిధమయిన పని చేయ తలపెట్టరు. భార్యకు ప్రసవం దగ్గర పడటంతో ఆమెను లేడీ ఎల్జిన్ మహిళా ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు మామూలుగా జరిపే పరీక్షలన్ని చేసి ఎక్స్ రే కూడా తీశారు. అందులో బిడ్డ అడ్డంతిరిగి ఉండటం కనిపించింది. అందుచేత సిజేరియన్ చేసి బిడ్డను తీయడం తప్ప మరో మార్గం లేదని తేల్చి చెప్పారు.
అది మేజర్ ఆపరేషన్ అవడం వల్ల ప్రాణానికి కూడా ప్రమాదకరమయిన పరిస్థితి. అందుచేత భర్తనుండి లిఖిత పూర్వకమయిన అంగీకారం తీసుకోవాల్సి ఉంది. భర్తని అంగీకార పత్రం పూర్తిచేసి సంతకం పెట్టి యిమ్మని డాక్టర్లు అడిగారు. వెంటనే అతను, అంగీకారపత్రం రాసి యివ్వమంటారా వద్దా అని తన గురువుగారి సలహా కోసం ఆయన దర్బారుకు వెంటనే పరిగెత్తాడు.
అతను దర్బారుకు చేరుకున్న సమయంలో గురువుగారు బాబాకు మధ్యాహ్న్న హారతి యివ్వబోతున్నారు. ఎంతో గాభరాగా, ఉద్రేకం నిండిన స్వరంతో, తన భార్యకు ఆపరేషన్ చేయడానికి ఒప్పంద పత్రం యివ్వమంటారా లేక యింటికే తీసుకొని వచ్చి ప్రసవం చేయించమంటారా అని అడుగుదామనుకొన్నాడు. తరువాత అతను తన గురువుగారిని తను ఏమని అడుగుదామనుకొన్నాడో ఆవిధంగానే అడిగినట్లు చెప్పాడు. అతను చెప్పినది గురువుగారు ఏమని వినిపించుకున్నారో తెలీదు. తమిళం తెలుగు, ఉర్దూ, హిందీ కాకుండా గురువుగారు మరాఠీలో జవాబిచ్చారు. ఆయన అలాగే చేయి (అసా కరా) అని జవాబు చేప్పేసి హారతినివ్వడంలో నిమగ్నమయ్యారు. భర్తకి అర్ధమయినదేమిటంటే తన ప్రశ్నలోని చివరి మాటయిన యింటికే తీసుకొని వచ్చేయమంటారా అన్నదానికి ఆయన అలాగే చేయి అని సమాధానం ఇచ్చారని భావించుకున్నాడు. ఇక ఎంతో ఉపశమనం పొందినట్లుగా హమ్మయ్యా అనుకొని లాగి వదలిన బాణంలాగ ఆస్పత్రికి తిరిగి వచ్చాడు. డాక్టర్ కి గాని, నర్సుకి గాని చెప్పకుండా,భార్యను యింటికి తీసుకొని వెళ్ళడానికి బయట నిలబెట్టిన రిక్షా దగ్గరకు నడిపించుకొంటూ తీసుకొని వెడుతున్నాడు. డా.దేవ్ గైనకాలజిస్టుకు విషయం తెలిసి అతనిని వారించడానికి కంగారుగా వార్డులోకి వచ్చాడు. అటువంటి పరిస్థితిలో ఆమెను తీసుకొని వెళ్ళడం ఆమె ప్రాణానికే ప్రమాదమని, అది చాలా మూర్ఖత్వమని హెచ్చరిద్దామనుకొన్నాడు. కాని అతన్ని ఏవిధంగానూ ఎవరూ ఆపలేకపోయారు. గురువుగారే చెప్పారు కదా యింటికే తీసుకొని వెళ్ళమని అందుచేత ఏవిధమయిన భయం అక్కరలేదనుకొన్నాడు. ఆపరేషన్ చేయవలసిన అవసరం తప్పిందని ఎంతో సంతోషించాడు. తమ గురువుగారిపై వారికంత నమ్మకం. సెంట్.అగస్టిన్ ఇలా చెప్పారు. "నమ్మకంతో నువ్వు చేసే పని, దానితరువాత ఆపని చేసినందువల్ల దాని ప్రతిఫలం చూసి, నువ్వు నమ్మకంతో చేసిన పని ఫలితాన్ని నమ్ముతావు"
అలా సంతోషంతో ఆ దంపతులిద్దరూ యింటికి క్షేమంగా చేరుకొన్నారు. అప్పటికే నెప్పులు వస్తున్న ఆమెని మం చం మీద పడుకోబెట్టారు. మంత్రసాని ఎవరూ రాకముందే, యిక ఎటువంటి సహాయం లేకుండా ఆమె ఆరోగ్యకరమైన శిశువుకు జన్మనిచ్చింది.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment