31.12.2013 మంగళవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
పాత సంవంత్సరానికి వీడ్కోలు - కొత్తసంవత్సరానికి స్వాగతం
15.10.1918 బాబా మహా సమాధి చెందిన తరువాత కూడా బాబా తన లీలలను ఎందరో భక్తులకు కలుగ చేస్తూనే ఉన్నారు. అటువంటి లీలలతో "ఆంబ్రోసియ ఇన్ షిరిడీ' అని పుస్తక రూపంలో శ్రీ శివనేశన్ స్వామీజీ గారి ప్రేరణతో శ్రీ రామలింగస్వామి గారు రచించారు. అందులోని 84వ.లీల ఇప్పుడు మీరు చదవబోయేది. ఇది శ్రీసాయి లీల ద్వైమాసపత్రిక సెప్టెంబరు - అక్టోబరు, 2005 సంచికలొ ప్రచురింపబడిది. ఆ సంచికనుండి గ్రహింపబడింది.
ముందుగా శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం 103వ.శ్లోకం, తాత్పర్యం
శ్రీవిష్ణుసహస్రనామం
శ్లోకం: ప్రమాణం ప్రాణ నిలయః ప్రాణభృత్ప్రాణజీవనః |
తత్త్వంతత్త్వ విదేకాత్మా జన్మ మృత్యుజరాతిగః ||
తాత్పర్యం: భగవంతుని సరియైన కొలతగా, ప్రాణస్పందనకు స్థానముగా ధ్యానము చేయుము. ఆయన మన యందలి ప్రాణ స్పందనముగా ఆ స్పందనమును భరించువానిగా మరియూ ఆ స్పందనమునందలి అంతరాత్మగానున్నాడు. ఆయన "ఆది" అని పిలువబడునదిగా మరియూ "ఆది" అను పిలువబడువాని నన్నింటిని తెలుసుకొనిన వానిగా నున్నాడు. కనుక పుట్టుకను, చావు, మరియూ ముసలితనమునూ దాటుచున్నాడు.
బాబా పక్షవాతం తగ్గించుట
(శ్రీ వి.నాగార్జున రావు, హైదరాబాదు వారి ప్రాణస్నేహితుని కుమార్తెకు వచ్చిన పక్షవాతాన్ని బాబా నయం చేయుట)
1975వ.సంవత్సరంలో నా స్వంతపని మీద నేను బొంబాయి వెళ్ళాను. బొంబాయిలో చుట్టుపక్కల చూడదగ్గ ప్రదేశాలన్నిటినీ చాలా చూశాను. హటాత్తుగా నాకు షిరిడీ కూడా వెళ్ళాలనిపించింది. ఇందులో భక్తికన్నా చూడాలనె కుతూహలం తప్ప మరేమీ కాదు. కాని అమెరికానించి నా బావమరిది వస్తున్నందువల్ల షిరిడి వెళ్ళే ప్రయత్నానికి ఆటంకం కలిగి మానుకోవలసిన పరిస్థితి ఎదురయింది.
నాకు చాలా నిరుత్సాహం కలిగింది. నువ్వే కనక దేవుడివయితే నాకు షిరిడీ దర్శించే భాగ్యం కలుగ చేయమని బాబాని ప్రార్ధించాను.
ఇంతలో ఒక ఆసక్తికరయమయిన సంఘటన జరిగింది. తను ప్రయాణం చేసేటప్పుడు మార్గం మధ్యలో మరొక విమానం ఎక్కడానికి ఎక్కువ సమయం వుండాల్సి వస్తుందనీ అందుచేత తను రావడం వాయిదా వేసుకున్నానని టెలిగ్రాం ఇచ్చాడు. అలా అనుకోని విధంగా నాకోరిక నెరవేరడంతో నాహృదయంలో నమ్మకమనే బీజాలు నాటబడ్డాయి.
నాకు షిరిడీ గురించి ఎవరన్నా సమాచారం ఇస్తే బాగుండుననుకొన్నాను. అంధేరీ నుండి దాదర్ కు వెళ్ళే లోకల్ రైలులో ప్రయాణం చేస్తున్నాను. అప్పుడే నాకు ఒక సాయి భక్తునితో పరిచయం కలిగింది. నాకతను షిరిడీ గురించి అన్ని వివరాలు చెప్పాడు. మొట్టమొదటిసారిగా నాకు షిరిడీ ప్రయాణం కల్పించి బాబా నన్ను తన వద్దకు రప్పించుకుంటున్నారని, ఇది అంతా ముందే నిర్ణయింపబడిందనీ ఋజువయింది.
షిరిడీ చేరుకున్నాక స్నానం చేసి బాబా దర్శనానికి వెళ్ళాను. మనసుకి ఎంతో హాయిగా అనిపించింది. ఒక్క క్షణం, ప్రతి చోట బాబా తప్ప నాకేమీ కనిపించలేదు. నాజీవితమంతా ఆయన అనుగ్రహాన్ని నాకు ప్రసాదించమని, ఆయన ఓదార్పు నాకెప్పుడూ కావాలని ప్రార్ధించాను. షిరిడీలో దొరికిన పుస్తకాలన్నిటినీ చదివాను. బాబా మానవాతీతుడని, సర్వత్రా నిండి ఉన్న భగవంతుడనే భావన నాలో కలిగింది. అప్పటినుండీ నాలో బాబా మీద నమ్మకం స్థిరంగా వృధ్ధిపొందింది.
నాప్రాణ స్నేహితునికి ఒక అమ్మాయి. ఆమెకు పక్షవాతం వచ్చి చెయ్యి కదపలేకపోయేది. వైద్యం చేయించినా ఫలితం లేకపోవడంతో నాస్నేహితుడు చాలా బాధపడుతూ ఉండేవాడు. ఇంక ఆమెకు నయం కాదనే విచారంతో కృగిపోయాడు.
నేనతనికి షిరిడీనుండి తెచ్చిన ఊదీనిచ్చి బాబా మీద పూర్తి విశ్వాసంతో ఆయన దయ చూపమని ప్రార్ధిస్తూ పక్షవాతం వచ్చిన చేతికి రాయమని చెప్పాను. తనకి బాబా మీద నమ్మకం లేకపోయినా, నేను పట్టుపట్టడంతో ఆవిధంగా చేయడానికి ఒప్పుకున్నాడు. ఊదీతోనే కనక అమ్మాయికి పక్షవాతం తగ్గిపోతే తను బాబాని భగవంతునిగా పూజిస్తానని అన్నాడు.
ఊదీ రాసిన తరువాత బ్రహ్మాండమయిన ఫలితం కనపడింది. తొందరలోనే అమ్మాయి కోలుకొంది. వైద్యం కూడా బాగా పనిచేసింది.
వైద్యం చేస్తున్న డాక్టర్ కి కూడా తన వైద్యం వల్లే అమ్మాయికి బాగయిందనే పూర్తి నమ్మకం కలగలేదు. డాక్టర్ కి కూడా చాలా ఆశ్చర్యం వేసింది. నా స్నేహితుడు సాయిబాబాకి గొప్ప భక్తుడయిపోయాడు.
ఎవరయిన ఆయనమీద దృష్టి పెట్టి ప్రార్ధిస్తే చాలు, మన ప్రార్ధనలని ఆయన వింటారు. మనలని అనుగ్రహిస్తారు. అదే ఆయన మనయందు చూపించే దయ.
సాయిలీల ద్వైమాసపత్రిక సెప్టెంబరు-అక్టోబరు, 2005 సంచికనుండి గ్రహింపబడినది.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment