01.01.2014 బుధవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు
శ్రీసాయితో మధురక్షణాలు - 33
ఈ రోజు శ్రీసాయితో మధురక్షణాలలో 33వ.క్షణం తెలుసుకుందాం. ముందుగా శ్రీవిష్ణుసహస్ర నామస్తోత్రం 104వ.శ్లోకం, తాత్పర్యం
శ్రీవిష్ణుసహస్రనామం
శ్లోకం: భూర్భువస్సువస్తరుస్తారః సవితాప్రపితామహః |
యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః ||
తాత్పర్యం: పరమాత్మను భౌతికము, శక్తి, ప్రజ్ఞాలోకములుగా ధ్యానము చేయుము. ఆయన సృష్టి వృక్షముగా, తరింపచేయువానిగా మరియూ సృష్టికర్తగానున్నాడు. ఆయన అందరికి ముత్తాతవంటివాడు. ఆయనయే యజ్ఞము, యజ్ఞమును రక్షించువాడు, యజ్ఞమును చేయువాడు. మరియూ యజ్ఞమునకు ప్రతిబింబము. ఆయన ఈ సమస్త యజ్ఞమున కంతటికి వాహనము వంటివాడు.
సాయి చేసే సహాయం
శ్రీసాయినాధుడు చూపించే దయ చిన్నదైనా అటువంటి చిన్న చిన్న సంఘటనలు మానవ జీవితంలో ఎంతో తృప్తిని ఆనందాన్ని కలుగచేస్తాయి. అటువంటిదే ఒక సాయి భక్తునికి జరిగిన సంఘటన.
నేను రైల్వేలో పని చేసి పదవీ విరమణ చేసిన తర్వాత నాకు బ్రతకడానికి చాలినంత పింఛను వస్తోంది. నా భార్య మరణించింది. ఒక్క సాయి తప్ప నన్ను చూసేవాళ్ళు ఎవరూ లేరు . అద్దె యింటిలో ఉంటూ హాయిగా ఆనందంగా జీవితం గడుపుతున్నాను. నాయింటికి ఎవరు వచ్చినా వారితో ఛలోక్తిగా మాట్లాడుతూ వారిని కూడా ఆనంద పరుస్తూ ఉంటాను. నా సమస్యలను సాయికి తప్ప మరెవ్వరికీ చెప్పుకోలేదు. సాయినాధునికి సర్వం తెలుసును కాబట్టి యీనా అలవాటుని ఆవిధంగానే కొనసాగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను .
నేను రైల్వేలో పనిచేసినందువల్ల, గౌరవ పూర్వకంగా ప్రతి సంవత్సరం నాకు రెండు మొదటితరగతి రైలు టిక్కెట్లు యిస్తారు. ఒకటి నేను ప్రతిసంవత్సరం షిరిడీ వెళ్ళడానికి ఉపయోగిస్తూ ఉంటాను. రెండు సంవత్సరాల క్రితం మార్చ్ 25వ.తారీకున షిరిడీ వెళ్ళే సమయం ఆసన్నమయిందని గుర్తుకొచ్చింది. ఇక మరొక ఆలోచన లేకుండా బట్టలు మార్చుకొని టిక్కెట్ కొనడానికి స్టేషన్ కి బయలుదేరాను. బయలుదేరేముందు ఎటువంటి స్వార్ధం లేకుండా బాబావేపు ప్రేమతో నేను వెళ్ళేపని జరిగేలా చూడమని ప్రార్ధించాను. (నేను యింటినుంచి బయలుదేరేముందు ఎప్పుడూ యిలాగే ప్రార్ధిస్తూ ఉంటాను.) నా యింటినుండి కిలోమీటరు దూరంలో ఉన్న రిజర్వేషన్ ఆఫీసుకు నడచుకుంటూ వెళ్ళాను. వెడుతున్నపుడే షిరిడీ ఏతేదీకి బయలుదేరదామా అని అనుకుంటూ ఏప్రిల్ 1వ.తారీకున బయలుదేరదామని మనసులోనే నిర్ణయించుకున్నాను. రిజర్వేషన్ కౌంటర్ దగ్గరకు చేరుకొని యిండికేటర్ బోర్డు వైపు చూశాను. ఆశ్చర్యం, ఏప్రిల్ 1వ.తేదీ తప్ప మిగతా అన్ని రోజులూ టిక్కెట్స్ బుక్ అయిపోయాయి. ఫారం పూర్తిచేసి క్లర్క్ కి ఇచ్చాను.
ఒక్కటే బెర్త్ ఖాళీగా ఉందని చెప్పాడు. నాపేరుతో బెర్త్ రిజర్వ్ చేసి "మీరు చాలా అదృష్టవంతులు, కాస్త ఆలస్యంగా వస్తే ఇదికూడా అయిపోయేది, ఇక బెర్తులు దొరికి వుండేవికావు" అన్నాడు. అతను వెంటనే నా తిరుగు ప్రయాణానికి కూడా మన్మాడ్ స్టేషన్ కి టెలిగ్రాం పంపించాడు. ఇది సాయి లీల తప్ప మరేమీ కాదు. ప్రయాణానికి ఒక రోజు ముందుగానే కావలసినవన్ని సిధ్ధంగా ఉంచుకోవడం నా అలవాటు. దాని ప్రకారంగా సామానంతా సర్దుకున్నాను. నేను యింటిలో చిన్న డబ్బా ఒకటి హుండీగా పెట్టుకుని దానిలో నాకు తోచినప్పుడల్లా నాణాలు వేస్తూ ఉంటాను. షిరిడీ వెళ్ళీటప్పుడు అందులో ఉన్న డబ్బంతా తీసి షిరిడీలో హుండీలో వేస్తూ ఉంటాను. నేను హుండీ డబ్బా తెరచి డబ్బు లెక్కపెట్టాను. అది చాలా చిన్న మొత్తం అవడంతో నాకు చాలా సిగ్గనిపించింది. అదే సమయంలో ముగ్గురు మగవాళ్ళు, ఒక స్త్రీ నాకు తెలిసిన వాళ్ళు వచ్చారు. వారంతా బాగా డబ్బున్నవాళ్ళు. అందులో ఒకాయన తన కుమార్తె వివాహానికి నన్ను ఆహ్వానించడానికి వచ్చాడు. ఆయన శుభలేఖ ఇచ్చి "ఎల్లుండి మా అమ్మాయి వివాహం. మీరు తప్పకుండా రావాలి" అన్నాడు. "రేపే నేను షిరిడీ వెడుతున్నాను. అందుచేత రాలేనని" చెప్పాను. అప్పుడాయన (పెళ్ళికూతురి తండ్రి) నాప్రయాణాన్ని వాయిదా వేసుకోమన్నాడు. (వచ్చి న ముగ్గురూ కూడా అన్నదమ్ములు. అందరూ సాయి భక్తులే). అందులో ఒకతను "లేదు, ఆయనను వెళ్ళనివ్వండి. ఆయన షిరిడీనించి వచ్చిన తరువాత మనం ఆయనని ప్రత్యేకంగా భోజనానికి పిలుద్దాము. ఆయనకి ముందరే చెప్పకపోవడం మన తప్పు" అన్నాడు. ఇప్పుడు జరిగిన విచిత్రం చూడండి. అంతా సాయిలీల.
అందరూ ఒకే వరుసలో కుర్చీలలో కూర్చొన్నారు. ఎవ్వరూ కూడా ఒకరివైపు మరొకరు చూసుకోవటల్లేదు. అందరూ ఒకేసారి తమ జేబులలోంచి నోట్లు తీసి, షిరిడీలో హుండీలో వేయమని నాచేతికిచ్చారు. నేను వారిచ్చిన నోట్లని మడతపెట్టి వారిచ్చిన శుభలేఖ కవరులోనే పెట్టి "మీరిచ్చిన శుభలేఖ కూడా హుండీలోకి చేరుతుంది. బాబా కూడా వివాహనికి రావడానికి మీరిచ్చిన శుభలేఖ కూడా షిరిడీ హుండీలోకి చేరుతుంది" అన్నాను. నేనన్నదానికి వారెంతో సంతోషించారు. షిరిడీ చేరిన తరువాత నేను చెప్పినట్లే చేశాను.
నేను యింటిలో హుండీలో కూడబెట్టిన డబ్బు చాలా తక్కువవడంతో బాబా ఆధనికుల చేత డబ్బు యిప్పించి ఆలోటుని తీర్చారు. నిజం చెప్పాలంటే నేను కూడబెట్టిన చిన్న మొత్తానికి నేనింక డబ్బేమీ వేయలేదు. వారిచ్చిన డబ్బుతోనే నాది కూడా కలిపి హుండీలో వేశాను. బాబాకు భక్తుడిగా మారిన తరువాత బాబా నాకు చాలా లీలలు చూపించారు. (కాని ఒక్కటి మాత్రం జరగలేదు. బాబా ఎప్పుడూ నాకలలోకి రాలేదు. బాబా నుంచి నాకోరిక అదొక్కటే.)
సాయిప్రభ
నవంబరు, 1988 వ.సంచిక
వై.శ్రీనివాసరావు
సికందరాబాద్
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment