02.01.2014 గురువారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
శ్రీసాయితో మధురక్షణాలు - 34
శ్రీసాయితో మధురక్షణాలలో మరొక మధురాతి మధురమైన క్షణం ఈ రోజు తెలుసుకొందాము. ముందుగా శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్రం 105, 106,107,108 శ్లోకాలను కూడా ఇచ్చి ఈ రోజుతో పూర్తి చేస్తున్నాను.
శ్రీవిష్ణుసహస్రనామం
105 వ. శ్లోకం: యజ్ఞభృద్యజ్ఞకృద్యజ్ఞీ యజ్ఞభుగ్యజ్ఞసాధనః |
యజ్ఞాంగ కృద్యజ్ఞ గుహ్యమన్నమన్నాద ఏవచ ||
తాత్పర్యం: నారాయణుని యజ్ఞము భరించువానిగా, కర్తగా, యజమానిగా మరియు అనుభవించువానిగా, ధ్యానము చేయుము. ఆయన సృష్టికి లయకారకుడుగా నున్నాడు. ఆహారము తినువారియందు, తినబడు ఆహారము నందునూ, తానే యజ్ఞ స్వరూపుడై దాగియున్నాడు.
106వ.శ్లోకం: ఆత్మయోనిః స్వయంజాతో వైఖానస్సామగాయనః |
దేవకీ నందనః స్రష్టా క్షితీశః పాపనాశనః ||
తాత్పర్యం: నారాయణుని తనయందే తాను పుట్టుక గలవానిగా, మరియూ తనకు తానే పుట్టువానిగా, తనను తాను తనలోనుండి త్రవ్వుకొనువానిగా, తన గానముగా తనకు సృష్టించుకొనుచున్న వానిగా ధ్యానము చేయుము. ఆయన ఈ లోకములన్నిటికి సృష్టికర్త, అధిపతి, రక్షించువాడు, మరియు నశింపచేయువాడు, ఆయన పాపములను నశింపచేయు దేవకీదేవి కుమారుడు.
107వ.శ్లోకం: శంఖభృన్నందకీ చక్రీ శార్ఞ్గధన్వా గదాధరః |
రధాంగపాణి రక్షోభ్యః సర్వప్రహరణాయుధః ||
తాత్పర్యం: పరమాత్మను, శంఖమును, ఖడ్గమును, చక్రమును, ధనుస్సును, గదను ధరించినవానిగా ధ్యానము చేయుము. ఆయన రధచక్రమును చేత ధరించుటచే క్షోభింప చేయుటకు అలవికానివానిగా యున్నాడు. ఆయన తన ఆయుధములతో చక్కగా కొట్టగలిగినవాడై యున్నాడు.
108వ.శ్లోకం: వనమాలీ గదీశారీ శంఖీ చక్రీ చ నందకీ |
శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవో భిరక్షతు ||
తాత్పర్యం: నారాయణుని వన పుష్పములతో కూడిన మాలను ధరించినవానిగా, గదను, విల్లును, శంఖమును, చక్రమును, ఖడ్గమును, ధరించి తన వైభవమును లేక మహిమలను వెదజల్లువానిగా, జీవశక్తి యను జలములకు అధిపతియైన వానిగా, వ్యాపించుట అను శక్తికధిపతిగా, మనయందు వాసుదేవుడను పేర నివసించువానిగా ధ్యానము చేసినచో అతడు అన్ని వైపులనుండి మనలను రక్షించును.
సంపూర్ణం
స్వామీజీకి ప్రకృతి కూడా స్వాధీనమగుట
ఎవరూ కూడా తాము సాయికి భక్తులమని గాని, శిష్యులమని గాని, అంశ అని గాని తమకు తాము ప్రకటించుకోలేరు. మనకు ఏపేరు తగినదో శ్రీసాయినాధులవారే ప్రసాదించాలి. పూజ్యశ్రీ నరసిం హ స్వామీజీ వారికి తన సద్గురువయిన బాబాపై వున్న నిష్కళంకమైన భక్తి, ప్రేమే ఆయన బాబాకు అత్యంత భక్తుడని ఋజువు చేస్తుంది ఇప్పుడు చెప్పబోయే ఈ లీల.
1951 వ.సంవత్సరంలో అయిదవ అఖిలభారత సాయి భక్తుల సభ ధార్వార్ లో జరిగింది. ఆ సభను సక్రమంగా జరిపించడానికి యిద్దరు స్వామీజీలు (శ్రీరాధాకృష్ణ స్వామీజీ, శ్రీనరసిం హ స్వామీజీ) నాలుగు రోజుల ముందుగానే హుబ్లీ చేరుకొన్నారు. స్వామీజీగారి 'గురుభక్తీ అమోఘం. వారి శక్తి ఎటువంటిదో, వారు తిరిగి మద్రాసు వెడుతున్నపుదు హుబ్లీ రైల్వే స్టేషన్ లో మేము ప్రత్యక్షంగా చూశాము.
(శ్రీ రాధా కృష్ణ స్వామీజీ )
వారు మద్రాసుకు గుంతకల్ మీదుగా వేళ్ళే రైలులో తిరుగు ప్రయాణానికి హుబ్లీ రైల్వే స్టేషన్ కి చేరుకొన్నారు. అప్ప్డుడు ఒక ఆసక్తికరమయిన సంఘటన జరిగింది. హుబ్లీ నుంచి రైలు సరిగా 9.50 కి బయలుదేరాలి. హెచ్.హెచ్. నరసిం హ స్వామీజీగారు తన ఫైలులో కొన్న ముఖ్యమైన ఉత్తరాలు లేకపోవడం గమనించారు. ఆ ఉత్తరాలు తనకు ఆతిధ్యమిచ్చిన శ్రీ కృష్ణమూర్తి అయ్యర్ గారి బంగళా గదిలో అలమారులో పెట్టినట్లు గుర్తుకు వచ్చింది.
రైలు బయలుదేరడానికి మొదటి గంట కూడా కొట్టేశారు. స్టేషన్ నుంచి బంగళాకు నడచుకొంటూ వెడితే 10-15 నిమిషాలు సమయం పడుతుంది. అయినా గాని, నరసిం హ స్వామీజీగారు, రాధాకృష్ణ స్వామీజీ గారిని వెంటనే ఆ ఉత్తరాలు తెమ్మని అడిగారు. యిక మరోమాట మాట్లడకుండా, ప్రశ్నించకుండా, స్వామీజీ గారు వెంటనే బయలుదేరారు. ఈలోగా రైలుకి రెండవగంట కూడా కొట్టేసారు. గార్డు కూడా విజిల్ వేసి రైలు బయలుదేరడానికి సూచనగా పచ్చ జండా కూడా ఊపేశాడు. డ్రైవరు రైలును బయలుదేరదీయడానికి రెగ్యులేటర్ ని ఓపెన్ చేశాడు. కాని చక్రాలు ఒక్క అంగుళం కూడా ముందుకు కదలలేదు.
స్టేషన్ సిబ్బంది అందరూ బ్రేక్ సిస్టం ని పరీక్షించారు. కాని ఎటువంటి లోపం కనపడలేదు. సరిగ్గా సమయం 10 గంటలవగానె శ్రీరాధాకృష్ణ స్వామీజీగారు ఉత్తరాలు పట్టుకొని వచ్చి తన గురువుగారయిన శ్రీనరసిం హ స్వామీజీ గారికి అందచేశారు. అప్పటికే స్వామీజీ గారికి వీడ్కోలు చెప్పడానికి బోగీ వద్ద చాలా మంది గుమికూడి ఉన్నారు. బోగీ దగ్గ్రిర ఏదో ప్రమాదం జరిగిందేమోనని భావించి స్టే షన్ సిబ్బంది అందరూ స్వామీజీ గారు ఉన్న బోగీ దగ్గ్రిరకి పరిగెత్తుకుని వచ్చారు. నరసిం హ స్వామీజీగారు డ్రైవరుతో "ఇక ఇప్పుడు వెళ్ళి రైలు నడుపు, ఎటువంటి యిబ్బంది ఉండదు" అన్నారు. ఎటువంటి సమస్య లేకుండా రైలు సాఫీగా ముందుకు సాగింది. అదే స్వామీజీ గారి యోగ శక్తి. తన యోగ శక్తితో రైలును కూడా ముందుకు వెళ్ళకుండా శాసించగలిగారు. సద్గురువే కాదు శిష్యుడు కూడా మనలని ఆశ్చర్యానికి లోను చేసి తనపై భయభక్తులను కలిగి ఉండేలా చేస్తాడు.
సాయిలీల మాసపత్రిక
జనవరి 1989
ఆర్.రాధాకృష్ణన్
కర్నాటక
(పాఠకులకు ఒక గమనిక: పైన చెప్పిన లీలలో రైలు బయలు దేరే సమయం పగలా, రాత్రా అన్నది రాయలేదు. కారణం ఆంగ్ల పుస్తకంలో రైలు బయలు దేరే సమయం రాత్రి అనగా 9.50పి.ఎం అని తరువాత రాధాకృష్ణగారు ఉత్తరాలు పట్టుకొని (ఉదయం) అనగా 10 ఎ.ఎం. అని ప్రచురితమయింది. అందుకనే నేను కూడా సమయం ఎప్పుడన్నది తెలపలేదు. టైం మాత్రమే ఇచ్చాను.--త్యాగరాజు)
సాయిబాబాకు మనం భక్తులమవునా కాదా అన్నది మనం చెప్పుకోకూడదు. నేను ప్రతిరోజూ శ్రీ సాయి సత్చరిత్ర పారాయణ చేస్తానండి,సత్సంగాలలో పాల్గొంటూ ఉంటానండి నేను కూడా సాయి భక్తుడినేనండి అని మనకి మనం అనుకోకూడదు. మనం సత్చరిత్ర ఏవిధంగా చదివాము, మనసు పెట్టి చదివామా లేదా? బాబా చెప్పిన విషయాలను తూ.చ .తప్పక పాటిస్తున్నామా లేదా అన్నదే ముఖ్యం. అలా చేసినా కూడా మనకి మనం చాలా వినయంగా, నమ్రతతో ఉండాలి. అప్పుడే మనలను బాబా తన భక్తునిగా గుర్తిస్తారు. పైన చెప్పిన లీలలో స్వామీజీగారు ఉత్తరాలు తెమ్మనమని మరొక స్వామీజీగారయిన శ్రీరాధాకృష్ణస్వామీజీ గారిని అడిగారు. ఇద్దరూ బాబా కు భక్తులే. శ్రీనరసిం హ స్వామీజీగారిలో రైలు బయలుదేరిపోతుందనే ఆందోళన ఏమాత్రం కనిపించలేదు. చాలా మామూలుగా ఉత్తరాలు తెమ్మని అడిగారు. శ్రీరాధాకృష్ణస్వామీజీ గారు కూడా ఎటువంటి ప్రశ్నా వేయలేదు. రైలుకి గంట కూడా కొట్టేశారు. నేను వెళ్ళి వచ్చేలోగా రైలు బయలుదేరిపోతుంది ఎలాగా అని కూడా ఏమాత్రం ప్రశ్నించకుండా, ఎటువంటి సంశయం లేకుండా ఉత్తరాలు పట్టుకొని వచ్చారు. తరువాత కూడా శ్రీ నరసిం హ స్వామీజీగారు చాలా మామూలుగా డ్రైవరుతో రైలు బయలుదేరదీయవచ్చని చెప్పారు. ఆయనలో ఎటువంటి గర్వం కనపడలేదు. నేనే రైలును ఆపుచేయించాను అన్న భావం కూడా ఎక్కడా కనపడలేదు. బాబా మీద ఆయనకి అంత నమ్మకం ఉందని మనం అర్ధం చేసుకోవచ్చు... ఏమంటారు? -- త్యాగరాజు
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు )
0 comments:
Post a Comment