15.02.2014 శనివారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు శ్రీసాయి లీల ద్వైమాసపత్రిక మే-జూన్, 2005 సంచికలో ప్రచురింపబడిన సాయి లీలలు.
ఇప్పుడు కూడా బాబా సజీవంగా ఉండి మనకు సహాయం చేస్తున్నారా?
78. ముంబాయి నివాసి శ్రీథక్కర్ గారు మొక్కిన మొక్కులో మిగిలిన 50/- వసూలు చెయుట
ఒకసారి ముంబాయి నివాసి శ్రీథక్కర్ గారు తన కష్టాలు తీరితే కనక బాబాకు 55 రూపాయలు దక్షిణ ఇస్తానని మొక్కుకొన్నారు.
ఆయన మొక్కుకున్న ప్రకారం ఆయన కష్టాలు గట్టెక్కాయి. కష్టాలు తీరినందుకు ఆయన షిరిడీ వెళ్ళి సమాధి మందిరంలో బాబాను దర్శించుకుని హుండీలో 55 రూపాయలకు బదులుగా 5 రూపాయలు మాత్రమే దక్షిణగా సమర్పించుకున్నారు. తరువాత ముంబాయికి తిరిగి వచ్చేశారు.
ముంబాయిలో ఆయన తన యింటికి వచ్చి మెట్లు ఎక్కుతుండగా అదృశ్య కంఠంతో మిగిలిన 50 రూపాయలు ఇవ్వు అని గద్దించి అడుగుతున్నట్లుగా బాబా గుర్తు చేశారు. అప్పుడాయనకు బాబాను మోసం చేయలేనని అర్ధం చేసుకొన్నారు. తరువాత మరలా ఆయన షిరిడీ వెళ్ళి హుండీలో మిగిలిన 50 రూపాయలు వేసి బాబాకు క్షమాపణ చెప్పుకొన్నారు.
79. శ్రీమతి.అహల్యా కృష్ణాజీ ఉపార్కర్, ముంబాయి, గారి కాలు వాపును బాబా నివారణ చేయుట.
1969 ఆగస్టు నెలలో శ్రీమతి అహల్యాబాయి గారి కాలులో మేకు గుచ్చుకొని రక్తం కారింది. నొప్పి లేకపోవడంతో ఆవిడ దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. 24వ.తారీకున ఆమె కాలుకు సెప్టిక్ అయి జ్వరం వచ్చింది.
తరువాత బాబా ఒక అపరిచితుడుగా వచ్చి ఆమె కాలుకు మందిస్తానని మాట ఇచ్చారు. ఆవిడ ఇంటికెదురుగా మిలిటరీ వారి డిపో ఒకటి ఉంది. అతను ఆ డిపోలోకి వెళ్ళి వారి అనుమతితో మందును తీసుకొచ్చారు. మందును ఆమెకిచ్చి బాధ పెడుతున్న ఆమె కాలుకు రాసుకోమని చెప్పారు. ఆమె అతను చెప్పినట్లే చెసింది. మందు రాసిన వెంటనే వాపు తగ్గి నొప్పి కూడా తగ్గిపోయింది.
ఒకరోజు రాత్రి అమె కలలో ఒక నర్సు వచ్చి ఇంజెక్షన్ ఇచ్చింది. మరొక రోజు రాత్రి బాబా ఆమె కలలో కనిపించి సెప్టిక్ అయిన కాలికి రంధ్రం చేసి పుండును మాన్పుతాననీ, దాని వల్ల ఆమెకాలు మామూలు స్థితికి వచ్చి నొప్పి తగ్గిపోతుందని చెప్పారు.
ఒకరోజు రాత్రి ఆమె పడుకుని ఉండగా ఎలుక ఒకటి వచ్చి పుండుపడిన కాలికి పెద్ద రంధ్రం చేసి పుండుని యింకా పెద్దది చేసింది. దాంతో పుండులో ఉన్న క్రిములు, చీము అన్నీ బయటకి వచ్చేశాయి. ఆమె తన కొడుకుని లేపి బాబా తన కాలుని ఎలా నయం చేశారో చూపించింది. కాలుకి బాబా ఊదీ రాసిన కొద్ది రోజులలోనే ఆమె కాలు పూర్తిగా నయమయింది.
81. డబ్బాకు అడుగున రంధ్రం ఉన్నా కూడా బాబా తన అభిషేక తీర్ధం కారిపోకుండా అలాగే ఉంచిన సంఘటన గురించి ఒక జ్యుడీషియల్ ఆఫీసరుగారు మైలాపూర్ చెన్నై అఖిల భారత సాయి సమాజ్ వ్యవస్థాపకులైన శ్రీ బీ.వీ.నరసిమ్హస్వామిగారికి 25.02.1940 న. వ్రాసిన ఉత్తరం.
"బాబా అనుగ్రహం వల్ల నాభార్య ఆరోగ్యం కుదుటపడింది. ఇప్పుడు మీకు వివరింపబోయే సంఘటన మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మీరు మాయింటికి వచ్చినప్పుడు నాభార్య ఉపయోగించడానిక్ ఒక డబ్బాతో బాబా అభిషేక తీర్ధాన్ని పంపించమని సంస్థాన్ వారికి మీరు ఉత్తరం వ్రాసారు. అది మీకు గుర్తుండే ఉంటుంది. మీరు వెళ్ళిన కొద్ది రోజులలోనే మాకు అభిషేక తీర్ధం అందింది. దానిలో కొంత తీర్ధాన్ని ప్రతిరోజు నాభార్య తలమీద చల్లడానికి ఉపయోగించాము. కొద్దిరోజుల తరువాత ఆపేశాము. చాలా నెలలుగా యింకా మిగిలి ఉన్న అభిషేక తీర్ధం ఉన్న డబ్బాని బల్లమీదే ఉంచాము. క్రిందటి నెలలో ఆ డబ్బాని అక్కడినుండి తీసి అలమారులో పెట్టాము.
నిన్న మా రెండవ అమ్మాయి ఆ డబ్బాలో నూనె ఉందనుకుని తీయగా గగ గల మని శబ్దం వచ్చింది. డబ్బాని పైకి తిప్పి చూస్తే అడుగున చిటికెనవేలు పట్టేటంత కన్నం ఉంది. అందులోనుండి కాస్త నీరు వచ్చింది. తరువాత అందులోని నీటినంతా ఒక పాత్రలో పోసింది. డబ్బాలో మూడవ వంతువరకూ తీర్ధం ఉంది. విచిత్రమేమిటంటే డబ్బా అడుగున అంత పెద్ద కన్నం ఉన్నా కూడా తీర్ధం యిన్నిరోజులయినా కారిపోకుండా డబ్బాలో అలాగే ఉంది. ఎంత ఆశ్చర్యం...
అందులోని నీరు ఎంతో స్వచ్చంగా ఎటువంటి వాసనా లేకుండా మొట్టమొదటి సారిగా ఎలా ఉన్నదో అదే విధంగా రుచిగా ఉంది. మాపిల్లల మనసులో మంచి ముద్ర వేసింది ఈ సంఘటన. ఈ రోజు ఉదయం ఆ తీర్ధాన్నంతటినీ నాభార్య శిరస్సు మీద పోసాము. ఇందంతా చూసిన తరువాత మీకు ఈ ఉత్తరం వ్రాస్తున్నాను.
బాబా అభిషేక తీర్ధం -- ఈ సంఘటన మనలో నమ్మకాన్ని కలిగించటానికనేది స్పష్టం. లేకపోతే ఇంతవరకూ దానిని ఎవరూ కదపకుండా ఉన్నా చెక్కు చెదరకుండా వచ్చిన ఆ డబ్బాకి అడుగున రంధ్రం ఉన్నా నాకు తెలిసి ఉండేది కాదు. ఆ డబ్బాని మామూలుగా కొద్ది రోజులు పాలరాయి బల్లమీద పెట్టి ఆ తరువాత చెక్క బీరువాలో పెట్టాము. "
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment