18.02.2014 మంగళవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి లీల ద్వైమాసపత్రిక మే-జూన్ 2013 సంచికనుండి గ్రహింపబడినది.
బందిపోటు దొంగలనుండి రక్షించిన బాబా
అది 1997వ.సంవత్సరం అక్టోబరు 16వ.తేదీ. ఆరోజు జరిగిన సంఘటన గుర్తుకు వచ్చినపుడెల్లా నాకు భయంతో యిప్పటికీ వళ్ళు జలదరిస్తుంది.
ఆరోజున నాకు సాయిబాబా ఒక గొప్ప అనుభూతినిచ్చారు. ఆయన ఆరోజున నాకు చూపించిన అగోచరమైన అనంతమైన లీలను వర్ణించడానికి నాకు మాటలు చాలవు. అదే ఆయన యొక్క అనంత శక్తి.
నేను, శ్రీవిజయ్ కార్కర్ యిద్దరం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యిండియాలో ఆడిటర్స్ గా పనిచేస్తున్నాము. ఆరోజున మేము వార్ధా బ్రాంచ్ లో ఆడిట్ చేస్తున్నాము. ఆడిట్ పూర్తయేముందు బ్రాంచ్ మానేజర్ తో అన్ని విషయాలను చర్చించి తుది రిపోర్టును తయారు చేయాలి.
ఏదయినా గుడికి వెళ్ళడమంటే నాకిష్టం. ఆడిట్ జరుగుతున్న రోజులలో ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు వార్ధాలో ఉన్న సాయిబాబా గుడికి వెడుతూ ఉండేవాడిని. అక్కడికి వచ్చే భక్తులందరూ కూడా ఎంతో ప్రేమతోను భక్తితోనూ ఒక బక్కెట్ నిండా నీరు నింపి బాబాకు అభిషేక స్నానం చేస్తూ ఉంటారు.
అది చూసి నేను కూడా బాబాకు స్నానం చేయించే కార్యక్రమంలో పాల్గొంటు ఉండేవాడిని. ఆరోజు అక్టోబర్ 16, 1997 న. కోజగిరి పూర్ణిమ. ఆడిట్ పూర్తవడానికి యిక కొద్ది రోజులే ఉందనగా ఆరోజు కూడా ఉదయం 5 గంటలకే బాబా గుడికి వెళ్ళాను. అక్కడ బాబాకు, పాలు, పెరుగు, నీటితో అభిషేకం చేశారు. ఆకార్యక్రమమంతా పూర్తయిన తరువాత నేను బాబాముందు సాష్టాంగ నమస్కారం చేస్తూ "ఈరోజుతో మాఅడిట్ పని పూర్తవుతుంది. ఈరోజే మన ఆఖరి కలయిక" అని మనసులో అనుకొన్నాను. మేము వార్ధాలోని ఒక హోటల్ లో ఉంటున్నాము. దాదాపు 15రోజులుగా మేము ఆహోటల్ లోనే ఉండటంవల్ల హోటల్ యజమాని, మిగతా సిబ్బంది అంతా బాగా పరిచయమయ్యారు. వారందరికి మాఅలవాట్లు ఏమేమిటో అన్నీబాగా తెలిసాయి.
1997, అక్టోబర్ 16వ.తేదీ రాత్రి 9.30 కి నాప్రక్క గదిలోనే ఉన్న నాసహోద్యోగి శ్రీవిజయ్ నార్కర్ గదికి కొన్ని ఆఫీసు విషయాలు మాట్లాడటానికి వెళ్ళాను. తిరిగి నాగదికి వచ్చేటప్పటికి అర్ధరాత్రి 12 గంటలయింది. గదికి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే నా గదిలోని కాలింగ్ బెల్ మ్రోగింది. ఎవరు వచ్చారో చూద్దామని తలుపు తీశాను. గది గుమ్మం వద్ద మంచి దుస్తులుధరించి ముగ్గురు నిలబడి ఉన్నారు. వాళ్ళ చేతులలో పదునైన కత్తులున్నాయి. కత్తిని నాగుండెలకు ఆనించి నన్ను గదిలోకి తోశారు. ముగ్గురూ గదిలోకి వచ్చి తలుపుకు బోల్ట్ వేసేశారు. టెలిఫోన్ వైర్లను కత్తిరించి టీ.వీ.సౌండ్ పెద్దగా పెట్టారు. నన్ను మంచం మీదే కూర్చోమని చెప్పారు. వారిలో ఒకడు నామీద కత్తిని ఆనించి పెట్టాడు. మరొకతను దుప్పటిని చింపి పేలికలుగా మెలిపాడు. మూడవవాడు నాదగ్గరున్న విలువైనవాటినన్నిటినీ యిమ్మని, నాజేబులు వెతకసాగాడు. నాజేబులో ఉన్న 2,500/-రూపాయలు కనపడ్డాయి వాళ్ళకి. నాబ్యాగ్ లో గురుచరిత్ర 14వ.అధ్యాయం, యింకా కొన్ని సామాన్లు ఉన్నాయి. వాళ్ళు డబ్బు తీసేసుకొని మిగతావన్ని విసరివేశారు. దుప్పటిని చింపిన పీలికలతో నానోరు కట్టేసి మాట్లాడకుండా చేశారు. చేతులు, కాళ్ళుకూడా కట్టేసి బాత్ రూం లోకి తీసికెళ్ళి కుళాయి గొట్టానికి కట్టిపడేశారు.
అకస్మాత్తుగా జరిగిన ఈసంఘటనకి నేను చాలా భయపడిపోయాను. ధైర్యం తెచ్చుకోవడానికి సాయిబాబాను స్మరిస్తూ కూర్చున్నాను. ఆశ్చర్యకరంగా కుళాయికి నన్ను కట్టేసిన ముడి వూడిపోయింది. నోటికి కట్టిన గుడ్డను విప్పుకుని గట్టిగా అరవసాగాను. కోజగిరి పూర్ణిమ సందర్భంగా చుట్టుప్రక్కల ఉన్న భవనాలలోనివారందరూ మేలుకొనే ఉన్నారు. వాళ్ళందరూ హోటల్ కి వచ్చి యజమానితో విషయం చెప్పారు. యజమానికి వెంటనే ఆలోచన తట్టి హోటల్ ప్రధాన ద్వారానికి తాళం వేసేశాడు. ఆసమయంలో బందిపోటు దొంగలు మెట్ల మీదుగా క్రిందకి దిగుతున్నారు. వారి చేతులలో కత్తులు ఉన్నాగాని హోటల్ యజమాని, సిబ్బంది అందరూ కూడా వాళ్ళని కత్తి, యింకా మరికొన్ని ఆయుధాలతో బెదిరించారు. జరుగుతున్న కొట్లాటలో ఒక దొంగ పారిపోయాడు. కాని మిగిలిన యిద్దరినీ పట్టుకొన్నారు. పోలీసులకు సమాచారం అందించగానే వాళ్ళు వచ్చి పట్టుబడిన యిద్దరు దొంగలినీ తమ ఆధీనంలోకి తీసుకొన్నారు. మేము రాత్రంతా పోలీస్ స్టేషన్ లోనే గడిపాము. నన్ను చంపేసి ఉండవలసిందని దొంగలు గొణుక్కోవడం నాకు వినిపించింది. సాయిని స్మరించడం వాల్ల ఆయన అనుగ్రహంతో నాప్రాణాలు నిలబడ్డాయి. కనులు మూసుకొని ఆయనను స్మరించుకొన్నాను. నాకనులముందు ఆయన విగ్రహం కనిపించింది. అప్రయత్నంగా నాచేతులు ఆయనకు నమస్కరించాయి.
ఆర్.జి. పన్ బుదే
రిటైర్డ్ బ్రాంచ్ మానేజర్
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యిండియా
6/7 తార్షుంగ్, సాయి నగర్
గోధని రోడ్
ఝింగాబాయ్ టక్లి,
నాగపూర్ - 440 030
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment