14.07.2014 సోమవారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబంధువులకు సాయి బా ని స అందించిన సాయి తత్వం
శ్రీసాయి తత్వం -2వ.భాగం
అందుచేతనే బాబా షిరిడీలో అన్ని పండుగ రోజులలో ఉత్సవాలను నిర్వహించేవారు. శ్రీసాయి సత్ చరిత్ర 6వ.అధ్యాయంలో బాబా హోలీ, శ్రీరామనవమి, దీపావళి, గురుపూర్ణిమ లాంటి ప్రముఖ పండుగలను వైభవంగా జరిపించేవారనే విషయం మనం గమనించవచ్చు.
మారుతి, శివ, గణపతి దేవాలయాలను తన డబ్బుతో పునరుధ్ధరించి, భక్తులలో భక్తిభావాన్ని పెంపొందింప చేశారు.
"ప్రజలు తమ స్వలాభంకోసం తోటిమానవుని కాళ్ళకు నమస్కరించడానికి సందేహించరు కాని భగవంతుని ముందు మోకరిల్లడానికి మాత్రం సంకోచిస్తారు" శ్రీసాయి సత్ స్చరిత్ర 5వ.అధ్యాయంలో మనం ఈ విషయం గురించి గమనించవచ్చును. భాయి కృష్ణాజీ, బాబా షిరిడిలోకి ప్రవేశిస్తున్నారన్నదానికి గుర్తుగా వేపచెట్టు క్రింద పాదుకలను ప్రతిష్టించాడు. బాబా ఆపాదుకలను స్పృశించి....
'యివి భగవంతుని పాదాలు. ఎవరయితే గురు, శుక్రవారాలలో యిక్కడ అగరువత్తులు వెలిగిస్తారో వారికి భగవంతుని అనుగ్రహం లభిస్తుంది".
"ధనవంతులను ద్వేషించవద్దు, బీదలను అవమానించవద్దు" శ్రీసాయి సత్ చరిత్ర 12.వ అధ్యాయంలో ఈ విషయాన్ని గమనిద్దాము. ధనవంతుడయిన గోపాల్ ముకుంద్ బూటీని, బీదబ్రాహ్మణుడయిన మూలేశాస్గ్త్రి వద్దనుంచి దక్షిణ తీసుకొనిరమ్మని బాబా పంపుతారు. ఆవిధంగా బాబా ధనవంతునికి, బీదవానికి మధ్య స్నేహాన్ని ప్రోత్సహించారు.
"గాయాలు,రోగాలు భౌతిక శరీరానికే. మనస్సును స్థిరంగా ఉంచుకొని దాని సహాయంతో శరీరానికి ఓదార్పునివ్వాలి".
ఈభావానికి పూర్తి అర్ధాన్ని మనం శ్రీసాయి సత్ చరిత్ర 7వ.అధ్యాయంలో గమనించవచ్చు. 1910వ.సంవత్సరం దీపావళిరోజున బాబా ద్వారకామాయిలో ధునిముందర కూర్చొని ఉన్నారు.
బాబా హటాత్తుగా తన చేతిని ధునిలోకి పెట్టారు. ఆవిధంగా ఎక్కడొ చాలాదూరంలో ఉన్న ఒక కమ్మరి స్త్రీ ఒడిలోనుండి కొలిమిలో పడిన ఆమె బిడ్డను రక్షించారు. బాబా చేతికి కాలిన గాయమయింది. గాయానికి వైద్యం చేయడానికి బొంబాయినుండి డాక్టర్ పరమానంద్ వచ్చారు కాని, బాబా వైద్యం చేయించుకోకుండా "భగవంతుడే వైద్యుడు" అని బిడ్డ అనుభవించవలసిన బాధను తాననుభవించారు.
"నిజమైన భౌతికశరీరానికి ఖరీదయిన దుస్తులు ధరింపజేసి, సుగంధపరిమళాలు పూసి సంతోషపడనవసరంలేదు. అవేమీ లేనందువల్ల విచారించనక్కరలేదు. సంతోషము,విచారము రెండిటినీ సమానంగా భావించాలి"
1909వరకు షిరిడీ ప్రజలు బాబాను గౌరవించలేదు. ఆయనను ఒక పిచ్చి ఫకీరుగానే భావించారు. కాని, 1910నుంచీ ఆయనకు ఖరీదయిన దుస్తులు, నగలు సమర్పించి పూజించడం ప్రారంభించారు. బాహ్యంగా ఆయన తన భక్తుల ప్రేమకు తలఒగ్గేవారు. కాని అంతర్గతంగా యిటువంటి భౌతిక సుఖాలను ఆశించలేదు.
"నావద్దకు వచ్చినవారిలోని అజ్ఞానాన్ని తొలగించి వారిలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తాను". శ్రీసాయి సత్ చరిత్ర 5వ.అధ్యాయంలో ఈవిషయం గమనించవచ్చు.
ద్వారకామాయిలో దీపాలను వెలిగించడానికి బాబా వర్తకుల వద్దనుంచి నూనె తెచ్చేవారు.
ఒకరోజున వర్తకులందరూ ఏకమై బాబాకు నూనెను యివ్వడానికి నిరాకరించారు. బాబాకు భగవంతునిమీద అచంచలమయిన విశ్వాసం ఉంది. అందరూ ఆశ్చర్యపడే విధంగా బాబా నీటితో దీపాలను వెలిగించారు. ఆతరువాత వర్తకులందరూ పశ్చాత్తాపంతో బాబాని క్షమించమని వేడుకొన్నారు. బాబా వారితో మంచి ప్రవర్తన కలిగి ఉండమని హితబోధ చేశారు.
"దొంగలు నీవద్దనున్న ధనాన్ని దోచుకొని నీకు వేదన కలిగించవచ్చు, కాని నువ్వు సంపాదించిన ఆధ్యాత్మిక సంపదకు భగవంతుడు ఆనందంతో నీమనసుకు సంతోషాన్ని కలిగిస్తాడు".
శ్రీసాయి సత్ చరిత్ర 36వ.అధ్యాయంలో మనం ఈవిషయాన్ని గమనించవచ్చు. ఒకసారి గోవాలో నున్న ఒక పెద్దమనిషి 30,000/-రూపాయలు దొంగిలింపబడటంతో జరిగిన నష్టానికి ఎంతో వ్యధ చెందాడు. అతని స్నేహితుడు దత్తాత్రేయుని భక్తుడు. అతను తన మొదటి నెల జీతం 15/-రూపాయలు దత్తసేవకు వినియోగిస్తానని మ్రొక్కుకొన్నాడు. ఇద్దరూ షిరిడీకి వచ్చారు. బాబా యిద్దరినీ దీవించారు. గోవానుండి వచ్చిన పెద్దమనిషికి దొంగిలింపబడ్డ సొమ్ము తిరిగి అతనికి వచ్చేలా అనుగ్రహించి అతని స్నేహితుని వద్దనుండి 15/-రూపాయలు దక్షిణగా స్వీకరించారు. ఈవిధంగా యిద్దరినీ సంతోషపెట్టారు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment