22.01.2015 గురువారం
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
బ్లాగులో ప్రచురణ జరిగి రెండువారాలు అయింది. మన్నించాలి. ఈ రోజు సాయి లీలా మే - జూన్ 2009 ద్వైమాసపత్రిక లో శ్రీ హరిసీతారాం దీక్షిత్ గారు చెప్పిన ప్రత్యక్ష అనుభవాలను చదవండి.
హరి సీతారాం దీక్షిత్ చెప్పిన అనుభవాలు: 1
సాయి మహరాజ్ తన భక్తులకు వివిధ రూపాలలో దర్శనమిచ్చి తరువాత తను వచ్చినట్లుగా ఋజువు చూపించేవారు.
ఒకసారి నానాసాహెబ్ సాయిబాబాకి నైవేద్యం (ప్రసాదం) తీసుకొని వచ్చాడు. నానా సాహెబ్ వచ్చేటప్పటికి బాబా అప్పుడే భోజనం ముగించారు. బాబాని ప్రసాదం స్వీకరించమని నానా కోరాడు. "నేనిప్పుడే భోజనం ముగించాను. ఆపళ్ళెం అక్కడ పెట్టి నువ్వు యింటికి వెళ్ళి భోజనం చెయ్యి" అన్నారు బాబా.
బాబా చెప్పినట్లుగా నానా వెడుతూ వెడుతూ "పళ్ళెంలోనుండి బాబా కాస్తయినా తీసుకొని స్వీకరించారో లేదో కాస్త కనిపెట్టుకొని చూడు . ఆయన తిన్న వెంటనే నాకు చెప్పు. అపుడే నేను భోజనం చేస్తాను" అని మాధవరావు దేశ్ పాండేతో చెప్పాడు. కాసేపటి తరువాత బాబా "నానా భోజనం చేశాడా" అని అడిగారు మాధవరావుని.
"మీరు కాస్త తిన్న తరువాతనే తను తింటానని చెప్పాడు నానా" అని మాధవరావు అన్నాడు. "ఓ! అలాగా! నానా పళ్ళెంలో అన్నీ పెడుతూ ఉన్నపుడే నేను ఒక ఈగ రూపంలో ఆరగించాను. భోజనం చేయమని నానాతో చెప్పు" అన్నారు బాబా.
ఇది వినగానే నానాసాహెబ్ సంతోషంగా భోజనానికి ఉపక్రమించాడు.
ఒకసారి నానా సాహెబ్ తో బాబా "ఎవరయినా నీవద్దకు వచ్చి ఏదయినా అడిగినపుడు నీకున్నంతలో లేదనకుండా దానంచేయి. ఒకవేళ నీకివ్వడానికి యిష్టం లేకపోతే ఆవిషయం నెమ్మదిగా చెప్పు, అంతే కాని కసిరి తిట్టి పంపించవద్దు" అన్నారు.
కొద్దిరోజుల తరువాత నానా సాహెబ్ తన గ్రామానికి వెళ్ళాడు. మూడు నాలుగు రోజుల తరువాత ఒక ముసలామె అతని గుమ్మం వద్దకు యాచనకై వచ్చింది. పనివాడు భిక్ష వేయడానికి నిరాకరించాడు. కాని ఆముసలామె తన పట్టు విడవకుండా అడుగుతూనే ఉంది. నానాసాహెబ్ ఆమె ప్రవర్తనకి చికాకు పడి మందలించి పంపేశాడు.
నానా సాహెబ్ మరలా సాయిబాబాని దర్శించడానికి వెళ్ళినపుడు "నేను ధర్మం కోసం నీయింటి ముంగిటకి వచ్చాను. కాని నేను చెప్పిన మాటలు మరచి కసురుకొని పంపించావు. ముసలి స్త్రీ రూపంలో వచ్చినది నేనే. కాని నాకు నీ పరుషవాక్యాలే దక్కాయి" అన్నారు బాబా. నానా సాహెబ్ తను చేసిన పనికి సిగ్గుతో తల దించుకొన్నాడు.
ఒకసారి ఒక ఆడకుక్క మహల్సాపతి యింటిలోకి ప్రవేశించింది. ఆకుక్క చాలా అసహ్యంగా, రోతగా వుంది. మహల్సాపతి దానిని కొట్టడంతో అది అరుస్తూ వెళ్ళిపోయింది. ఆతరువాత మహల్సాపతి సాయిని దర్శించుకోవడానికి వెళ్ళినపుడు " ఎంతో ఉన్నతంగా ఊహించుకొని నేను భగత్ (మహల్సాపతిని అందరూ 'భగత్' అని పిలిచేవారు) యింటికి వెళ్ళాను. కాని నాకు దెబ్బలు మాత్రం మిగిలాయి" అన్నారు బాబా. తన భక్తులలో జ్ఞానాన్ని నింపి వారిని చైతన్యవంతులను చేయడానికే బాబా యిటువంటి లీలలను ప్రదర్శిస్తూ ఉండేవారు.
ఎటువంటి సంబంధం లేనిదే ఎవరూ ఎవరివద్దకూ రారు. మనవద్దకు ఎవరు వచ్చినా అది కుక్క గాని, పిల్లిగాని, లేక మానవుడు గాని, ఎవరినీ తరిమి కొట్టవద్దు. మనం వాటిని పట్టించుకోకుండా నీచంగా చూడరాదు" అని బాబా తన భక్తులకు హితవు పలికారు.
సాయి మహరాజ్ కేవలం మాటల ద్వారానే బోధలు, సలహాలు యివ్వడం కాక ఎన్నో విధాలుగా వాటి ప్రాముఖ్యతను నొక్కి వక్కణించేవారు.
ఒకసారి యిటువంటి చర్చలు జరిగిన రెండుగంటల తరువాత వాడాలో మేమందరం భోజనాలు చేస్తుండగా గుమ్మం వద్దకు ఒక కుక్క వచ్చింది. మేము దానిని తోలేశాము. అది ప్రక్కయింటి వాకిలి వద్దకు వెళ్ళింది. అక్కడ ఆ కుక్క ఆ యింటివారు కొట్టిన బెత్తం దెబ్బలు తిని ఏడుస్తూ వెళ్ళిపోయింది.
అప్పుడే మాకు సాయి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి, మేమే కనక దానికి కాస్త రొట్టె ముక్క వేసుంటే ఆ కుక్కకి బెత్తం దెబ్బలు పడేవి కాదు కదా అని అనిపించింది.
ఆరోజు సాయంత్రం దాసగణు తన కీర్తనలో సంత్ నామదేవ్ గురించి వర్ణిస్తున్నారు. ఆయన చెప్పిన కధలో, ఒకసారి భగవాన్ విఠల్ కుక్క రూఫంలో సంత్ నామదేవ్ యింటికి వచ్చి రొట్టెముక్కను లాగుకొని నోటకరచుకొని పరిగెత్తాడు. నామదేవ్ ఆకుక్క వెనకాలే చిన్న గిన్నెలో నెయ్యితో పరిగెడుతూ "ఉట్టి రొట్టెముక్కను తినకండి స్వామీ! ఈ నెయ్యిని కూడా తీసుకొని దానితో రెట్టెముక్కను ఆరగించండి" అన్నాడు.
తరువాత అదే రోజు మాధవరావ్ అడ్ కర్ భక్త లీలామృతం చదువుతున్నాడు. ఆయన చదువుతున్నదానిలో యిదే సంఘటన రావడం తటస్థించింది. ఆవిధంగా బాబా ఉదయం తను చెప్పిన మార్గదర్శక సూత్రాలకి బలమైన సంఘటన కళ్ళకు కట్టినట్లుగా స్పష్టంగా తెలియచేశారు.
(మిగతా భాగం రేపు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment