28.07.2015 మంగళవారం
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయిలీల మాసపత్రిక 1980 నవంబరు సంచికలో ప్రచురింపబడిన నిజమయిన సాయిభక్తుడెవరు అనే విషయం గురించి తెలుసుకుందాము.
నిజమయిన సాయిభక్తుడెవరు?
శ్రీసాయినాధులవారిపై ప్రచురింపబడిన ఈ వ్యాసాన్ని మనం చాలా సులభంగా అర్ధం చేసుకోగలం. ఈ వ్యాసం ఎంతో మంది సాయిభక్తులకు మనసుకు హత్తుకొంటుందనే అనుకుంటున్నాను.
మొట్టమొదటగా ఉదయించే ప్రశ్న భగవంతుడంటే ఎవరు? సాయి నాధునికి నిజమయిన భక్తులెవరు? ప్రపంచంలో అన్ని మతాలలోను ఉన్న ఒకేఒక భావన. అదే "మానవ సేవే మాధవ సేవ". దీనిని ఎవరూ కాదనలేదు అన్నది మనకందరికి తెలిసిన విషయమే. అయితే మానవులందరూ కూడా బంగారంలాంటి ఈ మూల సూత్రాన్ని ఎందుకని అర్ధం చేసుకోలేకపోతున్నారు. ప్రపంచంలో యిది కేవలం ఒక ముఖ్యమయిన ధర్మసూత్రంగానే మిగిలిపోయింది ఎందుకని? కారణం అజ్ఞానం తప్ప మరేమీ కాదు. సహజసిధ్ధంగా మానవుడు స్వార్ధపరుడు, కోరికల పుట్ట. స్వార్ధం అనేది సమాజానికి ఉపయోగపడేదిగాను, అమోదయోగ్యమయినదిగాను ఉండాలి. అంతేగాని స్వార్ధప్రయోజనం స్వంతానికి ఉపయోగపడేలా ఉండకూడదు.
దేవాలయాలకి, మసీదులకి, చర్చిలకి యింకా పుణ్యక్షేత్రాలకు వెళ్ళేవారంతా భక్తులేనా? వారంతా దైవభక్తులే అని మనం అర్ధంచేసుకుందామా? అందరిలోను భగవంతుడున్నాడు, అందరిలో ఉన్న భగవంతుడు ఒకడే, భగవంతుడు అన్నిచోట్లా ఉన్నాడని మనం అనుకుంటున్నపుడు పుణ్యక్షేత్రాలను దర్శించడం అవసరమా? కాని, మనకు దైనందిన జీవితం లో అనేక సమస్యలు ఉన్నాయి. భగవంతుని మీద ఏకాగ్రత, ధృఢనిశ్చయం, మనశరీరం మీద మనకే స్వాధీనం లేకపోవడం, యిటువంటి కారణాలవల్ల మనం భగవంతునికి చేరువగా చేరలేకపోతున్నాము. ఒక సంసారిగా అది సాధ్యమయేదికాదు. కాకపోతే పుణ్యక్షేత్రాలలో మనం మనస్సును మన అధీనంలోకి తెచ్చుకొని భగవంతుని మనసారా ప్రార్ధించి పూర్తి న్యాయం చేయగలగటం కష్టమయిన విషయమేమీకాదు. * పవిత్రమయిన ప్రదేశాలలో నలువైపులనుంచి మనలోకి మంచి ఆలోచనలు ప్రవేశిస్తాయి.
ఎందువల్లనంటే భగవంతుని అనుగ్రహం కోసమయినా కావచ్చు లేక భగవంతుడంటే భయంవల్లనయినా కావచ్చు. అందుచేత ఈరెండు విషయాలలోను భగవంతుని పూజించడం తప్పనిసరి. భవబంధాలన్నిటినీ త్యజించిన సన్యాసి, భగవంతునియొక్క నిజమయిన భక్తుడని నిరూపించవచ్చు. కాని ప్రతివాడు సన్యాసి కాలేడు. అందుచేత నిజమయిన భక్తుడవాలంటే సన్యాసి అవాలనే ఆలోచనకి యిక్కడ ప్రాధాన్యత లేదు, లాభం కూడా లేదు.
విశ్వాసం, నమ్మకం ఈ రెండూ సంబంధిత భావాలు. వీటిమీద ప్రశ్నలు, చర్చలు అనవసరం. సాధారణంగా మానవులు దేవునిముందు హృదయపూర్వకంగా తమతమ కోర్కెలను చెప్పుకుంటూ ఉంటారు. నిజమయిన భక్తుడు దీనిని అనుచితంగాను, అతిగాను భావించడు. ఎందుకంటే భగవంతుడు సర్వజ్ఞుడు. ఆయనకన్నీ తెలుసు. మనకేది కావాలో తెలుసు.
సాయిమహరాజ్ ఎప్పుడూ సుఖవంతమయిన జీవితాన్ని గడపలేదు. ప్రతిరోజు అయిదిళ్ళవద్ద భిక్షమడిగేవారు.
బాబా కూడా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు లాగే బాధలు, కష్టాలు అనుభవించారు. ఎందుకని? జీవితం గులాబీల పానుపుకాదు. మనకు ప్రాప్తం లేనిదాని గురించి మనమేమీ ఆశించకూడదు. పుట్టిన ప్రతి మానవుడు కష్టించి పని చేసి తిండి సంపాదించుకోవాలి. సాధారణంగా ప్రజలు శ్రమపడకుండా, నిజాయితీగా శ్రమించకుండా, తాము అనుకున్న ఫలితాలేమీ రాలేదని, తమ ఖర్మ అని తమను తాము నిందించుకుంటు ఉంటారు. ఖర్మ అన్నది మనకు మనం చేసుకున్నస్వయంకృతాపరాధం. అదృష్టం కలిసిరావడమంటే మనం నిజాయితీగా ప్రయత్నం చేసినపుడు భగవంతుడు అనుగ్రహించి చేసే అధ్బుతం.
నేడు సాయి భక్తి అన్నికులాలు, మతాల వారిలో బాగా ప్రాచుర్యం పొందుతోంది. (వ్యాప్తి చెందుతోంది.) ఇందులోని అద్బుతం ఏమిటి? ఎవరయినా సరే ఎక్కువ ఓర్పు వహించి శ్రీసాయి సత్ చరిత్రను సమగ్రంగా చదివితే, సాయి బోధించిన సూత్రాలు చాలా సరళంగాను, ఆచరించడానికి సులభమైనవి అని అర్ధమవుతుంది. బాబా చెప్పిన సూత్రాలను ఆచరణలో పెట్టినపుడు మానవాళికి ఎంతో మేలు కలుగుతుంది. మానవుడు భగవంతునిచే సర్వోన్నతంగా సృష్టించబడ్డాడు. మానవుని మేధస్సు భగవంతుడిని కూడా జయించేటంత శక్తికలది. అందుకనే సాయి మనకు ప్రముఖంగా చెప్పిన సూక్తి "నాయందెవరి దృష్టో వారియందే నాదృష్టి" తన మీదనే దృష్టి పెట్టమని బాబా ఎందుకని చెప్పారు? దీనిలోని భావం ఏమిటి? దీని గురించి ప్రతివారూ తీవ్రంగా ఆలోచించాలి. సాయిమీదనె దృష్టి నిలపడమంటే అది సామాన్యమయిన విషయమేమీ కాదు. దానికి ఎంతో ఏకాగ్రత, ఓర్పు, స్థిరమయిన మనస్సు, భక్తి ఉండాలి. వీటినన్నిటినీ సాధిస్తే మన సమస్యలు సగంవరకూ వాటంతటవే సమసిపోతాయి. మనజీవితం మనచేతుల్లోనే ఉండి ఆనందకరంగా సాగుతుంది.
సాయిచరిత్రను చదివి ఆయన చేసిన బోధనలను అర్ధం చేసుకోకుండా అద్భుతాలు కలగాలని కోరుకోవడమంటే, అర్ధం చేసుకోకుండా చదవడం, తిన్నది జీర్ణించుకోలేకపోవడం వంటిది.
భక్తి అనేది భూమి ఆకాశం కలిసే చోటువంటిది. భక్తి ఎంత ఎక్కువగా ఉంటే అంతకంటే ఎక్కువగా మనం సాధించుకోగలం. దీనికి యిక ముగింపు అంటూ ఉండదు. అనగా మనలో భక్తి పెరుగుతున్న కొద్దీ ఫలితాలను కూడా ఎక్కువగా అనుభవించగలం.
వాస్తవంగా పైన చెప్పిన సందర్భంలో, సాయి భక్తులు బాబావారి అధ్బుతాలను అర్ధం చేసుకుంటే కనక బాబాను గురువులకే గురువు సమర్ధ సద్గురువుగా భావిస్తారు.
ఎన్.మశ్చిందర్ దాస్
వరంగల్
(శ్రీసాయిలీల నవంబర్ 1980)
* పవిత్ర ప్రదేశాలలో, దేవాలయాలలో పవిత్రమైన వాతావరణం ఉంటుంది. దేవుని దర్శనం చేసుకున్న తరువాత కాసేపయినా ప్రశాంతంగా కూర్చుని దర్శించుకున్న దేవుని రూపాన్నే కనులు మూసుకుని చూస్తూ ఉండాలి. ఈ రోజుల్లో మనలో ఎంతమందిమి ఈ విధంగా చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. కూర్చోవడమంటే ఎదో మొక్కుబడిగా కూర్చోవడం కాదు. ప్రశాంతమయిన మనసుతో పవిత్రమైన ఆలోచనలతో స్థిరంగా కూర్చోవాలి. నేడు దేవాలయానికి వెళ్ళినా కూడా చరవాణులు తప్పటల్లేదు. భగవంతుని దర్శన సమయంలోనే చరవాణులలో సంభాషణలు, బయటకు వచ్చిన తరువాతకూడా సంభాషణలు చేస్తూ ఉంటే మనలో భక్తి ఉన్నదా లేదా అనేది మనకు మనమే ఆలోచించుకోవాలి. ఒకవేళ మన చరవణిని ఆసమయంలో మాట్లాడకుండా ఆపివేసినా ఎవరు చేశారో, ఎందుకని చేశారో అనే విషయం మీదనే మనసు లగ్నమై ఉంటుంది. ఇక భగవంతుని మీద మనసు లగ్నం చేయగలమా? వీటిని జయిస్తే మనం మనసుని కాస్తయిన అదుపులో ఉంచుకోగలం, భక్తి మనలోకి దానంతటదే ప్రవేశిస్తుంది. ఓం సాయిరాం.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment