30.07.2015 గురువారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
గురుపౌర్ణమి శుభాకాంక్షలు
రేపు అనగా 31.07.2015 గురుపౌర్ణమి. మన సద్గురువు అయిన బాబావారిని ఎప్పటిలాగే మనసారా స్మరించుకుంటూ ఉందాం.
గురుబ్రహ్మ, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరఃగురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"అంటారు. దైవోపచారం చేస్తే గురువైనా రక్షిస్తాడు. అదే గురువుకు కోపం వస్తే ముల్లోకాలలో ఎవరూ రక్షించలేరట. అందుకే సమస్త విద్యలను నేర్పే గురువుకు, జ్ఞానాన్ని అందించే గురువుకు సేవచేసి, గురుకృప పొంది మహనీయులైనవారు ఎందరో వున్నారు.
"గురువునూ, గోవిందుడిని పక్కనపెట్టి ముందు ఎవరికి నమస్కారం చేస్తావంటే, గురువుకే నమస్కరిస్తాను. కారణం గోవిందుడు వున్నాడని చెప్పింది గురువేకదా" అంటాడు భక్తకబీర్ దాస్. అదీ మన భారతీయసంస్కృతి ఆర్షధర్మం నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యం. కాబట్టి గురుపౌర్ణమినాడు ప్రతి ఒక్కరూ గురువుల్ని సేవించాలి.
గురు సందేశము :
వేదవ్యాసుడు తన రెండు చేతులనూ పైకి ఎత్తి లోకమంతటికీ నమస్కరిస్తూ చెప్పిన మాటల్లో విశిష్టమైనది ఏమిటంటే- 'ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారో మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు.' పరమ ధర్మపథాలన్నింటిలోకీ పరాయణమైన ఈ ఒకే ఒక్క విషయాన్ని త్రికరణశుద్ధిగా పాటించినట్లయితే మన సమాజం కచ్చితంగా శాంతిధామమవుతుంది
******
ఈ రోజు ది గ్లోరీ ఆఫ్ షిరిడీ సాయి లో ప్రచురింపబడిన మరొక బాబా లీలను తెలుసుకుందాము. భారత దేశం నుంచి ఎక్కడికో వేల మైళ్ళదూరంలో ఉన్న విదేశానికి ముఖ్యమయిన పత్రాలను తీసుకుని వెళ్ళడం మరచిపోతే ఇక ఆవ్యక్తి పడే అవస్థ వర్ణనాతీతం. వెనక్కి వచ్చి తీసుకుని వెళ్ళే పరిస్థితి కాదు. అటువంటి పరిస్థితిలో ఎవరు సహాయం చేయగలరు? కాగితాలు ఇంటివద్దకూదా కనపడకపోతే ఇక ఏమి చేయాలి?
ఏవిధంగా సహాయం అందుతుంది. కాగితాలు దొరికి తిరిగి విదేశానికి వచ్చి చేరాలంటే వెంటనే అయే పనేనా? అటువంటి పరిస్థితిలో ఇరుక్కున్న వ్యక్తి దీన గాధ ఇప్పుడు మీరు చదవబోయేది. మరి ఈ సమస్య ఎలా పరిష్కరింపబడింది. చదవండి.
షిరిడీ సాయి వైభవం
నా పరువును నిలబెట్టిన బాబా
అత్యవసర పరిస్థితిలో బాబా నాకు ఏవిధంగా సహాయం చేశారో, మీకు వివరిస్తాను.
నాకప్పగించిన ఒక ముఖ్యమయిన పని నిమిత్తం నేను విదేశానికి వెళ్ళాను. కాని అక్కడకు వెళ్ళిన తరువాత చూసుకుంటే నాపనికి సంబంధించిన ముఖ్యమయిన (డాక్యుమెంట్స్) కాగితాలని యింటిదగ్గరే మర్చిపోయానని గ్రహించేటప్పటికి నాకేం చేయాలో అర్ధం కాలేదు. ఇంటికి ఫోన్ చేసి నేను చదువుకునే గదిలో కాగితాలు వెతకమని చెప్పాను. ఎంత వెదికినా నేను చెప్పిన కాగితాలేమీ కనపడలేదని చెప్పారు. ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఇదే సమాధానం వచ్చింది. కొన్నివేల మైళ్ళ దూరంలో ఉన్నాను. ఇక్కడికి రావడానికి అయిన ఖర్చు, సమయం అంతా వృధా అయిపోయిందనే ఆందోళనతో, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను. నా సహచరులకి నా మొహం ఎలా చూపించాలి, నా బాస్ కి నేనేమని సమాధానం చెప్పాలి? ఈ ఆలోచనలతో మనసంతా వికలమయిపోయింది. హోటల్ గదిలోనే కూర్చుని బాబాని ప్రార్ధించి, నాతో కూడా తెచ్చుకున్న సాయి సత్ చరిత్రని చదవడం ప్రారంభించాను.
మరునాడు ఇంటికి ఫోన్ చేసి కాగితాలు దొరికాయా అని అడిగాను. దొరకలేదనే సమాధానం వచ్చింది. ఇంకా దురదృష్టం వెంటాడుతూనే ఉంది. ఆ మరుసటి రోజు కూడా యిదే విధంగా జరిగింది. అప్పటికి సత్ చరిత్ర మూడవవంతు పూర్తయింది. ఆఖరికి ప్రయత్నాన్ని విరమించుకుని సత్ చరిత్ర పూర్తి చేసి మరలా బాబాని ప్రార్ధించడానికే నిశ్చయించుకున్నాను.
నాలుగవ రోజున జరిగింది అధ్బుతం. సాయి సత్ చరిత్ర ఆఖరి పేజీ చదవడం పూర్తయిన మరుక్షణమే యింటి దగ్గిరనుంచి ఫోన్ వచ్చింది. నేనడిగిన కాగితాలు దొరికాయనీ, వెంటనే కొరియర్ ద్వారా పంపుతున్నామని చెప్పారు. నా కళ్ళనుండి ఆనంద భాష్పాలు రాలాయి. నా సంతోషానికి అవధులు లేవు. ఒక్క రోజులోనే నాకు కాగితాలు అందాయి. నాకప్పగించిన పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకుని యింటికి తిరిగి వచ్చాను.
అసలు జరిగిన విషయం, నేను నాసామానులు సద్దుకుంటున్నపుడు. ఈ ముఖ్యమయిన కాగితాలన్నిటిని, నేను తీసుకుని వెళ్ళనవసరంలేని ఫైలు లోపలి కవరులో పెట్టేశాను. మూడవరోజునాడు మా మామగారికి తెల్లవారుజామున 3 గంటలకు తను నా ఫైలు లోపల వెదకలేదన్నట్లుగా కల వచ్చింది. ఆయన వెంటనే లేచి ఫైలులో చూడగా అందులో కాగితాలు కనిపించాయి. ఈ కల ఆయనకి సరిగ్గా, వేలమైళ్ళ దూరంలో నేను శ్రీ సాయి సత్ చరిత్రను పూర్తి చేయబోతున్న సమయంలో వచ్చింది.
బాబా పాదాలకు ప్రణమిల్లి, ఆయనకు నా కృతజ్ఞతలు తెలుపుకోవడం తప్ప నేనేమి చేయగలను? కొన్ని కొన్ని సమస్యలకు పరిష్కారాలు చాలా అద్భుతంగా జరుగుతాయి.
సాయిరాం
అశోక్
గ్లోరీ ఆఫ్ షిర్దీ సాయి అక్టోబరు, 21, 2010వ. సంచికనుండి.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment