30.03.2016
బుధవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి లీలామృత ధార
షిరిడీలో నా మొదటి అనుభవం
ఈ
రోజు, సాయి లీల మాసపత్రిక నవంబరు, 1974 వ.సం. సంచికలో ప్రచురింపబడిన మరొక అద్భుతమైన
సాయి లీల. బాబా వారు ఒక్కొక్క సారి అదృశ్యంగా
మన దగ్గరకు వచ్చి సహాయం చేస్తారన్న విషయం ఈ లీల చదివిన తరువాత మనం గ్రహించుకోవచ్చు. ఇంతకు ముందు నేను నరసాపురంలో వుండేవాడిని. అక్కడ ప్రతి శనివారం శ్రీ సాయిబాబా సత్సంగం చేసుకుంటూ
ఉండేవాళ్ళం. మా సత్సంగంలో దాదాపు 60 పైదాకా సభ్యులం ఉండేవారం. అందులో ఒక సభ్యురాలు
ఒక రోజు తమ అనుభవం చెప్పారు. ఆవిడ ప్రతిరోజూ
ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచేవారట. లేచి బాబావారి ఆరతి పాట పెట్టేవారట. ఒకరోజు రాత్రి ఆలస్యంగా పడుకోవడం వల్ల లేవలేకపోయారు. అప్పుడు నాలుగు గంటలకు “లే, లే” అని ఎవరో లేపినట్లయిందట. మరి నిద్రనుండి లేపినది బాబా వారు. ఇది చదివిన తరువాత నాకు ఈ సంఘటన గుర్తుకు వచ్చింది.
శ్రీ
సాయి లీలామృత ధార
షిరిడీలో
నా మొదటి అనుభవం
1972
వ.సంవత్సరం దీపావళి రోజులలో మా అబ్బాయికి జ్వరం వచ్చి టెంపరేచర్ 104 డిగ్రీల పై దాకా
వుంది. మేము బాబాని ప్రార్ధించి రక్షించమని
వేడుకున్నాము. అబ్బాయికి జ్వరం తగ్గితే సంవత్సరం
లోపులో షిరిడీ వస్తామని మొక్కుకున్నాము. బాబా
దయ వల్ల అబ్బాయికి తొందరలోనే జ్వరం తగ్గి ఆరోగ్యవంతుడయ్యాడు. కొన్ని కారణాంతరాలవల్ల మేము అనుకున్న మొక్కు ప్రకారం
షిరిడీ వెళ్ళలేకపోయాము. 1973 వ.సంవత్సరం దీపావళి
రోజులు కూడా సమీపిస్తుండంతో సంవత్సరం పూర్తవకుండా మా మొక్కును తీర్చేసుకోవాలనుకున్నాము.
కాని మా మూడు నెలల పాపతో అంత దూరం ప్రయాణం చేయాలంటే
కాస్త భయంగానే ఉంది. కాని బాబామీద భారం వేసి
పది రోజులు ముందుగానే టికెట్స్ రిజర్వ్ చేయించాము. దురదృష్టవశాత్తు పాపకి డయేరియా వచ్చింది. మంచి మందులు వాడినా గుణం కన్పించలేదు. అయిదు రోజుల దాకా చూశాము కాని పాప ఆరోగ్యంలో ఎటువంటి మార్పు లేకపోవడంతో అయిష్టంగానే
టికెట్స్ రద్దు చేయించాను. చాలా బాధ కలిగింది. కాని, విచిత్రంగా రెండు రోజులలోనే పాపకి విరోచనాలు
తగ్గిపోయాయి. వెంటనే మరలా ఇంతకు ముందు అనుకున్న
రోజుకే టికెట్స్ రిజర్వ్ చేయించాను. షిరిడీకి
రాను పోను ప్రయాణం అంతా ఎటువంటి కష్టం లేకుండా జరిగింది. షిరిడీలో మూడు రాత్రులు గడిపాము. అక్కడ ఉన్న మూడు రోజులూ ఎంతటి ప్రశాంతతను అనుభవించామో
అది వర్ణించడానికి సాధ్యం కాదు.
మంగళవారం
నాడు మేము షిరిడీ చేరుకున్నాము. బుధవారం రాత్రి
పడుకునే ముందు బాబాని ఇలా ప్రార్ధించాను, “బాబా! తెల్లవారుఝాము (గురువారమ్) నాలుగు
గంటలకే నాకు మెలకువ వచ్చేలా చేయి. స్నానం పూర్తి
చేసుకుని తయారయి అయిదు గంటలకల్లా సమాధి మందిరానికి వచ్చి నీ కాకడ ఆరతిని, అభిషేకాన్ని
దర్శించే అవకాశం కలిగించు” ప్రార్ధించుకున్న
తరువాత ప్రశాంతంగా నిద్రపోయాను. గాఢ నిద్ర పట్టేసింది. ఒక్కసారిగా ఎవరిదో చేయి నా వీపు
మీద పడి నన్ను తోసి, లేచి కూర్చునేలా చేసింది.
నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. నా వీపు
మీద చేయి వేసి తోసిందెవరా అని లేచి కూర్చుని లైటు వేసాను. నా భార్యా పిల్లలు గాఢ నిద్రలో ఉన్నారు. ఓహ్! అప్పుడే గుడి గంట నాలుగు సార్లు మ్రోగింది. వాచీలో టైమెంతయిందోనని చూశాను. సరిగా నాలుగు గంటలవడానికి ఒక నిమిషం ఉంది!!! బాబా
తప్ప నన్నెవరు లేపగలరు?
త్రికరణ
శుధ్ధిగా ఆయనని ప్రార్ధించి శరణాగతి వేడితే బాబా తానే స్వయంగా వచ్చి తన భక్తులకు ఎటువంటి
సహాయాన్నయినా అందిస్తారనే విషయం ఈ అనుభవం ద్వారా నాకు ఋజువయింది.
దీనిని బట్టి బాబా మహాసమాధి చెందిన 55 సంవత్సరాల
తరువాత కూడా బాబా సశరీరంగా దర్శనాన్నిస్తారన్న దానికి ఇది నా రెండవ అనుభవం.
ఇంకా
ఆయన మామీద కురిపించిన అనుగ్రహం అభిషేకానికి మొదటి టిక్కెట్ మాకే లభింపచేయడం. దీపావళి రోజున బాబాకి అభిషేకం, అర్చన మొట్టమొదటగా
మా చేత చేయించుకున్నారు బాబా. ఆరోజు రాత్రి
పల్లకి సేవలో కూడా పాల్గొనే అదృష్టాన్ని ప్రసాదించారు.
ఆయన
నిరంతరం మామీద కురిపిస్తున్న అనుగ్రహానికి
మేమెంతో అదృష్టవంతులమని భావిస్తున్నాను.
సి. కె. రామనాధ్ చెట్టి
హైదరాబాదు – 500 027
(ఈయన
రాసిన మొదటి అనుభవం సాయిలీల మాసపత్రిక అక్టోబరు 1972 వ.సంవత్సరం సంచికలో ప్రచురింపబడిందని
ఈ అనుభవం మొదట్లో రాశారు. కాని నాకు ఆ పత్రిక
నెట్ లో దొరకలేదు. సాయిభక్తులు ఎవరి వద్దయినా
లభిస్తే నాకు తెలియపర్చండి. అనువాదం చేసి ప్రచురిస్తాను.)
ఓం
సాయిరామ్..
త్యాగరాజు,
9440375411
నిజాంపేట్
హైదరాబాద్
(మరికొన్నిఅమృత ధారలు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment