29.03.2016 ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయి లీల మాసపత్రిక జూన్ 1974 సం.సంచికలో ప్రచురింపబడిన ఒక అద్భుతమైన సాయి లీల. బాబా వారు ఒక భక్తునికి ఇచ్చిన అద్భుతమైన దివ్య దర్శనం చదవండి.
శ్రీసాయి
అమృత ధార
బాబా
దివ్య దర్శనం
(ఒక
సాయి భక్తుని అనుభవం)
(శ్రీ
ఎన్.పూర్ణచంద్ర రావు, బి.ఎ.)
1955
వ. సంవత్సరంలో గురువారంనాడు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో శ్రీ సాయిబాబాగుడికి నా
స్నేహితునితో, కూడా వెళ్ళడం సంభవించింది. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన. అప్పటివరకు నాకు సాయిబాబాను పూజించడమంటే ఏమీ తెలీదు. మొట్ట మొదటి దర్శనంతోనే గుడిలో ఉన్న సాయిబాబా విగ్రహం
నన్నెంతో ముగ్ధుణ్ణి చేసింది. అప్పటినుండి
ఇంటిలో నేను ఆయనని ప్రతిరోజూ ఆరాధించడం మొదలు పెట్టాను. నేను 1959 లో భీమవరం వదలి పెట్టే వరకు దాదాపు ప్రతిరోజూ
ఆయన గుడికి వెడుతూ ఉండేవాడిని
నేనక్కడ
ఉన్న ప్రతిరోజూ ఆయనను పూజించేటంతగా నాలో ఆయన మీద భక్తి విశ్వాసాలు క్రమంగా పెరగడం ప్రారంభించాయి. బాబా అనుగ్రహంతో 1964 వ.సంవత్సరంలో నాకు కొడుకు
పుట్టాడు. నాకు షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకోవాలని
ఎంతో కోరికగా ఉండేది. కాని నేను నివసిస్తున్న
ప్రదేశం నుండి షిరిడీ చాలా దూరంలో ఉండటం వల్ల నా కోరికని నెరవేర్చుకోలేకపోయాను. 1967వ.సంవత్సరం మొదట్లో నాకు 8 వారాలు
ఆఫీసు వారు నిర్వహించే శిక్షణా శిబిరానికి వెళ్ళి అక్కడ ఉండే అవకాశం వచ్చింది. ఈ సమయంలోనే
నాకు వేరే ఊరికి బదిలీ అయ్యి కుటుంబంతో సహా క్రొత్త ప్రదేశానికి వెళ్ళాల్సిన పరిస్థితి.
ఈ చికాకుల వల్ల కుటుంబాన్ని క్రొత్త ఊరిలో వదలి, నేను పూనా వెళ్ళి 8 వారాలు ఉండాలి. పిల్లల్ని వంటరిగా క్రొత్త ప్రదేశంలో రెండు నెలలపాటు వదలి వేసి పూనా
వెళ్ళడమా లేక, సెలవు పెట్టి పూనా వెళ్ళే అవకాశాన్ని వదలుకోవడమా? ఏదీ నిర్ణయించుకోలేని
సందిగ్ధంలో పడ్డాను.
ఆలోచించి
నిర్ణయిం తీసుకోవడానికి కూడా సమయం లేదు.
24 గంటలలో ఏదో ఒకటి తేల్చుకోవాలి. మరుసటి
రోజు ఉదయమే పూనాకి బయలుదేరడమా లేక సెలవు పెట్టేయడమా? రోజంతా దీని గురించే ఆలోచిస్తూ బుర్ర బద్దలుకొట్టుకుంటున్నాను. పూనా వెళ్ళే అవకాశాన్ని పోగొట్టుకోదల్చుకోలేదు. పూనానుండి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకోవాలని
ఎప్పటినుండో నాలో ఉన్న చిరకాల వాంఛని నెరవేర్చుకోవాలనుంది. అలాగని ఇక వేరే మగ దిక్కు ఎవరూ లేకుండా కుటుంబాన్నంతా క్రొత్త ప్రదేశంలో వదలి వెళ్ళాలని లేదు. నేను
లేనప్పుడు కుటుంబంలో ఎలాంటి అవసరాలు వచ్చినా ఎవరు చూస్తారు. ఇవే ఆలోచనలతో సతమతమవుతూ ఉన్నాను. సరైన నిర్ణయం తీసుకోలేక చాలా బాధపడుతున్నాను. ఆ రోజు రాత్రి సరిగా నిద్ర కూడా పట్టలేదు. ఆ రోజు అర్ధరాత్రి హటాత్తుగా నాకు స్వప్నంలో షిరిడీ
సాయిబాబా వారు దర్శనమిచ్చారు. ఆయన చుట్టురా
దివ్యమైన తెల్లటి కాంతి ప్రసరిస్తూ ఉంది. ఆ
కాంతి ఎంత తీక్షణంగా ఉందంటే దానిని నేను మాటలలో వర్ణించలేను. వర్ణించడానికి నాకు సాధ్యం కాదు. ఆయన శిరస్సునుండి పాదాల వరకు తెల్లటి కాంతి ప్రసరిస్తూ
ఉంది.
ఆయన నావైపు చూస్తూ ఉన్నారు. ఆయన కళ్ళు కూడా సజీవంగా ఉన్నాయి. అంతటి తీక్షణమయిన కాంతిని తట్టుకోవడం నా వల్ల కాలేదు. ఇంతకు ముందు నేనెప్పుడూ చూసి ఉండకపోవడం, అనుభవం
లేకపోవడంతో ఒక విధమయిన దిగ్భ్రాంతికి లోనయ్యి భయంతో లేచి కూర్చున్నాను. అటువంటి దివ్యమయిన తీక్షణమయిన తెల్లని కాంతి మధ్యలో
బాబావారి దర్శనం. ఇటువంటి అనుభూతి వివరంగా చెప్పాలంటే ఆధ్యాత్మికత పూర్తిగా నిండి ఉన్న
యోగులకి తప్ప సామాన్య మానవునికి ఆ అనుభూతిని వర్ణించడం సాధ్యం కాదు. అంత మహత్తరమయిన దివ్యానుభూతి. అయిదు నిమిషాలు విశ్రాంతి
తీసుకున్న తరువాత నిద్రకుపక్రమించాను. అరగంటలోనే
మరలా స్వప్నంలో అదే దివ్యమయిన తీక్షణమయిన వెలుగులో బాబా వారి దర్శనం. ఆ వెలుగు తీవ్రతని
తట్టుకోవడం నాకు సాధ్యమవలేదు. వళ్ళంతా వణుకు
కలిగింది. ప్రకంపనాలు కలిగి మళ్ళీ లేచి కూర్చున్నాను. పొద్దుటే రాత్రి నాకు వచ్చిన కల గురించి సావకాశంగా
ఆలోచించసాగాను. అప్పుడు నాకర్ధమయింది. పూనా వెళ్ళే అవకాశాన్ని వదలుకోకుండా బాబాగారు నన్ను
షిరిడీ రమ్మంటున్నారని. షిరిడీ వచ్చి బాబాను
దర్శనం చేసుకుందామనే నా చిరకాల వాంఛను తీర్చుకోమని బాబాగారు ఆదేశిస్తున్నట్లుగా నేనర్ధం
చేసుకున్నాను.
నా
కుటుంబ సంరక్షణ భారమంతా బాబా మీదే వదలి, మరుసటి రోజునే పూనాకి బయలుదేరాను. పూనాలో ఉండగా వరుసగా మూడురోజులు ప్రభుత్వ సెలవులు
దినాలు వచ్చాయి. ఆ సెలవులలో షిరిడీకి ప్రయాణమయ్యాను. మహరాష్ట్రలోని మారు మూల ప్రాంతాల్లో భాషా సమస్య
ఉంది. అక్కడ ఎక్కువ మంది హిందీ కాని మరాఠీ
గాని మాట్లాడతారు. శ్రీసాయిబాబా వారి అనుగ్రహంతో
ఎక్కడా ఎటువంటి కష్టం లేకుండా నేననుకున్నదానికంటే ఎంతో సంతోషంగా ప్రయాణం జరిగింది. బాబా తన భక్తులకు ఏవిధంగా సహాయం చేస్తారో నా షిరిడీ
ప్రయాణంలో జరిగిన విశేషాలన్నీ వివరిస్తాను.
పూనా
బస్ స్టాండులో రాత్రి 2 గంటలకి షిరిడీ వెళ్ళడానికి ప్రభుత్వం వారు నడిపే బస్సుకోసం
నిరీక్షిస్తూ ఉన్నాను. ఇంతలో పొడవుగా బలిష్టంగా
ఉన్న అపరిచిత వ్యక్తి నా వద్దకు వచ్చాడు. అతనికి
గడ్డం ఉంది. అతను బస్సు చార్జీ కే తన కారులో
నన్ను అహ్మద్ నగర్ వరకు దింపుతానని నా వెంట పడ్డాడు. హిందీ, మరాఠీ తప్ప ఆంగ్లం కూడా రాని ఒక అవరిచితుడితో
ఒంటరిగా అతని కారులో వెళ్ళడానికి కాస్త సందేహించాను. భయం కూడా వేసింది. కారు వెనక సీటులో వార్తా పత్రికల కట్టలు ఎన్నిటినో
వేసుకుని వెళ్ళేంత ఖాళీ ఉన్నా, ఒక్కరిని మాత్రమే తీసుకుని వెడతానన్నాడు. నేనతనికి సమాధానం చెప్పడానికి ఇష్టపడకపోయినా, నేనక్కడికి
వెళ్ళాలన్న విషయాన్ని నన్ను హిందీలోనే అడిగి తెలుసుకున్నాడు. అక్కడ ఇంకా బస్సుకోసం నిరీక్షిస్తున్న మిగతా ప్రయాణీకుల
దగ్గరకు వెళ్ళి వాళ్ళని కూడా అడిగి తిరిగి నా దగ్గరకు వచ్చాడు. నాతో “మీరు షిరిడీ వెడుతున్నారన్న విషయం నాకు బాగా
తెలుసు. నా కారులో రావడం వల్ల మీకెటువంటి హాని
జరగదు” అని హిందీలోనే మాట్లాడాడు. ఎంతో ప్రయత్నం చేసి నన్ను తన కారులో కూర్చునేలా చేశాడు.
చాలా అయిష్టంగానే నేనతని కారులోకి ఎక్కాను.
నేనతని మాటలను నమ్మాలో నమ్మకూడదో ఏమీ అర్ధంకాలేదు. కారులోకి ఎక్కిన తరవాత తొందరగానే నన్ను అహ్మద్ నగర్
కు చేర్చాడు. ప్రయాణం అంతా చాలా హాయిగా సాగింది. షిరిడీ వెళ్ళడానికి అహ్మద్ నగర్ లో బస్ స్టాండ్
ఎక్కడో చూపించాడు నాకు. అక్కడినుండి ప్రభుత్వం
వారి బస్సులో నాకు షిరిడీ వెళ్ళడానికి సీటు దొరికింది.
అహ్మద్
నగర్ లో బస్సులోకి ఎక్కిన తరవాత బస్సు ఆగిన ప్రతి స్టేజ్ లోను షిరిడీ వచ్చిందా అని
నా తోటి ప్రయాణీకులను అడగసాగాను. షిరిడీ దాటి పోతుందేమో, కష్ట పడతానేమోనని నాభయం. నా
ఆతృతను చూసి ఒకతను నా దగ్గరకు వచ్చి వివరాలన్నీ అడిగాడు. తాను బస్సు ఇన్స్పెక్షన్ చేసే ఆఫీసరునని, నన్ను
షిరిడీలో దించి సాయిబాబా వారి మందిరాన్ని చూపిస్తాననీ కంగారు పడవద్దని అభయం ఇచ్చాడు. షిరిడీ వచ్చాక అతను శ్రీసాయిబాబా వారి మందిరానికి
తీసుకుని వెళ్ళి, ఆ ప్రాంతం విశేషాలన్నీ నాకు
వివరించాడు. అతను చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను.
మందిరంలోకి
అడుగు పెట్టగనే అప్రతిభుడినయ్యాను. ఇంతకు ముందు
నాకు కలలో దివ్యమయిన తెల్లని వెలుగులో నాకు బాబా వారి దర్శనమయిందని మీకు వివరించాను.
సరిగ్గా అదే బాబా వారి విగ్రహం నాకు కలలో ఏవిధంగా దర్శనం కలిగిందో అదే విధంగా ఇక్కడ
బాబా వారి మూర్తిని చూస్తున్నాను. ఇంకా వివరంగా
మీకు చెప్తాను. ఇంతకు ముందు నేను పశ్చిమగోదావరి
జిల్లాలోని భీమవరం, ఏలూరులలో ఉన్న సాయిబాబా మందిరాలకి వెళ్ళాను. సాయిబాబా వారి విగ్రహాలు వివిధ రంగులలో అంటే తెల్లటి
గడ్డం, కాషాయం ఎరుపు రంగు దుస్తులలో ఉండేవి.
పూర్తిగా తెలుపు వర్ణంలో ఉన్న సాయిబాబాని ఎప్పుడూ ఆరాధించలేదు. షిరిడీలోని ఈ విగ్రహాన్ని దర్శించుకున్న తరువాత
నాకు కలలో దర్శనమిచ్చిన ఆయన రూపాన్ని ఒకసారి మరలా గుర్తుకు తెచ్చుకున్నాను. నేను చూసి తట్టుకోలేనంతగా ఆయన నాకు దివ్యమయిన దర్శనాన్ని
కలిగించినందుకు నాకెంతో సంతృప్తి కలిగింది.
ఇది
జరిగిన తరువాత శ్రీసాయిబాబాపై నా నమ్మకం వేయింతలు పెరిగింది. ప్రతిరోజూ ఆయనను ప్రార్ధించుకుంటూ ఉంటాను. ప్రతినెల పోస్టులో వచ్చే ఆయన ఊదీ ప్రసాదం కోసం ఎంతో
ఆతృతగా ఎదురు చూస్తూ ఉండేవాడిని.
(మరికొన్ని అమృత ధారలు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
3 comments:
శ్రీ శిరిడి సాయిబాబా ఏకాదశ సూత్రాలు
-------------------------
శిరిడి జేరు టెల్ల సిరులకు మార్గమ్ము
సర్వ దు:ఖ హరము సర్వ శుభము
నీదు దర్శనమ్ము నిత్య కళ్యాణమ్ము
శ్రీనివాస సాయి ! శిరిడి రాజ !
తనర నెవరి కైన ద్వారకా మాయిని
జేరి నంత శాంతి చేరు వగును
అరయ నార్తు డైన నిరుపేద కైనను
శ్రీని వాస సాయి !శిరిడ రాజ !
పరమ పురుష ! నీవు భౌతిక దేహమ్ము
వీడి వర సమాధి కూడి ఉన్న
నాడు సైత మవని నప్రమత్తుండవే
శ్రీనివాస సాయి ! శిరిడి రాజ !
నీదు భక్త జనుల నిత్య రక్షణ భార
మొనసి వర సమాధి ముఖమునుండె
మోయు చుంటి వెంత మోదమ్ము రా నీకు
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !
శ్రీ సమాధి జేరి చేయెత్తి పిలిచిన
పలికి మాటలాడు ప్రభుడ వీవు
శ్రీ సమాధినుండి చేయెత్తి దీవించు
శ్రీనివాస సాయి ! శిరిడి రాజ !
నిన్నాశ్ర యించు వారిని
పన్నుగ నిను శరణు జొచ్చు భక్తజనుల నా
పన్నుడి వై రక్షించు ట
నెన్నగ నీ బాధ్యత యని యెంతువు సాయీ !
నీయందు దృష్టి నిలుపుచు
పాయక నినుకొలుచు నట్టి భక్త జనుల పై
శ్రీయుత నీకటాక్ష శ్రీ ల
మేయము గా బరపుచుందు మేలుర సాయీ !
సత్య మెరుగ లేక సంసార బంధాల
జిక్కి బాధలొందు జీవజనుల
బరువు మోయ నీవు ప్ర త్య క్ష మౌదువు
శ్రీనివాస సాయి ! శిరిడి రాజ !
ఎవరు గాని నిన్ను నెద నిండ భావించి
నీసహాయము కొర కాస పడిన
తక్షణాన నీవు తగ నాదు కొందువు
శ్రీనివాస సాయి ! శిరిడి రాజ !
శ్రీ భాగ్య నిధులు గూడుచు
నీ భక్తుల గృహములెల్ల నిండారును నీ
యే భక్తుని గృహ మైనను
శోభనమే – లేమి చొరదు శుభకర సాయీ !
సర్వ కార్య ధర్మ నిర్వహణ లన్నియు
శ్రీసమాధినుండె జేతు ననుచు
మాట ఇచ్చి మమ్ము మన్నించినావురా
శ్రీ నివాస సాయి ! శిరిడి రాజ !
చాలా బాగా రాసారు...
Exlent ga vrasaru sai ram
Post a Comment