05.03.2016 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి
జయజయ సాయి
సాయి బంధువులకు
బాబావారి శుభాశీస్సులు
కొన్ని సంవత్సరాల
క్రితం సాయిలీలా మాసపత్రిక పాత సంచికలలోనుండి కొన్ని బాబా లీలలను ప్రచురించాను. తరవాత కొన్నాళ్ళకు అంతర్జాలంలో నాకు దొరకలేదు. అనుకోకుండా నిన్న దొరికాయి. సాయిబానిస గారి శ్రీసాయి పుష్పగిరిని కూడా కొన సాగిస్తూ,
మధ్య మధ్యలో ఈ లీలలను కూడా ప్రచురిస్తూ ఉంటాను.
ఇంకా ఖపర్డే గారి డైరీలోని కొన్ని విశేషాలను కూడా ప్రచురింపవలసి ఉంది. వాటిని కూడా వీలు వెంబడి ప్రచురిస్తూ ఉంటాను. ఈ
రోజునుండి ప్రచురింపబోయే ఈ లీలలకు శ్రీ సాయి లీలామృత ధార అని నామకరణం చేసి, వీటిలో
సాయిలీల మాసపత్రికలో ప్రచురించినవాటిని మీ కందిస్తాను.
ఓమ్ సాయిరామ్.
శ్రీసాయి లీలా
మాసపత్రిక మే 1975 సంచికనుండి గ్రహింపబడినది.
శ్రీ సాయి లీలామృత
ధార
ముక్కు పుడక
బాబా తన భక్తులను
పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లుగా తన వద్దకు లాగుకొంటారు. బాబా భక్తులు కానివారెవ్వరూ ఆయన వద్దకు చేరలేరు. బాబా దృష్టిలో ఎవరయితే పడతారో అపుడే ఆయన అనుగ్రహం
వారి మీద ప్రసరిస్తుంది.
పురందరదాసు దక్షిణభారత
దేశంలో ప్రప్రధమ సంగీత విధాంసులు, వాగ్గేయకారుడు కర్ణాటక సంగీత పితామహుడిగా స్థానం
సంపాదించుకుంటే త్యాగరాజు కర్ణాటక సంగీతంలో త్యాగ బ్రహ్మగా పేరుగాంచాడు.
పురందరదాసు అసలు
పేరు శ్రీనివాస నాయకర్. ఇతను బంగారం, వజ్రాల
వ్యాపారంలో ఎంతో ధనం సంపాదించిన కోటీశ్వరుడు.
కాని పరమ పిసినారిగా కూడా పేరు గడించాడు.
తన జీవితాన్ని వ్యాపారానికే అంకితం చేసి కనీసం ఒక్క క్షణమయినా భగవంతుని తలచేవాడు
కాదు.
ఏపూర్వ జన్మలో చేసుకున్న పుణ్య ఫలం వల్లనో,
భగవంతుడు అతనిని తన భక్తునిగా స్వీకరించే క్షణం ఆసన్నమయింది. ఒక రోజున శ్రీనివాస నాయకర్ వద్దకు పండరీపూర్ పాండురంగడు
(విఠల్) ఒక బ్రాహ్మణుని రూపంలో వచ్చి, “అయ్యా!
నా కుమార్తెకు వావాహం చేయ సంకల్పించాను. తమరు
నాకేమన్నా సహాయం చేయండి” అని అర్ధించాడు. శ్రీనివాస
నాయకర్ ఆతనిని మరుసటి రోజు రమ్మన్నాడు. మరునాడు
ఆ బ్రాహ్మణుడు రాగానే, మరలా మరుసటి రోజు రమ్మని చెప్పాడు. ఆ విధంగా ఆ బ్రాహ్మణుడిని ఆరు నెలలపాటు ప్రతిరోజూ
తిప్పించుకున్నాడు. ఆఖరికి ఆ బ్రాహ్మణుడు శ్రీనివాస
నాయకర్ భార్య వద్దకు వెళ్ళి తన దుస్థితిని వివరించాడు. దయార్ద్ర హృదయురాలయిన ఆమె, కొన్ని వేల రూపాయలు విలువ
చేసే తన వజ్రపు ముక్కు పుడకను తీసి ఆయనకు సమర్పించింది.
ఆ బ్రాహ్మణుడు ఆ ముక్కు పుడకను నాయకర్ వద్దకు అమ్మకానికి
తీసుకుని వచ్చాడు. దానిని చూడగానే అది తన భార్యదని
వెంటనే గ్రహించి బేరమాడి డబ్బు కోసం మరునాడు రమ్మని చెప్పాడు నాయకర్. ఆ ముక్కుపుడకని ఇనప్పెట్టిలో భద్రంగా దాచి తాళం
వేసి ఇంటికి వెళ్ళి భార్యను ఆమె ముక్కుపుడక గురించి అడిగాడు.
భర్త స్వభావం తెలిసిన భార్య, లోపలికి వెళ్ళి వజ్రాన్ని
పొడి చేసి విషం తీసుకుని జీవితాన్ని అంతం చేసుకుందామని నిశ్చయించుకుంది. ఆవిధంగానే వజ్రాన్ని పొడిచేసి ఒక కప్పులో వేసి నీటితో
కలిపి తాగబోతుండగా,…..ఠప్….కప్పులో ఏదో పడినట్లుగా శబ్దమయింది. ఏమిటా అని కప్పులోకి చెయ్యి పెట్టి వెతకగానే అది
తన ముక్కుపుడక. భగవంతుడు చేసిన సహాయానికి కృతజ్ఞతతో
ఆమె కళ్ళంబట ఆనందభాష్పాలు కారాయి. సరైన సమాయానికి
భగవంతుడు చేసిన సహాయానికి కృతజ్ఞతతో నమస్కారాలనర్పించుకుంది. ఆ ముక్కు పుడకను తీసుకుని వెళ్ళి భర్తకు చూపించింది. దానిని చూసి భర్త నివ్వెరపోయాడు. తాను దుకాణంలో భద్రంగా ఇనప్పెట్టిలో తాళం వేసి దాచి పెట్టిన ముక్కుపుడక ఆమె చేతిలోకి ఎలా వచ్చిందని
ఆలోచిస్తూ దుకాణానికి పరుగెత్తాడు. ఇనప్పెట్టి
తెరచి చూశాడు. అందులో తాను భద్రంగా దాచిన ముక్కుపుడక
కనపడలేదు. నోటంబట మాటరాలేదు. ఏవిధంగా మాయమయిందో అర్ధం కాలేదు. ఇంటికి వెళ్ళి నిజం చెప్పమని భార్యనడిగాడు. ఆమె జరిగిన విషయమంతా వివరంగా చెప్పింది. శ్రీనివాస నాయకర్ కి జ్ఞాన నేత్రం తెరచుకుని జ్ణానోదయమయింది. తనని ఉధ్ధరించడానికి సాక్షాత్తు ఆ భగవంతుడే బ్రాహ్మణుడి
రూపంలో వచ్చాడని అర్ధమయింది. తుచ్ఛమయిన, అశాశ్వతమయిన
సుఖ సంతోషాలకు, ధనసంపాదనకు ఎంతో విలువయిన జీవితాన్ని వ్యర్ధంగా గడిపానే అని చింతించాడు. గతించిన రోజులన్నీ గుర్తుకు వచ్చాయి. భగవంతుని అనుగ్రహం వల్ల ఈ క్షణంనుండి తాను మారిన
మనిషి. తనకున్న సంపదనంతా బీదవారికి దానధర్మాలు
చేసేసి బికారిగా మారాడు. బిచ్చమెత్తుకుంటూ
పాండురంగ విఠల్ వైభవాన్ని శ్రావ్యంగా గానం చేస్తూ తన భార్యతో కూడా ఊరూరా తిరగసాగాడు.
ఎక్కడికి వెళ్ళినా ప్రతి గృహంలోను పాండురంగ విఠలుని
ప్రతిష్టించి, ఎన్నో గృహాలలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పాడు.
పాండురంగ విఠలుని
భక్తులలో సముచిత స్థానాన్ని సంపాదించుకొని ధృవతారగా వెలుగొందాడు.
పీ.వి. సత్యనారాయణ
శాస్త్రి
రిటైర్డ్ తహసిల్
దారు, గుంటూరు.
(రేపటి సంచికలో
సాయిబానిస గారి శ్రీసాయి పుష్పగిరి చదవండి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment