07.03.2016 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి
జయజయ సాయి
సాయి బంధువులకు
బాబావారి శుభాశీస్సులు
నా మదిలోని కోర్కెను తీర్చిన బాబా
విచిత్రం ఏమిటంటే బాబా భక్తులకు చాలా విచిత్రంగా కలుగుతూ ఉంటాయి అనుభవాలు. మనసులో అనుకున్న మరుక్షణమే మన కోరికని ఆయన తీర్చే విధానం చూస్తే మనకే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అ అనుభూతి జీవితాంతం మనకి పదే పదే మనసులోకి వచ్చి ఒక విధమైన ఆనందం కలుగుతుంది. ఆ విధమైన అనుభూతులను పొందిన ఒక సాయి భక్తురాలు పంపించారు. చదవండి.
చెన్నై నుండి
శ్రీమతి కృష్ణవేణి గారు రెండు అనుభూతులను పంపించారు. ఈ రోజు వాటిని ప్రచురిస్తున్నాను.
1
మేము చెన్నైలో మైలాపూర్ లో ఉన్న బాబా గుడికి వెడుతూ
ఉంటాము. ఈ సంవత్సరం జనవరి ఒకటవ తారీకున కొత్త
సంవత్సరం సందర్భంగా బాబా గుడికి వెళ్ళాము.
కొత్త సంవత్సరం కాబట్టి గుడిలో చాలా రద్దీగా ఉంటుందని మా చిన్న పాపతో వరుసలో
(లైన్ లో) నుంచోవడం చాలా కష్టమని భావించాము.
బాబా గుడి బయట బాబాని అందరూ చూడటానికి వీలుగా పెద్ద తెరలతో సీ.సీ.టీ.వీ లు ఏర్పాటు
చేశారు.
ఆ విధంగానయినా బాబాని చూడవచ్చనే ఉద్దేశ్యంతో
గుడికి సాయంత్రం బయలుదేరాము. గుడిలో మేము అనుకున్నంత
రద్దీ లేదుగాని, వరుసలో నుంచుని బాబా దర్శనం చేసుకోవాలంటే చాలా మలుపులు ఉన్నాయి. ప్రతి మలుపు వద్ద చిన్న తెరలతో సీ.సీ టీవీ లు ఏర్పాటు
చేశారు. గుడిలో రద్దీ తక్కువగానే ఉండటం వల్ల
మేము వరుసలో నుంచున్నాము. అప్పటికి ఆరతి సమయం
అవటంతో వరుసలో నుంచున్నవాళ్ళందరూ ఎక్కడున్నవాళ్ళు అక్కడే కూర్చున్నారు. కాని అనుకోకుండా మేమున్న వరుసలో మలుపు వద్ద ఉన్న
సీ సీ టీవీ కి ఏదో సాంకేతిక లోపం వచ్చి ఆగిపోయింది. ఆరతి చూసే అదృష్టం లేకపోయిందని చాలా బాధపడ్డాను. కనీసం గుడిలోనయినా ఉన్నామని కాస్త ఆనందపడ్డాను. గుడిలో బాబాకి ఆరతి మొదలయింది. కర్పూరం వెలిగించే సమయం. ఇంతలో మా పెద్ద పాప ఏడవటం మొదలెట్టింది. వరుసలో
ఉన్నవారికి ఇబ్బందిగా ఉంటుందని భావించి నేను లేచి నుంచున్నాను. మేమున్న తరువాతి వరుసలో మలుపు వద్ద సీ.సీ టీవి వుంది
కాని స్థంభం అడ్డుగా ఉండటం వల్ల కనిపించటంలేదు.
ఇంతలో ఎవరో బాబా ఆరతిని వీడియో తీయసాగారు. సరిగ్గా కర్పూరం వెలిగించే సమయానికి
అది నేను చూడటం కోసమే అన్నట్లుగా ఆవీడియో లో బాబా ఆరతిని చూసే భాగ్యం కలిగింది. ఆరతిని వీక్షించడం నాకెంతో ఇష్టం. ఆవిధంగా బాబా వారు నాకు ఆరతిని చూసే అదృష్టాన్ని
కలిగించారని సంతోషించాను.
నేను
మా చిన్న పాప డెలివరీకి మా అమ్మగారింటికి ఒంగోలు వెళ్ళాను. అక్కడ ఉన్నప్పుడు ప్రతి గురువారం మధ్యాహ్న ఆరతికి
నేను, మాపాప వెళ్ళేవాళ్ళము. ఒకసారి ఆరతికి
వెళ్ళినపుడు అక్కడ ఉన్న ఒకామె తన పాపను పూజారిగారికి ఇచ్చి బాబా ఒడిలో పడుకోబెట్టమని
కోరింది. ఆయన పాపని బాబాగారి ఒడిలో పరుండబెట్టారు. అది చూసిన నాకు నేను కూడా మా చిన్న పాపని తీసుకుని
వస్తే బాబావారి ఒడిలో పెట్టించి ఉంటే బాబాగారి ఆశీర్వాదం పాపకు లభించేది కదా అనుకున్నాను. ఆ విధంగా భావిస్తున్నపుడు హటాత్తుగా నాకు ఆ పాప
స్థానంలో నా చిన్నపాప కనిపించింది. మా చిన్న
పాప పేరు శర్వాణీసాయి. అప్పటికి మా చిన్న పాప
వయసు మూడు నెలలు. ఆశ్చర్యం ఏమిటంటే, గుడిలో
నాకు బాబా ఒడిలో నా చిన్నపాప ఏగౌను వేసుకొని కనిపించిందో, నేను ఇంటికి వెళ్ళేటప్పటికి అదే గౌనుతో ఉంది. అది చూడగానే నాకు ఆనందంతో కళ్ళంబట ఆనందాశ్రువులు
కారాయి. బాబా నా చిన్న పాపను కూడా తీసుకుని
వచ్చి నీఒడిలో పెట్టి ఉంటె నువ్వు ఆశీర్వదించి
ఉండేవాడివి కదా అనుకున్న నా కోరికని ఈ విధంగా తీర్చి ఆశీర్వదించావా బాబా అని పదే పదే నా
కృతజ్ఞతలు తెలుపుకున్నాను.
సాయి భక్తులందరికీ ఒక మనవి. ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా సాయిబానిస గారు ఈ రోజు శ్రీసాయి టీ.వీ. లో ప్రసంగించిన శివశంకర సాయి అనే ప్రసంగాన్ని క్రింద ఇచ్చిన యూట్యూబ్ లింక్ లో వినండి.
https://youtu.be/SohXgVufQpg
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment