09.03.2016 బుధవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయిలీలా మాసపత్రిక మే నెల 1975, లో ప్రచురించిన ఒక సాయి లీలామృతం.
శ్రీసాయి లీలామృత
ధార
బంగారు చెవిపోగులు
నిజం చెప్పాలంటె నా ప్రియమిత్రుడు ఒకసారి బాబాగురించి చెపుతుంటే
యధాలాపంగా వినడం తప్ప, 1956 ముందు వరకు నాకు
బాబా గురించి అంతగా తెలీదు. అతని తాతగారు బాబాకు గొప్ప భక్తులు. బాబా జీవించి ఉన్న రోజులలో ఆయనను దర్శించుకున్న
అదృష్టవంతులు ఆయన. 11 సంవత్సరాలు క్షయవ్యాధితో
బాధపడి 1956 వ.సంవత్సరంలో నేను ఆరోగ్యవంతుడినయ్యాను.
నా ఫ్లాట్ లో చిన్న బాబా చిత్ర పటం ఉంది. ఎవరు తెచ్చి అక్కడ పెట్టారో నాకంతగా గుర్తులేదు. నేనా ఫోటో వైపు భక్తితో కాకుండా మామూలుగా చూసేవాడిని. 1957 వ.సంవత్సరం మొదట్లో నాకు సాయిబాబాను పోలిన
వృధ్ధుడు ఒక పాడుపడిన ఇంటిలో ఒక చిన్న చెక్క బల్లమీద కిందకి పైకి తిరుగుతూ ఉన్నట్లుగా
స్వప్నంలో కనిపించాడు. ఆ తరువాత నుంచి కాలం గడిచే కొద్దీ బాబా మీద భక్తి పెరగసాగింది. 1958 వ.సంవత్సరంలో (హోలీ పండగ సెలవులలో ) నాకు షిరిడి
వెడదామని ప్రేరణ కలిగి, షిరిడీ వెళ్ళాను. ఇంకా
ఇక్కడ చెప్పవలసిన గొప్ప విశేషమేమంటే గుడికి సంబంధించిన వాళ్ళెవరూ కూడా భక్తులనుండి
డబ్బు అడగకపోవడం. సాధారణంగా ఇటువంటి ప్రదేశాలలో
భక్తులవద్దనుండి ధనాన్ని ఆశిస్తారు. అటువంటిది
నాకిక్కడ కనిపించలేదు. ఇటువంటి ప్రదేశాలలో
దొంగతనాలు కూడా జరగడం సహజం. అటువంటి దొంగతనాలు
కూడా లేవు. ఈ రెండు విషయాలను చాలా అసాధారణమయినవిగా
చెప్పుకోవచ్చు. ఇదంతా బాబావారి అనుగ్రహం వల్లనే
ఇక్కడున్న వారిలో నీతి నిజాయితీ నిక్షిప్తమయి ఉన్నయని భావించాను.
1959 వ.సంవత్సరంలో
చివరికి గాని నేను బాబాను ప్రతిరోజూ పూజించడం ప్రారంభించలేదు. ఆ సమయంలోనె ఒక ఆసక్తికరమయిన సంఘటన జరిగింది. మేమున్న అపార్టుమెంటు లోనే నా భార్య చెవి పోగులు
బంగారపువి పోయాయి.
నా భార్య ఇల్లంతా క్షుణ్ణంగా
మూడు సార్లు వెతికింది. అయినా దొరకలేదు. అందరూ సాధారణంగా అనుమానించే విధంగానే మా యింటిలో
పనిచేసే పనిమనిషి మీద అనుమాన పడింది. తనకి
మా పనిమషిమీద అనుమానం ఉన్నా నిగ్రహించుకొని
ఎటువంటి దొంగతనం అంటగట్టకుండా చెవిపోగులు కనపడటంలేదని ఆమెతో మామూలుగా అంది. ఇక ఆ చెవిపోగులు దొరికే సమస్య లేదు, పోయినట్టే అని
నిర్ధారించుకున్నాము. ఈ సమయంలోనే బాబా వారి
అనుగ్రహం మామీద ఏవిధంగా ఉందోనని పరీక్షిద్దామనుకున్నాము. మరుసటి రోజు ఉదయం మా పనిమనిషి ఇల్లు శుభ్రం చేస్తూ
చెవిపోగులు తెచ్చి ఇచ్చింది.
మాకు చాలా ఆశ్చర్యం
వేసింది. అవి పోయి వారం రోజులయింది. మరి ఇప్పుడు ఎక్కడినుండి ఏవిధంగా తెచ్చిందో మాకేమీ
అర్ధం కాలేదు. ఈ సంఘటన జరిగిన మరుక్షణంనుండి
నా మదిలో బాబా పై విశ్వాసం ఏర్పడసాగింది. అంతే
అప్పటినుండి ప్రతిరోజు బాబాని పూజించడం ప్రారంభించాను. ఇప్పటి వరకూ అదే పూర్తి విశ్వాసం, నమ్మకంతో ఆయనను
పూజిస్తూనే ఉన్నాను.
1961 వ.సంవత్సరంలో
షిరిడి వెళ్ళి బాబాను దర్శించుకుందామనే ప్రేరణ కలిగి షిరిడీకి ప్రయాణమయ్యాను. శ్రీరామనవమికి
భక్తులు చాలా మంది వస్తారనీ, రద్దీగా ఉంటుందని భావించి, షిరిడిలో రామనవమి ఉత్సవాలు
ప్రారంభమయే ముందుగానే తిరిగి వచ్చేద్దామనుకున్నాను. గురువారం
నా పూజను ముగించాను. శుక్రవారం మధ్యాహ్న ఆరతికి
వెళ్ళాను. తిరుగు ప్రయాణమయేముందు చీఫ్ ఎక్జిక్యూటివ్
గారి దగ్గరకు వెళ్ళాను. అదే సమయంలో రామనవమి
ఉత్సవాలకి బొంబాయి ఇతర ప్రాంతాలనుంచి భక్తుల రాక ప్రారంభమయింది. చీఫ్ ఎక్జిక్యూటివ్ గారు నాకు తిరుగు ప్రయాణానికి
అనుమతినివ్వడానికి బదులు పండగ అయేంత వరకు షిరిడీలోనే ఉండమన్నారు.
ఆయన ద్వారా బాబాగారే ఆజ్ఞాపించారని ఆనందించి పండగ
ఉత్సవాలయేంత వరకు షిరిడీలోనే ఉండిపోయాను. షిరిడీ
అంతా భక్తులతో కిటకిటలాడుతున్నప్పటికీ, బాబా దయవల్ల నాకు సౌఖ్యంగా ఉండటానికి అతిధి
గృహం ఇచ్చారు. 50 వేలమందికి పైగా జనం వచ్చారు. హిందువులే కాకుండా వారిలో శిక్కులు, జైనులు, జొరాష్ట్రియన్స్,
ముస్లిమ్స్, క్రిష్టియన్స్ కూడా ఉన్నారు. అందరూ
కూడా తమ తమ కోర్కెలను, మొక్కులను తీర్చుకోవడానికి సమాధి మందిరంలో బాబాను ఎప్పుడు దర్శించుకుందామా
అనే ఆతృతతో ఉన్నారు. ఈ ఉత్సవాలలో చెప్పుకోదగ్గ
విశేషమేమంటే ప్రతి భక్తుడు కూడా పవిత్ర గోదావరి జలాలను తమ తలపై మోసుకొని తెచ్చి బాబాకు
స్నానం చేయించడం. ఆ విధంగా తీసుకుని వచ్చే
భక్తులలో 10 నుంచి 12 సంవత్సరాల వయసు గల పిల్లలు కూడా ఉండటం విశేషం. ఈ భక్తులలో పురుషులు, స్తీలు, వయసు మళ్ళిన వారు అందరూ ఉన్నారు.
బాబాకి స్నానం చేయించిన తరువాత భక్తులందరూ పూలదండలు
పట్టుకుని ఆయన మెడలో ఎప్పుడు వేద్దామా అని చాలా ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నారు.
ఆ సమయంలో నేను చుట్టూ ఉన్న మిగతా భక్తులనందరినీ పరిశీలించి చూశాను అందరి చేతులలోను చాలా ఖరీదయిన పూల దండలున్నాయి. కాని నా చేతిలో ఉన్న దండ వాటితో పోల్చుకుంటె చాలా
సాధారణంగా ఉంది. ఎవరి దండలను కాదని బాబా మొట్టమొదటగా నేను తీసుకువచ్చిన దండనే వేయించుకుంటే నేనెంతో అదృష్టవంతుడిని అని భావించాను. బాబాపాలరాతి విగ్రహం ఉన్న వేదిక దగ్గరగా ఉన్న భక్తుల చేతులలో ఉన్న దండలు
నేను తెచ్చిన దండకంటె దివ్యంగా ఉన్నప్పటికీ బాబా నేను తెచ్చిన దండను స్వీకరిస్తే బాగుండును అనుకున్నాను . అదే
సమయంలో పూజారిగారు నన్ను దగ్గరకు రమ్మని సైగ చేసి, నా చేతిలో ఉన్న దండను తీసుకుని ఆ ఉత్సవ
సమయంలో మొట్టమొదటగా బాబా మెడలో అలంకరించారు.
నాకెంత సంతోషం కలిగిందో మాటలలో వర్ణించలేను. ఆ విధంగా బాబా నన్ననుగ్రహించారు.
ఎం. గంగారెడ్డి బీ.కామ్.
హైదరాబాద్
హైదరాబాద్
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment