(ఒరిజినల్ గ్లాస్ నెగిటివ్ నుండి రూపుదిద్దుకున్న శ్రీసాయి
సహజ ఛాయా చిత్రం)
03.02.2017 శుక్రవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీషిరిడీ
సాయి వైభవమ్
బాబా,
విశ్ కాంతగారికి జీవితాన్ని ప్రసాదించుట
(బాబా
తన భక్తునిపై అనుగ్రహమ్ – 2 వ.భాగమ్)
ప్రొఫెసర్
విశ్ కాంతగారు వెనుకటి రోజులను గుర్తుకు తెచ్చుకుంటూ బాబా తనను ఏవిధంగా కాపాడినది చాలా
వివరంగా చెప్పిన అనుభవమ్.
“తర్వాత
సంవత్సరాలన్నీ చాలా కష్టాలు, కడగండ్లతో సాగాయి.
బీదరికం మమ్మల్ని తీవ్రంగా బాధించసాగింది.
మా అమ్మగారు ఎంతో మంది బీద బ్రాహ్మణ బాలురకు భోజనం పెట్టారు. అటువంటిది మాకు కడుపునిండా తిండిపెట్టలేని దుస్థితికి
చేరుకుంది. తరచుగా కాకపోయినా మేము ఒక్కొక్కసారి
పస్తులతో పడుకోవలసివచ్చేది.
నాకు ఇద్దరు అన్నయ్యలు,
ఒక అక్క, ఒక చెల్లెలు ఉన్నారు. ఒకానొక సందర్భంలో
మా అక్క మమ్మల్నందరినీ కూర్చోబెట్టి మాకుటుంబానికి కలిగిన దురవస్థ గురించి వివరంగా
చెప్పింది. “మన తండ్రి చనిపోవడంవల్ల మమనందరం
విపరీతమయిన కష్టాలననుభవిస్తున్నాము. ఎటువంటి
పరిస్థితులు ఎదురయినా సరే ఆఖరికి ఆకలితో అలమటించే పరిస్థితులు వచ్చినా, ఎవరినీ ‘దేహి’
అని యాచించము అని మాటివ్వండి” అని ప్రమాణం చేయించుకుంది. అప్పుడు నావయసు 8 సంవత్సరాలు. అప్పుడే నేను ఏదో ఒక ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నాను. మానాన్నగారి స్నేహితునికి ఒక ప్రింటింగ్ ప్ర్రెస్
ఉంది. అందులో పనికి కుదిరాను. ప్రెస్ యజమాని మాదుస్థితి తెలిసున్నవాడవడం చేత,
నాకు యాచించడం ఇష్టంలేదు కాబట్టి, అయిష్టంగానే
నాకు ఉద్యోగం ఇచ్చాడు.
ప్రెస్
లో నాపని వారానికి పదివేల రూళ్ళు వేయబడ్డ పేపర్ షీట్లను ఒక క్రమపద్ధతిలో అమర్చడం. సరిగా లేనివాటిని ప్రక్కన పడేయడం. ఈ పనికి నాకు వారానికి ఒక రూపాయి జీతం. జీతం తీసుకున్న తరువాత మా అమ్మ చేతిలో పెట్టేవాడిని.
అది చూసి మా అమ్మ ఏడిచేది. మానాన్నగారు ఉన్నప్పుడు
మా అమ్మగారు మహారాణీల బ్రతికారు. సేవ చేయడానికి ఎంతోమంది పనివాళ్ళుండేవాళ్ళు. ఇపుడు అవసరం కోసం ఎవరయినా పిలిస్తే వారి ఇళ్ళకు
వెళ్ళి వంటలు చేసే పరిస్థితి ఎదురయింది. ఇటువంటి
పరిస్థితుల్లో నా చదువును కొనసాగిస్తు హైస్కూలు విద్యను పూర్తి చేసుకుని కాలేజీలో చేరాను.
డిగ్రీ
రెండవసంవత్సరం చదువుతుండగా నా ఆరోగ్యం పాడయింది.
తిండిలేక పస్తులుండటంవల్ల నా ఆరోగ్యం మీద తీవ్రమయిన ప్రభావం చూపించింది. కడుపులో గ్యాస్ ప్రోబ్లెమ్ వల్ల అల్సర్ లు వచ్చి
లోపల ప్రేగులు దెబ్బతిన్నాయి. ఎక్స్ రే లో
కూడా ఇది నిర్ధారణయింది. గవర్నమెంట్ విక్టోరియా
ఆస్పత్రిలో చేరాను. అక్కడ కొన్ని రోజులు వైద్యం
చేశారు. ఆస్పత్రిలో రెండుపూటలా నాకు భోజనం
దొరకడం నా అదృష్టమనే చెప్పాలి. అయినా కాని
డ్యూటీలో ఉన్న డాక్టర్, సూపరింటెండెంట్ తో నన్ను డిస్చార్జి చేయమని చెబుతూ “ఈ నరకంలో
పాపం ఈ అబ్బాయిని చంపడమెందుకు? ఇంటికి పంపించేద్దాము.అక్కడే ప్రశాంతంగా కన్ను మూస్తాడు”
అన్నాడు. ఈ మాటలు నాచెవిన పడ్డాయి. ఈ మాటలు విన్న తరవాత నిరాశ ఆవరించింది. నన్ను ఇంటికి పంపించేశారు.
నన్ను
డిస్చార్జి చేసే సమయంలో డాక్టర్ కొన్ని యాంటాసిడ్స్, కాస్త ఉపశమనం పొందడానికి (సెడేటివ్స్)
వాడమని మందులు రాసి ఇచ్చారు. మావాళ్ళందరూ కూడా నాకు ఏవిధమయిన సహాయం చేసే స్థితిలో లేరు. ఇక జీవితం మీద విరక్తి చెంది జీవితాన్ని అంతం చేసుకుందామనే
నిర్ణయానికి వచ్చాను. వారం రోజులుగా గుప్పెడు
నిద్రమాత్రలను (సెడేటివ్స్) వేరు వేరు మందుల షాపులనుంచి కొని దాచాను. ఆ తరువాత ఈ విధంగా ఒక ఉత్తరం రాసి ఉంచాను. “ఎవరికి సంబంధించినదయితే వారికి. నేను నాజీవితాన్ని అంతం చేసుకుంటున్నాను. దీనికి ఎవరూ బాధ్యులు కారు” ఈ విధంగా ఉత్తరం రాసి
మొత్తం నిద్రమాత్రలన్నిటినీ రాత్రి పొద్దుపోయిన తరువాత మింగేశాను.
మా
అమ్మగారికి వేకువజామునే లేవడం అలవాటు. ఉదయాన్నే
నాగదికి వచ్చి నన్ను నిద్రలేపడానికి ప్రయత్నించింది. నేను రాసిపెట్టిన ఉత్తరం ఆవిడ కంటపడింది. ఉత్తరం చదివి పరిస్థితినంతా అర్ధం చేసుకుంది. వెంటనే నన్ను బాగా బలంగా కుదపసాగింది. ఇక ఏడవడం మొదలుపెట్టింది. ఇదంతా జరుగుతున్నపుడు నేను నాశరీరంనుండి బయటకు వచ్చేశాను. పైనుండి మా అమ్మగారిని చూస్తున్నాను. నేను చాలా ఆనందంగా హాయిగా ఉన్నానని మా అమ్మగారితో
చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. కాని ఫలితం
లేకపోయింది. ఆవిడకు నేను కనపడను, నా మాటలు వినిపించవు. కాని ఆశ్చర్యం ఏమిటంటే సాయిబాబాను పోలిన ఒక ముసలివ్యక్తి
నాప్రక్కన నుంచుని ఉన్నాడు. నేను చేసిన పనికి
అతను చాలా చిరాకు పడుతున్నాడని తెలుస్తోంది. అతని మొహంలో ఎటువంటి ఆనందం లేకపోవడం నాకు
స్పష్టంగా కనిపించింది. మావాళ్ళు ఆంబులెన్స్
ని పిలిపించారు. నాశరీరాన్ని అందులో ఉంచి ఆస్పత్రికి
తీసుకునివెళ్ళారు.
నా
ఆత్మకు, నాశరీరానికి ఉన్న బంధం ఇంకా తెగిపోలేదు.
అందువల్లనే నాశరీరం నాఆత్మని కూడా లాక్కుని వెళ్ళడంతో ఆబాధను నేను అనుభవిస్తున్నాను. ఆపరేషన్ ధియేటర్ లో నాశరీరాన్ని బల్లమీద పడుకోబెట్టారు. నేను (ఆత్మ) స్టీలు బీరువామీద పైన కూర్చుని కింద
ఉన్న ప్రతి ఒక్కరినీ చూస్తున్నాను. కాని అతి
ముఖ్యమయిన విషయం ఏమిటంటే బాబా కూడా నాతో వచ్చి బీరువా ప్రక్కనే నాకు దగ్గరగా (నా ఆత్మకు)
నుంచుని ఉన్నారు. డాక్టర్, నర్సులు మొదటగా
నాకడుపుని శుభ్రం చేశారు. డెఫిబ్రిలేటర్ ఉపయోగించి
నాఛాతీ మీద కరంట్ షాక్ లు ఇవ్వసాగారు. ఆక్షణంలో
నావెనకనే నుంచున్న బాబా నావీపుమీద ఒక్క గుద్దు గుద్ది “వెంటనే లోపలికి వెళ్ళు” అని
అధికారస్వరంతో ఆజ్ఞాపించారు. నా శరీరం నా ఆత్మని
లోపలికి లాక్కుంది. నేను మెల్లగా కళ్ళు తెరిచాను.
ఆస్పత్రిలో నన్ను అబ్జర్వేషన్ లో ఉంచిన తరవాత మధ్యాహ్నం
డిస్చార్జి చేశారు. ఇటువంటి అనుభవం కలిగిన
తరువాత పరిస్థితులన్నీ కుదుటపడసాగాయి. నేను,
నాసోదర సోదరీమణులందరం బాగా
చదువుకుని స్థిరపడ్డాము. ఇంకా ముఖ్యమయిన విషయం ఏమిటంటే మేమంతా బాబాకు అంకిత
భక్తులమయ్యాము.
ఏభక్తుడయినా
సరే ఆత్మహత్య చేసుకోవడం తనకిష్టం ఉండదని బాబా చాలా స్పష్టంగా చెప్పారు. శ్రీసాయి సత్ చరిత్ర 26వ.అధ్యాయంలో అంబడేకర్ గురించిన
ప్రస్తావన వస్తుంది. అంబడేకర్ జీవితంమీద విరక్తి
చెంది షిరిడీలో ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు.
ఆసమయంలో సగుణమేరు నాయక్ వచ్చి అతనికి స్వామి సమర్ధ చరిత్రను ఇచ్చాడు. అంబడేకర్ అది చదివిన తరువాత తన ఆత్మహత్యాప్రయత్నాన్ని
విరమించుకున్నాడు.
భగవంతుడు
ఇచ్చిన ఈ శరీరంతో మనం అన్ని బాధ్యతలను నిర్వహించాలి. మంచయినా చెడయినా అన్నిటికీ బాధ్యత వహించాలి.
జననమరణ
చక్రాలలో మనం సాగుతూ ఈ జన్మలోనే ఋణం తీర్చుకోవాలి. లేకపోతే మరుజన్మకి ఈఋణం మనవెంటే వస్తుంది. కర్మనుంచి తప్పించుకోలేము. భగవంతుని ఆజ్ఞ ప్రకారం నడచుకొని ఆయన అనుగ్రహాన్ని
పొందాలి.
2014వ.సంవత్సరంలో
ప్రొఫెసర్ ఆర్. విశ్ కాంత్ గారు చెప్పిన అనుభవమ్
సాయిలీలా
వాట్ స్ ఆప్ గ్రూప్ నుండి సేకరణ
Source : Baba's Divine Manifestations by Vinny Chitluri
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment