24.04.2017 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
శ్రీసాయి లీలా తరంగిణి –29 వ.భాగమ్
రచనః శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
(మూల రచన : తెలుగు. ఆంగ్లంలోకి అనువదింపబడినది)
సాయి లీలాస్. ఆర్గ్ నుండి గ్రహింపబడినది
(మరల తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా)
అనువాదానికి నిమిత్త మాత్రుడుః ఆత్రేయపురపు త్యాగరాజు
కె.పి. ఆర్. దివ్య ప్రభాస్ ఎన్ క్లేవ్, ఫ్లట్ 102, లోటస్ బ్లాక్,
నిజాంపేట, హైదరాబాద్
Mail id : tyagaraju.a@gmail.ocm
ఫోన్ : & వాట్స్
ఆప్ : 9440375411
8143626744
మణిద్వీపమ్
1991వ.సంవత్సరం మే నెల
6వ.తారీకున నా భర్త ధ్యానం చేసుకుంటూ ఉన్నారు.
ధ్యానంలో ఆయనకు అద్భుతమయిన దృశ్యాలు కనిపించాయి. విచిత్రమయిన సంఘటనలను కూడా అనుభవించారు. ధ్యానంలో ఆయన వీక్షించిన దృశ్యాలగురించి వివరణ.
“ధ్యానంలో నాకు ఎంతోమంది
దేవి దేవతలే కాక రాక్షసులు కూడా కనిపించారు.
వారంతా వారిలో వారు దెబ్బలాడుకొంటూ ఉన్నారు. అప్పుడు ఒక యోగినిలా ఉన్న స్త్రీ నన్ను సమీపించి,
“ఇక్కడ ఉండటం క్షేమకరం కాదు. నాతోకూడా రా”
అంది. ఆమె తెల్లటి దుస్తులను ధరించి, జుట్టును
తలపైన ముడి వేసుకుంది. ఆమె, మెడకి చేతులకి
రుద్రాక్షలు ధరించి ఉంది. ఆమె నన్ను కొండలలోనుంచి,
కోనలలోనుంచి తీసుకునివెడుతూ ఉంది. మేము నడుస్తున్న
దారి చాలా ప్రదాకరమయినదిగా ఉంది. ఆతరువాత మేము
ఒక కొలను వద్దకు వచ్చాము. ఆ ప్రదేశమంతా వివిధ
రకాల పెద్దపెద్ద వృక్షాలతో నిండిఉంది. ఆ ప్రదేశం
చాలా సుందరంగా ఉంది. అక్కడినుంచి ఆయోగిని నన్ను
ఆకాశమార్గంలో తీసుకెళ్లసాగింది. అక్కడ ఒక పెద్ద
కోట ఉంది. దాని చుట్టూ గోడలు ఉన్నాయి. గోడలన్నీ ఇనుముతో తయారుచేయబడి ఉన్నాయి.
కోటకి నాలుగువైపులా నాలుగు
ప్రవేశద్వారాలు ఉన్నాయి. నాలుగు ద్వారాల వద్ద
సైనికులు కాపలా కాస్తున్నారు. ఆ సైనికులు మమ్మల్ని
లోపలికి వెళ్ళనివ్వలేదు. ఇక అక్కడ ఉండటం అనవసరమని
చెప్పి ఆ యోగిని నన్ను మరొక ప్రదేశానికి తీసుకుని వెళ్ళింది.
అక్కడ మాకొక పొడవయిన
కోట కనిపించింది. ఆ కోటకు ప్రవేశద్వారాలు చాలా ఉన్నాయి. ఆమె నన్ను ఉత్తరద్వారం గుండా కోటలోపలికి తీసుకునివెళ్ళింది. కోటలోపల వివిధ రకాలయిన పండ్ల చెట్లు
కనిపించాయి. అన్ని వృక్షాలు పండ్లతో నిండి ఉన్నాయి.
ఆచెట్లమీద పక్షులు ఎగురుతూ ఉన్నాయి. నాకు ఆకలిగా
ఉండి ఒక పండును కోసుకుని తినవచ్చా అని ఆయోగినిని అడిగాను. ఆమె అందుకు ఒప్పుకోకుండా, ఆపని చేయవద్దని చెప్పింది. ఆసుందరమయిన ప్రదేశాన్ని కొంతసేపు చూసిన తరువాత ఆమె
నన్ను ఇంకొక చోటకి తీసుకునివెళ్ళింది.
కొంతదూరం ప్రయాణం చేసిన
తరువాత మేమొక కోటవద్దకు చేరుకొన్నాము. కోట
చుట్టు ఉన్న గోడలు రాగితో తయారు చేయబడి ఉన్నాయి.
మేము లోపలికి వెళ్ళాము. అక్కడ ఒక పురుషుడు,
ఇద్దరు స్త్రీలు మాట్లాడుకుంటూ ఉన్నారు. వారు
చాలా అందంగా ఉన్నారు. వారు దైవస్వరూపులలాగ ఉన్నారు. వారేమి మాట్లాడుకుంటున్నారో నాకర్ధం కాలేదు. వారెవరు అని ఆయోగినిని అడిగాను. “అది నీకనవసరం” అంది యోగిని. మరికొంతసేపు ఇక్కడే ఉండి వారెవరో తెలుసుకుని వారికి
ప్రణామాలు అర్పిద్దామని చెప్పాను. దానికా యోగిని
ఒప్పుకోలేదు. ఆయోగిని నన్ను అక్కడినుంచి వెంటనే
తీసుకుని వెళ్ళిపోయింది.
మేమిద్దరం మరికొంతదూరం
వెళ్ళినతరువాత, ఒక కోట కనిపించింది. దాని చుట్టూ
ఉన్న గోడలు చాలా ఎత్తుగా ఉన్నాయి. చుట్టూ సముద్రం
ఉంది. అక్కడ కూడా దేవి, దేవతలు ఉన్నారు, వారితో మాట్లాడటానికి యోగిని నాకు అవకాశం ఇవ్వలేదు.
అక్కడినుంచి యోగిని నన్ను
మరొక చోటకి తీసుకుని వెళ్ళింది. అక్కడ కూడా
మరొక కోట, చుట్టూరా ఎత్తయిన గోడలు ఉన్నాయి.
ఆ ప్రదేశం చాలా అందంగా ఉంది. ప్రకృతిరమణీయంగా కనులకి విందు చేస్తోంది. అకస్మాత్తుగా
భయంకరమయిన ఉరుములు, మెరుపులతో పెద్ద వర్షం కురవసాగింది. "నీకు భయం వేస్తోందా" అని అడిగింది యోగిని. నాకు భయం వేయటంలేదని సమాధానమిచ్చాను. అపుడా యోగిని “ఈ భయంకరమయిన వాతావరణానికి నువ్వు
భయపడకుండా ధైర్యంగా ఉన్నావు కాబట్టి, నిన్ను నీగమ్యానికి చేర్చడానికి నేను ప్రయత్నిస్తాను. కాని సామాన్యమానవుడు తట్టుకోలేని కష్టమయిన, భయంకరమయిన
పరిణామాలను ఎదుర్కోవటానికి నువ్వు సిధ్ధంగా ఉండాలి. కాని నీఅంతట నీవు కోరుకున్నావు కాబట్టి నిన్ను నేను
అక్కడికి తీసుకుని వెడతాను. జాగ్రత్త,” అని
హెచ్చరించి ఆమె నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళింది.
మరికొంత దూరం ప్రయాణించిన
తరువాత మేమొక కోటవద్దకు చేరుకొన్నాము. కోట
చుట్టూ ఉన్నగోడలు, వెండితో చేయబడి ఉన్నాయి.
కాని యోగిని నన్నాకోటలోకి తీసుకుని వెళ్ళలేదు.
అక్కడినుంచి మేము ఇంకొక
కోట వద్దకు చేరుకున్నాము. ఆ కోట చుట్టూ ఉన్న
గోడలు బంగారంతో చేయబడి ఉన్నాయి. ఆ కోట చుట్టు
సైనికులు కాపలా కాస్తున్నారు. వారు మమ్మల్ని
లోపలికి వెళ్ళనివ్వలేదు.
అక్కడినుంచి మేము మరొక
ప్రదేశానికి వెళ్ళాము. మేము ప్రయాణించిన దారంతా
చాలా కఠినంగాను నడవటానికి కష్టాలతో కూడుకున్నదిగాను ఉంది.
ఆ దారిలో కొంత దూరం ప్రయాణించిన తరువాత మాకొక పెద్ద కోట కనపడింది. ఆ కోటంతా పద్మాలతో కప్పబడి ఉంది. ఆ కోటకి గోపురాలున్నాయి. ఒక్కొక్క గోపురం మీద ఒక్కక్క దేవత అధిష్టించి ఉంది. నేను వారికి నమస్కరించుకుంటానని ఆయోగినిని అడిగాను. అందుకామె అవసరం లేదని చెప్పి నన్ను తీసుకుని వెళ్ళిపోయింది.
కొంతదూరం ప్రయాణం చేసిన
తరువాత ఒక రాజభవనానికి చేరుకున్నాము. ఆ రాజభవనానికి
ఉన్న గోడలు చతురస్రాకారలో ఉన్నాయి. గోడలకి
వజ్రాలు పొదగబడి ఉన్నాయి. రాజప్రాసాదానికి
నాలుగు వైపులా స్త్రీలు కాపలా కాస్తున్నారు.
వారు నన్ను భవనం లోపలికి తీసుకునివెళ్లారు. అక్కడ ప్రకాశవంతమయిన వెలుగులు విరజిమ్ముతూ ఉన్న
సింహాసనం మీద దేవి ఆశీనురాలయి ఉంది. కొంతమంది
స్త్రీలు ఆవిడ పాదాలకు సేవచేస్తున్నారు. మరికొంతమంది
ఆదేవికి పూలదండలతోను, పుష్పాలతోను పూజలు చేస్తున్నారు. నేను ఆదేవికి నమస్కరించుకుంటానని యోగినిని అడిగాను. అందుకా యోగిని వద్దని చాలా పరుషంగా మాట్లాడింది. నన్ను మరొక చోటకి తీసుకుని వెళ్ళింది.
అక్కడినుంచి మేము సముద్ర
తీరానికి వెళ్ళాము. సముద్రుడు మాకు వెళ్ళడానికి
దారి ఇచ్చాడు. దారిలో షార్క్ చేపలు, పెద్ద
పెద్ద చేపలు మమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నించాయి. కాని అవి ఏమీ చేయలేకపోయాయి. కొంత దూరం వెళ్ళినతరువాత మాకొక రాజప్రాసాదం కనిపించింది. రాజప్రాసాదం చుట్టూ ఉన్న నీరు తేనెకన్నా మధురంగా ఉంది. ఆ రాజభవనం వజ్రంలా అత్యంత ప్రకాశవంతంగా
వెలుగులు విరజిమ్ముతూ ఉంది. అంతటి వెలుగును
భరించలేక కళ్ళుమూసుకున్నాను. యోగిని నన్ను
రాజమహల్ లోకి రమ్మని చెప్పింది. నేను ధైర్యంగా
లోపలికి అడుగుపెట్టాను. నేను లోపలికి వెళ్లగానే
అక్కడ పెద్ద ‘శ్రీచక్రం’ కనిపించింది.
కొంతమంది
స్త్రీలు మమ్మల్ని లోపలికి తీసుకునివెళ్ళారు.
అక్కడ ఒక ఎత్తయిన ప్రదేశం మీద వజ్రాలు, రత్నాలు ఇంకా విలువయిన రాళ్ళతో పొదగబడ్డ
సింహాసనం కనిపించింది. ఆ సింహాసనం మీద లలితా
త్రిపుర సుందరీదేవి అధిష్టించి ఉంది.
ఈ విశ్వానికంతటికీ సృష్తికర్త,
రక్షకురాలయిన ఆ జగన్మాత, ధగధగాయమానంగా ప్రకాశవంతమయిన కిరణాలతో బ్రహ్మాండంగా వెలిగిపోతూ
ఉంది.
ఆ జగన్మాత ఎఱ్ఱని చీర
ధరించి ఉంది. నుదుటిమీద కుంకుమ బొట్టు ఉంది. ఆవిడ నేత్రాలు చాలా విశాలంగా ఉన్నాయి. అవి కెంపు రంగులో మెరుస్తూ ఉన్నాయి నాసికకు అందమయిన ఆభరణం తళుకులీనుతూ ఉంది. కిరీటం విలువయిన నవరత్నాలతో పొదగబడి కాంతివంతంగా
ప్రకాశిస్తూ ఉంది. ఆవిడ చేతులలో ఆయుధాలు ధరించి
ఉంది. ఆవిడకు నమస్కారం చేసుకోవడానికి యోగిని
నాకు అనుమతిచ్చింది. నేనామెకు సాష్టాంగ నమస్కారం
చేసుకోగానే అమ్మ నాకు పంచదశి మంత్రంలోని ‘బీజాక్షరాల’ యొక్క అర్ధాన్ని వివరించి నన్ను
దీవించింది.
నాభర్తకు వచ్చిన స్వప్న
వృత్తాంతమంతా శ్రీశైలంలోని శ్రీ పూర్ణనందస్వామిగారికి వివరించి చెప్పాము. యోగిని నాభర్తని దేవతలకి ఇంకా మరికొంతమంది అమ్మవార్లకు
ఎందుకని నమస్కారం చేసుకోనివ్వలేదని, అంతే కాక కొన్ని ప్రదేశాలలోకి వెళ్ళడానికెందుకని
అనుమతించలేదని మాసందేహాలను నివృత్తి చేయమని అడిగాము. అపుడు స్వామీజీ, “ఆజగన్మాత అనుగ్రహం వల్లనే దారి కఠినమయినదైనా ఇంత దగ్గరి దారిలోనే నీభర్తకు ఆమెను దర్శించుకునే భాగ్యం కలిగింది. అక్కడికి వెళ్లడానికి తను అనుభవించిన కష్టాలను గమనించినట్లయితే
సరియైన దారిలో వెళ్ళి ఉండేవాడు. ఆసందర్భంలో
ఎవ్వరూ అతనిని అడ్డుపెట్టలేరు.”
నాభర్త మీద అమ్మవారి
అనుగ్రహం కలగడానికి కారణం శ్రీసాయిబాబా వారి దయ, ఆయన ఆశీర్వాదములు. బాబా తన బోధనలలో ఎప్పుడూ చెబుతూ ఉండేవారు “నేనే
జగన్మాతను” అని. ఈరోజు నాభర్త ద్వారా ఆవిషయాన్ని
ఋజువు చేశారు. బాబాకు ఇష్టం లేకపోతే ఇదంతా
జరిగి ఉండేది కాదు. ఎంతో తపస్సు చేస్తే తప్ప
మహాయోగులకు కూడా లభ్యమవని అదృష్టం నాభర్తకు లభింపచేశారు బాబా. సాయికి మనం చేసే ఏచిన్న సేవయినా అనంతకోటి ఫలితాలను ప్రసాదిస్తుంది.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment