05.05.2017 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
శ్రీసాయి లీలా తరంగిణి
–37 వ.భాగమ్
రచనః శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
(మూల రచన : తెలుగు.
ఆంగ్లంలోకి అనువదింపబడినది)
సాయి లీలాస్. ఆర్గ్ నుండి
గ్రహింపబడినది
(మరల తెలుగులోకి అనువాదమ్
చేయించినవారు బాబా)
అనువాదానికి నిమిత్త
మాత్రుడుః ఆత్రేయపురపు త్యాగరాజు
కె.పి. ఆర్. దివ్య ప్రభాస్ ఎన్ క్లేవ్, ఫ్లాట్
102, లోటస్ బ్లాక్,
నిజాంపేట, హైదరాబాద్
Mail id :
tyagaraju.a@gmail.ocm
ఫోన్ : & వాట్స్
ఆప్ : 9440375411
8143626744
మా అమ్మాయికి బాబా దర్శనమ్
మా అమ్మాయి చి.నీరజ,
ఆమె భర్త శ్రీ బొండాడ జనార్ధన రావు, ఇద్దరూ కూడా సాయి భక్తులే. ఒక రోజు రాత్రి మా అమ్మాయికి కల వచ్చింది. ఆ కలలో మా అమ్మాయి శ్రీసాయినాదులవారిని పూజించి
భక్తిపాటలు పాడుతూ ఉంది. బాబా ఫొటోముందు ఇంకా
దీపం వెలుగుతూనే ఉంది.
ఆ సమయంలో ఆమె భర్త “నీరజా
చూడు ఈ రోజు బాబా ఫొటోలో ఏదో ప్రత్యేకత కన్పిస్తోంది. బాబా శ్వాస తీసుకుంటున్నట్లుగా కనపడుతోంది. వచ్చి నువ్వే చూడు” అన్నారు. విస్మయంతో మా అమ్మాయి ఫొటో దగ్గరకు వెళ్ళి చూసింది. ఎంతో ఉత్సాహంతో బాబా ఫొటో వైపే తదేకంగా చూస్తూ
ఉంది. బాబా దర్శనమిచ్చారు. ఆయన మండపంలాంటి ఒక కట్టడం మీద ఎప్పుడూ కూర్చునే
భంగిమలో కాలుమీద కాలు వేసుకుని కూర్చుని ఉన్నారు.
ఆమె కళ్ళల్లో ఆనంద భాష్పాలు. ఆమె బాబా
పాదాలకు శిరసు వంచి నమస్కరించింది. ఇంకా ఆమెకు
నమ్మశక్యం కావటంలేదు. “బాబా, ఆఖరికి నువ్వు మాయింటికి వచ్చావా"? అని ప్రశ్నించింది. ఆమె బాబా పాదాల దగ్గరగా కూర్చుని ఒక చేతిని బాబా
నేలమీద ఆన్చిన కాలుమీద మరొక చేతిని బాబాగారి మరొక కాలుమీద వేసి తలని ఆయన ఒడిలో పెట్టుకుని
బాబానే చూస్తూ ఏదో మాట్లాడింది. అపుడు బాబా
ఆమెతో “నువ్వు, మీ అమ్మ, మీరు స్థాపించిన పరిశ్రమ గురించి చాలా ఆందోళనలో ఉన్నారు” అన్నారు. అపుడు మా అమ్మాయి బాబాతో “బాబా, మీకన్నీ తెలుసు. అయినా మీరు మమ్మల్ని పట్టించుకోవడంలేదు” అంది. బాబా నవ్వుతూ ఆమె తల నిమిరి, “దాని గురించి నువ్వు
బెంగ పెట్టుకోకు. పరిస్థితులన్నీ చక్కబడతాయి”
అన్నారు. బాబా ఈవిధంగా చెప్పగానే మా అమ్మాయి
ఎంతగానో సంతోషించింది. తరువాత మెలకువ వచ్చి
కల కరిగిపోయింది. మా అల్లుడిగారి సహాయంతో మేమొక
పరిశ్రమని స్థాపించాము. మాకు అనుభవం లేకపోవడం
వల్లను, మా అల్లుడుగారు ఎక్కడో దూరంగా ఉండటం వల్లను మేము పరిశ్రమ కార్యకలాపాల మీద శ్రధ్ధ
పెట్టలేకపోయాము. బాగా నష్టాలు రావడంతో పరిశ్రమని
మూసివేయాల్సివచ్చింది. ఆతరువాత బాబా దయవల్ల
పరిస్థితులన్నీ కుదుటపడ్డాయి.
బాబా మరొకసారి మా అమ్మాయికి
కలలో దర్శనమిచ్చారు. ఆకలలో బాబా ద్వారకామయిలో
కూర్చుని ఉన్నారు. మా అమ్మాయి కూడా అక్కడే
కూర్చుని ఉంది. ఈలోపులో అక్కడికి ఒక స్త్రీ
వచ్చి బాబాకు నమస్కరించింది. అపుడు బాబా ఆమెతో
, “అమ్మా, లక్ష్మీ, ఈరోజు నాకు నువ్వు భోజనం తీసుకునిరాలేదెందుకని?” అని ప్రశ్నించారు. అపుడామె, “బాబా నీభక్తులు ఎందరో నీకు మంచి మంచి
విందు భోజనాలు తీసుకుని వస్తున్నారు. నేను
సమర్పించే అతి సామాన్యమయిన వంటకాలని నువ్వు ఇష్టపడవేమోనని అనుకున్నాను” అని సమాధానమిచ్చింది. అపుడు బాబా, “లక్ష్మీ, ఎవరు ఏమి తెచ్చినా నాకు నువ్వు
సమర్పించే భోజనమే ఎక్కువ తృప్తినిస్తుంది” అని సమాధానమిచ్చారు. ఆమె ఎంతో సంతోషంతో బాబాకు భోజనం తీసుకురావడానికి
వెళ్ళింది. ఆ తరువాత మా అమ్మాయికి మెలుకువ
వచ్చింది. తనకు కలలో ద్వారకామాయిలో లక్ష్మీబాయి
షిండేతో సహా బాబా దర్శనం కలిగినందుకు తానెంతో అదృష్టవంతురాలినని పొంగిపోయింది.
మరొక కలలో “మా అమ్మాయి
ఒక గుడిలో కూర్చుని ఉంది. చిరిగిన బట్టలు కట్టుకున్న
ఒక వృధ్ధుడు ఆమె వద్దకు వచ్చి, "అమ్మా! నువ్వు షిరిడీ వచ్చి ప్రసాదం తీసుకోకుండా వెళ్ళిపోతున్నావా?”
అని ఆమెకు పెరుగన్నం పొట్లం ఇచ్చి తినమన్నాడు.
ఆమె ఆ ప్రసాదాన్ని తిని బాబాయే స్వయంగా ఇచ్చారని ఎంతో సంతోషించింది.
ఒకసారి మేము మా అమ్మాయి
కుటుంబంతో పండరీపూర్ వెళ్ళాము. ఆరోజు దసరా
ఉత్సవాలు జరుగుతూ ఉండటం వల్ల గుడంతా భక్తులతో నిండిపోయి తొక్కిసలాట జరిగింది. ఆ పరిస్థితుల్లో మేము గర్భ గుడిలోకి వెళ్ళగలమా లేదా
అని భయపడ్డాము.
మేము ఒక బెంచీమీద నుంచుని దూరంనుంచే
భగవంతుడిని దర్శించుకుని నమస్కారం చేసుకుని ప్రార్ధించుకున్నాము.
ఇది జరిగిన ఒక సంవత్సరం
తరువాత మా అమ్మాయికి పండరీపూర్ వెళ్ళినట్లుగా కలవచ్చింది. ఆమె గుడిలోపలికి వెళ్ళింది. లోపల దేవునికి సాష్టాంగ నమస్కారం చేద్దామనుకుంటె
శ్రీపాండురంగని విగ్రహం కనిపించలేదు. అపుడామె
మనసులో ఇలా అనుకుంది. “ఇంతకు ముందు ఇక్కడికి
నేను వచ్చినా నీపాదపద్మాలను స్పృశించే భాగ్యం కలగలేదు. దానికి నేను చాలా బాధపడ్దాను. కాని ఈసారి నేనెంతో ఆశతో నీ దర్శనం చేసుకుందామని
వచ్చాను. కాని ఇప్పుడు నువ్వే అదృశ్యయిపోయావు” ఈ విధంగా బాధపడుతూ కదలకుండా దూరంగా నుంచుని ఉంది. ఇంతలో కాషాయ బట్టలు ధరించిన ఒక వ్యక్తి అక్కడికి
వచ్చాడు. ఆయనను చూడగానే ఆయన సమర్ధ రామదాసు
స్వామీజీ (సజ్జన్ ఘడ్) అని గుర్తించింది. అప్పుడాయన పాండురంగనికి సాష్టాంగనమస్కారం చేసుకోమని మా అమ్మాయితో
చెప్పారు. ఆమె వెంటనే శ్రీపాండురంగని పాదాలమీద
పడింది. ఆమె ఆ విధంగా సాష్టాంగ పడగానే, పాండురంగని
పెద్ద విగ్రహం చుట్టు లెక్కలేనన్ని చిన్న చిన్న పాండురంగని విగ్రహాలు కనిపించాయి. మొత్తం గుడంతా పాండురంగని విగ్రహాలతో నిండిపోయింది. ఆమెకు ఒక్క పాండురంగని విగ్రహం దర్శనం లభించక బాధపడినందుకు
ఇపుడు లెక్కలేనన్ని పాండురంగని విగ్రహాలు దర్శనమివ్వగానే ఆమెకు కలిగిన ఆనందం అనిర్విచనీయమైనది,
వర్ణించలేనిది.
1990వ.సంవత్సరంలో మా
అమ్మాయి కుటుంబమంతా బెంగళూరుకు తరలివెడుతున్నపుడు మేము కూడా వారింటికి వెళ్ళాము. ఒకరోజు మా అమ్మాయి తనకు క్రితం రాత్రి ఒక కల వచ్చిందని
చెప్పింది. ఆకలలో ఆమెకు తాను ఒకటిన్నర అడుగుల ఎత్తుఉన్న పాండురంగ, రుక్మాబాయి విగ్రహాలకు
ప్రార్ధిస్తున్నట్లుగా కనిపించింది. ఈ విగ్రహాల
వెనుక ఇంకా పెద్ద విగ్రహం కనిపించింది. కాని
అది సరిగా కనిపించలేదు. ఆవిగ్రహం ఏమిటో సరిగా
కనిపించకపోయినా దానికి కూడా సాష్టాంగ నమస్కారం చేసుకొంది.
అపుడు ఆమె భర్త శ్రీజనార్ధనరావుగారు
ఈవిధమయిన కల ఆమెకు చాలా సార్లు వచ్చిందని, కాని పాండురంగ, రుక్మాబాయి విగ్రహాల వెనుక
కనిపించే పెద్ద విగ్రహం గురించి ఏమి తెలియటల్లేదని చెప్పారు. ఆయన ఈ విషయం గురించి మమ్మల్ని అడిగారు. మచిలీపట్నంలో పండరినాధుని విగ్రహం ముందు హనుమంతుని
విగ్రహం ప్రతిష్టించారని, కాని ఈ పెద్ద విగ్రహం గురించి మాకు కూడా ఏమీ తెలీదని చెప్పాము. అపుడు మా అల్లుడుగారు ఇక భవిష్యత్తులో పండరీపూర్
వెళ్ళే అవకాశం ఉండదని అందువల్ల బెంగళూరుకి 15 కిలోమీటర్ల దూరంలో ప్రతిష్టించబడ్డ పాండురంగని
దర్శించుకుందామని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే
మేము అక్కడికి వెళ్ళాము. అక్కడ పాండురంగని
విగ్రహాన్ని చూడగానే అప్రతిభులయ్యాము. ఆ విగ్రహం
సరిగ్గ మా అమ్మాయికి కలలో ఏవిధంగా కనిపిస్తూ వస్తోందో అదేవిధంగా ఉంది. అక్కడ ఒకటిన్నర అడుగుల ఎత్తులో పాండురంగ, రుక్మాబాయిల
విగ్రహాలున్నాయి. వాటివెనుక 40 అడుగుల ఎత్తులో
పాండురంగ విఠలుని విగ్రహం ఉంది. ఆ పాండురంగని
విగ్రహం ఎంతో తేజస్సుతో, చుట్టూరా అష్టలక్ష్ములతో ఘనంగా కనువిందు చేస్తూ ఉంది. చూడగానే కళ్ళు తిప్పుకోలేనంత సుందరంగా ఉంది.
మా అమ్మాయి ఎప్పుడూ పండరీపూర్
వెళ్లలేకపోయామే, అక్కడ పాండురంగని దర్శించుకోలేకపోయామే అని బాధపడుతూ ఉండేది. ఇపుడు ఇక్కడ బెంగళూరులో ఇంత పెద్ద విగ్రహాన్ని చూసిన
తరువాత స్వామి తనకోసమే ఇక్కడికి వచ్చాడా అని ఎంతగానో సంతోషించింది. పాండురంగడు తనకు కలలలో అన్ని సార్లు దర్శనమిచ్చినా
తను ఆ కలలను సరిగా అర్ధం చేసుకోనందుకు మన్నించమని వేడుకొంది. ఈ విధంగా మనసులో ఆలోచించుకుంటూ పాండురంగనికి మనస్ఫూర్తిగా
భక్తితో నమస్కరించుకుంది.
మా అమ్మాయి పెద్ద కొడుకు
చి.మురళీకృష్ణ కారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు.
కారు ఎపుడు డ్రైవ్ చేసినా మంచి నైపుణ్యంతో చేస్తూ ఉంటాడు. ఒకసారి కారులో వెడుతుండగా స్టీరింగ్ దగ్గరున్న బాల్
జాయింట్ విరిగిపోయి, రోడు ప్రక్కనున్న కరెంటు స్థంబానికి గుద్దుకుంది. దానివల్ల ఆకరెంటు స్థంభం కారుమీద ఒక ప్రక్కగా పడిపోయింది. మెల్లగా కరెంటు తీగలు కారుమీద పడి వాటినుంచి నిప్పురవ్వలు
వచ్చాయి. అదృష్టవశాత్తు మామనవడికి కరెంటు షాక్
ఏమీ కొట్టలేదు. ఆకరెంటు స్థంభం కారుమీదకి ఒక
ప్రక్కకు కాకుండా కారుమీదనే పడి ఉంటే మామనవడికి చాలా ప్రమాదం జరిగిఉండేది. బాబా అనుగ్రహం వల్ల ఈప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మామనవడే కాదు ఆరోడ్డు మీద ఉన్న స్కూలు పిల్లలకు
కూడా ఈప్రమాదం బారిన పడకుండా తప్పించుకున్నారు.
బాబా ఎల్లపుడూ, అపారమయిన భక్తిశ్రద్ధలతో తనను పూజించే భక్తులను కాపాడుతూ ఉంటారు. బాబా దయవల్ల మామనవడికి పెద్ద ప్రమాదం తప్పింది.
(రేపటి సంచికలో రావుగారి మనుమడికి బాబా
చూపించిన లీలలు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment