10.06.2017 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
బాబావారు ప్రసాదించిన మరికొన్ని సందేశాలు
శ్రీ సాయితత్త్వ సందేశములు
(voice of Sai Baba)
శ్రీసాయి తత్త్వసందేశములు –10 వ.భాగమ్
35. 08.12.1992 ఉదయం 11.35 గంటలకు
షిరిడి ద్వారకామాయిలో శ్రీసాయినాధుడు యిచ్చిన సందేశము
మీ మనస్సులు నాయందు నిలిపిన ఆకలిని, పిపాసను, సంసారమును మరచెదరు. ప్రపంచ సుఖములయందు చైతన్యమును పోగొట్టుకొనగలరు. అప్పుడె మనస్సుకు శాంతి ఆనందము కలుగును. నిత్యమైన దానికి అనివార్యమైనదానికి తారతమ్యము తెలిసికొని ప్రవర్తించండి.
శరీరమును, మనస్సును ఆత్మను సర్వశ్య శరణము చేయండి. మీరు నిత్యము నా నామస్మరణ చేయుచున్నచో సమస్త పాపములనుండి దురాలోచనలనుండి తప్పించుకొని మనస్సును పావనము చేసుకొని, మాయ అనే సంకెళ్ళనుండి విముక్తులై సంసారమునందు గల భయములను పారద్రోలి, ప్రాపంచిక కష్టసుఖములయందు విరక్తి కలిగి హృదయములో వున్న భేదాభిప్రాయములను పోగొట్టుకొని శరీరమే శాశ్వతము అనే భావనను నిర్మూలించుకొని, ప్రాపంచిక జన్మ అనే సాధనము నుండి బయటపడి, పరమార్ధ మార్గమునకు పోవు స్థితిని సంపాదించగలరు. మీరు దేనియందును అభిమానము పెట్టుకొనక అహంకారమును ప్రక్కకు పెట్టి నాకు శరణుజొచ్చినవారికి బంధములు వూడి మోక్షము పొందగలరు.
నా లీలలు, నాతత్వములోని అంతరార్ధము తెలుసుకున్నవారికి మమతలు పోయి, భక్తి కలిగి, జ్ఞానాలంకారమును పొందగలరు. ఎవరైతే నాశరణాగతి వేడెదరో, నాయందు భక్తి కలిగి వుండెదరో అట్టివారిని సమస్త బంధములనుండి తప్పించుటయే గాక, వారిలోనున్న గర్వమును, అహంకారమును రూపుమాపి శుధ్ధ చైతన్యమును ప్రసాదించెదను. నాకు పూజాతంతులు కాని, షోడశోపచారములు గాని, అవసరము లేదు. ఎవరైతే నాకు పూర్తిగా సర్వశ్య శరణాగతి చేసెదరో అట్టివారిని సకల వేళలయందును సంరక్షించెదను.
36. 09.12.1992 బుధవారం దత్తజయంతి ఉదయం 7.15 గంటలకు శ్రీసాయి యిచ్చిన సందేశం
మీరు నాభక్తులై యుండి నాజీవిత చరిత్రలోని తత్త్వము కాని బోధలు కాని గ్రహించక నా మార్గమును అనుసరించుటలేదు. దానికి మీరు సిగ్గు పడవలయును.
నన్ను మీ హృదయములో స్థిరపరచుకొని ఏకాగ్రతతో ధ్యానించిన సత్య ప్రబోధమును, సమబుధ్ధిని, స్వార్ధపరత్వం లేని బుధ్ధిని త్వరితముగా పొందగలరు. ఆధ్యాత్మిక నిష్ట అభ్యసించిన ఆత్మానంద సుఖము పొందగలరు.
క్రమశిక్షణలేని భక్తుని హృదయము వినాశకరమైన వ్యసనములకు లోబడును. తిని,
త్రాగి, నిద్రించుటయే పరమ పదముగా భావించవద్దు. నా భక్తులు లౌకిక విషయముల గూర్చి తలంచరాదు. అలసట వలన అనుష్టానమునకు అవరోధము సంకుచిత బుద్ధి వలన హాని కలుగును.
నిరతర కార్యదీక్ష, త్యాగబుధ్ధి కలిగియున్నచో శాంతి శ్రేయము కలుగును. ఎవరు ఎట్లు ప్రవర్తించుచున్నను శ్రేయస్కాముడు తనను తాను పరీక్షించుకొనవలయును.
దైవము అద్వితీయుడు అట్టి దైవము నేనే. సర్వము నేనే.
“జైసా అల్లా రఖేగా – ఐసా రహనా” ప్రాప్తించినదానితో తృప్తి పొందండి. మోహ విభ్రాంతుల కొరకు యితరులను పీడించకండి. నేను యిచ్చినదానితో సంతృప్తి పొందండి.
ఇంద్రియముల ప్రోత్సాహము చేత విషయవాసనలు మీ బుధ్ధిని పట్టుకుని మిమ్ములను నాశనము చేయుచున్నవి. అంతే కాని దైవ ప్రోత్సాహము వలన మీరు కర్మలు చేయుచున్నరనే అపోహను తొలగించుకొనండి.
ఇంద్రియ నిగ్రహమును అలవాటు చేసుకొనండి. ఎప్పుడైతే కామ క్రోధ అహంకారములను జయించెదరో అప్పుడే బ్రహ్మజ్ఞానమును పొందగలరు.
మీ శరీరము పాంచభౌతికము. ఇది పంచభూతములలో చివరకు కలియును. కనుక మీ శరీరమునకు ఎంత పోషణ కావలయునో అంతనే యివ్వండి సుఖ భ్రాంతులకు, విషయవాసనలకు లోబడి దేహాభిమానముయందు ఎక్కువ ఆసక్తి చూపవద్దు. మీ మనస్సును ఉన్నత స్థాయిలో వుంచుకొనండి.
37. దత్త జయంతి రోజు మధ్యాహ్నం 12.40 గంటలకు వచ్చిన సందేశం
నేను సర్వాంతర్యామిని. నాకు తెలియని విషయములు ఏమియు లేవు. మీరు చేయు ప్రతి కార్యము నేను పరీక్షించుచూ వుండెదను. నాకు తెలియదనుకొనుట మీ అజ్ఞానము.
నేను సర్వవ్యాపకుడను. సర్వజీవులలో వున్నాను. నాలో వున్న దైవత్వమును, నాజీవితములోని విశేషములను చాలా మంది గ్రహించలేరు. ఇదివరలో
రాని విశేషములు యిప్పుడు నీతో వ్రాయించుచున్న పుస్తకములో తెలియచేసినాను.
నన్ను సర్వదా మనస్ఫూర్తిగా పూజించినవారికి సద్గతిని కలుగచేసెదను. విమర్శనలకు మీరు విలువ యివ్వవద్దు. మీకు యిచ్చిన కార్యమును మీరు నిర్విఘ్నముగా సాగించండి. నా సహాయము ఎల్లప్పుడు వుండును.
నా తత్త్వ ప్రచారములో మీ శాయశక్తులా పాల్గొనండి. వాడవాడలలో నా ‘తత్త్వ సందేశములు’ ప్రబోధించండి.
మానవసేవ చేయు నిమిత్తము ఏ కార్యములు చేపట్టినను నాశుభాకాంక్షలతో జయప్రదమగును. ఈ కార్యముల ప్రారంభములో వచ్చు విమర్శనలకు తావియ్యవద్దు. మీకు ఏభావన వస్తే అదే నాభావన అని గ్రహించి కార్యము కొనసాగించండి. ఎవరి సలహాను పొందే అవసరములేదు. మీరు ఏకాగ్ర చిత్తులై నిర్వర్తించండి. నా ఆశీస్సులతో జయప్రదమగును.
ఈ నిర్వహణకు ధనము ఏవిధముగా సమకూరునని భయపడవద్దు. మీ కార్యమును మీరు వెంటనే ప్రారంభించి బీదప్రజలకు ఉపయోగకారులవండి. మానవసేవకంటే మించినది ఏమియు లేదు. మీకు సదా నా ఆశీస్సులు గుమ్మరించుచుండెదను.
నా తత్త్వము, నాబోధలు, సేవ గురించి ప్రజలకు తెలియచేయండి. వారిని కూడా అదే విధముగా తత్త్వ ప్రచారము చేయమనండి. వారు చేయుటకు ముందు నాతత్త్వ భావన ఏమిటో నా వేదాంతసారమేమిటో ముందుగా తెలిసికొన్న తతువాతనే ఈ కార్యములో దిగమని సలహానివ్వండి. ఎవరిని నిర్భంధము చేయవద్దు. నేను ఎవరో వారి మనస్సుకు సంపూర్ణముగా హత్తుకునిపోయినప్పుడు
ఈ ప్రచారములోనికి దిగమనండి. ప్రచారమునకు మించిన సాధనలేదు. తదుపరి సేవ ముఖ్యము.
మీ స్వధర్మమును మీరు సక్రమముగా నిర్వర్తించిన తరువాతనే ఈ విషయాలలోనికి దిగండి. నన్ను సేవించిన సర్వదేవతలను పూజించిన ఫలమును పొందగలరు.
(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment