09.06.2017 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు మరికొన్ని శ్రీసాయి తత్త్వ సందేశాలు
శ్రీ సాయితత్త్వ సందేశములు
(voice of Sai Baba)
శ్రీ సాయి తత్త్వ సందేశములు – 9 వ.భాగమ్
30. 05.06.1992 రాత్రి
9.10 గంటలకు శ్రీ సుధాకర్ మహారాజుగారింటిలో సత్సంగములో శ్రీ సాయి యిచ్చిన సందేశము
“స్వార్ధం లేని అవధులు లేని, భేదభావనలు లేని, మానవసేవయందే గడపండి. దైవ ప్రేమచేత, మానవ ప్రేమను అతిక్రమించండి. భగవంతునకు ఏది ప్రీతో దానిని స్వీకరించండి. మనస్సును నిర్మలము చేసికొని బుధ్ధిని స్థిరపరచుకొని నన్ను నిత్యము ధ్యానించిన ఆధ్యాత్మిక ఔన్నత్యమును పొందగలరు.
సకల జీవులయందు నన్నే దర్శించిన మీ ఆధ్యాత్మిక పరప్రేమ వృధ్ధి చెందును. సుఖములు వచ్చినపుడు పొంగిపోవద్దు. కష్టములు వచ్చిన కృంగిపోవద్దు. ప్రతి కష్టము వెనుక ఒక కర్మ ఉన్నదని తెలిసికొనండి. కర్మ రాహిత్యమునకే కష్టములు వచ్చును. నా పూజకు ఆడంబరములు అవుసరము లేదు. చిత్త
శుధ్ధితో పాల్గొన్నందున ఒక నిదర్శనము చూపితిని. దానిని గ్రహించి మీ ఆధ్యాత్మిక స్థితిని వృధ్ధి చేసికొనుటకు పాటుపడండి. ఈ సృష్టి అంతయు సూర్యుని వలననే జరుగుచున్నది. అట్టి సూర్యుడను నేనే.
31.
08.11.1992 ఆదివారమునాడు శ్రీ సుధాకర్ మహరాజ్ గారి యింట బాబా యిచ్చిన సందేశము, సమయము 5 గం. 50 ని.
ప్రతి ఆదివారము మీరందరు దత్తనామము కాని, దత్తపూజ కాని సాయినామ సంకీర్తనకాని, చేసి హృదయమును, మనస్సుయందు లయము చేసుకొనండి. ఆదివారము
పవిత్రమైన దినము. ఎందువలననగా ఆశ్వయుజ పౌర్ణమి, ఆదివారమునాడు భోజగిరి అనే భక్తునకు బాలదత్తునిగా దర్శనమిచ్చినాను. మరియొక
ఆదివారము నాడు, బాలబాబా అనే నా అంకిత భక్తునకు నా దివ్యస్వరూపముతో దర్శనమిచ్చిన రోజు భాద్రపద శుధ్ధ చవితి ఆదివారము నా అవతారమైన శ్రీపాదుడు జన్మించిన రోజు. ఆదివారమునాడే శ్రీపాదుడు కృష్ణానదిలో జలసమాధి అవుటకు ప్రయత్నించిన దినము. నీకు ప్రధమముగా నా దర్శనము ఆదివారమునాడే కలిగినది. నీ ప్రమాదములన్నిటిని
కాపాడినది ఆదివారమే. దీనిని
గ్రహించి
ఆదివారం మహత్యము తెలుసుకొనండి. ప్రలోభములకు లోను కానివారే దైవానుభూతికి అర్హులు. లౌకిక
దృష్టికి గొప్పవిగా కనపడినవి అన్నియూ పవిత్రములు కావు. మధురమములైనవి అన్నియూ వర్జ్యములు కావు. దైవభక్తి ఉన్నప్పుడే నాదికాదు, నీదే అనే స్థితిని సంపాదించగలరు. నా సందేశాలు, నా బోధలు యితరులకు బోధించుచున్నారే కాని మీరు పాటించుటలేదు. నేను కోరిన శ్రధ్ధ, సబూరి త్రికరణశుధ్ధిగా పాటించుటలేదు. ప్రతిఫలాపేక్షలేక,కామితార్ధములందు ఆశలేక బ్రహ్మనిష్టకలిగి,
నన్ను సేవించిన మధురత్వమును ప్రసాదించుటయేగాక,
నా అనుగ్రహమునకు పాత్రులగుదురు. నేను నిత్యముక్తుడను, లోకగురుడను, పురుషోత్తముడను. నన్ను
నమ్మి నాకు పూర్తి శరణాగతులైనవారికి, భక్తి జ్ఞాన, వైరాగ్య, విజ్ఞానము సహితము ప్రసాదించెదను.
మీరు, నామసంకీర్తన చేయుచున్నారే కాని, మీ మనస్సును బుధ్ధిని నామముయందు, స్థిరత్వముపెట్టక, మనస్సును పరిపరివిధములుగా పోగొట్టుకొనుచున్నారు. ఇట్టి
నామ సంకీర్తననల వలన ఫలితము లేదు. హృదయపూర్వకముగా, మనస్ఫూర్తిగా, మనస్సును. నాయందు లయముచేసి, కొద్ది నిమిషములు చేసిననూ నేను సంతోషించెదను. మీనామ
సంకీర్తన మనస్ఫూర్తిగా ఒకే నామముతో సాగించండి.
33. 16.11.1992 ఉదయం
8.30 గంటలకు పూజామందిరములో సాయినాధుడు యిచ్చిన పవిత్ర సందేశము.
నీ పూర్వజన్మలో వున్న పుణ్య విశేషము వలన, శ్రీ లలితాదేవి దేవతార్చన వలన శ్రీ చక్రపూజా ఫలితము వలన, దేవి నీపై కరుణాకటాక్షము కలిగి, నిన్ను ఆనందపరచుటకు తన పవిత్రమైన పసుపుకుంకుమలను గంధమును ప్రసాదించినది. సౌజన్యమూర్తియగు గురువును ఆశ్రయించి, ఆరాధన చేయు విధానమును తెలుసుకొనిన, సిధ్ధిని పొందగలవు. అట్టి సద్గురువు దొరకని పక్షములో నన్నే బోధ గురువుగా భావించి ఆత్మ విశ్వాసముతో శ్రధ్ధాభక్తులతో నిత్యము పంచదశాక్షరీ మంత్రమును, శ్రీ చక్రపూజను చేసిన విశేషానుభవము పొందగలవు.
శ్రీ దేవి ఉపాసన వలన అరుణ శరీర ప్రకాశకాంతులతో, అశోక చంపక పున్నాగ సౌగంధిక పుష్పములతో ప్రకాశించు దేవి దర్శనము కలిగి నీ సర్వ పాపకర్మ క్షయకరమగును. శ్రీ సచ్చిదానంద బ్రహ్మ స్వరూపిణియగు ఆ దేవి కరుణా కటాక్షముచే ప్రసాదింపబడిన ఈ పవిత్ర కుంకుమను, శ్రవణ మనన ధ్యాన యోగములయందు శ్రధ్ధా భక్తి కలిగిన వారికి ప్రసాదించిన వారికి శుభము కలుగును.
34. 28.11.1992 అర్ధరాత్రి 2.10 గంటలకు వచ్చిన సందేశము.
యోగులు శరీరము ధరించి ఏదో ఒక కార్య నిమిత్తం భూలోకమునకు వచ్చెదరు. అది నెరవేరిన తర్వాత, శరీరమును విడచి వెళ్ళిపోయెదరు. నేనును
అట్లే వచ్చితిని. నా రూపమును మీ మనస్సులో మీ యిష్టరీతిలో చిత్రించుకొని మీకు కావలసిన రీతిలో నా విగ్రహములను తయారుచేయించి ప్రతిష్టలు చేయుచున్నారు.
దాతలను
బాధించి చందాలు వసూలు చేసి, నా మందిరములు, నా విగ్రహ ప్రతిష్టలకు వ్యయము చేయుట, నాకు సమ్మతము కాదు. డాంభికమైన విగ్రహములు అవసరము లేదు. ఈ జగత్తులో నున్న వస్తువులన్నిటిలోను,
నేను వ్యాపించి యున్నాను. నాకు భౌతిక శరీరము లేదనే కాని, నేను లేని ప్రదేశము లేదు. నారూపమును చూడలేక ఎవరికి తోచిన విధముగా వారు ఊహించుకొనుచున్నారు.
నాకు కావలసినది భక్తి. మీ స్వధర్మమును మీరు సక్రమముగా నిర్వర్తించుకొనుచు, మీ మనస్సును నాయందు లగ్నము చేసుకొనండి.
నిర్వ్యామోహితుడను, అభిమాన రహితుడను. అహంకారములకు ఆడంబరములకు అతీతుడను. నాయందు పూర్ణమైన భక్తి కలిగి నాతత్త్వ ప్రచారము చేసిన ఆనందించెదను. అప్పుడే
మీరు మనో నిశ్చయము మనశ్శాంతి పొందగలరు. ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే నాకు కావలయును.
బ్రహ్మ విచారణ వలన బ్రహ్మాత్త్మెక్య సాక్షాత్కారముత్పన్నమగును. దానియందు స్థిరత్వము సంపాదించిన, ఆ బ్రహ్మ నిష్ట క్షణికమైనను
నిరవధిక ఫలదాయకమగును. అదియే
సత్కర్మ ఫలనిధి యగును.
ఎవరి మనస్సు ఒక క్షణకాలమైనను నాయందు, కేవల భక్తి భావముతో నిశ్చలముగా నిలపగలరో, వారికి సమస్త పుణ్యతీర్ధములయందు
స్నానమాచరించిన పుణ్యము. వేయికోట్ల మంత్రజపమొనర్చిన ఫలము లభించును. నిరంతరము నాతత్త్వ ప్రచారములో పాల్గొనిన యీ మహాప్రయోజనము పొందగలరు.
బ్రహ్మ విచారణమొనర్చి, బ్రహ్మ నిష్టులైన యెడల సర్వ శుభకరమగును. శ్రేయస్సు, కరతలామలకమగును. ఈ జగత్తు అంతయు త్రిగుణముల చేత వ్యాపింపబడి యున్నది. ఈ త్రిగుణములు అవ్యయ స్వరూపమైన నావే. జనన మరణాలకు లోనై అజ్ఞానులై స్వప్నంలో సమానమైన ఈ సృష్టిని అనుభవించుచున్నారు.
॥ బహూనాం జన్మ నామన్తే జ్ఞాన వాన్మాం ప్రపద్యతే - ॥
(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment