21.06.2017 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
బాబావారు ప్రసాదించిన మరికొన్ని సందేశాలు
శ్రీ సాయితత్త్వ సందేశములు
(voice of Sai Baba)
శ్రీసాయి తత్త్వసందేశములు
–16 వ.భాగమ్
నిన్న ప్రచురించిన శ్రీసాయితత్త్వ
సందేశములు 15 వ.భాగంలో ‘తితీక్ష’ అనే పదం వచ్చింది. తితీక్ష అంటే నాకు కూడా తెలియదు. నాకు తెలియని విషయం మీకు చెప్పడం వల్ల (బ్లాగులో
ప్రచురించడం వల్ల) ఉపయోగం ఏమీ ఉండదు. ఆ పదానికి
అర్ధం కొంతమందికి తెలిసే వుండవచ్చు. కాని నేను
కూడా తెలుసుకోవాలిగా. అందుకనే తెలుగు నిఘంటువు
చూసి దానికి అర్ధం వివరించాను.
మరొక విషయం ఏమిటంటే నేను
ప్రతిరోజు మణెమ్మ గారు వ్రాసిన శ్రీ సాయి సత్ చరిత్రను నిత్య పారాయణ చేస్తూనే వున్నాను. ఈ రోజు 10 వ. అధ్యాయం పారాయణ చేస్తున్నపుడు అందులో
‘తితీక్ష’ అనే పదం వచ్చింది. అనగా ఇన్నాళ్ళు
నాకు ఆపదానికి అర్ధం తెలుసుకోవాలనే కుతూహలం కూడా కలగలేదన్నమాట ఏదో పారాయణ చేయడమే తప్ప.
నేను ప్రతిరోజూ నిత్య పారాయణ చేస్తూ ఉంటాను అని నాకు నేను చెప్పుకుంటే ఎటువంటి ఫలితం
ఉండదు. అందుకనే బాబా సత్ చరిత్రలో అన్న మాటలు
“చదవడంలో తొందర పనికిరాదు. మెల్లగా అర్ధం చేసుకుంటూ
చదవాలి అని.
నిన్న ప్రచురించినదానిలో
మరికొన్ని వాక్యాలు “ఇతరులకు బోధించుటకు ముందు మీ హృదయములలో భగవంతుని ప్రతిష్టించుకొనండి.”
పైన చెప్పిన వాక్యాలను
బట్టి నాకు నేను అర్ధం చేసుకున్నదేమంటే “ఇతరులకు చెప్పేముందు దాని అర్ధం కూడా తెలుసుకుని
చెప్పాలి” అని.
( 10 వ. అధ్యాయం పేజీ
90 లో బాబా వారి గురించి వర్ణిస్తూ అన్న మాటలలో “ఒకప్పుడు శాంతి దాంతి ఉపరతి తితీక్షాదులతో
ఆత్మస్థితి యందుండి, భక్తులను ప్రసన్న చిత్తులను చేసేవారు)
దాంతి : ఇంద్రియ నిగ్రహము,
బాహ్యేంద్రియ నిగ్రహము, బ్రహ్మచర్యాది తపఃక్లేశమును ఓర్చు తనము)
ఓమ్ సాయిరామ్
58. 23.10.1993 ఉదయం 8 గంటలకు షిరిడీలో శ్రీసాయిబాబా
యిచ్చిన సందేశము.
ఈ గ్రంధము అపార శాస్త్ర
పరాపరమై మధించి వెలికి తీసిన సారభూతమైన గ్రంధమిది. సర్వశాస్త్ర సిధ్ధాంత సమన్వయ రూపమైన గ్రంధమిది. సర్వమత సాంప్రదాయ తత్త్వములను పోషించుచూ, అన్ని
మతములకు ప్రాతినిధ్యము వహించు ఏకైక ప్రామాణిక గ్రంధమిది. ఆధ్యాత్మిక జ్ఞానము, సమస్త ధర్మములకు నిఘంటువులాంటి
గ్రంధమిది. ఇతర మతములలోని ప్రధాన సూత్రములు,
ధర్మములు ఈ గ్రంధములో క్రోడీకరింపబడి యున్నది.
వివిధ మత సిధ్ధాంత రూప శాఖోపశాఖలుగా విరాజిల్లు ధర్మ వృక్షములాంటిది. సర్వధర్మ సమన్వయ క్షేత్రములాంటిది యీ గ్రంధము. విశ్వమత గ్రంధము యిది. సర్వసమన్వయ ధోరణితోను అగాధ జ్ఞానముతోను, లోకోత్తర
సర్వోపయోగముగా ప్రకాశించు గ్రంధమిది. ప్రపంచ
పరమార్ధ జీవనముపై ఈ గ్రంధ ప్రభావముండును. ప్రారబ్ధమును
అనుభవించుచున్నను నిర్మలమైన మనస్సుతో మీ బుధ్ధిని నాయందు లయము చేసి యీ గ్రంధమును చదివిన
ముక్తులై కర్మలకు అంటబడక సుఖమును పొందెదరు.
నిత్యము పఠించిన జ్ఞానసిధ్ధి పొంది పరమాత్మ పదమును పొందెదరు. ఈ గ్రంధ ముద్రణకు సహకరించినవారందరికి గోదానము వలన
ఎంత పుణ్యము లభించునో అంత పొంది పాపరహితులై, పరమాత్మ పదమును పొంది సద్గతిని పొందగలరు. స్వార్ధము లేక, దురాభిమానము లేక వ్యాపార దృష్టి
లేక, పరాకృతత్వము తప్ప, ఏ విధమైన కోరిక లేకుండా, నా తత్త్వ ప్రచారము కొరకు స్వకార్యములను
వదలి, ఒకటిగా చేరి పరిపూర్ణమైన ఆనందముతో యీ కార్యమును జయప్రదము కావించిరి. ఈ గ్రంధము వలన భగవంతుని అందరిలోను చూడగలిగి ఉత్కృష్టమైన
ఆనందమును పొందగలరు.
ఆధ్యాత్మికమైన బంధుత్వముచే
భగవంతుని మీరు మీతో వచ్చునట్లు తెచ్చుకొనే స్థితిని పొందగలరు.
“సర్వ ధర్మాన్ పరిత్యజ
మామేకం
శరణం ప్రజ”
అనే భావమునకు అతీతులయ్యెదరు. చెడ్డ ఆకర్షణవైపునకు
నడవనివ్వక, చెడునుండి మిమ్ములను విడుదల చేయును.
“సర్వం ఖల్విదం బ్రహ్మ”
అని తెలుసుకొనగలరు.
ఈ గ్రంధమును చదివినంత
మాత్రమున లాభము లేదు. దానిలోని విషయములను హృదయపూర్వకంగా
ఆచరించినప్పుడే దాని ఫలితమును పొందగలరు. దైవ
లీల అనే జ్ఞానము చేత, మీ పాత్రను సక్రమముగా నిర్వర్తించండి.
ఈ పుస్తక రచన చేత, అఖండ
జ్ఞానము సంపాదించినానని విఱ్ఱవీగక, అహంకారము ప్రదర్శించవద్దు. ఈ గ్రంధములోని విషయములను వివరించమని ఎవరైన ప్రశ్నించిన
మౌనముగా వుండు. నీవు దాని గురించి ఏమైనా చెప్పిన,
యీ గ్రంధములోని విషయములు మోక్ష పధ ఆలోచనలకు, మాటలకు అతీతమైనందున, నీవు చెప్పునది సరియైన
భావనలో యుండదు. ఈ గ్రంధమునకు కర్తవు నీవు కాదు. కనుక నోరు విప్పవద్దు. ఎవరైన యితర గ్రంధములలోని శ్లోకములను దృష్టాంతముగా
చెప్పిన అట్టివారు మనోస్థితిని పొందనట్లే.
ఆ స్థితిని పొందినవారు ఈ గ్రంధములోని విషయముల గురించి ప్రశ్నించరు.
ఈ గ్రంధమును వివిధ భాషలలో
తర్జుమా చేయుటకు ప్రయత్నించు. అట్టి ప్రయత్నంలో
నా భక్తులు హృదయపూర్వకంగా నీతో సహకరించుటకు ముందుకు వచ్చెదరు. అశక్తి ప్రకటించక ముందుకు పో. నీవు నిమిత్త మాత్రుడవని గ్రహించు.
(పరాకృతత్వము అన్న మాటకు
నిఘంటువు వెతికినా దొరకలేదు.. పరాకత్ అనే మాట కనిపించింది దాని అర్ధం నిశ్చింత , తీరిక, ఇంకొక పదం.. పరాకత్ గ = హాయిగా, నిక్షేపంగా, లీజర్
గా.. ఇక్కడ పరాకృతత్వము అంటే నేను అర్ధం చేసుకొన్నది పరులకు ఉపకారం చేయాలనే తత్వం అయివుండచ్చనుకొన్నాను. గ్రంధ ముద్రణలో సాయపడినవారు ఎటువంటి ప్రతిఫలాపేక్ష
లేకుండా స్వార్ధము, దురభిమానము, వ్యాపారదృష్టి లేకుండా స్వకార్యములను వదలి కార్యక్రమమును
జయప్రదము కావించారని బాబా సందేశమిచ్చారు. అందు
చేత పరాకృతత్వము అంటే నేను అర్ధం చేసుకున్నదది.
మన సాయిబంధువులలో ఎవరికైనా అర్ధం తెలిస్తే నాకు తెలియచేయండి.)
59. 24.10.1993 మధ్యాహ్నం 2.30 గంటలకు గాణుగాపూర్ దత్తమందిరంలో
శ్రీసాయి యిచ్చిన సందేశము.
ఈ పవిత్ర స్థలమునందు
భక్తి శ్రధ్ధలతో ధ్యానం చేసిన ఆధ్యాత్మిక ఔన్నత్యమును పొంది శుధ్ధ చైతన్యము పరమ శాంతిని
పొందగలరు. నేను అమితాచార పరాయణుడను, పరమాత్మ
సాగరుండను. చరాచర వినాశపరుడను. కర్పూరకాంతి దేహము కలవాడను. యోగశాస్త్ర తత్త్వవేత్తను, యజ్ఞప్రియుడను. భక్త పరాధీనుడను, ఆయురారోగ్య సంపదలను యిచ్చువాడను. త్రైలోక్య పూజితుడను. సర్వశరణాగతులకు, శరణుజొచ్చినవారికి దైవ స్వరూపుడను. సర్వ మంగళాకారుడను. సర్వ ఆది వైద్య భీషజనుడను. సర్వ సంకటహారిని. సర్వపాపక్షయకరుడను. జ్ఞానయోగ నిధిని, విశ్వగురువును. యోగిజనప్రియుడను, సిధ్ధ చరితుడను. మాలా కమండలాధారుడను. ఈ చరాచర జగత్తుకు సాక్షిని.
అట్టి నన్ను నిత్యము పూజించిన నేను ఎవరో తెలుసుకొనగలరు. దైవకృపవలన నీచే వ్రాయించబడిన గ్రంధమునకు సహకరించినవారికి,
ఆపదలునుండి, ప్రమాదములనుండి, విషయవాసనలునుండి, రోగ పాపములనుండి, తప్పించెదను.
నేను సర్వాంతర్యామినని
తెలుసుకొనండి.
60. 23.12.1993 రాత్రి 8 గం.40. ని. గురువారం గుంటూరు
సత్సంగములో శ్రీసాయి యిచ్చిన సందేశము.
ఎవరూ తాము అధికులమనుకొనరాదు.
ఇక్కడ సుఖ భోగములు అనుభవించుటకు
కాదు. దైవసేవ మానవ సేవ కొరకే. ఈర్ష్య అసూయ అనుబంధమైన భావములు కలిగి యోగ, యాగ,
తపో యోగములను సంపూర్ణముగా విసర్జించి, దైవమునే మరచి, దుష్కార్యములు దుష్ట బుద్ధులకు
దాసులై, స్వార్ధ అసూయ ద్వేష భావములు కలిగి రజోతమోగుణములకు ప్రాధాన్యత యిచ్చి, జ్ఞానజ్యోతిలోని
కాంతి పుంజములను అందుకోలేక, భక్తిమార్గమును వదలి అంధకారములో పడి ఈ ప్రకృతి వైపరీత్యములను
సరిదిద్దుకోలేక దుష్కార్యములకు లోనగుచున్నారు.
వీటన్నిటినీ అంతిమ దశకు తెచ్చుటకు జగజ్జనని అయిన ఆ పరాశక్తి ఆదిపరాశక్తి లోకమాత,
సర్వలోక శ్రేయస్సు కొరకు ఈ ప్రకృతిని వికృతముగా మార్చదలచుకొన్నది.
అందువలననే భూకంపములు, నదులు పొంగుట అగ్నిపర్వతములు
బ్రద్దలై ప్రజలలో భయభ్రాంతులు కలిగి జన నష్టము, ఆస్థి నష్టము సంభవించును. ఇంగిత జ్ఞానము
లేనందున ఆధ్యాత్మిక సాధన అడుగంటబడి మానవ మరణకాండమునకు మీ అజ్ఞానమే కారణము.
రాబోవు ప్రకృతివైపరీత్యములకు
ప్రళయములకు ముందు తరమువారికి కనువిప్పు అగును.
ఈ ప్రళయములనుండి తప్పించుకొనవలయునంటే నా నామస్మరణ నిత్యము జపించండి. నా నామస్మరణ చేత మీ కర్మలు కాలుష్యములు హరింపబడి
అహంకార మమకారములనే పొరలను పోగొట్టుకొనగలరు.
నా నామముచే మీ మనస్సును పవిత్రము చేసుకొని ఆత్మజ్ఞానము పొందండి. భక్తితోను, ప్రేమతోను జ్ఞానాగ్నిలో మీ కోరికలను
తాపములను పడవేయండి. నా నామ ఉఛ్ఛారణతో ఆధ్యాత్మిక
జ్ఞానము వృధ్ధి చేసుకొని సాంగత్య దోషములను పోగొట్టుకొని నిర్మలమైన పరమాత్మానుభవము పొందండి. నిత్యము నన్ను స్మరించిన మీ చిత్తము శుధ్ధమై దుఃఖములను
మరచి ప్రశాంతము పొందగలరు. నా నామము నిత్యము చేసిన ఏ ఆపదలు రాకుండా రక్షణ యిచ్చెదను.
(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment