20.06.2017 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
బాబావారు ప్రసాదించిన మరికొన్ని సందేశాలు
శ్రీ సాయితత్త్వ సందేశములు
(voice of Sai Baba)
శ్రీసాయి తత్త్వసందేశములు
–15 వ.భాగమ్
55. 02.09.1993 ఉదయం 7 గంటలకు గుంటూరులో శ్రీసాయినాధుడు
యిచ్చిన సందేశము
ధ్యానం ఏకాగ్రతతో చేసిన
దాని వలన పుట్టిన సమస్య దర్శనమనెడి ప్రకాశము గల జ్ఞానదీపము చేత మిధ్యా జ్ఞాన స్వరూపమైన
మోహాంధకారమైన చీకటి నాశనమగును. నిర్మలమైన బుధ్ధి
కలిగి, మనోనిగ్రహము, గలవాడై శబ్దాది పంచేంద్రియ విషయములందు ఆసక్తి వదలినవాడై యిష్టానిష్టములగు
ద్వంద్వములను వదలినవానికి వాక్కు, కాయము, మనస్సును స్వాధీనమంధుంచుకొని, సదా ధ్యాన యోగమందు
ఆసక్తి కలిగి, యిహపరభోగములయందు వైరాగ్యము కలవాడై, అహంకారమును, బలమును, గర్వమును, కామమును,
కోపమును విసర్జించి మమకారము లేనివాడై శాంతచిత్తుడైన వాడు బ్రహ్మ సాక్షాత్కారము పొందగలడు.
అగ్ని సకల వస్తువులను
ఎట్లు భస్మము చేయునో, జ్ఞానాగ్ని సమస్త కర్మలను భస్మము చేయును.
ప్రాకృత విషయములు, ప్రపంచ గుణములు, మాయామోహములు,
జ్ఞానాగ్నిలో భస్మమగును. జీవగుణములు రహితమగు
వరకు బ్రహ్మ గుణములు పూర్తియగువరకు, బ్రహ్మ విచారణ, ధ్యానానుష్ఠానము చేయుచుండవలయును. పుణ్య కర్మలు నిష్కామ బుధ్ధితో చేయకపోవుటచే, నైష్కర్మ్య
సిధ్ధిని మీరు పొందలేకపోవుచున్నారు.
“అహం బ్రహ్మాస్మి” వాక్యార్ధబోధ
ఎంతవరకు ధృఢముగా గలుగునో అంతవరకు శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రధ్ధ, సామధానము కలిగి
అనుష్ఠానపరులై శ్రవణ, మనన, నిధి, ధ్యానములను చేయండి.
భవరోగములు నశించువరకు
బ్రహ్మవిచారణాపరమగు అనుష్ఠానము చేయండి.
వాసనాక్షయ, మనోనాశము
కలుగువరకు శ్రవణాది త్రయమును యనుష్టింపకపోయినచో భవరోగము పెరుగునే కాని, తరగదని గ్రహించండి.
(ఉపరతి = ఇంద్రియములను విషయదృష్టినుండి మరలించుట. తితీక్ష = ఓర్పు, ఇతర
ప్రాణులనుంచి తనకేదైనా హాని కలిగినప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోకపోవడం. దమము = ఇంద్రియనిగ్రహము. శమము =
కామక్రోధాదులు లేక అణగి యుండుట)
56. 07.09.1993 రాత్రి 8.15 గంటలకు కృష్ణకిశోరు గృహములో
సాయినామ సంకీర్తన భజనలో శ్రీసాయిబాబావారు యిచ్చిన సందేశము.
మీకు జ్ఞానోదయము కలుగవలయునంటే,
అనుష్ఠానమును సక్రమముగా చేయుచు, దైవ భక్తి కలిగి యుండవలయును. సోమరితనము, వృత్తి రహితమైన నిద్ర, రాగద్వేషములు అనేవి
నిర్వికల్ప సమాధికి ప్రతిబంధములు. సదా ఆత్మానుసంధానము
చేయుటచే, మనస్సునకు వృత్తిస్వరూప పరిణామము నివృత్తియగుటచే, అంతవరకు నిరోధింపబడినట్టి
స్థితిస్వరూపమైన ఆత్మ పరిణామము ధృఢమగును. అపరోక్ష
బ్రహ్మ సాక్షాత్కారం (స్వానుభవంతో సంపాదించు కున్న బ్రహ్మజ్ఞానం.) (ఇతరుల నుంచి తెలుసుకున్న
జ్ఞానం పరోక్ష జ్ఞానం)పొందవలయు నంటే, విషయాసక్తి , ప్రజ్ఞామాన్ద్యము (మాన్ద్యము = జాడ్యము)
విపత్కరమైన బహుదురాగ్రహములు అనే మీ వర్తమాన ప్రతిబంధకములను నివృత్తి చేసుకొనవలయును. ఇతరులకు బోధించుటకు ముందు మీ హృదయములలో భగవంతుని
ప్రతిష్టించుకొనండి.
భగవద్భావమున సహజ ఆనందమనే
మైకమును పొందగలరు. ద్వేషశక్తి కంటే, ప్రేమశక్తి
కోటిరెట్లు ఘనమైనది. దుఃఖము, విచారమునకు మూలబీజము
మీలోనే వున్నది. ఆ బీజమే అజ్ఞానము. దానిని మీ దివ్యత్వము అనే జ్ఞానాగ్నిచే భస్మము చేయండి. మీరు ఏది పొందినా అది యిచ్చివేయడానికి మీకు చెందినది
ఏదీ లేదని గ్రహించండి. సర్వత్ర భగవంతుని ఉనికిని
అనుభవించండి.
దైవాన్ని మీలోను సమస్త జీవులలోను
అనుభవపూర్వకముగా ఎప్పుడు తెలుసుకొనెదరో అప్పుడే బ్రహ్మసాక్షాత్కారము పొందగలరు. బ్రహ్మ సాక్షాత్కారము పొందవలయునంటే మీలో వున్న దైవానికి
సత్యంగా వుండాలి. ధర్మపధమున నడచినచో, దైవ కృపపొందగలరు.
57. 20.09.1993 సాయంత్రము 7 గంటలకు శ్రీసాయి యిచ్చిన
సందేశము.
మీ అహంకారాన్ని సంపూర్ణముగా
వదలుకొని, పరమాత్మ శరణుపొందెదరో అప్పుడు సత్యస్వరూపాన్ని తెలుసుకొని భగవంతుని అంతటా
చూడగలరు. అప్పటివరకు మిమ్ములను వాసనలు బాధపెడుతూనే
ఉంటాయి. సర్వాత్మ భావం అంతా భగవంతుడే అనే దృష్టి,
అనుభవం కలిగినప్పుడు వాసనలు పూర్తిగా నాశనమయిపోవును. వాసనలకు మూలస్థానం అహంకారభావము. విషయవాంఛలు, బంధాలు. ప్రాపంచిక విషయాలపై ఆసక్తి
అహంకారమునకు మూలకారణం. ఆ అహంకారాన్ని నాశనము
చేసుకొనండి.
దైవము సర్వశక్తివంతుడు, సర్వజ్ఞుడు, ప్రేమమయుడు, దయాసముద్రుడు. అటువంటి పరమాత్మను శరణుపొందిన, ఆయన మిమ్ములను ఎన్నడు
విడవడు. దైవమే మార్గదర్శకుడుగా ఉన్నాడని మీరు
ఎల్లప్పుడు భావిస్తుండాలి. దైవము మిమ్ములను
నడుపుచున్నాడని భావించాలి. అహంకారముతో సాధన
చేసినా, ఆధ్యాత్మిక ఉన్నతి పొందలేరు.
శాశ్వతమైన స్థానానికి
చేరవలయునంటే అన్ని ఆలోచనలకు అతీతులు కండి.
మనస్సుపై పరిపూర్ణ సాక్షీభావం కలిగిఉంటే అప్పుడు మనస్సే ఉండదు. మీరే సత్యము అనేటటువంటి జ్ఞానము పొంది పారవశ్యమును
అనుభవిస్తారు.
ఎంతకాలం మీ నిజ సత్యస్వరూపము
తెలుసుకొనలేరో అంతకాలము తక్కువ స్థితిలోనికి జారిపోయెదరు. ఆత్మ స్వాతంత్ర్యము కోసం విరామము లేకుండా పోరాడుతూ
ఉండండి. నిశ్చలమైన పవిత్రమైన శాంతియుత మనస్సే ఆత్మ లేక బ్రహ్మమని గ్రహించండి. ఆత్మానుభవాన్నిపొందే ముందు పరిశుధ్ధ హృదయం కలిగి
ఉండాలి. దీనికి సాధన చాలా అవసరం. ఆత్మానుభవం పొందిన తర్వాతనే ఆలోచనా రహితులుగా వుంటారు.
(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment