19.06.2017 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
బాబావారు ప్రసాదించిన మరికొన్ని సందేశాలు
శ్రీ సాయితత్త్వ సందేశములు
(voice of Sai Baba)
(కొన్ని అనుకోని సంఘటనల వల్ల వారం రోజులుగా ప్రచురించలేకపోయాను. ఈ రోజునుండి యధావిధిగా శ్రీసాయి సందేశాలను ప్రచురిస్తున్నాను.)
శ్రీసాయి తత్త్వసందేశములు
–14 వ.భాగమ్
51. 14.08.1993 శనివారం 9.30 గంటలకు విశాఖపట్నంలో శ్రీ
ఎమ్.వి.హరగోపాల్ గారింట్లో శ్రీసాయిబాబా యిచ్చిన సందేశము.
ఈస్ట్ వాల్తేరులో బాబా
మందిరము నిర్మించినారు. ధుని నిర్మాణములో కొన్ని
వాస్తులోపములు వున్నవి. వాటిని సరిదిద్దమని
కార్యకర్తలకు తెలియచేయి. ఈ మందిర వార్షికోత్సవమునకు
నీవు పాల్గొని సరైన మార్గములో సరిదిద్దుటకు ప్రయత్నించు.
నీవు సాధారణ భక్తి కోటిలో ఒక సామాన్య సాధకునిగా
ప్రవర్తించుచూ నీ అండదండలు యిచ్చట సాయి బృందమునకు అందచేయి.
నా నామస్మరణలో కూడా లలితా
సహస్రనామము అనుష్ఠాన పూర్వకముగా చేయండి. ఈ
నూతన గృహములో సుఖశాంతులు కలుగవలయునంటే నా నామ సంకీర్తన ఆ నూతన గృహములో చేయమని చెప్పుము. ఆ గృహములో బిల్వ వృక్షమును నాటమని చెప్పుము.
నేను సదా చరాచర శక్తిని,
పరాశక్తిని అని గ్రహించండి. నా వలననే ఈ సకల
చరాచర ప్రపంచము సృష్టింపబడినదని గ్రహించండి.
మనస్సు లేనిది మీ దృష్టిని నామీద కేంద్రీకరించిన ప్రయోజనము లేదు. నేను పరాశక్తినని ఆదిశక్తినని తెలుసుకొని నన్ను
నిత్యము ఏకాగ్రతతో ధ్యానించండి.
నా ప్రచారములో మీరందరు
సహకరించిన మీకు సుఖశాంతులు లభించును. నాభక్తులకు
నాతత్త్వము బోధించు.
52. 19.08.1993 రాత్రి 8.15 గంటలకు విశాఖపట్నంలో శ్రీ
ఎమ్.వి.హరగోపాల్ గారి స్వగృహములో నామ సంకీర్తన చేయుచుండగా శ్రీబాబావారు యిచ్చిన సందేశము.
మీ ఆత్మ నిర్మలము కావలయునంటే,
ఫలాపేక్ష వదలి కర్మ యోగము ఈశ్వరార్పణ బుధ్ధితో చేయండి. నిష్కామ కర్మ యోగముచే, దైవ భక్తియు, భక్తిచే, జ్ఞానోదయము,
జ్ఞానముచే ముక్తి కలుగును. అంతే గాక, నిష్కామ
కర్మ యోగముచే పాప నివృత్తియు ఉపాసనచే నిక్షేప నివృత్తియు, బ్రహ్మతత్త్వ విచారణముచే,
ఆవరణ నివృత్తి కలుగును. ఎవరైతే తన ఛాయని విడచి
నడిచే శక్తిని పొందగలరో వారికి కర్మ ప్రధానము కాదు. సంకల్పమే ప్రధానము. అట్లుగాక తన నీడ తనతో వచ్చుచుండిన అట్టివానికి మనస్సు
ప్రధానము కాదు. కర్మయే ప్రధానము. మనస్సు శుధ్ధమని, అశుధ్ధమని రెండు విధములు. ఆ అశుధ్ధమైన
మనస్సు విషయాది కామ సంకల్పములతో కూడి యున్నది.
శుధ్ధమైన మనస్సు కామ సంకల్ప రహితమైనది.
మానవునికి బంధమునకు,
మోక్షమునకు మనస్సే కారణమని గ్రహించండి. విషయాసక్తి గల మనస్సు బంధమునకు, నిర్విషయమైన మనస్సు మోక్షమునకు కారణమని తెలుసుకొనండి. కనుక మీ మనస్సును నిర్విషయ శక్తి పొందునట్లు సాధన
చేయండి. పుణ్యకర్మ గల జీవి పుణ్యకర్మలు చేయును. పాపకర్మ గల జీవియయినచో పాపపర్మలనే చేయును.
సత్వ రజో తమో గుణములు
లేనివాడు కేవలము ఆత్మజ్ఞానము, భగవద్భక్తి, విషయ వైరాగ్యములు కలిగి యుండును. కర్మశుధ్ధి ముందుగా చేసుకొన్న సంకల్పశుధ్ధి యగును. కనుక కర్మ శుధ్ధిని చేసుకొనుటకు పాటుపడండి.
పూర్వజన్మ కర్మానుసారముగా
యీ జన్మలో మీకు అట్టి స్వభావ గుణములే కలుగును.
నిష్కామ కర్మ యోగముచే అంతఃకరణ శుధ్ది కలిగి ఉపాసనచే చిత్తము, ఏకాగ్రత కలిగి,
బ్రహ్మజ్ఞానముచే మోక్షము కలుగును. కర్మశుధ్ధియైనచో
సాధన చతుష్టయ సంపత్తి కలుగును. ఆత్మశుధ్ధి
కావలయునంటే తపస్సు, ధర్మానుష్టానము, భగవద్భక్తి ముఖ్యము.
విచారణ వలనే ఆత్మ స్వరూప సాక్షాత్కార జ్ఞానము కలుగగలదు. మలిన ప్రారంభము కలిగి, తమోగుణ అవస్తలో వున్నచో బ్రహ్మజ్ఞానము
పొందలేరు. పాపకర్మలు మీ హృదయములో సంపూర్ణముగా
నశింపకపోవుటచే, ప్రకృతి గుణములు విషయ వికారములు మీలో ఉద్భవించుచున్నవి. దోషరాహిత్యము కొరకు దోషరహితమైన అనుష్టానము చేయండి.
నామ సంకీర్తన నామ మాత్రము
చేసిన లాభము లేదు. మీ చిత్తమును ఏకాగ్రత చేసుకొని
నాయందు స్థిర బుధ్ధిని నిలిపి నామ సంకీర్తన కొనసాగించండి.
53. 20.08.1993 ఉదయం 6 గంటలకు శ్రీసాయి యిచ్చిన సందేశము.
శుభమైనట్టిగాని, అశుభమైనట్టిగాని,
యిష్టమైన పదార్ధములను చూచినప్పుడు గాని, తినినప్పుడు గాని, వాసన చూచినప్పుడు గాని,
ఎవరైతే సంతోషము గాని, దుఃఖముగాని పొందకుందురో, ఎవరైతే సమస్త ప్రాణులయందును సమబుధ్ధి
కలిగి, సుఖాదులను కోరక, ఇంద్రియములను జయించునో ఎవరైతే హర్ష కోపములను పొందకుందురో, ఐశ్వర్యములయందు,
దేహాదులయందు, ‘నేను – నేను’ అని బుధ్ధియుండదో, ఎవరి బుధ్ధి వికార రహితమై, రాగాది కళంకవర్జితమై
యుండునో, అట్టివాడు శమవంతుడుగా యుండగలిగి, అన్ని జీవరాశులయందు సమత్వ భావము పొందగలిగి
యుండును.
ఎంతవరకు పరమాత్మ పదమును
తెలుసుకోకుండా వుండెదరో, అంతవరకు భోగసాధనలలో చిక్కుకొని, రాగద్వేషాదులచే ఆవరింపబడనివారే
ఈ సంసార చక్రములో తిరుగాడుచుందురు. దృశ్యప్రపంచమయమగు
బుధ్ధిని వదిలి వివేకవంతులై పరబ్రహ్మనును పొందుటకు ప్రయత్నించండి.
(శమవంతుడు - కామక్రోధాదులు లేక యడ(గియుండుట)
54. 25.08.1993 రాత్రి 10 గంటలకు డాక్టరు శ్రీ వెంకటరత్నంగారి
పూజామందిరములో శ్రీసాయి యిచ్చిన సందేశము
మీరు సకలము ఎరుగుదుమని
జ్ఞానులమని, యితరులకంతే అధికులమని, అసాధారణ ప్రజ్ఞానవంతులమని భావన రానివ్వకండి. మీరు ఎంత తెలివిగలవారైనా దైవ భీతి లేకపోయినచో ఏమియును
సాధించలేరు. అసాధారణ ప్రజ్ఞ లభ్దికై ప్రాకులాడవద్దు. ఆత్మోధ్ధారణకు పనికిరాని విద్యలు వ్యర్ధము. బృహత్తర మహిత్ర, పవిత్ర గ్రంధములను చదివినంత మాత్రమున
ప్రయోజనము లేదు. గోప్యములగువాటి గురించి వాదోపవాదములు
చేయరాదు. అవసరమైనవాటిని విడచి హానికరములైన
విషయములందు కల్పించుకొనుట తెలివితక్కువతనము.
స్వానుభవ దూరులైన తార్కికులతో వాదము
ప్రయోజన శూన్యము. మతాచారాడంబరములు లేక, నిస్వార్ధ
సేవ చేయుచు కీర్తి ప్రతిష్టలకై ప్రాకులాడక, త్యాగ బుధ్ధి కలిగి, ఆధిక్యతను ప్రకటించుకొనక,
ప్రపంచ కోరికలను తృణప్రాయముగా చూచుచు ఆధ్యాత్మిక అభ్యున్నతి కొరకై అన్వేషిస్తూ, దైవచింతన
తత్పరులై, బాహ్యవ్యాపారములను త్రోసిపుచ్చి, ఆత్మబలము వృధ్ధిచేసుకొని, పరతత్వము, సత్యవస్తువంటే
ఏమిటో తెలుసుకొని, సకలమును ఏకముగా చూచుచు, అంతర్ముఖులై, నిరాడంబరులై, ఋజుమార్గవర్తనులగుదురో,
అట్టివారు దైవ పరమ రహస్యమును గ్రహించుటయే గాక, జ్ఞానజ్యోతిని కూడా చూడగలరు.
నన్ను నమ్మి నాపాదారవిందములను
ఆశ్రయించినవారికి సకలము నానుండియే యుత్పన్నమయి ప్రశాంతత కల్గి నా దర్శన భాగ్యము లభించును. ప్రేమ, సేవ, విధేయత, యివి మీ జీవితాశయమని భావించి
వాటిని పాటించండి. ఇవియే నాప్రేమామృతమైన సిధ్ధాంతములు. ఇవి సకల మతములలోని సారాంశము.
(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment