23.06.2017 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
బాబావారు ప్రసాదించిన మరికొన్ని సందేశాలు
శ్రీ సాయితత్త్వ సందేశములు
(voice of Sai Baba)
శ్రీసాయి తత్త్వసందేశములు
–18 వ.భాగమ్
65. 16.02.1994
రాత్రి 7.15 గంటలకు డాక్టర్ శ్రీ గుడ్లవల్లేటి వెంకటరత్నంగారి స్వగృహములో వున్న
పూజా మందిరములో సాయిబాబావారు యిచ్చిన సందేశము
ప్రేమ ఎక్కడ వుంటుందో
మనస్సు అక్కడే వుంటుంది. అదే విధముగా దైవముపై
తీవ్రమైన కోరిక వుంటే తప్ప మనస్సు దైవముపై నిలవదు. మీ దృష్టి ఎంత సంకుచిత వలయములో వుంటే అంత దుఃఖాన్ని
పొందుతారు. మనస్సు నిశ్చలమైతే గాని అహంకారము
పోదు. ఆత్మానుభవానికి పెద్ద అడ్డు ‘నేను చేసేవాడని’
అనే అహంభావం. దానిని వదలుకొనండి.
సంపూర్ణమైన నమ్మకముతో
నా నామమును చేసిన మీ మనస్సు పరధ్యానమునుండి విముక్తి అయి, నిశ్చితమై పవిత్రముగాను శాంతముగాను
కాగలదు. అహంకారరహితులై నిజమైన ఆత్మార్పణతో
నానామమును ‘జయజయసాయి శ్రీసాయి’ అని ఉఛ్ఛరించిన, అట్టివారికి తమ మాటలు, చేతలు వాటికి
అవే పవిత్రమగును. నానామములోని అంతరార్ధము తెలిసికొనక
యాంత్రికముగా చేసిన దాని ఫలితము లేదు. ‘జయ జయ సాయి గురు సాయి’ అనగా
‘జ’ లో చంద్ర బీజము యున్నందున
మృత్యుభయము తొలగును.
‘య’ లో వాయు బీజము వలన
భూత, జ్వరములు తొలగును.
‘సా’ లో శారద బీజముచే
వాక్సుధ్ధి కలుగును
‘గు’ లో రుద్ర బీజముచే
అజ్ఞానము నశించును.
‘రు’ లో వున్న అగ్ని
బీజముచే వెలుగు ప్రసాదింపబడును.
‘సాయి’ అనగా ‘సా’ అంటే
సర్వకారణములకు ‘యి’ అనగా సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామని
ఈ భావనతో నానామమును ఏకాగ్రతతో,
మనస్సు నాయందు లయము చేసి స్మరించిన, మీ అనారోగ్యము బాగుపడుటయే గాక, శరీరప్రజ్ఞ, అతీతమైన
శక్తిని పొందగలరు.
‘సంపత్త్ స్మరూపాం జ్యోతిర్మయం,
గీం
జ్ఞానాఖ్య దీప్తిం ఆనందక్రీం
ఐశ్వర్య సంధాయనాం దీపం
లక్ష్మిం
కార్యచ వాచా మనసా నమామి’
ఈ శ్లోకమును చదువుచూ,
నిత్యము నాకు దీపారాధన చేసిన, మీ మనస్సు శాంతి, వర్చస్సు, ఆనంద భోగాలు, ఆయురారోగ్య
ఐశ్వర్యాదులు కలుగును. దీపము జ్ఞానమునకు సంపత్తికి
ప్రతీక, లక్ష్మీ స్వరూపం.
త్రికరణ శుధ్ధిగా యీ జ్యోతి స్వరూపమును ఆరాధించండి.
నా లీలలు, నా బోధలు,
నా సందేశములు, నా అనుభుతులే నా వేదాంతము. నేను
అన్ని మతములకు అతీతుడను. ద్వంద్వ భావములను
వదలుకొని సమత్వ భావము అలవరచుకొనండి. అది లేనిచో
ముందుకు పోజాలరు. సోదర భావము పెంపొందించుకొనండి. ఒకరికంటే ఒకరు అధిక స్థితిలో వున్నామని భావించకండి.
నాకు నైవేద్యము పెట్టుచున్నపుడు గాయత్రి మంత్రము జపించి, కావలసినంత మంచి తీర్ధమును పెట్టండి. లేనిచో ఎట్లు స్వీకరించెదను.
66. 17.02.1994 ఉదయం 7 గంటలకు బందరులో డా.వెంకటరత్నం
గారి పూజా మందిరములో శ్రీసాయి యిచ్చిన సందేశము.
మీరు అనేక జన్మలనుంచి
నిష్కామ పుణ్యకర్మలు చేయుచూ వచ్చుచున్నచో, మీ పుణ్యము పరిపక్వమై ఈ జన్మలో దాని ఫలితము
పొందగలరు. మీరు పవిత్రమగు పుణ్య క్షేత్రములలో
ఎన్నిటిలోనో వెదికిన ఒక్క పరమయోగి సాధుపురుషుని కనుగొనుట మిక్కిలి కష్టము. అటువంటివాడే నిత్య పూజ్యుడు. నిత్యం వేదాధ్యయనము, ధ్యానము జ్ఞానముచే ఆనందాత్మ
స్వరూపము పొందినవాడే నిత్య పూజ్యుడు. ఆనందాత్మ
స్వరూపమైనదగు యేపరబ్రహ్మము కలదో ఆ పరబ్రహ్మమే నేనని తెలిసికొని బ్రహ్మము నందు ఐక్యమైయుండువాడే
నిత్యపూజ్యుడు. బ్రహ్మస్వరూపము కలిగియున్న
యజ్ఞోపవీతములు లేకున్నను అటువంటివాడు కూడా పవిత్రుడే. మీ దేహమునకు ఎటువంటి బాధలు వచ్చినను, దానికి బాధపడక
ఎవరైతే యుండెదరో అట్టివాడు ఆత్మకన్నను వేరైనవాడు కాక, భేదబుధ్ధి లేక యుండును.
ఆత్మజ్ఞానము సంపాదించుటకు
సకల శాస్త్రములు చదవవలయునని భ్రాంతిని విడిచిపెట్టుకొనండి. తత్త్వ వివేకము చేసి ఆత్మయే సత్యమగు పరబ్రహ్మ అని
తెలిసికొని, ఆత్మ సంధానము చేసుకొనండి. తీర్ధయాత్రలు,
పుణ్యనదీ జలములలో స్నానమాచరించినందున ఆత్మానుభవము పొందలేరు.
స్వయంగా మీలోనే ప్రకాశించుచున్న
పరబ్రహ్మ స్వరూపమగు ఆత్మ స్వరూపమును తెలిసికొనలేక, భగవంతుడు ఎచ్చోటనో వున్నాడని తలంచుచున్నారు. మీ శరీరములో నివసించుచున్న పరబ్రహ్మ స్వరూపుడగు
ఆత్మను దర్శించినయెడల ముక్తిని పొందగలరు. ఈ
ఆత్మానుభవము శ్రవణము చేతను, యాగము చేతను, బుధ్ధి చాతుర్యము చేతను, ధ్యానము చేతను, తపస్సు
చేతను పొందజాలరు.
ఇది నాది, అది నాది అనే
మమకారమును వదలి, తత్త్వ వివేకముచే బ్రహ్మమే నేను – నేనే బ్రహ్మమని గ్రహించి, నిర్వికల్ప
సమాధి నిష్ఠయనెడి బ్రహ్మసాక్షాత్కారమును పొందినవాడే ఆత్మ స్వరూపమును తెలుసుకొనగలడు.
69. 15.03.1994 రాత్రి 7 గంటలకు పూజామందిరములో శ్రీసాయి
యిచ్చిన సందేశము.
మీ ఆత్మ నా నామమును జపించుట
సాధనగా చేసుకొంటే మీ మనస్సు సులభంగా ఏకాగ్రత పొందుతుంది. నా నామాన్ని నిరంతర స్మరణ చేయడం వలన, మీ మనస్సు
పవిత్రం అయి, మనోవికారాలు, శరీరపరమైన కోర్కెలు లేకుండా పోయి, అప్పుడు మీలోని భగవంతుడె, మీ ఆత్మ అనే అనుభవాన్ని
పొందుతారు. నామము, ఆత్మ, భగవంతుడు, వేరు కాదు. కాబట్టి నామమును ఉఛ్ఛరించినప్పుడు ఆత్మను గుర్తుచేసుకొనండి. ఆత్మ తనయొక్క పూర్ణవైభవముతోను, దివ్యతతోను, బహిరంగపడవలయునంటే,
మీ మనస్సును ఆత్మలో కలుపుకొని, నామస్మరణ చేసిన, దివ్య ఆనందము, ప్రశాంతిని పొందగలరు. విరామము లేని మనస్సును అదుపులోనికి తెచ్చుకోవలయునంటే
నామస్మరణ ఒక్కటే మార్గము. పరిపూర్ణ నమ్మకముతో
ఆత్మకు చిహ్నంగా యున్న నామాన్ని స్మరిస్తే, క్రమేపి మీ మనస్సుకు పరధ్యానం కలుగచేసే
ఆలోచనలనుండి విముక్తులయ్యెదరు.
(ఇంకా వున్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పనమస్తు)
0 comments:
Post a Comment