01.06.2017 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
బాబావారు ప్రసాదించిన మరికొన్ని
సందేశాలు
శ్రీ సాయితత్త్వ సందేశములు
(vaice of Sai Baba)
శ్రీసాయి తత్త్వ సందేశములు
– 5 వ.భాగమ్
16. 11.04.1992 ఉదయం 4.30 గంటలకు శ్రీ సాయి యిచ్చిన సందేశము
దైవమునకు ఆయన భక్తునికి మధ్యగల ప్రేమబాంధవ్యముతో భక్తి ఉద్భవిస్తుంది. దైవము భక్తుడు
వేరే వ్యక్తులుగా యుండక, ఏకత్వాన్ని అనుభవించండి.
భక్తునిలో ప్రేమ పరిపక్వత కలిగినప్పుడు దైవకృప కలుగును. ప్రేమ పరిపక్వత దైవకృపను ప్రోద్భవించును.
అప్పుడె భగవంతుని కృపాజ్యోతి ప్రజ్వలింపబడి భక్తునివైపు
ఆకర్షింపబడుతుంది. భక్తుడు తనకు దైవమునకు మధ్యగల
అవిఛ్చిన్న బంధ విముక్తి కొరకు ఆవేదనతో ఆతృతపడుతూ వుంటాడు. భక్తుని, దైవమును బంధించే సంకుచిత ప్రేమ స్వభావము
కాదు. అది జ్ఞానప్రకాశమైన ప్రేమతో కూడిన ఆకర్షణ. భగవంతునికి భక్తునికి గల ప్రేమ అనంత ఆనందాన్ని కలుగచేస్తుంది.
కనుక మీరు భక్తి ప్రేమానందాన్ని విస్మరింపజేస్తే
ముక్తిని పొందలేరు. భక్తుడు దైవము కొరకై తీవ్ర
పరితాపముతో బెంగ పెట్టుకొనుచున్న యెడల, దైవం తన భక్తుని కొరకై క్రిందకు దిగివస్తాడు.
అప్పుడే భక్తుని సంసార బంధములన్నింటిని పరమార్ధములుగాను
దైవ చైతన్యముగాను మార్చివేయును.
భక్తి పారవశ్యముచే మానవుడు
దైవ కరుణ పొంది యీ ప్రాపంచిక జీవిత చర్యలయొక్క అర్ధములు, ఆదర్శములను బోధపరచుకొనగలడు. మీరు దైవ కృపకు, కరుణాపూరిత సఖ్యతకు పాటుపడండి. మీ సంసారపు వితండ పెనుగాడ్పులలో చిందరవందర చెందక,
మీజీవిత నావను సరైన త్రోవలో నడుపు మార్గదర్శి ఆ భగవంతుడె అని గ్రహించండి.
17. 26.04.1992 ఉదయం 9.20 గంటలకు ధ్యానములో బాబా యిచ్చిన
సందేశము.
నేను : ఈ గ్రంధ రచనమొనర్చుటలో
సఫలమగునట్లు నన్ను అనుగ్రహించండి బాబా. అనుగ్రహమనే
మీ మూల ధనమును మీ ఖజానాలోనుండి తీసి నాబుధ్ధి అనే సంచిలో నింపి, నాకు జ్ఞానమును లభింపచేయండి దానిని ఆధారము చేసికొని నేను ముందుకు పోసాగెదను. వివేక వచనములనెడి మీ కర్ణభూషణములను భక్తుల కర్ణములకు
సింగారించెదను. మీ వేదాంతతత్త్వములోని గూడార్ధ
భాండాగారమును తెరచి నాఎదుట పెట్టండి. నానేత్రములకు
నా బుధ్ధికి, మీ కృపయనెడి దివ్యాంజనమును పెట్టండి. నాబుధ్ధిని వికసింపచేసి మీ సాహిత్య సంపదను నాకు
స్పష్టముగా కనిపించునట్లు అనుగ్రహించండి. మీ
ప్రభావముచే నాబుధ్ధి అనెడి నదిలో మీ తత్త్వసిధ్ధాంతమును ప్రవహించునట్లు చేయండి. మీ అనుగ్రహమనే చంద్రునిచే స్ఫూర్తి అనెడి వెన్నెలను
నాకు ప్రాప్తింపచేయండి. మీరిచ్చే జ్ఞానముచే
మీ వేదాంతములోని నవరస శాస్త్రోక్తులు పొంగులు పెట్టుచు బయటకు పొరలి ప్రవహించునట్లు,
ఈ గ్రంధముద్వారా చేయండి బాబా యిదే నాకోరిక.
బాబా : ప్రార్ధన అనే నెపముతో నన్ను స్థుతించుట ప్రారంభించినావు. ఈ వ్యర్ధ స్తుతులు కట్టిబెట్టి నేనిచ్చిన కార్యమును
ప్రారంభించు. జ్ఞానమనెడి సుగంధముతో నిండియున్న
ఈ గ్రంధమును వెంటనే ప్రారంభించు.
నేను : బాబా, మీ ఆజ్ఞను
వెంటనే పాటించెదను.
18. 06.05.1992 రాత్రి 7.35 గంటలకు బాబా యిచ్చిన
సందేశము
ఈ గ్రంధ రచనయందు శ్రధ్ధ
చూపక, యితర కార్యములయందు ఆసక్తిని చూపుచున్నావు.
ఇప్పుడు రచించుచున్న “వేదాంత” అధ్యాయములో శంకరాచార్య, రామానుజాచార్య, విచార
మార్గముల ప్రవచనములు, సిధ్ధాంతములు, భాష్యములు, వివరముగా వ్రాసిన చదువరులకు అర్ధముగాక,
ఈ గ్రంధమునే అసహ్యించుకునే పరిస్థితి కలుగవచ్చును. కనుక వారి భాష్యములను క్లుప్తముగా మొదట కొంత వివరించి
తరువాత నా వేదాంతసారమును విపులముగా తెలియచేసి, తుదిలో వారి సిధ్ధాంతములను వివరించు.
నా తత్త్వ ప్రచారము
(Mission) గురించి వ్రాయించినాను. ఇంకా కొన్ని
విషయములు తెలియచేసెదను. వాటిని కూడా ఆ అధ్యాయములో
విపులీకరించు.
ఇప్పుడు నేను చెప్పుచున్న
అధ్యాయము పూర్తయిన తర్వాత ‘పూర్వ మీమాంస’ గురించి చెప్పెదను.
నేను జ్యోతిస్వరూపుడను. నాయందు పూర్తి విశ్వాసముంచినవారికి అమోఘమైన శక్తినిచ్చెదను.
మీ భావనలు యింకొకరిపై
రుద్దుటకు ప్రయత్నించవద్దు. ఎవరి నమ్మకములు
వారివి. పరమాత్మ అంటే పరాశక్తియే.
నాయందు ధృఢవిశ్వాసము
లేకపోయినను, నన్ను పిచ్చి ఫకీరుగా భావించుచున్నను, వారి క్షేమము కోరి మంత్రముకాని,
ఉపదేశము కాని, యిచ్చిన దానిని పాటించకపోయినచో దానినే పఠించవలయునని వత్తిడి చేయుట భావ్యము
కాదు.
మీరు అనుకొనుచున్న సాయి
భక్తునికి, నుదురుమీద ఎముక, ముక్కుకు ముందుభాగములో యున్న ఎముక విరిగినది. ముక్కుకు, మాట్లాడుటకు, సంబంధముగల మార్గమునకు నష్టము
కలిగే పరిస్థితి ఏర్పడవచ్చును. దానికి సరియైన
చికిత్స చేయించవలయును. దవడకు, వెన్నుపూసకు
పోవు మార్గములో ద్రవ పదార్ధములాంటి ‘Fluid’ తో నిండి యున్నందున రక్తప్రసారమునకు అడ్దుతగులును. శిరస్సునకు ముందు భాగములో యున్న నరములకు దెబ్బ తగిలినందున
అవి వాచి వున్నవి. తాత్కాలికముగా తగ్గినను
సరియైన చికిత్స చేయించకపోయిన Concussion of Brain వచ్చే ప్రమాదము కలదు. కనుక జాగురూకత వహించండి.
పై రూపురేఖలను చూచి రోగి
బాగుపడుచున్నాడనే భ్రమలోపడి యున్నారు. అది
సరి కాదు. నేను చెప్పినది నిర్ధారణ చేసుకొనవలయునంటె
నిపుణులైన వైద్యులతో పరీక్ష చేయించండి. ఇది
సత్యమని వారు చెపితే నా నామమును, నామంత్రమును ఉఛ్చారణ చేయండి.
చందనము శరీరమునకే చల్లదనము
యిచ్చును. కాని నా నామ చందనము శరీరమునకే కాక
మనో వ్యాకులతను ఉపశమింపచేయును.
ఈ రోగి యిప్పుడు ఈ స్థితిలో
వున్నాడంటే నీవు శ్రధ్ధతోను, నిష్టతోను, స్వార్ధరహితముగాను, నా నామము చేయుట వలననేనని
గ్రహించండి. భగవంతుడు ఒక్కడె కాని ఈ యుగములో
ప్రత్యక్ష దైవము నేనే. ఇది గమనించండి. మీలోవున్న
అహంకారమును పూర్తిగా నిర్మూలించుకొని నాకు దాసులుకండి. నా పూజకు డాంభికములు, నిష్టలు
మొదలైనవి అవసరము లేదు. శ్రధ్ధ, సబూరి వున్న
సాధించలేనిది ఏదియు లేదు. అపుడే మీరు గమ్యమునకు
చేరగలరు.
(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పనమస్తు)
0 comments:
Post a Comment