31.05.2017 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
బాబావారు ప్రసాదించిన మరికొన్ని సందేశాలు
శ్రీ సాయితత్త్వ సందేశములు
(vaice of Sai Baba)
శ్రీసాయి తత్వ సందేశములు –4 వ.భాగమ్
13. 12.03.1992 ఉదయం 9.50 నిమిషములకు పూజా మందిరములో దీక్షలో నుండగా ధ్యానములో వచ్చిన సందేశము.
మీరు సామాన్య మానవ మాత్రులైనందున, మీ యింద్రియముల ప్రోద్బలముచే మీకోరికలను పోగొట్టుకొనలేకపోవుచున్నారు. మీ కోరికలు చిత్రవిచిత్ర లోభితములు. అంతర్గతముగా యున్న నా దివ్య తేజోరూపమును దర్శించుటకు ఎవరును ప్రయత్నించక బయటకు ప్రాకుచున్న సురాశుర రూపాంతరములను చూచి మోసపోవుచున్నారు.
నా దివ్య తేజోమయ రూప దర్శనము వీక్షించవలయునంటే,
పరమ శాంతిగల పరిశుధ్ధమైన మనస్సు, చిత్తశుధ్ధి, ఏకాగ్రత, ప్రాపంచిక విషయములయందు ఉదాశీనత కలిగి, ఐశ్వర్య సుఖములను శాశ్వతముగాను, అహంకారమును పూర్తిగా విసర్జించి, మీలోయున్న జ్ఞానము ఒక అణువు మాత్రమేనని భావించి, నాకు పూర్తి శరణాగతులైనట్టివారికి, నా దివ్య తేజోస్వరూప దర్శనము యివ్వగలను. దీనికి
దీక్ష, పట్టుదల ముఖ్యము. సకలము నేనే, నేను నీవాడను అనే భావన ఎప్పుడు వచ్చునో అప్పుడే నీ జన్మ సాపల్యమగును.
నీ దీక్షకు సంతసించి నీకు దర్శనమిచ్చెదను. కాని, నా దివ్యతేజోస్వరూపముతో కనిపించిన నీకు మతి చాంచల్యము కలిగి సంసార బంధజ్ఞత, వైరాగ్య భావము కలిగే అవకాశము కలదు. అందువలన అనసూయామాత అత్రి మహర్షులకు దత్తుడైన రోజున భిక్షాటనకు పోవు రూపములో నీకు దర్శనమిచ్చెదను. దానితో తృప్తి చెంది ఏ యితర చిత్రవిచిత్ర కోరికలు కోరవద్దు.
నీతో చేయించవలసిన కార్యములు చాలా కలవు. అవి మహారాధనగా భావించి అశ్రధ్ధ చేయక ఆసక్తి చూపుచూ కొనసాగించు. నా దర్శనభాగ్యము పొంది పూజానంతరము నీ దీక్షను విరమించు.
14. 21.03.1992 ఉదయం 9.10 గంటలకు పూజామందిరములో శ్రీ సాయిబాబా యిచ్చిన సందేశము.
నా వేదాంత ప్రబోధామృత తత్త్వ ప్రచారమే నీ జీవిత లక్ష్యము. అందుకే
ఈ జన్మ ఎత్తుట అయినది. ప్రతి
జీవికి ఎవరికి తగిన కార్యము వారికి అప్పగించి ఈ భూమిపైకి పంపుట జరుగుచున్నది. వారికి
నియమించిన స్వధర్మమును ఆచరించినదానిని బట్టి వారి పునర్జన్మ కూడా యిచ్చటనే నిశ్చయింపబడును.
కర్తృత్వ భావము వదలి నీ విధిని సక్రమముగా నిర్వర్తించిన నీ మనస్సు శుధ్ధమై శమము, ఉపరతి సాధించి, నీవు ఎవరివో ఏమిటో తెలుసుకొనగలవు. నీకు అప్పగించిన కర్తవ్యమును అనాసక్తితో క్రియాకలాపమొనర్చక, నిర్విఘ్నముగా చేసిన నిష్కామ సిధ్ధితో సాధించగలవు.
( శమముః కామక్రోధాదులు లేక అణగి యుండుట.
ఉపరతి ః ఇంద్రియములను విషయదృష్టినుండి మరల్చుట)
నా బోధలలోని వేదాంత అర్ధమును మానవాళి గ్రహించి, చైతన్యవంతులై, వారి మనస్సు నిర్మలమై, చిత్త శుధ్ది కలిగి, ప్రాపంచిక విషయములందు అనాసక్తి చూపుచూ, నారూప దర్శనము కొరకే తపించిపోవుచుందురు. అదే నా తత్త్వ బోధలలోనున్న వేదాంత రహస్యము.
తత్త్వమంటే ఏమిటో ముందుగా తెలుసుకో. తత్త్వమంటే శరీరము, మనస్సు, ఆత్మ ఈ మూడింటి సమత్వముయొక్క ప్రతిపాదనయే తత్త్వము. ‘తత్’ అనగా ‘అది’ త్వం అనగా ‘ఇది’. ఇంద్రియములకు దూరముగానున్నదే ‘అది’. దగ్గరగా నున్నదే ‘ఇది’. దీని భావన తెలుసుకొని నా తత్త్వమంటే ఏమిటో గ్రహించుటకు ప్రయత్నించు.
నావేదాంత వాక్యములన్నియు తత్త్వములోనికి రావు. నీ కర్తవ్యకర్మలను సక్రమముగా సాగించు.
15. 01.04.1992
at 10.10 am at the house of Pujya Rami Reddy Garu. This was given by Him only.
(రామిరెడ్డిగారి గృహంలో ఆయన యిచ్చిన సందేశము)
(ఆంగ్లములో యిచ్చిన సందేశానికి తెలుగు అనువాదమ్)
నీలో ఉన్న చెడు ఆలోచనలని, కోరికలని, అరిషడ్ వర్గాలని, అహంకారాన్ని తొలగించుకొనిననాడు నీ హృదయంలోనే ఉన్న భగవంతుడిని తెలుసుకోగలవు. ఇటువంటి
దుర్గుణాలన్నిటినీ తుడిచిపెట్టడానికే,
తన వేదాంతసారాన్ని, తత్త్వాన్ని ఒక పుస్తక రూపంలో ప్రచురించమని భగవంతుడు నీకొక దారి చూపించాడు. సూర్యకిరణాలు తడిబట్టను పొడిగా చేయటమేకాదు, ఒక భూతద్దముద్వారా ఆ సూర్యకిరణాలను ఒకేచోట కేంద్రీకరింపచేసినప్పుడు భస్మం చేస్తాయి కూడా. అదేవిధంగా భగవంతుని తత్త్వాన్ని అర్ధం చేసుకొన్నవాని పాపాలు భస్మమైపోతాయి.
నువ్వు తలపెట్టిన పుస్తకప్రచురణకు కావలసిన సమాచారాన్నంతా ఆధ్యాత్మిక గ్రంధాలయిన పురాణాలనుండి, ఇతర మత గ్రంధాలనుండి సేకరించు. ఈ కార్యాన్ని నీకు భగవంతుడే అప్పగించినందువల్ల,
నీకన్ని విధాలా సహాయం చేసే బాధ్యత మార్గాన్ని చూపించే బాధ్యత కూడా ఆయనదే. నీలో ఏభావన కలిగినా అది భగవంతుని ఆదేశం ప్రకారం వచ్చినదేనని భావించు. కొన్ని సలహాలు, సూచనలు నీకు ధ్యానంలోను, మరికొన్ని స్వప్నాలలోను నీకు తెలియచేయబడతాయి. పుస్తకాన్ని లోతుగా అధ్యాయనం చేసి, సరిగా అర్ధం చేసుకున్నవానికి భగవంతుని తత్వాన్ని తెలుసుకునే జ్ఞానం లభిస్తుంది. అటువంటి
ప్రయోజనం లభించడమే కాదు, అతని ఆలోచనా విధానాలన్నీ మారిపోతాయి. ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించడమే కాకుండా అతనిలో రాగద్వేషాలు, అసూయ, వితండవాదాలు అన్నీ కూడా తుడిచిపెట్టుకొనిపోతాయి. అంతేకాదు, నీ ఆలోచనలు స్వచ్చంగాను చేసే పనులు అన్నీ కూడా మంచివిగాను ఉంటాయి.
ఈ పవిత్ర గ్రంధం ఒక జ్ఞానజ్యోతి. ఆత్మకు సంకేతం. సర్వమానవాళికి ప్రకాశవంతమయిన వెలుగును ప్రసాదిస్తుంది.
భగవంతుని
చేతిలో నువ్వు ఒక పనిముట్టువనే భావనతోనే ఎల్లప్పుడు ఉండు. నీ గొప్పదనం వల్లనే ఈ పుస్తకం వెలుగులోకి వచ్చిందని భావించకు. ఈ కార్యం జయప్రదంగా పూర్తవడానికి భగవంతుడు నీకు కావలసిన శక్తిని, ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. నేను నిన్ను ఆశీర్వదించి శక్తిని ప్రసాదిస్తున్నాను. పూర్తయేంతవరకు ఈ వ్రాతప్రతిని ఎవ్వరికీ చూపించవద్దు. ఒకవేళ నువ్వు ఎవరినయినా సంప్రదించదలచుకుంటే
నీకు బాగా నమ్మకమున్న ఒకరిద్దరికి మాత్రం ఈ వ్రాత ప్రతిని చూపించి వారితో చర్చించు. వారి సహాయం, సూచనలు తీసుకో. ఈ వ్రాతప్రతి అంతర్జాతీయ భాషలో మాత్రమే ఉండాలి. ఈ పుస్తక రచన ప్రారంభించేముందు ఒక లక్షసార్లు భగవన్నామస్మరణ చేయి. ఆ తరువాత మాత్రమే మొదలుపెట్టు. భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తాడు.
(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment