10.07.2017 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
ఈ రోజు శ్రీసాయి లీల
ద్వైమాసపత్రిక జూలై – ఆగస్టు 2005 వ.సంవత్సరంలో ప్రచురింపబడిన మరొక సాయి లీల..
బాబా
మహాసమాధి చెందిన తరువాత భక్తులకు కలిగిన అనుభవాలను శ్రీ శివనేశన్ స్వామీజీ వారి ప్రేరణతో
శ్రీ రామలింగం స్వామి రచించిన ‘Ambrosia in Shiridi’ అనే పుస్తకంలోనిది.
శ్రీసాయి లీలా విలాసమ్
షిరిడీలో నివసించిన శ్రీరామచంద్ర
అమృతరావు దేశ్ ముఖ్ గారు తమ అనుభవాన్ని ఈ విధంగా వివరిస్తున్నారు.
82. నేను షిరిడీలో నివసిస్తున్నా
గాని, బాబా మందిరానికి వెళ్ళే అలవాటు నాకు లేదు.
1961 వ.సంవత్సరంలో మాపెద్దమ్మాయికి
టైఫాయిడ్ వచ్చింది. ఆమెను ఆస్పత్రిలో (ఇపుడది
సాయినాధ్ ఛాయా గెస్ట్ హౌస్ గా పిలవబడుతూ వుంది) చేర్పించాము. ఆస్పత్రిలో వైద్యం చేయించినా గాని జ్వరం ఏమాత్రం
తగ్గలేదు.
నాభార్య పొద్దున్న, సాయంత్రం
మా అమ్మాయికి బాబా తీర్ధం యిస్తూ వుండేది.
ఆస్పత్రిలో 45 రోజులపాటు వైద్యం చేయించినా పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. టైఫాయిడ్ పూర్తిగా తగ్గలేదు. ఇక విసుగు వచ్చి అమ్మాయిని ఏస్థితిలో ఆస్పత్రిలో
చేర్పించామో అదే స్థితిలో తిరిగి యింటికి తీసుకొని వచ్చేశాము.
బాబా తీర్ధం మీదనే పూర్తి
విశ్వాసంతో నాభార్య రోజుకు రెండుసార్లు ఊదీ కూడా కలిపి తీర్ధాన్ని మా అమ్మాయికి త్రాగిస్తూ
ఉండేది. ఇక మందులేమీ వాడలేదు. మందులతోనే నయం కానిది కేవలం బాబా ఊదీ, తీర్ధంతో
నయమవుతుందా అని నాభార్యతో అన్నాను.
ఆస్పత్రినుంచి తీసుకువచ్చిన
మూడు రోజుల తరువాత మా అమ్మాయికి నయమయి ఆహారం తీసుకోవడం మొదలుపెట్టింది. ఒక్క నెలలోనే పరిపూర్ణంగా ఆరోగ్యం చేకూరింది.
మందులవల్ల నయం కానిది
బాబా ఊదీ తీర్ధం వల్లనే అమ్మాయికి టైఫాయిడ్ తగ్గిందనీ, బాబానే నమ్ముకోమని నాభార్య నన్ను
వత్తిడి చేసింది.
మా అమ్మగారు సాయిబాబా
జీవించి ఉన్నకాలంలో ఆయనని చూసింది. ఆమె ప్రతిరోజు
బాబా ఆరతికి వెళ్ళేవారు. ప్రతిరోజు బాబా ఊదీ,
తీర్ధం తీసుకుంటూ వుండేవారు.
1961 వ.సంవత్సరంలో ఒకరోజు
మా అమ్మగారు తెల్లవారుఝామున 4 గంటలకు కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం బయటకు వెళ్ళారు. ప్రమాదవశాత్తు మాయింటి ప్రక్కనే వున్న బావిలో పడిపోయారు. ఆ విషయం ఎవరూ గమనించలేదు. ఉదయం 5 గంటలకు బావిలోనుంచి నీళ్ళు తోడుకోవడానికి
వచ్చినవాళ్ళు ఆవిడను గమనించి పైకి తీశారు.
బావి 48 అడుగుల లోతు వుంది. ఆవిడ పూర్తిగా
చల్లని నీటిలో తడిసిపోయారు. అంత వృధ్ధాప్యంలో
బాగా చల్లగా వున్న నీటిలో గంటవరకు వుండిపోయింది.
ఆవిడని బయటకు తీసిన తరువాత యిద్దరు డాక్టర్స్ పరీక్షించి ఆవిడ శరీరం చాలా చల్లగా
అయిపోయిందని చెప్పి, బాబా దయవల్లనే ఆవిడ బ్రతికిందని చెప్పారు. 48 అడుగుల ఎత్తునుండి పడినప్పటికీ బాబా దయవల్ల ఆవిడ
శరీరం మీద ఎటువంటి దెబ్బలు గాయాలు తగలలేదు.
అంత పెద్దవయసులో ఉన్న ఆవిడకు అసలేమీ దెబ్బలు తగలకుండా అంత విపరీతమయిన చల్లని
నీటిలో కూడా గంటసేపు వున్నా గాని ఆవిడ బ్రతికిందంటే శ్రీసాయిబాబా చూపించిన అధ్భుతమయిన లీల
తప్ప మరేమీ కాదని డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయారు.
వృధ్ధురాలయిన మా అమ్మగారిని
బాబా మాత్రమే కాపాడారని నాకు తెలిసొచ్చింది.
నాకు బాబా మీద పుర్తి నమ్మకం కలిగి ఆయనను పూజించడం మొదలుపెట్టాను.
ప్రతిరోజూ సాయంత్రం మరాఠీ
భాషలో ఉన్న బాబా సత్ చరిత్ర పారాయణ మొదలుపెట్టాను.
ఎప్పుడయితే నేను పారాయణ
చేయడం మొదలుపెట్టడం ప్రారంభించానో సరిగా అదే సమయంలో ఒక పెద్ద కప్ప నా పారాయణ పూర్తయేంతవరకు
నాప్రక్కనే వచ్చి కూర్చునేది. ఈవిధంగా మొత్తం
సత్ చరిత్ర పారాయణ పూర్తి అయేంతవరకు జరిగింది.
సత్ చరిత్ర పారాయణ పూర్తయిన ఆ తరువాతి రోజునుంచి ఆ కప్ప మరలా రాలేదు. ఈ దృశ్యాన్ని మాకుటుంబ సభ్యులే కాక మాయింటికి వచ్చినవారందరూ
చూశారు.
నేను చేసే పారాయణ వింటూ
నాలో ఆయనపై నమ్మకాన్ని పెంపొందించడానికే బాబా ఆ రూపంలో వచ్చారని మేమంతా ప్రగాఢంగా విశ్వసించాము.
ఆతరువాత మా పెద్దమ్మాయికి
వివాహం చేయడానికి పెద్ద సమస్య ఎదురయింది. నా
స్థితి ఎలా వున్నప్పటికి ఎలాగయినా సరే 1974 వ. సంవత్సరంలో మా పెద్దమ్మాయికి వివాహం
జరిపి తీరాల్సిందేనని నిశ్చయించుకొన్నాను.
ఆ సమయంలో నా ఆరోగ్యం పాడయింది. వివాహం
జరిపించడానికి కూడా తగిన ఆర్ధిక స్థోమత లేదు.
హృదయపూర్వకంగా బాబాని ప్రార్ధించాను. – “బాబా, మొదట్లో నాకు నీమీద నమ్మకం లేకపోయినా
గాని నాకుటుంబానికి వచ్చిన కష్టాలను నివారించావు.
నేను ఇపుడు నిన్ను మనఃపూర్వకంగా వేదుకొంటున్నాను. మాపెద్దమ్మాయి వివాహాన్ని జరిపించు. నా అనారోగ్యాన్ని నివారించి ఆరోగ్యవంతుడిని చేయి” బాబా నాప్రార్ధన విన్నారు.
1975 జనవరిలో ఒకరోజు
ఉదయం మా అన్నయ్య పెళ్ళిమాటలు
మాట్లాడుకోవటానికి పెళ్ళికుమారుని తల్లిదండ్రులను వెంటబెట్టుకుని మా యింటికి వచ్చాడు. 18.05.1975 న వివాహానికి ముహూర్తం నిర్ణయించాము. ఎక్కువ ఆర్భాటాలు లేకుండా మాకు తగినంతలో బాబావారి పెండ్లి మండపంలో అతి సాధారణంగా వివాహం జరిపించాము. మేము 500 మంది అతిధులకు భోజనాలను ఏర్పాటు చేశాము. మా అంచనాకు మించి 800 మంది వచ్చారు. వచ్చినవారందరికీ భోజనాలు పెట్టలేకపోతే మాకుటుంబగౌరవం
మంట కలిసిపోతుంది. ఈ సమస్యని అధిగమించడానికి
మాకు ఎటువంటి దారి కనిపించలేదు. ఏమి చేయాలో
తెలియని పరిస్థితిలో పడిపోయాము.
బాబా మీద అచంచలమయిన పూర్తి
విశ్వాసంతో వెంటనే బాబాగారి ద్వారకామాయికి పెరుగెత్తాను. మా కుటుంబగౌరవాన్ని నిలబెట్టమని హృదయపూర్వకంగా కన్నీళ్ళతో
ప్రార్ధించాను. ఊదీ తీసుకుని పెండ్లి మండపానికి తిరిగి వచ్చాను.
వండిన పదార్ధాలతో నిండివున్న
పాత్రలన్నిటిలోను ఊదీ వేసి వచ్చిన అతిధులందరికీ వడ్డన ప్రారంభించాము.
ఆశ్చర్యం 800 మందికి
వడ్డన చేయగా 200 మందికి సరిపడా భోజనపదార్ధాలు యింకా మిగిలి వున్నాయి.
సర్వాంతర్యామి అయిన బాబా
తన లీలావిలాసంతో మాయింటి గౌరవాన్ని నిలబెట్టారు.
83. కారు ప్రమాదంలో మాటపడిపోయిన
చిన్న పిల్లకు మాట వచ్చుట.
బొంబాయి అంధేరీలో వున్న
ఒక సాయిభక్తుని చిన్నపాప మీదకు కారు దూసుకుని వచ్చింది. ఆమె బ్రతికింది. కాని గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చేర్పించిన తరువాత కోలుకోవడానికి 15
రోజులు పట్టింది. ఆస్పత్రిలో చేసిన వైద్యం
వల్ల కోలుకొన్నాగాని ప్రమాదం జరిగినపుడు పడిపోయిన మాట తిరిగి రాలేదు. ఎన్ని మందులు వాడినా ఎంత చేసినా మాట్లాడలేకపోయేది.
ఆఖరికి బాబా ఊదీనే మందుగా
నోటిలో వేశారు. ఊదీని మొట్టమొదటి మోతాదుగా
వెయ్యగానే పాప మాట్లాడటం ప్రారంభించింది.
ఊదీ యొక్క అమోఘమయిన శక్తికి
అందరూ ఆశ్చర్యపోయారు.
జ్యోతి రంజన్
పైన చెప్పిన లీలా విలాసంలో శ్రీ అమృతరావు దేశ్ ముఖ్ గారు శ్రీ సాయి సత్ చరిత్ర పారాయణ మొదలు పెట్టినప్పుడు బాబా కప్ప రూపంలో రావడమ్ చదివిన తరువాత నాకు శ్రీసాయిబానిస గారి అనుభవాలలో ఒకటి గుర్తుకు వచ్చింది. మీరు దానిని ఇంతకు ముందు చదివే వుంటారు. ఆయన అనుభవాలు ప్రచురించిన పుస్తకం శ్రీసాయి పుష్పగిరి లో 13 వ.అనుభవం.
1991 వ.సంవత్సరంలో ఆయన దీపావళి పండుగ రోజున తన యింటి మొదటి అంతస్థులో దంపతులిద్దరూ లక్ష్మీదేవి పూజ చేసుకుంటూ వుండగా ఒక బోదురు కప్ప ఆయన కాళ్ళవద్దకు వచ్చింది. ఆరోజు వర్షం కూడా పడలేదు. బాబా ఒక స్నేహితుని రూపంలో గాని, బంధువు రూపంలో గాని వచ్చి తమను ఆశీర్వదిస్తారని ఊహించుకున్నారు. కాని బాబా ఒక కప్ప రూపంలో వచ్చారు.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment