03.09.2017 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సురేష్ గారు బాలకృష్ణ వామన్ వైద్య గురించి పంపించారు. ఈ రోజు దానిని ప్రచురిస్తున్నాను. షిరిడీ ప్రయాణానికి ముందు ఆ తరువాత వైద్య గారిమీద బాబా తమ అనుగ్రహం ఏవిధంగా చూపించారో మనకి అవగతమవుతుంది.
సాయిభక్తులు - బాలకృష్ణ వామన్ వైద్య
బాలకృష్ణ వామన్ వైద్య, బాంద్రాలో నివాసముండేవారు. అతను రైల్వే శాఖలో పనిచేశాడు. అతను 1910లో తన కుటుంబంతో కలిసి మొదటసారి షిర్డీని సందర్శించాడు. షిర్డీ రావడానికి ముందే బాబా అతనిమీద తన ప్రేమను, దయను కురిపించారు.
షిరిడీ ప్రయాణానికి ముందుగానే సెలవు కోసం, మరియు
ప్రయాణానికి పాసుల కోసం ఆఫీసులో దరఖాస్తు చేసుకున్నారు. కానీ కొన్ని పనులు చాలా త్వరగా చేయవలసిన అవసరం ఉంది, అందువల్ల సెలవు మంజూరు చేస్తారో లేదో అని సందేహిస్తూ ఉన్నాడు.
తను తప్పకుండా ఆఫీసులో ఉండవలిసిన అవసరం ఉంది అని తెలుసు. కాని ఏదేమైనా, అతను తన సెలవు దరఖాస్తు పంపించాడు. అయితే పాసులతోపాటు సెలవు కూడా మంజూరు అయింది. అందుకు అతను ఆశ్చర్యపడ్డాడు. తరువాత అతనికి తెలిసింది ఏమిటంటే సెలవు మంజూరు చేసిన అధికారి ఒక సాయి భక్తుడు. ప్రయాణంలో కూడా వారికి బాబా అనుగ్రహం తోడుగా ఉంది.
వారు కోపర్ గావ్ చేరుకునేటప్పటికి చీకటి పడింది. వారు షిర్డీ వెళ్ళడానికి ఒక టాంగాను మాట్లాడుకున్నారు. కాని చీకటి పడిన తరువాత షిర్డీకి టాంగా నడపడానికి టాంగాఅతను ఒప్పుకోలేదు. దానికి కారణం దారంతా నిర్మానుష్యంగా ఉండి దోపిడీ దొంగలవల్ల ఎల్లప్పుడూ ప్రయాణికులకు ముప్పు పొంచి ఉంటుంది. అయితే, వైద్యకు బాబా మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. బాబా మనలని ఎప్పుడూ కాపాడుతూ ఉంటారు అందువల్ల మనకి ఎటువంటి ముప్పు రాదని టాంగా నడిపేవానికి అతను హామీ ఇచ్చాడు. అప్పుడు మరికొందరు ప్రయాణికులు కూడా మాతోపాటుగా షిర్డీ వస్తామని అన్నారు. అలా అతనికి తోడూ దొరికింది. మార్గంలో, షిర్డీ నుండి కొన్ని టాంగాలు మరియు ఎడ్ల బండ్లు వస్తూ కనిపించాయి. అందువల్ల ముందుకు వెళ్ళడానికి దారి సురక్షితంగా ఉందని మాకు అర్ధం అయ్యింది.
వారు సురక్షితంగా షిరిడీ చేరుకుని సాఠె వాడలో ఒక గది తీసుకున్నారు. మరుసటి రోజు సంకష్ట చతుర్థి కావడం వలన ఉపవాసము ఉండాలని, అందుచేత ఈ రోజే కొంచం ఆహారం తీసుకోమని తన కుటుంబ సభ్యులను బలవంతపెట్టి రాత్రి ఒంటి గంట సమయంలో అందరినీ తినమని చెప్పాడు. తరువాత వారు ఆ రాత్రి నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం బాబా అక్కడ వున్న భక్తులతో "రాత్రి
నా బిడ్డలు వచ్చారు. వారిని ఎవరు పట్టించుకోలేదు, వారికి తినడానికి కూడా ఆహారామేమి ఇవ్వలేదు. అందుచే వారు అర్ధ ఆకలితో నిద్రపోయారు" అని కోపంగా అరిచి వారిని మశీదు నుండి బయటకు తరిమేసారు. (ఉపవాసముండే రోజు భోజనం చేయకుండా ఫలహారం మాత్రమే తీసుకున్నా
ఉపవాసమున్నట్లే లెక్క) బాబా కోపాన్ని చూసిన ఆ భక్తులు వైద్యని కలిసి జరిగినదంతా చెప్పి, మీ కుటుంబానికి ఆదరణ లభించిందని, తేలికపాటి భోజనం కూడా చేసి విశ్రాంతి తీసుకున్నామని, బాబాతో వచ్చి చెప్పమని ప్రాధేయపడ్డారు. ఈ మాటల వలన బాబాకు వారి కుటుంబం పై బాబాకు ఉన్న శ్రద్ధ వైద్యకు తెలిసింది. తరువాత బాబా దర్శనానికి వెళ్ళి వైద్య, బాబా ముందు సాష్టాంగ పడి, స్థానిక భక్తులు చెప్పమన్నట్లుగా, మా కుటుంబాన్ని బాగా చూసుకున్నారని బాబాతో చెప్పారు. అప్పుడు బాబా వారిని ఆశీర్వదిస్తూ,
"అల్లా భలా కరేగా" (అల్లాహ్
మేలు చేస్తాడు) అన్నారు. వైద్య భార్య నుండి బాబా భిక్ష తీసుకున్నారు:
తరువాత ఆ రోజు బాబా భిక్ష కోసం వెళ్ళినప్పుడు ఆయన వాడ వద్దకు వచ్చి వైద్య ఉంటున్న గది ముందు నిలబడి భిక్ష
అడిగారు. అతని భార్య వెంటనే గది లోపలకి వెళ్లి సంతోషంగా బాబాకి జొన్న రొట్టె మరియు కూర సమర్పించింది. ఇది బాబా యొక్క సాధారణ భిక్ష మార్గం కాదు, ఇది అసాధారణమైనది. ఈ విధంగా మళ్ళీ ఈ భక్తుడుపై బాబా తమకున్న ప్రేమను తెలియజేసారు.
మరుసటి రోజు వైద్య భార్య బాబా కోసం ఆహారం సిద్ధం చేసింది, కానీ ఏదో కారణంగా ఆలస్యం అయింది. మిగిలిన భక్తులు అప్పటికే తాము తెచ్చిన నైవేద్యాలను మసీదుకు తీసుకుని వెళ్లి బాబా ముందుంచారు. తాము తెచ్చిన నైవేద్యాలను బాబా స్వీకరిస్తారని ప్రతి ఒక్కరూ వేచి చూస్తూ ఉన్నారు. కాని
బాబా మేము తెచ్చే నైవేద్యం కొరకు ఎదురుచూస్తూ భక్తులను వేచి ఉండమన్నారు.. కానీ బాబా వారిని ప్రశాంతంగా ఉండమని కోరారు. వైద్య భార్య నైవేద్యం తీసుకొని వెళ్లి సమర్పించుకున్నప్పుడు, బాబా తమ భక్తులతో ఆ పళ్ళెం తమ దగ్గర ఉంచమని అడిగారు. అప్పుడు ఆయన ఆహారంలో కొంచెం స్వీకరించి, మిగిలినది ప్రసాదంగా తమ దీవెనలతో పాటు తిరిగి ఇచ్చారు.
బాబా పవిత్రపరిచిన పోటో:
షిర్డీకి తన యాత్ర సందర్భంగా, బాబా యొక్క ఛాయాచిత్రాన్ని బాబా తన చేతులతో స్వయంగా పవిత్రం చేసిన తరువాత ఆయన ఆశీస్సులతో తీసుకోవాలని వైద్య అనుకున్నాడు. అతను శ్యామాను చూసిన వెంటనే తన కోరిక గురించి చెప్పాడు. ప్రక్కనే ఉన్న బాబా అతని కోరిక విన్న వెంటనే "ఎందుకు ఆలస్యం? వెళ్ళి ఫోటోను తెచ్చుకో" అని చెప్పారు. అతను వెంటనే వెళ్లి ఫోటోను తెచ్చి ఆయన చేతికి ఇచ్చారు. ఆయన కొన్ని క్షణాలు ఆ ఫోటోను పట్టుకొని, తర్వాత అతనికి అందిస్తూ "దీనిని మీతో ఇంటికి తీసుకెళ్ళి పూజించుకోండి" అన్నారు.
ఆ ఛాయాచిత్రం ఇప్పటికి వారి ఇంట్లోనే ఉంది.
వైద్య ముంబాయికి తిరుగు ప్రయాణంలో నాశిక్ సందర్శించాలని అనుకున్నాడు. అతను కుటుంబ సభ్యులతో కలిసి తిరుగు ప్రయాణానికి బాబా అనుమతి కోసం మశీదుకు వెళ్లారు. అప్పుడు బాబా అతనికి అనుమతి ఇస్తూ "వెళ్ళండి,
కానీ నాశిక్ ఎందుకు వెళ్ళాలి? నాసిక్ లో ప్లేగు ఉన్నందువల్ల మీరు మీ పిల్లలతో వచ్చిన దారిన ఇంటికి తిరిగి వెళ్ళండి" అన్నారు. అతనిపై, అతని కుటుంబం పై బాబా యొక్క ప్రేమ మరియు కరుణకు అతడి హృదయం కరిగిపోయి కన్నీళ్ళు పెట్టకుండా ఉండలేకపోయాడు. వారు టాంగాలో కోపరగావ్ రైల్వే స్టేషన్ కు చేరుకునేసరికి, వాళ్ళు ఎక్కవలసిన రైలు అప్పుడే వెళ్ళిపోయింది. వారు నిరాశపడి ఆ రాత్రి స్టేషన్ లో గడపవలసి వచ్చింది. అయితే మరుసటి ఉదయం వారు తర్వాత రైలులో ప్రయాణించి మన్మాడ్ సురక్షితంగా చేరుకున్నారు. అక్కడ వారు తప్పిపోయిన రైలు ఒక భయంకరమైన ప్రమాదానికి గురై వారు ఎక్కవలసి ఉన్న బోగీ పూర్తిగా నుజ్జు నుజ్జు అయిందని తెలిసింది. ఈ సంఘటన ద్వారా బాబాకు తమ ప్రియమైన వారిపై ఉండే ప్రేమ ఎంతటిదో మరోసారి అతనికి తెలిసింది.
వైద్య షిర్డిలో ఉన్నప్పుడు ఒక విచిత్ర సంఘటన జరిగింది. బాబా భక్తుడు ఒకతను వైద్య వద్దకు వచ్చి “నాకు కొంత డబ్బివ్వండి, మీకు చందనం ఇస్తాను” అన్నాడు. అలా అడగడం వలన అతనికి కోపం వచ్చి ఇవ్వనన్నాడు. అతను తిరిగి వెళుతుండగా ఎందుకో వైద్య మనస్సు మార్చుకొని వెనక్కి పిలిచి “నీకు కొన్ని నాణాలు ఇస్తాను, చందనం ఇవ్వు!” అన్నాడు. కానీ అతడు నిరాకరించి బాబా నుండి తనకలాంటి ఆదేశాలు లేవన్నాడు. వెంటనే వైద్య బాబా దగ్గరకెళ్ళి జరిగినదంతా చెప్పాడు. బాబా విని “సరే!” అన్నారు.
వైద్య 1912 మరియు 1916 లలో షిర్డిని మళ్ళీ సందర్శించాడు. ప్రతి సందర్శనలో అతను బాబా యొక్క ప్రేమ మరియు కరుణను అపారంగా అనుభవించాడు.
వైద్య 1912లో రెండవసారి షిర్డీ కుటుంబ సభ్యులతో కాకుండా తన ఆఫీస్ లోని ఇద్దరు స్నేహితులతో కలిసి వెళ్లారు. ఆ సమయంలో అతనికి కలిగిన దురదృష్టకరమైన సంఘటనలు మరియు ఇతర బాధలు బాబాతో విన్నవించుకోవాలని
అనుకున్నాడు. కాని అతను చెప్పదలచినదంతా బాబా ముందే గ్రహించినట్లు అతనిని చూసిన వెంటనే “నిశ్చింతగా ఉండు, భయపడకు!” అని అన్నారు. “బాబా మీ కృప, అండదండలు ఉన్నంతవరకు నేను దేనికి భయపడనని” వైద్య బదులు చెప్పాడు. తరువాత “బాబా మేము ఆఫీసుకి ఒక్కరోజు మాత్రమే సెలవు పెట్టి వచ్చాము. అందువల్ల తిరిగి వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి” అని బాబాను ప్రార్ధించాడు. కాని బాబా అతనికి అనుమతినివ్వలేదు. బాబా తనకు ఏ ఆపదా రాకుండా చూసుకుంటారు అందువలన నేను షిర్దిలోనే ఉంటానని తన స్నేహితులకు చెప్పాడు. అనుమతి లేకుండా ఆఫీసుకు హాజరుకాకపోతే ఉద్యోగం ఊడుతుందని అతని స్నేహితులు భయపడ్డారు. కాని వైద్య షిర్దిలోనే ఉండటం వలన, వారు కూడా బాబా మీద భారం వేసి షిర్డిలో ఉండిపోయారు. బాబా రెండు మూడు రోజులు షిర్దిలోనే వారిని ఉంచి తరువాత వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. బాబా దయవల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగలేదు.
1916లో అతను తన నివాసాన్ని బాంద్రాకు మార్చాడు. ఒకరోజు ఒక సన్యాసి అతని ఇంటికి వచ్చి ఒక పైసా అడిగాడు. అతని కుమారుడు ఇంటి ఆవరణలో ఉన్నాడు. ఆ పిల్లవాడు ఆ సన్యాసిని సాయిబాబాగా భావించి ఇంటి లోపలకి వెళ్లి పైసా తెచ్చి ఆ సాధువుకు ఇచ్చాడు. అప్పుడు వైద్య బయటకి వచ్చి ఆ సన్యాసికి నమస్కారం చేశాడు. సన్యాసి బాబావలె అసాధారణమైన పోలిక కలిగి ఉన్నందున ఆయనను తన ఇంటిలోనికి రమ్మని ఆహ్వానించాడు.
అయన లోపలికి వెళ్లి కొన్ని వండని ధాన్యాలు, తృణధాన్యాలు మరియు పప్పులు అడిగారు. వైద్య ప్రేమతో, భక్తితో ఆయనకి శీదా ఇచ్చారు. ధర్మాలను స్వీకరించిన తరువాత ఆయన "నీవు ఇప్పుడు సంతృప్తి చెందావా? నేను నీతో ఇక్కడే ఉన్నాను, ఇకపై మీరు షిర్డీకి రానవసరంలేదు"
అన్నారు. వైద్య మళ్ళీ ఎప్పుడు షిర్డిని సందర్శించలేదు.
జీవితంలో ఎన్నో ఇబ్బందులు మరియు సమస్యలు, కష్టాలు ఉంటాయి. కానీ సహాయం చేయడానికి, కాపాడటానికి ఎల్లప్పుడూ బాబా ఉన్నారనే నమ్మకంతో ఎన్ని కష్టాలు ఎదురయినా వైద్య వాటినన్నిటినీ చాలా ధైర్యంగా ఎదుర్కొన్నారు.
(Source: Life of Sai Baba, Volume 3 by
Sri.B.V.Narasimha Swamiji)
http://www.saiamrithadhara.com/mahabhakthas/balakrishna-waman_vaidya.html
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment