12.09.2017 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
ఈ రోజు మరొక అత్యధ్బుతమైన
సాయిబాబా చేసిన మహోపకారాన్ని గురించి తెలుసుకుందాము. సమాధి మందరం వద్ద కోరుకున్న వెంటనే వరాన్ని ప్రసాదించిన
ఈ అధ్బుతమైన లీల మనందరికోసం.
సాయిలీల మాసపత్రిక సెప్టెంబరు, 1980 సంచికనుండి గ్రహింపబడినది.
సమాధి మందిరం వద్ద బాబా
ప్రసాదించిన వరం
మేము మొట్టమొదటిసారిగా
1960 వ.సంవత్సరంలో షిరిడీ వెళ్ళాము. ప్రప్రధమంగా
షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకున్న పదహారు సంవత్సరాల తరువాత మరలా జూన్ 1976వ.సంవత్సరంలో
బాబా మరలా మమ్మల్ని షిరిడీకి రప్పించుకున్నారు.
ఆయన పిలిస్తే వెళ్ళకపోవడం అనేది మన చేతుల్లో లేదు.
ప్రభుత్వ రంగ సంస్థలో
నేను సీనియర్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను.
1976వ.సంవత్సరం జూన్ మూడవ వారంలో మా మానేజింగ్ డైరెక్టర్ నన్ను తన కాబిన్ లోకి
రమ్మన్నారు. ఆయన నన్ను కూర్చోమని చెప్పి “మంత్రిగారి
ఆదేశానుసారం ఒక వ్యక్తి నీ పై అధికారిగా వస్తున్నాడు. నువ్వు అతని క్రింద పనిచేయాలి” అన్నారు. ఇపుడు ప్రస్తుతం నేను పనిచేస్తున్న శాఖని దాని బాల్యావస్థనుండి
పెంచి పోషించి ఎంతో అభివృధ్దిలోకి తీసుకుని వచ్చాను. ఇపుడు నన్ను ఒక క్రొత్త వ్యక్తి బయటినుంచి వచ్చి
నామీద అధికారం చెలాయించడం, అతని క్రింద నేను పనిచేయవలసి రావడంలో అర్ధంలేదు. నాకున్న అనుభవంలో తక్కువ అనుభవం ఉన్న వ్యక్తి క్రింద నేను
పనిచేయవలసిరావడం నా అహంమీద దెబ్బ కొట్టినట్లయింది.
(అలాగని ఆ వచ్చే వ్యక్తి మీద వ్యక్తిగతంగా ఎటువంటి ద్వేషబావం నాలో లేదు). రాబోయే క్రొత్త వాతావరణాన్ని తలుచుకుంటే నామనసులో
చాలా వ్యధ కలిగింది. నేను రాజీనామా చేస్తే
ఎలా ఉంటుంది అని ఆలోచించాను. రిటైర్ మెంట్
కి దగ్గరగా ఉన్న వయసులో ముందుగానే రాజీనామా చేసి, ఇంత మంచి ఉద్యోగాన్ని ఎవరయినా చేజేతులారా పోగొట్టుకుంటారా? ఇంక నేను ఒప్పుకోక తప్పని పరిస్థితి. పదిరోజుల తరువాత అంటే జూలై ఒకటవ తేదీనుంచి నేను,
కొత్తగా చేరే ఆఫీసరు క్రింద పనిచేస్తూ ఆయన చెప్పినట్లు నడచుకోవాలి. నాకన్నా వయసులో చిన్నవాడయిన ఒక జూనియర్ ఆఫీసరు క్రింద
పనిచేయాల్సి వచ్చే పరిస్థితి వచ్చినందుకు నేనెంతో కుమిలిపోయాను.
కష్టాలు ఎదురయినప్పుడెల్లా
నేను బాబాని ప్రార్ధించుకుంటూ ఉంటాను. ఇపుడు
ఈ విపత్కర పరిస్థితిలో పూజా గదిలోకి వెళ్ళి బాబాను శరణు వేడుకొన్నాను. ఈ పరిస్థితినుంచి గట్టెక్కించమని, నాకొక దారి చూపించమని
బాబాను వేడుకొన్నాను.
జూన్ 20 లేక 21 తారీకున
మాకుటుంబ సభ్యులందరితో కూర్చుని నాకు వచ్చిన సమస్య గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. వారాంతంలో రెండురోజుల శెలవులలో బొంబాయినుండి ఎక్కడికయినా
వెడదాము కాస్త మనశ్శాంతిగా ఉంటుందని నాభార్య, కుమారుడు అన్నారు. నా స్నేహితుడు కూడా తన యింటికి రమ్మని ఆహ్వానించాడు. నాసిక్ నుండి షిర్డీ పెద్ద దూరం కాదు. మాకు కూడా షిరిడీ వెళ్ళాలని ఎంతో కోరికగా ఉంది. షిరిడీలో మానవరూపంలో అవతరించిన శివస్వరూపమయిన బాబా
దర్శనానికి బయలుదేరాము. ఆయన సమాధి మమ్మల్ని
షిరిడీకి రమ్మనమని ప్రేరేపించింది.
మేము యింతకు ముందు షిరిడీ
వెళ్ళినప్పటికన్నా ఇపుడు షిరిడీలో చాలా మార్పులు కనిపించాయి. భక్తుల నివాసాలకి కొత్త కొత్త భవనాలు, సిమెంటుతో చేసిన ఆవరణలు, పరిశుభ్రమయిన
వాతావరణంలో పూలమొక్కలు, చెట్లతో ఎంతో మార్పు కనపడుతూ ఉంది. సమాధి మందిరం, చావడి, యింకా బాబాకు సంబంధించిన ప్రదేశాలన్నీ
పూర్వపు వైభవంతోనే కళకలాలాడుతూ ఉన్నాయి.
మేమందరం పూజ, అభిషేకం,
సత్యనారాయణ వ్రతం అన్నీ ఎంతో భక్తిశ్రధ్ధలతో చేసుకున్నాము. కాని బాబా సమాధి ప్రక్కనే నేనొక్కడినే కూర్చోవాలనే
తీవ్రమయిన కాంక్ష నాలో కలిగింది. ఆయన సమాధి
ప్రక్కనే కూర్చుని బాబాతో నాలో చెలరేగుతున్న బాధనంతా నివేదించుకున్నాను.
నాకు ప్రమోషన్ యిప్పించి గాని,
లేకపోతే బదిలీ చేయించి గాని ఆఫీసులో నేను ఎదుర్కొనబోయే అవమానకర పరిస్థితులనుండి తప్పించమని
ప్రార్ధించాను. దానికి కారణం నా అహంమీద దెబ్బ తగలడం వల్లనే అని చెప్పక తప్పదు. ఈవిధంగా నాజీవితంలో ఎప్పుడూ
ప్రార్ధించలేదు. కాని నేను
సామాన్యమయిన భక్తుడిని మాత్రమే. నిష్కామ భక్తి
గురించి నేను చదివి ఉండవచ్చు, మాట్లాడి ఉండవచ్చు కాని ఇపుడు నేను కోరే కోరికను బట్టి
చూస్తే అందులో నాస్వార్ధం ఉంది. నా ప్రాపంచిక జీవితంలో నాకు సహాయం చేయమని బాబాని అర్ధిస్తూ
ఉన్నాను.
“నేను సమాధి చెందినప్పటికి
నా సమాధిలోనుంచి నా ఎముకలు మాట్లాడును. అవి
మీకు ధైర్యమును విశ్వాసమును కలిగించును. మనఃపూర్వకముగా
నన్ను శరణు జొచ్చినవారితో నా సమాధి మాట్లాడును” అని బాబా మనకి అభయప్రదానం చేయలేదా?
(శ్రీ సాయి సత్ చరిత్ర 25 అ.)
ఇపుడు జరిగిన అధ్బుతం
చదవండి.
షిరిడీనుంచి బొంబాయికి
తిరిగివచ్చాక ఆఫీసుకు వెళ్ళాను. ఆఫీసుకు చేరుకున్న
వెంటనే మా చైర్మన్ గారు ఇంటర్ కమ్ లో నాతో మాట్లాడి వెంటనే వచ్చి తనను కలవమని చెప్పారు. బహుశ నేనేదో తప్పుచేసి ఉంటాను అందుకనే వెంటనే రమ్మన్నారేమో, ఎటువంటి ప్రమాదం ముంచుకుని వస్తోందో ఏమోనని భయపడుతూ వెళ్ళాను. ఆయన నన్ను చూడగానే “ఈరోజే నువ్వు ఢిల్లీ వెళ్ళాలి. వెంటనే ఫ్లైట్ టిక్కెట్ కొనుక్కుని బయలుదేరు” అన్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. “నిన్ను వెంటనే ఢిల్లీ ఆఫీసుకు ప్రమోషన్ మీద ట్రాన్స్ ఫర్ చేస్తున్నాము” అన్నారు. నేనిక ఆయనతో ఏవిషయం మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదు. నాభార్య, కుమారుడితో కూడా మాట్లాడి వాళ్ళని కూడా
తీసుకునివెళ్ళే సమయం కూడా లేదు. మరుసటి రోజు
ఉదయాన్నే ఫ్లైట్ లో ఢిల్లీ చేరుకుని అక్కడి జనరల్ మానేజర్ దగ్గరనుంచి చార్జి తీసుకున్నాను.
అసలు ఈ సంఘటనలన్నీ యింత
వేగంగా జరగడానికి కారణం ఏమిటని వాకబు చేసాను.
తెలిసిన విషయం ఏమిటంటె వారాంతంలో మా చైర్మన్ గారు, మానేజింగ్ డైరెక్టర్ గారు
యిద్దరూ కలిసి ఢిల్లీ వెళ్ళారట. అక్కడ అఫీసులో
జనరల్ మానేజర్ గారు తను రాజీనామా చేయదలచుకున్నాననీ ఎటువంటి పరిస్థితులలోనయినా సరే
తనను నెలాఖరుకల్లా రిలీవ్ చేయవలసిందేనని చెప్పారట. మరొకసారి ఆలోచించుకోమని ఎంతగానో చెప్పిచూసారు ఆయనకి. కాని తను రాజీనామా చేయడానికి గల కారణం ఏమిటన్నది
మాత్రం ఆయన చెప్పదలచుకోలేదని తెలిసింది.
ఇక మా మానేజింగ్ డైరెక్టర్ గారికి ఆయన పట్టుదల ప్రకారం ఆయన రాజీనామాను ఆమోదించక తప్పలేదు. అటువంటి పరిస్థితులలో, బొంబాయిలో నాకన్న వయసులోను,
అనుభవంలోను జూనియర్ అయిన వ్యక్తి క్రింద పనిచేయవలసిన నన్ను వెంటనే ప్రమోషన్ మీద ఢిల్లీకి
ట్రాన్స్ ఫర్ చేయడం జరిగింది.
చక చక జరిగిపోయిన ఈ పరిణామాలకి
మా ఆఫీసులోనివారందరూ చాలా ఆశ్చర్యపడ్డారు.
బాబా నాకు చేసిన సహాయాన్ని జీవితంలో నేను మర్చిపోలేను. ఢిల్లీలో నాకు ప్రమోషన్ రావడమే కాదు. నాహోదాకు తగ్గట్లు నాకు కారు, దానికి ఒక డ్రైవరు,
ధనికులందరూ నివసించే లొకాలిటీలో విశాలమయిన పెద్ద ఫ్లాటు కూడా ఇచ్చారు. ఇంక అంతకన్న మరేమి కావాలి?
భగవంతుడు తన దీవెనలను
వర్షంలా కురిపిద్దామని భావిస్తే “ఆకాశాన్ని చీల్చి మరీ కురిపిస్తాడు” అని ఉత్తర
భారత ప్రజలందరూ చెప్పే మాట. డిల్లీలో అత్యున్నత
పదవిలో ఉన్న ప్రభుత్వ ఆఫీసరు మరియు, మంత్రులను కలుసుకుని పని చేసే అవకాశం లభించింది. సాయిబాబా కరుణ లేకుండా ఇదంతా సాధ్యామా?
భగవత్స్వరూపుడయిన శ్రీసాయిబాబా
పై నమ్మకం లేనివారందరికీ నా అనుభవాన్ని వివరంగా చెబుతూ ఉంటాను. ఈ అధ్భుతమయిన లీలను చదివిన సాయిభక్తులందరికీ ఎంతో
ఆనందం కలుగుతుంది.
బాబాకు శరణాగతి చేసి
ఆర్తితో అర్ధిస్తూ గందరగోళ పరిస్థితిలో ఉన్న భక్తునిమీద సాయిబాబా కురిపించిన అటువంటి దయ ఆ భక్తుని మీద బాబా తన సమాధినుంచి ప్రసాదించిన వరం.
బాబా తన శరీరాన్ని వీడినా గాని ఆయన అంతటా అన్ని చోట్లా నిండి ఉన్నారు. ఆయనని మనం పిలిస్తే చాలు పలుకుతారు. “నువ్వు నావైపు ఒక అడుగు వేస్తే నేను నీవైపు పది
అడుగులు వేస్తాను” అని బాబా మనకి అభయమిచ్చారు.
ఇంకా సందేహాలతో కొట్టుమిట్టాడుతూ
ఉన్నవారికి ఈ లీల ప్రగాఢమయిన నమ్మకాన్ని బాబామీద కలిగిస్తుంది. స్వఛ్చమయిన మనసుతో త్రికరణ శుధ్ధిగా సమాధి మందిరంలో బాబాను వేడుకుంటే నూటికి నూరు శాతం ఆయన వరాలననుగ్రహిస్తారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. షిరిడీ వెళ్ళి ఆయన సమాధి వద్ద ఆయనను దర్శనం చేసుకుని
మనస్ఫూర్తిగా ప్రార్ధించినవారి కోరికలన్నీ ఎటువంటి సందేహం లేకుండా వెంటనే అనుగ్రహింపబడతాయి.
ఎస్.పి. ఉడయవర్
బొంబాయి – 400004
సాయిలీల మాసపత్రీక సెప్టెంబరు,
1980
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment