13.09.2017 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
బాబాకు సర్వం తెలుసు
ఈ రోజు సాయిలీల మాసపత్రిక
సెప్టెంబరు 1980 సంచికలో ప్రచురింపబడ్డ శ్రీసాయిలీలకు తెలుగు అనువాదమ్ ప్రచురిస్తున్నాను.
మనమందరం సాయిని వివిధ
కోరికలతో ప్రార్ధన చేస్తూ ఉంటాము. మన కోరికలు
వెంటనే గాని ఆ తరువాత గాని తీరగానే మనకు బాబా ఎంతగానో సహాయం చేసాడని పొంగిపోతాము. కోరుకున్న కోరికలు అసలు తీరకపోతే బాబా నాకేమీ సహాయం
చేయడంలేదని ఆయనని నిందించి ఆయనపై ఉన్న భక్తిని, విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాము. కాని బాబాకు మనకేది ఎప్పుడు ఏవిధంగా ఇవ్వాలో, మనకేది
శ్రేయస్కరాన్ని కలిగిస్తుందో ఆయనకే తెలుసు.
మనమెప్పుడూ సుఖాలనే కోరుకొంటు ఉంటాము కాబట్టి మనకు అన్ని సుఖాలను ఏ దేవుడు ప్రసాదిస్తాడో ఆ దేవుడినే మనం గట్టిగా పట్టుకుంటాము. లేకపోతే దేవుడినే
మార్చేసి మరొక దేవుడిని పట్టుకుంటాము. కాని
సుఖాలన్నీ మనకి ఆనందాన్ని కలిగించవు కదా. అవేమి
శాశ్వతం కావు. అందుచేత ఎటువంటి పరిస్థితులలోనయిన
మనకు ఆయన మీద ఉన్న నమ్మకాన్ని మనం వమ్ము చేసుకోకూడదు. నాకు తెలుసున్న ఒకామెకు బాబా అంటే ఇష్టమే. బహుశ
మరీ అంత భక్తురాలు కాదు. కాని ఆమధ్య ఒక మహానుభావుడు
దూరదర్శన్ లలో కనిపించి బాబా ముస్లిమ్, ఆయనను పూజించకూడదు అనేటప్పటికి ఆమె బాబామీద
తనకున్న కొద్దిపాటి విశ్వాసాన్ని సడలించుకుంది.
బాబా సత్ చరిత్రలో ఇటువంటివారి గురించే మామిడి పూతగా వర్ణించారు. ఇపుడు ఒక భక్తునికి బాబా చేసిన మహోపకారాన్ని చదవండి.
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు
త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
బాబాకు సర్వం తెలుసు
నేడు సాయిభక్తులు లక్షలమంది
ఉన్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన భక్తుల
సంఖ్య యింకా యింకా పెరుగుతూనే ఉంది. ప్రతి
భక్తుడు ఆయనను తనదైన శైలిలో పూజిస్తూ, ప్రార్ధిస్తూ ఉంటాడు. ఎవరి పధ్ధతి వారిది. ఎవరు ఏపధ్ధతిని అనుసరించినా భక్తి ప్రధానం. కొంతమంది ఉదయాన్నే బాబా పాటలను మధురంగా గానం చేస్తారు. మరికొందరు బాబా మందిరంలో కూర్చొని ప్రశాంతంగా ఆయనను
దర్శించుకుని ధ్యానించుకుంటూ ఉంటారు. కొంతమంది
తమ యింటిలోనే అందమయిన పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకొని ఆయనను భక్తితో పూజించుకుంటూ
ఉంటారు. మరికొంతమంది ప్రతిసారి యాత్రలకు వెళ్ళి
భగవంతుని దర్శించుకుంటూ గంటలకొద్ది సమయం ఆయన సన్నిధానంలో గడుపుతూ ఉంటారు. మరికొంతమంది తమ తమ యింటి వ్యవహారాలలో నిమగ్నమయినప్పటికీ
ఖాళీ సమయాలలో ఆయనని స్మరించుకుంటూ ఉంటారు.
ఇంతమంది ఇన్ని విధాలుగా ఆయనని స్మరించుకుంటూ జపిస్తూ పూజలు చేస్తూ ఉన్నా సర్వసాధారణంగా
అందరూ ఒకేభావంతో పూజిస్తారు. అదేమిటో మనందరికీ
తెలుసున్నదే. కోరికలు తీరడం కోసం. కొంతమంది మొక్కులు మొక్కుకుంటారు తమ సమస్యలను తీర్చమని
కష్టాలనుండి గట్టెక్కించమని. ఇంకా ఎన్నో కోర్కెలతో
ఆయనను ప్రార్ధిస్తూ ఉంటారు. అంతేకాదు, నేను
నీభక్తుడిని కాబట్టి వెంటనే నాకోర్కెలను తీర్చు బాబా అని మొఱపెట్టుకునేవారు కూడా ఉన్నారు. తమ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి కావలసిన ప్రాపంచిక
వనరులు లేనివారు ఎంతోమంది ఉన్నారు. అటువంటివారు కేవలం తమ ప్రయోజనం కోసమే ఆయన మీద దృష్టిపెడుతూ ఉంటారు.
కాని బాబా దృష్టిలో అందరూ
సమానమే. ఆయన తన భక్తులయొక్క కులమతాలను గాని, లింగభేదాలను గాని, వయసును గాని
చూడరు. నూటికి నూరు శాతం ఖచ్చితంగా చెప్పే
విషయం ఒకటుంది. అదేమిటంటే బాబాకు సర్వం తెలుసు. అనగా తన భక్తునికి ఏది మంచి చేస్తుందో ఏది చెడు
కలిగిస్తుందో ఆయనకు మాత్రమే తెలుసు. కాని భక్తులు
మాత్రం తమ స్వలాభం కొద్దీ ఆవిషయాన్ని గమనించక తమ కోర్కెలు తీరని సమయాలలో ఒక్కొక్కసారి
అసంతృప్తిని ప్రకటిస్తూ ఉంటారు. మరికొంతమంది
బాబా మీద తమకున్న నమ్మకాన్ని కూడా వమ్ము చేసుకుంటూ ఉంటారు. అది సరైన పధ్ధతి కాదు.
నేను పైన వివరించిన విషయాన్ని
సమర్ధించడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. ఇపుడు
పాఠకుల కోసం ఒక సంఘటనను మీ అందరికోసం వివరిస్తున్నాను.
నా స్నేహితునికి షిరిడీ
సాయిబాబా మీద ఎంతో భక్తి ఉంది. బాబాకు పరమ
భక్తుడతను. తను పనిచేసే ఆఫీసులో ఒక ప్రత్యేకమయిన
శాఖలో ముఖ్యమైన విధులను నిర్వహిస్తూ ఉన్నాడు.
అతను తన పై అధికారుల దృష్టిలో మంచి పనివంతుడిగా పేరు సంపాదించుకున్నాడు. ఒకసారి అతను పని చేస్తున్న శాఖలో కొంతమంది ఉద్యోగులని రెండు నెలలపాటు ఆర్ధికంగా లాభం కలిగించే టూర్ కి పంపించదలచుకున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఎవరికి
వారు తమవంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. నా
స్నేహితుడు ఆర్ధికంగా అంతగా ఉన్నవాడు కాదు.
అందుచేత ఈ టూర్ వల్ల ఆర్ధికపరమయిన తన సమస్యలు చాలా మట్టుకు తీరిపోతాయని తనకు
కూడా ఈ అవకాశం లభిస్తె బాగుండుననే ఆలోచనలో ఉన్నాడు. తనకు ఈ అవకాశం వచ్చేలా చేయమని షిర్దీ సాయిబాబాను
ప్రార్ధించుకున్నాడు. బాబా దయవల్ల తనకు ఈ అవకాశం
తప్పకుండా లభిస్తుందనే ధృఢనమ్మకంతో ఉన్నాడు.
కాని ఆఖరికి టూర్ కి
వెళ్ళేవాళ్ల లిస్టులోనుంచి తన పేరు తీసివేయబడిందని తెలుసుకుని చాలా నిరాశకు గురయ్యాడు. బాబాను ప్రార్ధించుకున్నా తన కోరిక తీరకపోయేసరికి
బాబా మీద ఉన్న తన నమ్మకాన్ని సడలించుకోసాగాడు.
బాబా తన కోర్కెను తీర్చకుండా తనకెంత మహోపకారాన్ని చేశారో అర్ధం చేసుకోవడానికి
ఎంతోకాలం పట్టలేదు అతనికి. వారందరూ టూరుకు
బయలుదేరిన వారం రోజులకి అతని భార్యకి హటాత్తుగా చాలా తీవ్రమయిన జబ్బు చేసింది. అతి కష్టం మీద బ్రతికింది. ఒకవేళ అతనే కనక టూరుకి వెళ్ళి ఉంటే సరైన సమయానికి
వైద్య సహాయం అందక ఆమె మరణించి ఉండేది. అతను
ఉండటం వల్లనే దగ్గరుండి ఆమెకు అన్ని విధాలా వైద్యం చేయించగలిగాడు. ఇక రెండవ విషయం ఏమిటంటే టూరుకు వెళ్ళినవారందరూ తిరిగి
వస్తుండగా దారిలో వారికి పెద్ద యాక్సిడెంట్ అయింది. ఆందరికీ బాగా దెబ్బలు గాయాలు తగిలి ప్రమాదకర పరిస్థితిలో
పడ్డారు.
బాబాకు తనమీద ఎంత దయ
ఉందో తెలుసుకోలేనప్పటికీ బాబాకు మాత్రం సర్వం అవగతమే. ఆయనకు తన భక్తుల భవిష్యత్తంతా తెలుసు. అందువల్లనే తన భక్తునికి ముందు ముందు రాబోయే ప్రమాదాలనుంచి
రక్షించడానికే అతని కోర్కెను మన్నించలేదని మనకి స్పష్టంగా అర్ధమవుతుంది.
అందుచేత మనమందరం నిర్ణయాధికారాన్ని
బాబా మీదనే ఉంచి ఆయన చూపిన దారిలో పయనిద్దాము.
జె.
ఆర్. లరోయీ
న్యూఢిల్లీ
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment