16.09.2017 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ పి. ఆర్. అవస్థే
గారి స్వీయ చరిత్రనుండి కొన్ని భాగాలను సాయిపదానంద అక్టోబరు 1944 వ. సంచికలో ప్రచురించారు. సాయిలీల.ఆర్గ్ నుండి గ్రహింపబడినది. ఈ రోజు దాని తెలుగు అనువాదం అందిస్తున్నాను.
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు
త్యాగరాజు నిజాంపేట హైదరాబాద్
శ్రీ సాయి దివ్య చరణాల వద్ద
పురుషోత్తమ్ ఆర్. అవస్థి
అవి 1914 వ.సంవత్సరం
క్రిస్మస్ సెలవు రోజులు. నాస్నేహితుడయిన ఎమ్.బి.రేగే
నన్ను తనతో కూడా బాబాను దర్శించుకుని ఆయన ఆశీర్వాదాలు తీసుకుందువుగాని రా అని షిరిడీకి
తీసుకుని వెళ్ళాడు. షిరిడీకి ప్రయాణం చేస్తున్నపుడు
దారిలో ఆలోచిస్తూ ఉన్నాను. నాకంటూ ఒక గురువు
ఉన్నారు, మరి నాగురువు మరొక గురువును ఆశ్రయించవద్దని చెప్పిన మాటని నేను అతిక్రమిస్తున్నానా
అని నాలో నాకే విస్మయం కలిగింది.
షిరిడీ వెళ్ళడానికి నేను తయారయినందుకు నాకు పశ్చాత్తాపం కలిగింది. దారితప్పి షిరిడీకి వెడుతూ అక్కడ ఆముసలి ఫకీరు చేసే గారడీ విద్యలు చూడటానికా నేను వెడుతున్నది అని భావించాను. శ్రీరామనామాన్ని జపించి ఆయన చేసే క్షుద్రవిద్యలను నేను అరికట్టవలసిందే అన్నాను. రేగే నన్ను ‘వెఱ్ఱివాడా’ అన్నాడు.
షిరిడీ వెళ్ళడానికి నేను తయారయినందుకు నాకు పశ్చాత్తాపం కలిగింది. దారితప్పి షిరిడీకి వెడుతూ అక్కడ ఆముసలి ఫకీరు చేసే గారడీ విద్యలు చూడటానికా నేను వెడుతున్నది అని భావించాను. శ్రీరామనామాన్ని జపించి ఆయన చేసే క్షుద్రవిద్యలను నేను అరికట్టవలసిందే అన్నాను. రేగే నన్ను ‘వెఱ్ఱివాడా’ అన్నాడు.
షిరిడీలో మేము చావడిలో
సాయిబాబాను కలుసుకున్నాము. రేగే బాబా దగ్గరకు
వెళ్ళి నా చపలచిత్తాన్ని పోగొట్టమని ప్రార్ధించాడు. బాబా నావైపు చూసి తన మధురమయిన పవిత్రమయిన స్వరంతో
“అల్లా మాలిక్ హై” అన్నారు. ఆమాటలు నన్ను వెంటనే
సమ్మోహితుణ్ణి చేశాయి. నాలోని దోషాలను మన్నించమని
మనసులోనే ఆయనకు క్షమాపణలు చెప్పుకున్నాను.
నా శిరసును ఆయన పాదాలవద్ద ఆనించాను.
ఆయన నాతలను మృదువుగా స్పృశించి దీవించారు.
అప్పటినుంచి దారిలో ఏప్రాణిని చూసినా అన్నిటిలోను నాకు సాయిబాబాయే గోచరించారు. సాయిబాబాను కలుసుకున్న తరువాత ఒక సద్గురువు కోసం
నా అన్వేషణ పూర్తయిందనిపించింది. సాయిబాబాయే
నాసర్వస్వం.
మేమిద్దరం రాధాకృష్ణ
ఆయి యింటికి వెళ్ళాము. ఆమెను చూడగానే అచ్చుగుద్దినట్లు
నా గురువు యోగిని అయిన శాంతిదేవిలా కనిపించింది.
నన్ను చూడగానే ఆమె నాజీవితంలో అంతకుముందు జరిగిన కొన్ని సంఘటనలు చెప్పింది.
ఆ వివరాలు వినగానే నేను అప్రతిభుడినయ్యాను. అయినా గాని ఆమెను నాగురువయిన శాంతిదేవికి
ప్రత్యామ్నాయంగా అంగీకరించాలనిపించలేదు, ఆమె నా గురువుకు సోదరి అనిపించింది.
నేను ఈవిధంగా ఆలోచిస్తూ
ఉండగానే రాధాకృష్ణ ఆయి “నేను చచ్చిపోతున్నాను” అని గట్టిగా అరుస్తూ నేలమీద పడిపోయింది. నేను వెంటనే ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి
ఆమె తలను నాఒడిలోకి తీసుకున్నాను. పంచభూతాలకు
ఆధారభూతమయిన ‘శివపంచాక్షరి’ మంత్రంలోని అయిదు అక్షరాలకు మూలాధారమయిన అక్షరాలతో ఒకదాని
తరువాత ఒకటి గట్టిగా జపించసాగాను.
16 సంవత్సరాలలో నేను
చేసిన ఆధ్యాత్మిక సాధనలో నేను పొందిన ఫలితాన్ని స్వీకరించి ఆమెకు తిరిగి పునర్జీవనం కలిగించమని
దేవతలనందరినీ వేడుకొన్నాను. నా ప్రార్ధనలకు
స్పందించి రాధాకృష్ణ ఆయి కళ్ళు తెరిచింది.
ఆమెను తిరిగి బ్రతికించినందుకు భగవంతునికి నా కృతజ్ఞతలు తెలియచేసుకున్నాను.
నేను షిరిడీలో నాలుగు
రోజులున్నాను. సాయిబాబా తమ అధ్భుతమయిన శక్తుల
ద్వారా వివిధ దశల ద్వారా నన్ను పరీక్షించి, తను ఒక అవతారమని నన్ను గ్రహించుకునేలా చేసారు. షిరిడీ యాత్ర నాజీవితానికి ఒక పెద్దమలుపుగా ఋజువయింది. ఆయన ఒక ‘ముస్లిమ్’ అన్న అపవిత్రమయిన ఆలోచన నాలోనుంచి
తుడిచిపెట్టుకుని పోయింది. ఒక సద్గురువుయొక్క
ఆశ్రయం నాకు లభించాలని ఎంతోకాలంగా అన్వేషణలో ఉన్న నాకు బాబాయే నా సద్గురువుగా మాత్రమే
కాదు నా దేవునిగా నన్ను ఆకర్షించుకున్నారు.
ఆ రోజు ఏకాదశి. ఆ రోజే నేను బాబాను ఆఖరుసారిగా దర్శించుకునేది. కాకడ ఆరతి తరువాత సాయిబాబా చావడినుంచి మసీదుకు వచ్చారు. ఆయన నాస్నేహితుడయిన రేగేగారికి కబురు చేసి నన్ను
తీసుకునివెళ్ళమని చెప్పారు. టాంగా సిధ్ధంగా
ఉంది. మేము బయలుదేరుతుండగా సాయిబాబా ఎప్పటిలాగే
ఉదయంపూట వ్యాహ్యాళికి వెళ్లడానికి మసీదునుంచి బయటకు వచ్చారు. ద్వారం వద్ద మాకు ఆయన దర్శన భాగ్యం కలిగింది. ఆయనకు నమస్కరించుకున్నాము. మేము బయలుదేరేముందు ఆయన ఆశీస్సులను తీసుకున్నాము. దీని తరువాత సంవత్సరంలో రెండు మూడు సార్లు మాత్రమే
కాదు సందర్భం వచ్చినపుడెల్లా షిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులను పొందుతూ
ఉండేవాడిని. ఈవిధంగా క్రమం తప్పకుండా నాలుగు
సంవత్సరాలు షిరిడీ వెళ్లాను.
1917 నవంబరులో సాయిబాబా
వేకువజాముననే ఉజ్జయినిలో ఉన్న మాయింటిలో ప్రత్యక్షమయ్యారు. వెంటనే నేను మంచంమీదనుంచి లేచి వినయంగా ఆయనకు నమస్కరించుకున్నాను. వెంటనే ఆయన అదృశ్యమయ్యారు. అదే క్షణంలో నాకు చిరపరిచితమయిన అబ్దుల్ భాయి కంఠం
తోటలోనుంచి నన్ను పెరుపెట్టి పిలుస్తున్నట్లుగా వినిపించింది. వెంటనే తలుపు తీసుకుని బయటకు వచ్చి అబ్దుల్ల్ భాయి
కోసం వెతికాను. కాని తోటలో నాస్నేహితుడు ఒకతను
పువ్వులు కోస్తూ కనిపించాడు. ఇప్పుడు నన్ను పిలిచిన అబ్దుల్ భాయి ఏడీ అని అడిగాను.
తోటలోకి ఎవరూ రాలేదని, నన్ను ఎవరూ పేరుపెట్టి
పిలవలేదని చెప్పాడు.
శ్రీసాయిబాబా మాయింటికి
రావడంలోని ఆంతర్యం తలుచుకుంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఆ సంఘటన జరిగిన మూడవరోజున షిరిడీనుంచి శ్రీవామన్
రావు పటేల్ వద్దనుంచి రాధాకృష్ణ ఆయి మరణించిందని ఉత్తరం వచ్చింది. సాయిబాబా మాయింటికి వచ్చిన రోజున వేకువ జాము ఘడియలలోనే
ఆమె మరణించింది.
1918 మేనెలలో నేను, నా
సోదరి, మేనకోడలితో కలిసి షిర్దీ వెళ్లాను.
వారిద్దరూ బాబాకు నైవేద్యంగా ‘పిట్లా’ తయారు చేసి సమర్పిద్దామనుకొన్నారు.
(వీడియో చూడండి)
(వీడియో చూడండి)
ఇంతకుముందు రాధాకృష్ణ ఆయి నివసించిన గదిలోనే పిట్లా
తయారు చేస్తున్నారు. కట్టెలు తడిగా ఉండటంవల్ల
గదంతా పొగ వ్యాపించింది. ఇక ఆపొగను భరించలేక
నా సోదరి రాధాకృష్ణ ఆయిని పిలిచి కట్టెలను బాగా మండేలాగ చేయమని అడుగుదామనుకుంది. వెంటనే అమ్మ రాధాకృష్ణ ఆయి మెట్లుదిగి క్రిందకు
వచ్చి కట్టెలను రాజేయడానికి వారిద్దరికీ సహాయం చేసి ఆతర్వాత అదృశ్యమయింది. వాస్తవానికి నవంబరు 1917 వ.సంవత్సరంలోనే రాధాకృష్ణ
ఆయి తన శరీరాన్ని వీడినా ఇపుడామె తమ మధ్యలోనే ఉన్నట్లుగా అనుభూతి కలిగింది. కాని ఆమె దర్శనం లభించినందుకు వారెంతగానో సంతోషించారు.
1918 సంవత్సరం అక్టోబరులో
జరిగిన మరొక సంఘటన. ఉజ్జయినిలో మాయింటిలోని
ఆడవాళ్ళు అనుకోకుండా పొరబాటున దంపుడు బియ్యాన్ని రెండు మూడు సార్లు కడిగి వంటగదిలోకి
వెళ్ళారు. వెంటనే వారికి తాము చేసిన పొరబాటు
గుర్తుకు వచ్చి ఏమి చేయలా అనే అయోమయంలో పడ్డారు.
ఆ సమయంలో నేను అక్కడికి వెళ్ళగానే జరిగిన పొరబాటు గురించి చెప్పారు. నేను సాయిబాబాకి ఇష్టమయిన ‘సాఖర్ బాత్’ చేయమని యధాలాపంగా
చెప్పాను. (సాఖర్ బాత్ ఏవిధంగా చేయాలో వీడియో
చూడండి)
ఆవిధంగా తయారు చేసి బాబాకు
నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని మేము ఆరగించాము. సాయిబాబా మహాసమాధి చెందారన్న విచారకరమయిన సమాచారంతో
మాకు ఉత్తరం వచ్చింది. ఈ అనూహ్యమయిన వార్త
వినగానే మాకు దుఃఖం ముంచుకొచ్చింది.
ఆ సమయంలో నా స్నేహితుడు
ఒకతను అక్కడే ఉన్నాడు. ఇటువంటి విషాదకర సంఘటనలు
జరిగినపుడు ముస్లిమ్ లు వారి మతాచార ప్రకారం స్వీట్ రైస్ చేస్తారని చెప్పాడు. సాయిబాబా ఒక అసమానమయిన రీతిలో నాద్వారా ఆవిధంగా
నైవేద్యాన్ని అందుకున్నారు. ఎంత యాదృఛ్చికంగా
జరిగింది ఈ సంఘటన?
సాయిబాబా మనందరికీ నిరంతరం
తమ ఆశీస్సులను అందచేస్తూనే ఉన్నారు. వాటినన్నింటికి
తగినంతగా నేను చెప్పడం సాధ్యం కాదు. అన్నిటిని
వివరించాలంటే నామనసుయొక్క సరిహద్దులకు మించినది. హృదయ పరిధులను దాటి అనంతమయిన ప్రేమ
అందరిలోను వ్యాపించి ఉంటుంది. అన్ని విషయాలలోను
ఇది ఒక గొప్ప విషయం ఒక్కటి మాత్రం యదార్ధం.
ప్రేమామృతమయిన మన హృదయంలో భగవంతుడు నివసిస్తాడు. ఆయన మనకు ఓదార్పును కలిగించి సుఖ సంతోషాలను అందిస్తూ
మనకు తోడు నీడగా ఉంటాడు. ఆయనని మీ హృదయంలో
ప్రతిష్టించుకొనండి. మీరు తెలిసి కోరుకున్నా
కోరుకోకున్నా మీ కోర్కెలన్నీ నెరవేరుతాయి.
సాయి పదానంద అక్టోబరు
1994 సంచిక.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment