03.10.2017 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
ఈ రోజు మరొక అధ్భుతమైన
సాయి లీలను తెలుసుకుందాము. ఇది గొప్ప సాయిభక్తులయిన
శ్రీ డి.శంకరయ్యగారి అనుభవమ్. “ఓమ్ సాయి శ్రీసాయి
జయజయ సాయి” అనే బాబా నామ సప్తాహాలను ఎన్నిటినో ఆంధ్రదేశంలో చేయించారు. వారు హైదరాబాద్ వాస్తవ్యులు.
సాయిలీల.ఆర్గ్ నుండి
గ్రహింపబడినది. సాయిలీల మాసపత్రికలో
23.10.2013 ప్రచురింపబడినది.
తెలుగు అనువాదమ్
: ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట్, హైదరాబాద్
హోరువానలో కూడా ధుని
మండుట
శ్రీ సాయి సత్చరిత్ర
11 వ.అధ్యాయంలో సాయిబాబాకు పంచభూతాలమీద ఉన్న ఆధిపత్యం గురించిన ప్రస్తావన మనం గమనించవచ్చు.
ఒకసారి షిర్డీలో పెద్ద గాలివాన సంభవించినపుడు సాయిబాబా ఒక్కసారి గద్దించగానే అంతటి
గాలివాన వెంటనే ఆగిపోయి ప్రశాంతమయిన వాతావరణం ఏర్పడటమ్ గురించి మనకందరకూ తెలుసు.
అదే విధంగా ఒక సారి ధునిలోని మంట బాగా ప్రజ్వరిల్లుతూ
మంటలు మసీదు పైకప్పును తాకుతూ ఉన్నాయి. అప్పుడు
సాయిబాబా తన సటకాతో నేలమీద కొడుతూ “తగ్గు, తగ్గు , శాంతించు" అని శాసించగానే ఆయన కొట్టే
ప్రతి సటకా దెబ్బకి అనుగుణంగా ఆ మంటలు క్రమేపీ తగ్గుతూ ధుని ఎప్పటిలాగానే మండటం మొదలు
పెట్టింది. హోరున కురిసే వర్షంలో కూడా ధుని
మండుతూనే ఉన్న దృశ్యాన్ని ఇపుడు మనందరం కూడా వీక్షిద్దాము.
శ్రీ డి. శంకరయ్యగారు
గొప్ప సాయిభక్తులు. ఆయన హైదరాబాద్ నివాసస్థులు. ఆయన గొప్ప సాయిభక్తుడవడం వల్ల షిరిడీ వెళ్ళి సాయిబాబాను
దర్శించుకుంటూ ఉండేవారు. అది సహజమే. షిరిడీ వెళ్ళినపుడల్లా ఆయన అక్కడ శ్రీ శివనేశన్
స్వామీజీ గారి ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటూ ఉండేవారు.
ఒకసారి స్వామీజీ ఆయనతో సామూహిక నామసప్తాహాన్ని నిర్వహించమని చెప్పారు. నామ సప్తాహంలో బాబా నామాన్ని నిరంతరం 24 గంటలపాటు
గాని, ఒక వారం రోజులు గాని జరుపబడే కార్యక్రమమం.
వారం రోజులపాటు ఆపకుండా జరిపే కార్యక్రమం నామసప్తాహం. శ్రీస్వామీజీ, నామ సప్తాహానికి యిచ్చిన మంత్రం “ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి” .
అనంతపురం జిల్లాలోని
పెనుకొండలో 25.06.1988 నుంచి 06.06.1988 వరకు శంకరయ్యగారు ఆయన అనుచరులు సాయినామ సప్తాహాన్ని
నిర్వహించారు. వారు ఎక్కడ నామసప్తాహాన్ని నిర్వహించినా
అలవాటు ప్రకారం అక్కడ ధునిని కూడా ఏర్పాటు చేస్తూ ఉండేవారు. ధునిని బహిరంగ ప్రదేశంలో
నామసప్తాహం జరిగే చోట ఏర్పాటు చేస్తూ ఉండేవారు.
ఆ ధుని సప్తాహ కార్యక్రమం పూర్తయ్యేంతవరకు మండుతూ ఉండేది. ఆ ధునిలో గురుస్థాన్ నుంచి సేకరించి తెచ్చిన ఎండిన
వేపాకులు, ద్వారకామాయిలో సగం వరకు వెలిగి ఆరిపోయిన అగరువత్తులను, ఊదీ, మంచి గంధపు చెక్కలను,
మంచినెయ్యిని వేసేవారు.
ఆవిధంగా పెనుకొండలో జరుపుతున్న
సప్తాహ కార్యక్రమంలో కూడా ధునిని వెలిగించారు.
సప్తాహ కార్యక్రమం మొదలయిన రెండవరోజున రాత్రి రెండు గంటలవేళ శంకరయ్యగారు నిద్రలో
ఉన్నారు. ఆ సమయంలో వర్షం మొదలయింది.
మొదట చిన్నచిన్న తుంపరలుగా ప్రారంభమయి కుండపోతగా
వాన కురవసాగింది. ధునిపైన ఎటువంటి రక్షణ లేదు. వాన ప్రారంభమయిన కొద్దిసేపటికే ధుని చుట్టూరా నీళ్ళు
చేరి ఒక మడుగులా తయారయింది. ఆయనతో వచ్చినవారందరూ
శంకరయ్యగారిని లేపి విషయాన్నంతా వివరించారు. ఆయన ఎటువంటి ఆందోళన చెందకుండా ఎంతో ఉదాసీనంగా
“తన ధుని సంగతి చూసుకోవడానికి బాబాయే ఉన్నారు, ఆయన చూసుకుంటారులే” అని తిరిగి పడుకున్నారు.
మరుసటిరోజు ఉదయాన్నే
ధునిలో వేయవలసినవాటినన్నిటిని వేయడానికి ధుని దగ్గరకు వెళ్ళారు. ధునిలో ఎవరో నెయ్యి వేస్తున్నట్లుగా ధుని ప్రకాశవంతంగా
మండుతూ కనిపించింది. జీవితంలో తుపానులు సంభవించినపుడు
మనలని సురక్షితంగా ఒడ్డుకు చేర్చే నావ ‘నామ జపం’
_________
(అంత కుండపోత వాన వస్తున్నా
కూడా శంకరయ్యగారు ఎంత ఉదాసీనంగా ఉన్నారో గమనించారా? ఆయన వెంటనే లేచి అయ్యో ధుని ఆరిపోయిందేమో అని ఎటువంటి
కంగారును ప్రదర్శించలేదు. ధుని సంగతిని బాబా చూసుకుంటారులే అని మరలా నిద్రపోయారు. అంటే
బాబాపై ఆయనకు అంతటి అచంచలమయిన విశ్వాసం ఉంది.
బాబా ఇంకా సజీవంగానే ఉన్నారనే ధృఢమయిన నమ్మకం. మన సాయిభక్తులందరం కూడా బాబా మీద అటువంటి నమ్మకాన్ని
నిలుపుకోవాలి.
ఈ సందర్బంగా నా అనుభవం గుర్తుకు వచ్చింది. మా అమ్మాయికి వివాహం నిశ్చయమయింది. ఆ తరువాత కొన్ని రోజులకు మగ పెళ్ళివారు కొన్ని కోరికలు కోరారు. అవన్ని ఫోన్ చేసి చెప్పారు. అవి తీర్చడం నా శక్తికి మించిన పని. నా శ్రీమతి ఆ విషయం నాకు చెప్పింది. మా యింటి హాలులో సింహాసనం మీద కూర్చున్న బాబా ఫోటో పెద్ద సైజుది ఉంది.
నా శ్రీమతి ఆ విషయం చెప్పగానే నేను, "అది బాబాకు చెప్పు, ఆయనే చూసుకుంటారు" అని ఫోటో వైపు చూపించాను. ఎటువంటి కంగారు పడలేదు. ఆ విధంగా అని నేను నా కంప్యూటర్ దగ్గర పని చేసుకుంటూ కూర్చున్నాను. వివాహానికి ముందు కూడా బాబా నువ్వు నాకు నాలుగు లక్షలు అప్పు ఇవ్వు. రిటైర్ అయ్యాక వచ్చే డబ్బుతో నీ బాకీ షిరిడీ హుండీలో వేస్తాను అన్నాను. నా శ్రీమతి, అలా అడగడమేమిటి బాబాని అంది. నేను మళ్ళీ లెంపలు వేసుకున్నాను. కాని అప్పు చేయకుండా, మగపెళ్ళివారు కోరిన కోరికలను కూడా తీర్చగలిగేలా అంతా ఆయనే చూసుకున్నారు.... త్యాగరాజు )
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment