02.10.2017 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
ఈ రోజు మరొక అధ్భుతమైన
సాయి బాబా వారి మహత్యాన్ని ప్రతిబింబించే సంఘటన గురించి తెలుసుకుందాము. బాబా తన భక్తుల రక్షణే కాదు, తన భక్తుల ఆస్తిపాస్తులను
కూడా రక్షిస్తారని నిరూపించే సంఘటన. ఇది సాయిలీలా.ఆర్గ్,
సాయిలీల మాసపత్రిక 08.02.2014 నుండి గ్రహింపబడింది.
తెలుగు అనువాదమ్
: ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట్, హైదరాబాద్
సాయిబాబా తన భక్తునియొక్క ఆస్తిని కాపాడుట
శ్రీసాయి సత్ చరిత్రలో
సాయిబాబా తనకు తన భక్తులకు జన్మజన్మల సంబంధం ఉందని చెప్పారు. శ్యామాకు తనకు 72 జన్మల సంబంధం ఉందనే విషయం కూడా
చెప్పారు., అదేవిధంగా నానా సాహెబ్ చందోర్కర్,
బాయాజీబాయి, లక్ష్మీబాయి ఇంకా ఎంతోమంది భక్తులు ఉన్నారు. తాను నిరంతరం వారందరి యోగక్షేమాలను కనిపెట్టుకుని
ఉంటున్నానని కూడా అన్నారు. అటువంటి అద్భుతమయిన
లీలను ఇపుడు మనందరం తెలుసుకుందాము.
తన పేరును చెప్పడానికి
యిష్టపడని ఒక భక్తురాలియొక్క అనుభవమ్.
మా నాన్నగారు ఆర్డినెన్స్
ఫ్యాక్టరీలో పనిచేసేవారు. ఆయన 1963 వ.సంవత్సరంలో
పదవీవిరమణ చేసిన తరువాత పూనాకి వచ్చేశారు.
పూనాలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగ ఉంటుందని, యింకా ముఖ్యమయిన విషయం షిరిడీకి
దగ్గరగా ఉండటం వల్ల, పూనాలో స్థిరపడటానికి నిశ్చయించుకున్నారు. ఆ రోజుల్లో పూనానుండి షిరిడీకి వెళ్ళే మార్గంలో ప్రైవేటు
బస్సులు ఏమీ తిరిగేవి కావు. రాష్ట్రప్రభుత్వ
బస్సు ఒక్కటి మాత్రం ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్న ఆరతి ప్రారంభమయే ముందు షిరిడీకి
చేరుకునేది.
మా అమ్మమ్మగారికి ఒక
స్వంత యిల్లు అనేది ఒకటి ఉండాలనే కోరిక ఉండేది.
కాని ఆమె కల సాకారమయ్యే ముందుగానే ఆవిడ కాలం చేసింది. మానాన్నగారు ఒక స్వంత యిల్లును కట్టుకొని ఆమె కోరికను
తీర్చాలనుకున్నారు. దానికనుగుణంగా పూనాలోని
ఔనధ్ ప్రాంతంలో ఒక నిర్జన ప్రదేశంలో ఖాళీస్థలం కొన్నారు. అప్పట్లో ఔనధ్ ఒక చిన్న గ్రామం. పూనానుంచి ఒక్కటే బస్సు తిరిగేది. ప్రొద్దున్న బయలుదేరి సాయంత్రానికి తిరిగి వచ్చేది.
ఏమయినప్పటికీ ఆయన పట్టణానికి
వెళ్ళి మార్కెట్లో అన్ని బాగా పరిశీలించిన తరువాత యింటి నిర్మాణానికి కావలసిన నాణ్యమయిన
సామాగ్రిని కాస్త చవకలోనే కొన్నారు. ఆ సామాగ్రినంతటిని
ఖాళీస్థలంలో దింపించారు. ఖాళీస్థలానికి ఎదురుగా
రోడ్డుమీద ఒకేఒక్క లైటుస్థంభం ఉంది. దానికెదురుగా
ఉన్న యింటిలో ఒక కుటుంబం నివసిస్తూ ఉంది.
ఆ కుటుంబంవారు కర్ణాటకనుంచి
వచ్చిన మయ్యా వంశానికి చెందినవారు. మా అమ్మగారు
కూడా మంగళూరులోనే పుట్టి పెరిగడం వల్ల ఆ మయ్యా కుటుంబంలోని ఆవిడతో మంచి స్నేహం కుదిరింది. ఒకరోజున మా అమ్మగారు ఆమెతో “మేము మా ఖాళీ స్థలంలో
కొత్తగా కట్టుకోబేయే యింటికి సంబంధించిన సామానంతా ఉంచాము. ఇక్కడ దొంగతనాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మా సామానును కూడా దొంగలు ఎత్తుకుపోయే ప్రమాదం ఉంది. మీరు కాస్త కనిపెట్టుకుని చూస్తూ ఉండండి” అని చెప్పింది. అపుడు శ్రీమతి మయ్యా ఇలా అంది,
“మీ రెందుకని అంత
ఆందోళన పడతారు (శ్రీమతి) ప్రభూ గారు? మీరు
నియమించిన ముస్లిమ్ వాచ్ మన్ చాలా మంచివాడు.
అతను రాత్రంతా మీస్థలంలో “అల్లామాలిక్” అంటూ చుట్టూ తిరుగుతూ ఉంటాడు”
మా అమ్మగారికి ఆమె మాటలు వినగానే చాలా ఆశ్చర్యం
వేసింది. “వాచ్ మన ఎవరు? మేమెవరినీ మాసామానును కనిపెట్టుకుని ఉండమని ఎవరినీ
నియమించలేదే” అని అంది.
అపుడు శ్రీమతి మయ్యా
“ఆవ్యక్తి వృధ్ధుడు. అతనికి గడ్డం ఉంది. తలకి తలపాగా చుట్టుకుని ఉంటాడు” అని సాయిబాబా ఏవిధమైన
వేషధారణలో ఉంటారో ఆవిధంగా వర్ణించి చెప్పింది.
మా అమ్మగారి కళ్లలో నీళ్ళు నిండి కంఠం గద్గదమయింది. “ఓ , ఆయన ప్రతిక్షణం మమ్మల్ని కనిపెట్టుకుని రక్షిస్తూ
ఉంటారు” అని చెప్పింది.
సాయిబాబాను ప్రత్యక్షంగా
చూసిన ఆమె ఎంతటి అదృష్టవంతురాలో కదా అని మనసులోనే బాబాకు నమస్కరించుకొంది.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment