Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, April 27, 2018

శ్రీస్వామీజీ భక్తులతో జరిపిన అనుగ్రహ భాషణమ్ - 16 వ.భాగమ్

Posted by tyagaraju on 12:03 AM

      Image result for images of shirdi sai
                       Image result for images of rose hd

27.04.2018 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి పదానంద రాధాకృష్ణస్వామీజీ గారు భక్తులనుద్దేశించి చేసిన ప్రసంగాలలోని విషయాలను “Swamiji talks to Devotees” పుస్తకంలోని విషయాలను తెలుగులో అనువదించి అందిస్తున్నాను.   SrI sai Spiritual Centre, T.Nagar, Bangalore వారు ముద్రించారు.  ఈ రోజు ఆ   ఈ పుస్తకానికి సంపాదకులు, ప్రొఫెసర్ పి.ఎస్.నారాయణ రావు, శ్రీ బి.కె. రఘు ప్రసాద్ గార్లు.  సాయిలీల.ఆర్గ్ నుండి గ్రహింపబడినది.
      Image result for radhakrishna swamiji guru
తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు
శ్రీస్వామీజీ భక్తులతో జరిపిన అనుగ్రహ భాషణమ్ - 16 వ.భాగమ్       
29.11.1971  :  స్వామీజీ ఈ రోజు భగవంతుడిని ఏవిధంగా అర్ధం చేసుకోవాలి, ఆయనను గుర్తించడం ఎలా అన్న విషయాల గురించి ప్రస్తావించారు.  ఆత్మవిమర్శన చేసుకోవలసిన విధానం గురించి ఆలోచించమని ఆయన భక్తులకు చెప్పారు.  


మొదటగా మీకు మీరే ఈ ప్రశ్న వేసుకోండి, “నేను ఎవరు?”  ఈ విధంగా విశ్లేషించుకుంటే ఈ ప్రపంచం ఏవిధంగా సృష్టించబడింది అనే మూల కారణానికి మనలను క్రమక్రమంగా తీసుకుని వెడుతుంది.  అదే ఆత్మ.  జ్ఞానమార్గంలో ఉన్న ఏకొద్దిమందికో తప్ప సామాన్యులకు దీనిని అర్ధం చేసుకోవడం అంత తేలికయిన విషయం కాదు.
అసలు మన శరీరం అంటే ఏమిటీ అన్న విషయం గురించి విశ్లేషించుకోవాలి.  ఆతరువాత “నేను ఈ శరీరాన్నా లేక మరేదయినానా” అని మనకు మనమే కనుగొనాలి.  ఏమయినప్పటికి ‘సగుణోపాసన’ అనే సులభమయిన మార్గం ఉంది.  అనగా భగవంతుడిని ఏదో ఒక రూపంలో పూజించుట.  ఇది భక్తి మార్గం.  ఈ భక్తిమార్గం జ్ఞానమార్గం కన్నా సులభమయినది.  ఈ మార్గంలో కూడా చివరికి భగవంతుడిని చేరుకోగలరు.  ఇంకొక మాటలో చెప్పాలంటే సగుణమార్గం నిర్గుణ మార్గంలోనికి తీసుకుని వెడుతుంది.  ఆవిధంగా భగవంతుడిని సగుణమూర్తిగా పూజించిన భక్తునికి భగవంతుడు తనకు తానే సర్వాంతర్యామిగా ప్రకటితమవుతాడు. 
విష్ణుసహస్రనామంలో ఏమని చెప్పబడిందో గమనించండి.
“విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తి రమూర్తిమాన్” అందులో చెప్పబడిన ప్రతినామానికి అర్ధాన్ని విశ్లేషించి చెబుతామి. 
విశ్వమూర్తి అనగా ప్రపంచమే ఆకారంగా కలవాడు, సర్వాంతర్యామి.
మహామూర్తిః  మహోన్నతమయినవాడు (పరుండి యున్న కారణంగా విశాలమయిన స్వరూపం కలవాడు)
దీప్తమూర్తిః  ప్రకాశిస్తున్న జ్ఞానదీపంలా ఉండేవాడు.
అమూర్తి : ఆకారము లేని భగవంతుడు.
ఆవిధంగా భగవంతుడిని ‘విశ్వమూర్తి’ గా భావించిన తరువాత ‘మహామూర్తి’ గా తెలుసుకుని ‘ఆయనని’ ‘దీప్తమూర్తి’ లేక జ్యోతిస్వరూపునిగా గ్రహించుకున్న తరువాత చివరికి ఆయన నిరాకారుడు అనే విషయం బోధపడుతుంది.  భక్తి మనలని భగవంతుని వద్దకు తిన్నగా సరియైన మార్గంలో తీసుకునివెడుతుంది.  ఈలోపుగా మన శరీరానికి సంబంధించి మనలని అంటిపెట్టుకుని ఉన్న ఐహిక సుఖాలు, సంపదలు మనకున్నవన్నీ వదిలించుకోవాలి.  ఈ శరీరం మనది కాదు.  ఈ శరీరం మనకు భగవంతునిచే ప్రసాదింపబడింది.  అందువల్ల ఈశరీరాన్ని భగవంతునికే అర్పించేయాలి అనే భావన కలిగి ఉండాలి.  భగవంతునినుంచి మనలని వేరు చేసేదేమిటి?  అది ‘చిత్’   ‘సత్’ (భగవంతుడు) నుంచి వేరుచేసేది ‘చిత్’.  ‘చిత్’ మొట్టమొదటగా కల్పనని కలిగిస్తుంది. (ఇక్కడ చిత్ అనగా మనస్సు అని అర్ధం చేసుకోవాలి). (ఈ కల్పన వల్లనే ఏది వాస్తవమో, ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో మన బుధ్ధికందదు కారణం  మనలని మాయ కమ్మివేయడమే.) మన మనస్సు దాని మీద ప్రతిబింబించి (ఛాయ) చివరికి ‘భ్రమ’ ను కలిగిస్తుంది.  ఆభ్రమే మాయ.  (చిత్తభ్రమ).  మనస్సు చేసే మాయావినోదాన్ని అర్ధం చేసుకోగలం.  

(వేదాంతంలో ముఖ్యమయిన, దివ్యమయిన పదజాలాలు, సత్, చిత్, ఆనంద)  వీటి గురించి చిన్న ఉపన్యాసం ఈ వీడియోలో వినండి.


బ్రహ్మజ్ఞానం యొక్క తత్వం, సారంతోనే మనము ‘సత్’ (పరబ్రహ్మను) ని అర్ధం చేసుకోగలుగుతాము.  బ్రహ్మజ్ఞానం కలిగినవాడు ‘నేనే సత్’ (నేనే భగవంతుడను) అనే భావాన్ని కలిగిఉంటాడు.  ప్రతిజీవిలోను ఉన్న యదార్ధమయినది ఇదే.  ఆకారణం చేతనే భగవంతుడు విశ్వాత్మ మరియు అమూర్తి.  భగవంతుడిని పరిపూర్ణంగా అర్ధం చేసుకోవాలంటే మనం వాయుపుత్రుడయిన మారుతియొక్క పధ్ధతిని అలవరచుకోవాలి. మారుతి ఏరీతిగా ఉంటాడు?  మారుతి ఎల్లవేళలా శ్రీరామచంద్రుని పాదాలవద్దే ఉంటాడు.  అదే ఆయన భక్తి స్వభావం.  
                                   Image result for images of hanuman at lord Rama
మన మనస్సే మారుతి అని భావించుకుంటే దానిని ఎల్లప్పుడూ భగవంతుని పాదాల చెంతనే స్థిరంగా ఉంచాలి.  ఆవిధంగా మన మనస్సుని స్వాధీనంలో ఉంచుకోవచ్చు.  ఇది అత్యుత్తమయిన పధ్ధతి.  భక్తిమార్గం ద్వారా మనం భగవంతుడిని అర్ధం చేసుకోగలము.  ఉదాహరణకి బ్రహ్మజ్ఞానం కోరివచ్చిన ఒక మార్వాడీ వ్యక్తికి బ్రహ్మజ్ఞానాన్ని పొందాలంటే నవవిధ భక్తులను ఆచరణలో పెట్టాలని బాబా ఉపదేశించారు.  సత్వ, రజ, తమో గుణాలకు ప్రతీక షిరిడీలోని ద్వారకామాయి మూడుమెట్లు.  వాటిని ఎక్కి ద్వారకామాయిలోకి ప్రవేశించాలంటే నవవిధ భక్తిని అలవరచుకోవాలనే విషయాన్ని బాబా చాలా ప్రముఖంగా చెప్పారు.  మార్వాడీకి బాబా సూచించిన ఉపదేశాలలోని అర్ధమేమనగా మనం బ్రహ్మజ్ఞానాన్నిపొందాలంటే ఒక్కొక్క మెట్టు ఎక్కవలసినదే.  అంతే కాని అకస్మాత్తుగా అంతటి అభివృధ్ధిని సాధంచాలనే అవసరం మాత్రం లేదని చెప్పారు.

30.11.1971 :   ఈ రోజు స్వామీజీ రామనామాన్ని జపించడం వల్ల కలిగే ఫలితం గురించి వివరించారు. 
                        Image result for images of lord siva talking with parvati
పరమశివుడే స్వయంగా రామనామం యొక్క అమోఘమయిన శక్తి గురించి పార్వతీదేవికి వివరించాడు.
‘శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమె’ అనే మంత్రాన్ని పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశించాడు.
తులసీదాసు రచించిన రామాయణాన్ని గుర్తుకు తెచ్చుకొనండి.  
                       Image result for images of tulsidas
తులసీదాసు గొప్ప రామభక్తుడు.  నాభదాస్ తులసీదాస్ ను కలుసుకోవడానికి బృందావనంనుంఛి బయలుదేరి వెళ్ళాడు.  కాని ఆయన వెళ్ళేటప్పటికి తులసీదాస్ రాముని ధ్యానిస్తూ ధ్యానముద్రలో నిమగ్నమయి ఉన్నాడు.  
             Image result for images of tulsidas
తులసీదాస్ తనతో మాట్లాడకపోవడం ఒక పెద్ద నేరంగా భావించాడు నాభదాస.  ఆతరువాత కొంతకాలానికి తులసీదాస్ బృందావనానికి వెళ్ళాడు.  నాభదాస్ ఉద్దేశ్యపూర్వకంగానే తులసీదాస్ తో మాట్లాడకుండా నిర్లక్ష్యంగా ఉన్నాడు.  కాని తులసిదాస్ అతని స్వభావాన్ని పట్టించుకోలేదు.  ఆయన తన యిష్టదైవమయిన రాముడిని ధ్యానిస్తూ ఉన్నాడు.  కాని బృందావనంలో కృష్ణుడు, రామునిగా తులసీదాస్ కు దర్శనమిచ్చాడు.  తులసీదాసే పూర్వజన్మలో వాల్మీకి అని అంటారు.   తులసీదాస్ కి తన యిష్టదైవమందు ఎంతటి ప్రగాఢమయిన భక్తి ఉన్నదో మనం గమనించాలి. నీ హృదయాన్ని సంపూర్ణంగా ఆభగవంతునికర్పించినట్లయితే ఆయన నీహృదయంలో తన దయను కురిపిస్తాడు.  తులసీదాసు శిశువుగా ఉన్నపుడే రామనామాన్ని ఉఛ్ఛరించాడని చెబుతారు.  ఆయన మనసులో పరిత్యాగము, వైరాగ్యం ఎలా ప్రవేశించాయో మనకు తెలుసు.  ఒకసారి తులసీదాస్ తన తండ్రికి ఆబ్ధికం పెడుతున్న రోజు.  ఆ రోజున ఆయనకి తన భార్యను కలుసుకోవాలనే గాఢమయిన తపన కలిగింది.  ఆరోజున ఆమె తన పుట్టింటిలో ఉంది.  ప్రక్కన భార్య లేకపోవడంతో తులసీదాస్ కి పిచ్చెక్కినట్లుగా ఉంది. మామగారింటికి వెళ్ళడానికి అర్ధరాత్రివేళ గంగానది ఒడ్డుకు వెళ్ళాడు.  నదిలో ఒక శవం కొట్టుకుని వస్తూ ఉంటే దానిని ఒక పెద్ద వృక్షానికి సంబంధించిన దుంగలా పొరబడి దానిమీద ఎక్కి నీటిలో తేలుకుంటూ తన మామగారింటికి వెళ్ళాడు.  ఒక సర్పాన్ని త్రాడుగా భ్రమించి దానిసాయంతో తన భార్య పడుకున్న గదిలోకి ప్రవేశించాడు. తన భర్త తనను కలుసుకోవడానికి పడిన కష్టాలన్ని విన్నతరువాత ఆమె “ఇదే విధమయిన కష్టాన్ని మీరు భగవంతుని ప్రేమకోసం తహతహలాడి ఉన్నట్లయితే ఆయన తప్పకుండా మీకు దర్శనమిచ్చి అనుగ్రహించేవాడు" అని గట్టిగా చీవాట్లుపెడుతున్న ధోరణిలో మాట్లాడింది.  ఈ విధంగా మాట్లాడిన తన భార్యే ఆయనకు గురువయింది.  ఆతరువాత భగవంతుడు ఆయనను ఏవిధంగా కనిపెట్టుకుని ఉన్నాడొ మీకు తెలుసు.  ఒకసారి కొంతమంది పండితులు ఆయన వ్రాసిన రామాయణానికి లభించిన ఖ్యాతిని చూసి అసూయతో దానిని దొంగిలించడానికి ప్రయత్నించారు.  కాని వారి ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి రామాయణగ్రంధం వద్ద రామలక్ష్మణులు కాపలాగా ఉండటం కనపడింది వారికి.  
                                    Image result for images of rama and lakshmana
పరమశివుడు కూడా తులసీదాస్ ను అనుగ్రహించడం కూడా మనకు తెలుసు.  తులసీదాస్ రచించిన రామాయణ పఠనం జరిగేచోట మారుతి కూడా వచ్చి కూర్చుని ఆలకిస్తాడు.  అందువల్లనే రామాయణ ప్రవచనం జరిగే చోట ప్రత్యేకంగా మారుతి కోసం ఒక పీఠాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు.
బాబాకు కూడా మారుతిపై ప్రత్యేకమయిన ప్రేమ ఉంది.  షిరిడిలోని మారుతి దేవాలయం ముందు బాబాకు ‘ఆవేశం’ వస్తూ ఉండేది.
(అనుగ్రహ భాషణాలు ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)







Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List