ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
02.05.2018
బుధవారమ్
శ్రీ స్వామీజీ భక్తులతో జరిపిన
అనుగ్రహ భాషణమ్ - 17 వ.భాగమ్
శ్రీ సాయి పదానంద రాధాకృష్ణస్వామీజీ
గారు భక్తులనుద్దేశించి చేసిన ప్రసంగాలలోని విషయాలను “Swamiji talks to Devotees” పుస్తకంలోని
విషయాలను తెలుగులో అనువదించి అందిస్తున్నాను.
SrI sai Spiritual Centre, T.Nagar, Bangalore వారు ముద్రించారు. ఈ రోజు ఆ
ఈ పుస్తకానికి సంపాదకులు, ప్రొఫెసర్ పి.ఎస్.నారాయణ రావు, శ్రీ బి.కె. రఘు ప్రసాద్
గార్లు. సాయిలీల.ఆర్గ్ నుండి గ్రహింపబడినది.
తెలుగు అనువాదమ్
: ఆత్రేయపురపు త్యాగరాజు
01.12.1971 : ఈ రోజు
స్వామీజీ ఆధ్యాత్మిక వాతావరణం గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ మందిరం ఆధ్యాత్మికరంగానికి సంబంధించినవారందరూ
సమావేశమవడానికి ఎంతగానో ఉపయోగపడుతోంది. ఇక్కడ
సమావేశమయిన ప్రతివారికీ ఆధ్యాత్మికంగా ఎదగడానికి అవసరమయిన వాతావరణాన్ని కల్పిస్తూ ఉంది.
మనలో ఉన్నటువంటి అధమమైన కోరికలను అదుపులో ఉంచమని
మనమందరం ఈ మందిరంలో భగవంతుడిని ప్రార్ధించుకోవచ్చు. భగవంతుడు మనలను అనుగ్రహించి మన హృదయాన్ని జయిస్తే
తప్ప మనలోని అధమమయిన కోరికలను మనం జయించలేమని మీకందరికీ తెలుసు. కబీరు, తులసీదాస్, కనక మొదలయినవారందరూ భగవంతుని
వేడుకొని ఆయన ముందు రోదించి తమ హృదయాలను వెలుగుతో నింపుకున్న పుణ్యపురుషులు. మనం ఈ మందిరాన్ని కూడా వెలుగుతో నింపగలం. కాని మనలో అంతర్గతంగా ఉన్న మందిరం అనగా హృదయాన్ని
వెలుగుతో ఏవిధంగా నింపగలము? మన హృదయమందిరాన్ని
వెలుగుతో నింపుకోవాలంటే దానికి ముఖ్యమయినది భగవన్నామమే. భగవన్నామాన్ని జపిస్తూ మన హృదయమందిరాన్ని తెఱవాలి.
బాబా ద్వారకామాయిలో రాత్రంతా వెలుగుతూ ఉండేలా దీపాలను
వెలిగించి ఉంచేవారు. ఆవిషయం మనకందరికీ తెలుసు. దీనిద్వారా మనం గ్రహించవలసిన విషయం ఏమిటి?
ఆవిధంగానే మనం కూడా నిరంతరం భగవన్నామస్మరణ అనే దీపాన్ని
వెలిగించి మన హృదయాన్ని ఎల్లప్పుడూ వెలుగుతో నింపాలి. ఆదీపం ఆరిపోకుండా నిరంతరం వెలుగుతూనే ఉండాలి. ఈరోజు మనం ఈ మందిరాన్ని వేయిదీపాలను వెలిగించి వెలుగుతో
నింపేశాము. బాబాకు దీపాలను వెలిగించడమంటే ఎంతో
యిష్టం. ఈరోజు బాబా మనం వెలిగించిన దీపాలను
చూసి ఎంతో ప్రీతిచెంది మనలని తప్పకుండా అనుగ్రహిస్తారు. భగవంతుని యొక్క అనుగ్రహం, పరిపూర్ణమయిన యోగులయినంటువంటి
బాబా, శ్రీరామకృష్ణపరమహంసలాంటి వారి ద్వారానే మనందరిమీద ప్రసరిస్తుంది. వారందరూ మనలని
అనుగ్రహించడానికి సదా సంసిధ్ధులయి ఉంటారు.
వారి అనుగ్రహం మనమీద ప్రసరింపబడాలంటే మన జ్ఞాననేత్రం తెఱచుకుని ఉండాలి.
(ధ్యానం చేసుకునే సమయంలో మూడవ కన్ను తెఱచుకుంటుంది. ఒక్కొక్కసారి భూత భవిష్యత్ కాలాలు కూడా కనిపిస్తాయి...)
తోతాపురి, శ్రీరామకృష్ణులవారి జ్ఞాననేత్రాన్ని ఏవిధంగా
తెఱచారో మీకందరికీ తెలుసు. అదేవిధంగా శ్రీరామకృష్ణపరమహంస
స్వామి వివేకానందులవారిని స్పృశించగానే వివేకానందులవారికి మూడవనేత్రం (జ్ఞాననేత్రం) తెఱచుకుని బ్రహ్మజ్ఞానం
అవగతమయింది. ఆవిధంగా మహామహిమాన్వితులయిన సాధువులు
జ్ఞాననేత్రాన్ని తెఱచి అనుగ్రహిస్తారు. ఆధ్యాత్మిక
మార్గప్రయాణంలో ఎటువంటి ప్రయాస లేకుండా భగవంతుడు మనకు మంచి బుధ్ధిని, మంచి మనస్సును,
పవిత్రమయిన విషయాలను ప్రసాదించుగాక.
(తోతాపురి – 1864 వ.సంవత్సరం
చివరలో ఈయన దక్షిణేశ్వర్ లోని దేవాలయానికి వచ్చారు. ఏడువందలమంది సన్న్యాసులకు నాయకత్వం వహించారు.)
03.12.1971 : స్వామీజీ
ఈరోజు సమావేశమయిన భక్తులందరినీ ఉద్దేశించి ప్రసంగించారు. “ప్రతివారు తమకి మనశ్శాంతి కరువయిందని, చాలా అస్థిమితంగా
ఉన్నామని తమ బాధలను చెప్పుకుంటూ ఉంటారు.ఇటువంటి వ్యాకులతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటిని దాటుకొని బయటబడటం ఎలా? మానవులకి కష్టాలను, సమస్యలను ఎదుర్కొనే ధైర్యం లేదు. ఈప్రాపంచిక ఐహికసుఖాలను పూర్తిగా త్యజించి సర్వసంగ
పరిత్యాగి అయినవాడు మాత్రమే కష్టాలు, బాధలలో ఉన్న మానవులకి మార్గం చూపించగలడు. నాదగ్గరకు వచ్చేవారు తమ బాధలను సమస్యలను విన్నవించుకుంటుంటే
వారికి శాంతిని ఏవిధంగా చేకూర్చాలో తెలియక నేను చాలా కలవరపడుతూ ఉండేవాడిని. తమబాధలను
నాతో చెప్పుకోవడానికి రోజంతా నావద్దకు వస్తూనే ఉండేవారు. కాని చాలా కొద్దిమంది మాత్రం మంచి మంచి విశేషాలు
ఏమన్నా ఉంటే చెబుతూ ఉండేవారు. మనం పడే బాధలనుంచి
బయటపడటమెలాగో క్రమక్రమంగా మనకు మనమే నేర్చుకోవాలి. మనం ఆవిధంగా ఎలా చేయగలం? అందుకోసం మనం చేయవలసినది
మన హృదయాలను విససింపచేసుకోవాలి. “నేను అందరిలోను
ఉన్నాను. నేనే భగవంతుడను. ఆయన నాలో ఉన్నాడు. నేను ఆయనలో ఉన్నాను” అనే ఈ భావాన్ని మనం అలవరచుకోవాలి. మనకు మనమే భగవంతునితో పోల్చుకొని ప్రాపంచిక విషయాలపై
ఆసక్తి లేకుండా జీవించడమే ఈవిధానం. ఈ భావంతోనే
మన మనస్సు పూర్తిగా నిండిపోయినట్లయితే ఈప్రపంచంలో అనవసరమయిన విషయాలన్నిటిమీదా అనురక్తి
నశిస్తుంది. నీకేదయినా సమస్య వచ్చినపుడు కొంతసేపు ఒకచోట స్థిరంగా, ప్రశాంతంగా కూర్చోవాలి.
(ఆఫీసునుండి రాగానే నేను ధ్యానం చేసుకునేందుకు కూర్చున్న అయిదు నిమిషాలకు తరువాత రోజు జరగబోయే సమస్యకు దానిద్వారా జరగబోయే పరిణామాలనించి బయట పడేందుకు భగవంతుడు నన్ను హెచ్చరించి ఆవిధంగా జరగకుండా కాపాడాడు. లేకపోతే ఉద్యోగ విధినిర్వహణలో అప్రమత్తంగా లేనందుకు ఏమయిఉండేదో భగవంతునికే తెలుసు.... ఈ విషయం ఎందుకు చెప్పవలసివచ్చిందంటే ధ్యానం వల్ల కలిగే మంచి గురించి తెలియచేయడానికే..... త్యాగరాజు)
అప్పుడు
నీకు వచ్చిన సమస్యకు పరిష్కారం నీమనసులో మెదులుతుంది. ఆతరువాత నీవేమి చేయాలో నీకు నీవే నిర్ణయించుకోగలవు. సన్యాసయినా, సంసారయినా యిదే పధ్ధతిని పాటించవచ్చు. నువ్వెప్పుడయినా భజనలకి, వెళ్ళి అందులో పాల్గొన్నపుడు
‘నేను ఈశరీరాన్ని’ అనే విషయాన్ని మరచిపోవాలి.
ఈ విధమయిన భావన కలిగి ఉంటే ఆభజనల వల్ల నీకెంతో ప్రశాంతత లభించి మనస్సు హాయిగా
ఉంటుంది.
ముఖ్యంగా భజనలలో పాల్గొన్నపుడల్లా యిదే భావంతో ఉండటం అలవాటు చేసుకోవాలి. భజనలలో
పాల్గొనేవారు ఎవరయినా భగవంతునిమీదనే మనస్సును కేంద్రీకరించి నిజంగా ఉండగలుగుతున్నారా? ఆవిధంగా ఉండలేకపోవడమే అసలు సమస్య.
(మీకొక ఉదాహరణ చెబుతాను. మనం శుభకార్యాల సమయంలో ఎవరయినా సత్యనారాయణస్వామి
వారి వ్రతాలకు పిలిచినప్పుడు వెడుతూ ఉంటాము.
ఆసమయంలో పురోహితులవారు వ్రతకధ చెబుతున్నపుడు మొత్తం అయిదు కధలను మనలో ఎంతమందిమి
శ్రధ్ధగా వింటున్నాము.
మధ్యలో వచ్చేవారు వస్తూ
ఉంటారు. వచ్చిన వారు బంధువులయితే కాఫీలు తాగుతారా, టిపిన్ చేస్తారా అని అతిధి మర్యాదలు
కూడా చేస్తూ ఉంటారు ఆహ్వానించినవారు. బహుశ
మధ్యలో ఎవరూ వెళ్లరనుకోండి. కాని వ్రత కధ చెబుతున్నంత
సేపూ మనలో కొంతమందిమి లోకాభిరామాయణం మాట్లాడుకుంటూనే ఉంటాము. శ్రధ్ధగా వినేవారికి కూడా ఆకధలు ఏమీ విపబడవు. అంతకు ముందు చాలా సార్లు విన్న కధలే కదా మళ్ళీ మళ్ళీ
ఏమి వింటాములె అనే ఒక నిర్లక్ష్యమా? మనమందరం
ఒక్కసారి ఆలోచిస్తే మనం చేసే పొరబాట్లు మనకే తెలుస్తాయి… త్యాగరాజు)
ఈసమస్యకు పరిష్కారమేమిటి? గుడిలోకి ప్రవేశిస్తున్నపుడే “నేను భగవంతుని సన్నిధానంలోకి
ప్రవేశిస్తున్నాను. భగవంతునిపైనే ధ్యాసతప్ప
మిగిలిన విషయాలేమీ గుర్తుకు రాకూడదు. వాటినేమీ
మన మనస్సులోకి రానీయకూడదు” అని అనుకుంటు ఎందుకని ప్రవేశించరు? భజనలు జరిగే సమయంలో ఎవరయినా భగవంతుని మీదనే దృష్టిపెడుతున్నారా? నిజం చెప్పండి. ఇదే ముఖ్యమయిన సమస్య అవునా? ప్రతిరోజు ఒక గంటన్నరపాటు ప్రపంచాన్ని మరచిపోవడానికి
ప్రయత్నించండి.
రుద్రాధ్యాయ పారాయణ జరుగుతున్న
సమయంలో ఆ భగవంతుని మీదనే దృష్టిని నిలుపుకొనండి.
గుడిలోకి ప్రవేశించగానే ‘నేను భగవంతుని సన్నిధానంలో ఆయనతోనే ఉన్నాను” అనే భావాన్ని
కలిగిఉండటంవల్ల నీలో ‘తప్పుడు అహంభావం’ ప్రవేశిస్తున్నట్లు కాదు. మరొకవిధంగా చెప్పాలంటే
అది ‘సాత్విక అహంభావం’. సామూహికంగా ప్రార్ధనలు
భజనలు జరిగే చోటకి నువ్వు ప్రవేశించగానే నీలో భగవంతుడు ఉన్నాడనీ, అక్కడ ఉన్నవారందరిలోను
భగవంతుడు ఉన్నాడనే భావాన్ని కలిగి ఉండు. ఇదే
నిజమయిన కైలాసం. రుద్రాధ్యాయ పారాయణ ప్రారంభమవుతుడండగానే
‘శివా, శివా’ అని అనుకో. దానివల్ల నీబుధ్ధి
వికసించి ఆయన అనుగ్రహం నీమీదపడటానికి కారణమవుతుంది. తమిళంలో ఒక విషయం చెప్పబడింది. అదేమిటంటే నీకేదయినా కష్టం కలిగినపుడు ప్రశాంతంగా
కూర్చొని ‘శివా, శివా’ అనుకో. “జీవా శివా శివా
జీవా’. ఈ విధానాన్ని అవలంబించాలి. నీహృదయంలోనే భగవంతుడు ఉన్న కారణంగా నీహృదయంలోనికి
వెలుగు ప్రవేశిస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానం
పెంపొందించుకోవడానికి మంత్రోఛ్ఛారణ వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. మీరు యింటిలో ఉన్నపుడు గృహసంబంధిత చికాకులు మిమ్మల్ని
చుట్టుముట్టినపుడు ‘ఓమ్ శాంతిః, శాంతిః, శాంతిః’ అని శాంతిః” అనే పదాన్ని మూడు సార్లు
ఉఛ్ఛరించండి. ఆవిధంగా చేసినట్లయితే మీకు నిజమయిన
శాంతి లభిస్తుంది. ఈ విషయం ‘శృతు’ లలో చెప్పబడింది.
(శృతి - సంస్కృత పదం.
శృతులు --- ఆదిమ ఋషులు తమ స్వీయ అనుభవాల
ద్వారా నానా విధాలుగా ఈ శృతులను వర్ణించి తెలియ జేశారు. ‘శృతి’ అనగా విన్నది అని అర్ధం. శృతులను వేదాలు
అని కూడా అంటారు.) వికీపీడియానుంచి సేకరణ….
త్యాగరాజు)
రెండవ ‘శాంతిః’ మనను
ఆవరించి ఉన్న పంచకోశములలోను నిండి ఉంటుంది.
మూడవ ‘శాంతిః’ మన హృదయంలో ఉంటుంది.
అదే మనలోనున్న ఆనందం. అనగా ఆనందం బ్రహ్మ. ఆనంద సర్వా… ఈ శాంతిః చెవులు, కన్నులు మొదలయిన వాటి
బయట ఉండదు. అది నీహృదయంలో మాత్రమే ఉంటుంది.
(స్వామీజీవారి అనుగ్రహభాషణాలు
ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment