ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
13.05.2018 ఆదివారమ్
సాయిభక్తులందరికి ఒక మనవి. ఈ నెల 25వ.తారీకున అట్లాంటా (అమెరికాకు) వెడుతున్నాము. ఈ లోపుగా వీలును బట్టి శ్రీస్వామీజీగారి అనుగ్రహ భాషణాలు ప్రచురిస్తాను. వీలు కుదరకపోతే అట్లాంటానుంచి ప్రచురిస్తూ ఉంటాను. ఓమ్ సాయిరామ్
శ్రీ స్వామీజీ భక్తులతో జరిపిన అనుగ్రహ భాషణమ్ - 18 వ.భాగమ్
శ్రీ స్వామీజీ భక్తులతో జరిపిన అనుగ్రహ భాషణమ్ - 18 వ.భాగమ్
శ్రీ సాయి పదానంద రాధాకృష్ణస్వామీజీ
గారు భక్తులనుద్దేశించి
చేసిన ప్రసంగాలలోని విషయాలను “Swamiji talks to Devotees” పుస్తకంలోని విషయాలను తెలుగులో అనువదించి అందిస్తున్నాను. SrI sai
Spiritual Centre, T.Nagar, Bangalore వారు ముద్రించారు. ఈ రోజు ఆ ఈ పుస్తకానికి సంపాదకులు, ప్రొఫెసర్ పి.ఎస్.నారాయణ రావు, శ్రీ బి.కె. రఘు ప్రసాద్ గార్లు. సాయిలీల.ఆర్గ్ నుండి గ్రహింపబడినది.
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
07.12.1971 : స్వామీజీ ఈ రోజు మాయ గురించి చాలా వివరంగా చెప్పారు. “ఈమాయ అనేది చాలా జిత్తులమారి. భగవంతునియొక్క అనుగ్రహమే లేకపోయినట్లయితే, ఈ మాయను జయించడం సాధ్యం కాదు.
మాయను జయించాలంటే భగవదనుగ్రహం ఎంత ముఖ్యమయినదో నారదులవారి వృత్తాంతం తెలియజేస్తుంది.
ఒకసారి నారదులవారు తపస్సు చేసుకుంటూ ఉండగా ఇంద్రుడు అసూయతో అతని తపస్సును భంగపరచడానికి రంభ, ఊర్వశి, మేనకలతో సహా ఎంతోమంది నాట్యకత్తెలను పంపించాడు. నారదుడు పూర్తిగా భగవంతునియందే దృష్టిని నిలిపి తపమాచరిస్తున్నందువల్ల తనముందు ఎంతోమంది నాట్యం చేస్తున్నా ఏమాత్రం చలించలేదు. తమ నాట్యం ఆ నారదులవారిని కాస్తకూడా చలింపలేకపోవడం వల్ల ఆనాట్యకత్తెలందరూ తాము చేసిన పనికిమాలిన పనికి సిగ్గుపడి నారదునిముందు సాష్టాంగపడి తమదారిన వెళ్ళిపోయారు. తన ముందు ఎంతోమంది అందగత్తెలు నాట్యం చేసినా ఎటువంటి వ్యామోహంలోను పడకుండా కామాన్ని జయించాననే గర్వం నారదునిలో తలెత్తింది. ఆవిధంతా తాను కామాన్ని జయించానని బ్రహ్మ, విష్ణు, శివుల ముందు గొప్పగా చెప్పుకున్నాడు. కాని విష్ణువు నారదునికి మంచి గుణపాఠం చెప్పాలనుకున్నాడు. ఆ తరువాత నారదుడు ఒక మహారాజ భవనానికి వెళ్ళాడు. ఆ రాజకుమార్తె అధ్బుత సౌందర్యరాశి. ఆమెను నారదుడు వివాహం చేసుకోదలిచాడు. కాని ఆ రాకుమార్తె స్వయంవరంలో విష్ణువుని తప్ప మరెవరినీ వివాహమాడనని ప్రతిజ్ఞ చేసింది. అందువల్ల నారదునికి ఆమెను వివాహమాడె అవకాశం లేకపోయింది. అంతే కాక విష్ణువు నారదునికి కోతిరూపునిచ్చాడు. కోతిరూపంలో ఉన్న నారదునికి రాకుమార్తెను వివాహమాడె అవకాశం లేకుండా పోయింది.
ఆతరువాత స్వయంవరానికి వచ్ఛిన విష్ణువు ఆమెను వివాహమాడి అక్కడినుండి అదృశ్యమయాడు. ఈలోపుగా విష్ణువు నారదునికి అసలు రూపాన్ని ప్రసాదించాడు. ఆతరువాత జన్మలో శ్రీమహావిష్ణువు శ్రీరామునిగాను, ఆయన వివాహమాడిని రాకుమారి సీతగాను జన్మించారు. ఎన్నోజన్మలనెత్తి ఎంతో తపస్సు కూడా చేసిన నారదునివంటి మహాతపస్వి కూడా మాయాప్రభావానికి పాల్పడక తప్పలేదని ఈ సంఘటన మనకి తెలియజేస్తుంది. నారదునిలో ఉన్న అంతర్గత అహంకారమే ఆయన పతనానికి కారణమయింది. ఆతరువాత విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల నారదులవారి వ్యక్తిత్వం యధాస్థితికి వచ్చింది. భగవంతుడు అందువల్లనే ‘మమ మాయా దురత్యయా’ అని చెప్పాడు. “నాభక్తుని నేను మాయామోహంలో పడనివ్వను” అని కూడా భగవానుడు చెప్పాడు.
దైవీ హ్యేషా గుణమయి మమ మాయా దురత్యయా
మామేవ యే ప్రపద్యంతే
మాయామేతా తరంతితే (అ.7 శ్లో.14)
నామాయ త్రిగుణాత్మకమైనది. అలౌకికమైనది. ఇది అధిగమించుటకు సాధ్యము కానిది. కాని కేవలము నన్నే భజించువారు ఈమాయను అధిగమించి సంసారసముద్రమునుండి బయటపడగలరు.
08.12.1971 ; ఈ రోజు
స్వామీజీ మాయను అధిగమించడానికి వైరాగ్యం ఏవిధంగా సహాయపడుతుందో వివరంగా చెప్పారు. ఈ మాయ మనలో ఒక్క వ్యామోహ రూపంలోనే కాదు క్రోధము,
పగ దురాశ గర్వం అసూయ రూపాలలో మనలో నిండి ఉంటుంది. జ్ఞానాన్ని పొందాలంటే వైరాగ్యం ముఖ్యమని భగవానుడు
చెప్పాడు. ‘నేను ఈ శరీరాన్ని’ అనే భావన మనలోనుండి
పోవాలి. ఇది పోవాలంటే సత్కర్మలను చేయడం ద్వారానే
సాధ్యపడుతుంది. సత్కర్మలు చేయడం వల్ల మన బుధ్ధి,
మనస్సు, స్వచ్చంగా ఉంటాయి. అపుడే జ్ఞానం సిధ్ధిస్తుందని
భగవానుడు చెప్పాడు. వీటిని పొందాలంటే వైరాగ్యం
అవసరం. ఆధ్యాత్మికంగా అభ్యాసం చేసినట్లయితే
వైరాగ్యాన్ని పొంపొందించుకోగలం. ‘నేను ఈ శరీరాన్ని
కాదు’ అనే విషయం మనకి భక్తియోగం ద్వారా అవగతమవుతుంది. ఎప్పుడయితే ‘నేను ఈ శరీరాన్ని కాదు’ అని మనకు బోధపడుతుందో
అపుడే మనలో నున్న అహంకారం తొలగిపోయి మన మనస్సు స్వచ్చంగా ప్రకాశిస్తుంది. ప్రకాశవంతమయిన వెలుగుతో నిండిపోతుంది. ఆవిధంగా జ్ఞానాన్ని
పొందినవానికి ‘అంతా నేనే’ ‘నేను ఈ విశాలప్రపంచంలో ఉన్నాను’ ‘ఈ విశ్వమంతా నాలో ఉంది’ అనే
భావం అతని మనసులో మెదలడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా
కావలసినదేమిటంటే మనలోనున్న ఆకోరికలన్నీ పూర్తిగా నశించిపోవాలి. ఆతరువాతే మానవుడు మోక్షాన్ని పొందడానికి తగిన స్థితి
లభిస్తుంది. కామం, క్రోధం, లోభం యివన్నీ మానవుడిని
అజ్ఞానంలోకి నెట్టి భగవంతుని గురించి తెలుసుకునేందుకు అడ్డంకులను కలిగిస్తాయి. అందువల్లనే గీతలో భగవానుడు ‘త్రయం త్యజేత్’ అని
చెప్పడానికి కారణం.
త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః
కామః క్రోధస్తధా లోభః
తస్మాదేతత్త్రయం త్యజేత్
(అ.16 శ్లో.21)
కామ,క్రోధ, లోభములు అను ఈ మూడును నరకద్వారములు. అవి ఆత్మ నాశనమునకు కారణములు. అనగా మనుజుని అధోగతి పాలు చేయునవి. కనుక ఈ మూడింటిని త్యజింపవలెను.వీటినన్నిటిని మనము భగవంతుని అనుగ్రహము వల్లనే త్యజింపగలము. భగవంతుని గురించి నిత్యం స్మరించడానికి ఉండే ప్రతి అవకాశాన్ని మనం ఉపయోగించుకున్నచో అది మనలను పరిశుధ్ధులను గావిస్తుంది. మనకు ఆకలిగా ఉన్నపుడు హోటలుకు వెళ్ళి ఏదో ఒకటి తింటాము. అలాగే మనకు వినోదం కావాలని అనిపించినపుడు సినిమాకు వెడతాము. అదేవిధంగా మన మనసులోకి భగవంతుని గురించిన అలోచన కలిగిన క్షణంలోనే గుడికి వెళ్ళి ప్రశాంతంగా ఆయనను దర్శించుకోవాలి. అటువంటి మధురమయిన క్షణాన్ని వెంటనే సద్వినియోగం చేసుకోవాలి. కారణమేమిటంటే అటువంటి అవకాశాలు భగవంతుడు మాత్రమే మనకు ప్రసాదిస్తాడు.
ఆధ్యాత్మిక అభ్యాసాల గురించి వివరిస్తూ స్వామీజీ మనమెవరిమో మన నిజ స్వరూపమేమిటో తెలుసుకోవాలని ఉపనిషత్తులు తెలియజేస్తున్నాయని అన్నారు. ఉపనిషత్తులలో చెప్పిన వివరణను స్వామి వివేకానంద ఏమని చెప్పారో మీకు గుర్తుందా? “లేవండి, మేల్కొనండి, లక్ష్యాన్ని సాధించేవరకు విశ్రమించవద్దు”.
అలాగే మన లక్ష్యం ఆధ్యాత్మికంగా ఎదగడం. ఆధ్యాతికతను సాధించాలంటే మనం పూర్తిగా మేలుకొనే ఉండాలి. ఎప్పుడు సోమరితనంగాను, మందకొడిగాను ఉండరాదు. ఆధ్యాత్మికంగా మన లక్ష్యాన్ని సాధించుకోవాలంటే దానికి అవసరమయిన ప్రతి ప్రయత్నం నిరంతరం కొనసాగిస్తూనే ఉండాలి.
(స్వామీజీ గారి అనుగ్రహ భాషణాలు ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment