Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, June 18, 2018

శ్రీ సాయిబాబా నేటికీ సజీవంగానే ఉండి సహాయం చేస్తున్నారా? - 1 వ.భాగమ్

Posted by tyagaraju on 6:16 PM








   





Image result for images of rose

19.06.2018 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు బాబా వారి మరొక అధ్బుతమయిన లీలలగురించి తెలుసుకుందాము.  మానవునికి కష్టాలు ఎదురయినపుడే భగవంతుడు గుర్తుకు వస్తాడు.  అప్పుడు ప్రతి దేవుడికి అనేక మొక్కుకు మొక్కుకుంటాడు.  అవసరం మానవుడిని భగవంతుడిని ప్రార్ధించేలా చేస్తుంది.  ఇక కష్టాలు తీరిపోగానే భగవంతుడిని మర్చిపోతాడు.  ఆవిధంగా కాకుండా నిరంతరం మనం భగవంతుడిని స్మరించుకుంటూనే ఉండాలి.  బాబా నేటికీ సజీవంగానే ఉండి సహాయపడుతున్నారా అన్న ప్రశ్నకు సమాధానమే ఈ రోజు మీరు చదవబోయేది.   సాయిలీలా.ఆర్గ్ నుండి సేకరించబడినది.

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు, అట్లాంటా (అమెరికా)
1 571 594 7354

శ్రీ సాయిబాబా నేటికీ సజీవంగానే ఉండి సహాయం చేస్తున్నారా? 1 వ.భాగమ్

దేశంలో ఎంతోమందికి ఉత్పన్నమయే పైన ఉదహరించిన ప్రశ్నకు, జిజ్ఞాసతో మరెన్నిటినో అడిగేవాటికి సంతృప్తికరమయిన సమాధానాలు సాయిబాబా తెలియచేస్తూ ఉంటారు.  ఆ ప్రశ్న సామాన్యంగా ఏదో కుతూహలంతో తెలుసుకోవడానికి వేసిన ప్రశ్న కాదు.  అవసరాన్ని బట్టి ఆ ప్రశ్న ఉదయిస్తూ ఉంటుంది.  కష్టాలనెదుర్కొనేవాళ్ళు వేలమంది ఉంటూ ఉంటారు.  అటువంటి సమయంలో తమ కష్టాలను రూపుమాపి తమను ఆదుకునేవారు ఎవరున్నారా అని నలుదిశలా దృష్టి సారిస్తూఉంటారు.  ఆదుకోవడానికి భగవంతుడు లేడా?  సాధుపుంగవులు లేరా,  ఏదయినా మంత్రం ఉందా,  న కష్టాలు తీరడానికి మరేదయినా మార్గం ఉందా  అని  ఈ విధంగా కష్టాలలో ఉన్నవారు ఆర్తితో విలపిస్తూ ఉంటారు.  అటువంటి కష్టసమయాలలో నేటికీ సజీవంగా ఉండి సహాయపడేది ఒక్క సాయిబాబాయే అనే ధృఢనిశ్చయంతో, సాయిబాబాతో అనుబంధాన్ని పెచుకున్న వ్యక్తి దగ్గరకు, లేక తన పొరుగున ఎవరయినా ఉన్నట్లయితే వారి వద్దకు గాని సాయిబాబా సహాయానికై పరుగు తీస్తాడు.  అందువల్ల ప్రజలందరికీ వారి వారి భాషలలో గాని, ఆంగ్లంలో గాని హిందీలో గాని చాలా వివరంగా బాబా ఇప్పటికీ సజీవంగానే ఉండి తన విలక్షణమయిన రీతిలో సహాయపడగల వ్యక్తి ఆయన తప్ప, మనకు తెలుసున్నవారిలో మరెవరూ లేరనే విషయాన్ని తెలియచేయవలసిన ఆవశ్యకత ఎంతయినా ఉంది.  



అతీంద్రియ శక్తులు కలిగి అందరికీ సాయపడే సిధ్ధపురుషుడు, తనమీదనే నమ్మకం ఉంచుకున్నవారందరికీ లబ్ధి చేకూర్చుదామనే ఉద్దేశ్యం ఉన్న మహాపురుషుడు సాయిబాబా తప్ప మరెవరూ లేరనే, భావంతోను, పరిపూర్ణమయిన నమ్మకంతోను ఆయనని ఆశ్రయిస్తాడు. ఉత్తమమయిన కారణం ఏమీ లేకుండా, దైవిక లక్షణాలేమీ లేకుండా కేవలం కూటికోసం  ఏవో గారడీ విద్యలు, ఇంద్రజాల ప్రదర్శనలు, మనశ్శక్తితో చేసే చర్యలు చేసినంత మాత్రాన అటువంటివారు  ఆధ్యాత్మికంగా ఎదగదలచుకునే దైవభక్తి కలవారిని ఏవిధంగాను ప్రభావితం చేయలేరు.  కాని శాస్త్రీయంగా నిరూపించలేని సుప్రసిధ్ధమయిన సంఘటనలు విద్యావంతులు, సంస్కారవంతులు మొదలయినవారినందరినీ ఆకర్షిస్తాయి.  ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా మనం ముందుకు వెడదాము.

చంచలమయిన మనస్సు కలవారికి కూడా బాబా ఇప్పటికీ సజీవంగానే ఉన్నారని, ఆయన సర్వశక్తిమంతులని, ఏ సమయంలోనయినా ఆయన అవసరం తప్పక ఉంటుందని నిరూపించే సంఘటనలు, సందర్భాలు వివరంగా మీకోసం.

బాబాగారి లీలలు, చమత్కారాలు, చాలా వైవిధ్య భరితంగా ఉంటాయి.  అవి ఎంతో కాలంనుండి జరుగుతూనే ఉన్నాయి.  బాబాగారు జీవించి ఉన్నప్పటినుంచి జరుగుతూ ఉన్న అద్భుతమయిన సంఘటనలు, చమత్కారాలు ఇప్పటికీ ఎందరో సాయిభక్తులకు అనుభవమే.  మాటిమాటికి క్రొత్త ప్రదేశాలలో ఎన్నో విధాలుగా అవి జరుగుతూనే ఉన్నాయి. బాబా దృష్టిలో అందరూ సమానమే.  కుల,మత,వయస్సు, లింగభేదాలు, మనుషుల హోదా గురించి గాని ఎటువంటి భేదం లేకుండా అందరినీ సమదృష్టితో చూస్తారు బాబా.  ఆయన భక్తులందరూ ఆయననే తమ దైవంగా, దేవతగా ఒక సద్గురువుగా పిలిచిన వెంటనే పలికే దైవంగా కొలిచి పూజిస్తూ ఉంటారు.  ఈ మధ్యకాలం వరకు బాబా చూపించిన లీలలగురించి ఎన్నో పుస్తకాలు (శ్రీసాయి సత్ చరిత్ర) ఉన్నాయి.

ఇపుడు తూర్పుగోదావరి జిల్లా, రామచంద్రపురంలో మాతృశ్రీ కృష్ణాబాయిగారికి బాబావారు చూపించిన అద్భుతమయిన లీలల గురించి తెలుసుకుందాము.

మాతృశ్రీ కృష్ణాబాయి గారి భర్త శేషగిరిరావుగారు.  ఆయన సిమ్లాలోని అక్కౌన్ టెంట్ జనరల్ పోస్టల్, టెలిగ్రాఫ్ డిపార్ట్ మెంట్ లో సూపరింన్ టెండెంట్ గా పని చేస్తున్నారు.  శ్రీ శేషగిరిరావుగారు నాగపూర్ లో ఉన్న రోజులలో అక్కడ నివసించే దక్షిణాది ప్రజలందరూ బాబాను ఆరాధిస్తూ ఆయన గురించిన వాస్తవాలను తెలియజేస్తూ ఉండేవారు.  అపుడే మొట్టమొదటిసారిగా ఆయనకు బాబా గురించి చాలా స్వల్పమయిన అవగాహన ఏర్పడింది.  ఇంతకుముందు చెప్పినట్లుగా అవసరం ఆయనకు బాబాపై నమ్మకాన్ని కలుగచేసింది.  1946 వ.సంవత్సరంలో ఒకసారి ఆయనకు చాలా పెద్ద ఇబ్బంది కలిగింది.  నాగపూర్  అక్కౌన్ టెంట్ జనరల్ పోస్టల్ అండ్  టెలిగ్రాఫ్ శాఖలో  ఆయన సూపరింటెండెంట్ గా పెద్ద హోదాలో ఉన్నారు.  ఆయనకు ట్రెజరీకి సంబంధించిన తాళాలు కూడా ఇవ్వబడ్డాయి.  వాటి బాధ్యత మొత్తం ఆయనమీద ఉంది.  ఆయన ఆ తాళాలను తన బల్ల సొరుగులో ఉంచి ఆసొరుగు తాళం చెవిని తన వద్దనే ఉంచుకునేవారు.  ఒకరోజు ఉదయాన్నే ఆఫీసుకు వచ్చి సొరుగు తెఱచి చూస్తే ట్రెజరీ తాళాలు కనిపించలేదు.  సొరుగంతా వెతికినా తాళాలు కనిపించలేదు.  అంత విచిత్రంగా ఎలా మాయమయ్యాయో ఆయనకు అర్ధం కాలేదు.  తాళాలు పోయాయని వివరణ ఇచ్చుకోవడానికి కూడా లేదు.  తన ఉద్యోగానికే ప్రమాదం.  ఏమి చేయాలో పాలుపోలేదు ఆయనకి.  పై అధికారులతో మాట పడటమే కాకుండా తన హోదాకు, గౌరవానికి భగం వాటిల్లక తప్పని పరిస్థితి.  పీకల్లోతు కష్టంలో తాను మునిగిపోయాడు.  ఏమి ఏయాలో పాలుపోని పరిస్థితిలో అకస్మాత్తుగా ఆయనకి బాబా గుర్తుకు వచ్చారు.  “బాబా నువ్వే కనక శక్తిమంతుడివి, సహాయపడేవాడివి అయితే నాకు తాళాలు దొరికేటట్లుచేయి” అని ప్రార్ధించారు.  ఆయన  ఆవిధంగా ప్రార్ధించిన వెంటనే మరలా తన బల్ల వద్దకు వెళ్ళి సొరుగు తెఱచి చూశారు.  ఈసారి ఏమయిందో గమనించండి.  ఆశ్చర్యం సొరుగులో తన కళ్ళెదురుగానే తాళాలు కనిపించాయి.  ఆయనకు చాలా ఆశ్చర్యం కలిగింది.  అంతకుముందు తాను ఎన్నోసార్లు వెతికాడు.  ఆఖరికి తన సేవకులు కూడా వెతికారు.  అపుడు కనిపించని తాళాలు ఇపుడింత హటాత్తుగా ఎలా కనిపించాయో ఆయనకర్ధం కాలేదు.  ఈ సంఘటనతో ఆయనకి బాబా మీద కాస్త నమ్మకం ఏర్పడింది.  కాని సాయితత్వం ప్రచారంలోని రావడానికి చాలా శక్తివంతంగా ముఖ్యమయిన పాత్ర పోషించినది ఆయన భార్య.  మొట్టమొదట్లో ఆమెకు కూడా సాయిగురించి అంతగా పరిజ్ఞానం లేదు.  1950 వ.సంవత్సరం మే-జూన్ మాసాలలో ఆమె రామచంద్రపురంలో ఉన్న తన తండ్రిగారి ఇంటిలో ఉంది. ఆమె భర్త అనారోగ్య కారణాలవల్ల విశ్రాంతి తీసుకుందామని  నాగపూర్ నుంచి రామచంద్రపురం వచ్చి తన మామగారింటిలో ఉన్నారు.  ఆయన తిరిగి 1950 వ.సంవత్సరం జూన్ 16 న తిరిగి నాగపూర్ వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు.  కాని అనుకోకుండా ఆవిడకి 14 వ.తారీకున అనారోగ్యం చేసింది.  ఆవిడ ప్రతిరోజు ఉదయం 5 – 6 గంటల మధ్య లేచేది.  కాని ఆరోజు ఉదయం 10 గంటలయినా లేవలేదు.  విషయం ఏమిటో తెలుసుకుందామని 10 గంటలకు ఆమె భర్త గదిలోకి వెళ్ళి చూశారు.  ఆయన గదిలోకి రాగానే ఆవిడ మెల్లగా కళ్ళు తెఱచి తన దగ్గరగా రమ్మని పిలిచింది.  ఆమె స్వరం చాలా బలహీనంగా ఉంది.  ఆమె ఏడుస్తూ “నేను చనిపోతున్నాను.  పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి” అని చెప్పింది.  ఆమె మాటలు వినగానే ఆయన స్థాణువయ్యాడు.  “నీకేమిటి బాధ.  దేనికంతగా బాధపడుతున్నావు? చెప్పు” అని ప్రశ్నించారు.  “నాబాధేమిటో నేనే చెప్పలేకుండా ఉన్నాను.  కాని రాత్రి ఒంటిగంటనుంచి విపరీతమయిన బాధగా ఉంది” అని చెప్పింది.  ఆమె సమాధానం విని ఆమెకు గుండె నొప్పి వచ్చి ఉంటుందనుకున్నారు శేషగిరి రావుగారు.  అపుడామె గదిలో ఒక మూలను చూపిస్తూ, “అదిగో అక్కడే ఉన్నాడు వాడు.  వాడి వల్లనే నేను ఒంటిగంటనుంచి చావుకు దగ్గరవుతున్నాను” అని చెప్పింది.  ఆమె మాటలు సంధిప్రేలాపనలుగా భావించి వెంటనే వైద్యం చేయించడం మంచిదనుకున్నారు.  ఆమె మళ్ళీ “నేను చెప్పిన మాటలను మీరు నమ్మరు.  అక్కడ ఉన్నవాడు నాకు కనబడుతున్నాడు.  మీరేమో నాకేమీ కాదని అంటున్నారు” అని అంది.  శేషగిరిరావుగారు మందు తీసుకునిరమ్మని తన మామగారితో చెప్పారు.  ఆవిడ మంచినీళ్ళు కూడా గుటకవేయలేని స్థితిలో ఉంది.  మందుని ఆమె నోటిలో బలవంతంగా వేసి మింగించారు.  కాని ఆమెకు చాలా అస్థిమితంగా ఉంది.  సాయంత్రం 6 , 7 గంటలకి ఆవిడ మరలా తన భర్తను దగ్గరకు పిలిచి “నేను మరణించబోతున్నాను.  మీరు నన్ను  నమ్మడంలేదు” అంది.  ఆవిడ భయం పోగొట్టడానికి ఆయన సాయిబాబాఫోటోని (ఆఫోటోని ఆయనకు నాగపూర్ లో ఆయన గుమాస్తా ఇచ్చాడు) ఆవిడ తలగడ క్రింద పెట్టి “ఈ సాయిబాబా అన్ని దుష్టశక్తులను పారద్రోలుతారు” అని చెప్పారు.  ఖచ్చితంగా సాయిబాబా ఆవిధంగా చేస్తారని ఆయనకు నమ్మకం లేకపోయినా అప్పటి పరిస్థితి, అవసరాన్ని బట్టి ఆయన ఆవిధంగా చెప్పారు.  ఆతరువాత ఆయన మేడమీదకు వెళ్ళి పడుకున్నారు.  క్రింద గదిలో ఆమె నిద్రపోతూ ఉంది.  ఆవిడ తండ్రి ప్రక్కనే ఆమెను కనిపెట్టుకుని కూర్చున్నారు.  అర్ధరాత్రి 12 గంటలకు ఆమెలేచి “నాన్నా, నాన్నా నేను చనిపోతున్నాను.  ఎవరో నాప్రాణాన్ని లాగేస్తున్నారు” అంటూ అరవసాగింది.  ఆమె తండ్రి వెంటనే  లేచి చూశారు.  అప్పటికే ఆమె శరీరం కొంతభాగం మంచం మీదనుంచి లాగబడి కాళ్ళు క్రిదకు వ్రేలాడుతూ ఉన్నాయి.  ఆయన తిరిగి ఆమె శరీరాన్ని మరలా మంచం మీదకు చేర్చారు.  అపుడు ఆ గదిలో కొన్ని మాటలు వినిపించాయి.  ఆవిడ సాయిబాబా, రాఘవేంద్రస్వామి వార్ల పేర్లు ఉచ్చరిస్తూ ఉంది.  వారిద్దరూ తనను రక్షించడానికి వచ్చారని చెప్పింది.  తన వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చిన తండ్రితో “తలగడను పైకెత్తి చూడండి.  దానిక్రింద ఒక పొట్లం ఉంది.  అందులో ఉన్నవాటిని నానోటిలో వేయండి” అని చెప్పింది.  ఆమె తలగడ క్రింద ఎవరూ ఎటువంటి మందుపొట్లం పెట్టలేదు కాబట్టి ఆమె భ్రమలో ఏవో పిచ్చిమాటలు మాట్లాడుతూ ఉందేమోనని భావించారు ఆయన.  కాని ఆవిడ మళ్ళీ ఆయనతో అవే మాటలు తిరిగి చెప్పి”నేను చెప్పినట్లు చేయండి వాదించద్దు నాతో” అంది.  ఆయన తలగడ పైకెత్తి చూశారు.  క్రింద ఒక పొట్లం ఉంది.  పొట్లం తీసి విప్పి చూశారు.  అందులో తమలపాకంత పెద్దదిగా ఉన్న తులసి ఆకు ఉంది.  అందులో విభూది కూడా ఉంది.  ఆయన ఆరెండిటినీ తీసి విభూదిని ఆమెనోట్లో వేశారు.  ఆతరువాత ఆమెకి మంచి నిద్రపట్టింది. ఆతరువాత ఆయన పరీక్షగా గమనించినపుడు ఆవిడ చీర మీదంతా విభూతి ఉంది.  మంచానికి నాలుగుప్రక్కలా రక్షణ రేఖలా విభూది గీతలు ఉన్నాయి.  ఆవిడ భర్త కూడా మేడమీదనుంచి వచ్చి అన్నీ గమనించారు.  అంతే కాదు ఆమె నుదిటిమీద విభూది చేతి ముద్రను కూడా గమనించారు.  ఆతరువాత అమె స్వస్థురాలయింది.  

కొంతసేపటి తరువాత, ఒక అణానాణాన్ని తన తలగడ క్రింద పెట్టమని రాఘవేంద్రస్వామి, సాయిబాబా ఇద్దరూ తనతో చెప్పారని ఆవిధంగా చేయమని భర్తతో చెప్పింది.  

ఆయన ఒక అణానాణాన్ని ఆమె తలగడ  క్రింద ఉంచారు.  మామగారు, అల్లుడు ఇద్దరూ ఆనాణాన్ని ఎవరు తీసుకుంటారో అది ఎలా మాయమవుతుందో చూద్దామని గమనిస్తూ ఉన్నారు.  అతరువాత ఇద్దరూ భోజనానికి వెళ్ళారు.  ఆసమయంలో కృష్ణాబాయి ఉన్న గదిలో కొన్ని సంభాషణలు వినిపించసాగాయి.  ఆయన లేచి గదిలోకి వెళ్ళారు.  గదంతా మంచి సుగంధ పరిమళంతో నిండి ఉంది.  రాఘవేంద్రస్వామి, సాయిబాబా ఇద్దరూ వచ్చి అణానాణాన్ని తీసుకున్నారని, దాని స్థానంలో ఏదో పెట్టి వెళ్ళారని దానిని చూడాలని ఉందని చెప్పింది.  ఆమె భర్త తలగడ ఎత్తి చూడగా దాని క్రింద అణానాణెం కనపడలేదు.  కాని దాని స్థానంలో అపుడె కోసి తెచ్చినట్లున్న తులసి ఆకులు, బిల్వపత్రాలు ఉన్నాయి.  ఇవి తన రక్షణకోసం ఉంచబడ్డాయని ఆమె చెప్పింది.  ఆరోజున ఆమె ఆరోగ్యంగా ఉండటం వల్ల మేడమీదకు వెళ్ళి పడుకుంది.  అర్ధరాత్రి 12 గంటలవేళ ఆమె గదిలో మళ్ళీ కొన్ని సంభాషణలు వినిపించాయి.  ఆమె భర్త మేడమీదకు వెళ్ళి చూస్తే ఆమె భగవద్గీతలోని కొన్ని శ్లోకాలను చదువుతూ ఉంది.   అవి ……

భగవద్గీత        అ.    4  శ్లో        7          యదాయధాహి ధర్మశ్య        
                       అ.   4  శ్లో        8           పరిత్రాణాయ సాధూనాం
                       అ.   5  శ్లో       22          అనన్యాశ్చింతయంతోమాం
                       అ. 18  శ్లో      66           సర్వధర్మాన్ పరిత్యజ్య

(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)







Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List