Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, July 12, 2018

శ్రీ సాయిబాబా నేటికీ సజీవంగానే ఉండి సహాయం చేస్తున్నారా? 3 వ.భాగమ్

Posted by tyagaraju on 6:58 PM

      Image result for images of shirdi saibaba
              Image result for images of rose hd
12.07.2018  గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయిబాబా నేటికీ సజీవంగానే ఉండి సహాయం చేస్తున్నారా?  3 .భాగమ్
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
అట్లాంటా (అమెరికా)  ఫోన్. నంబర్  :  1 571 594 7354

బాబా ముందు నైవేద్యానికి ఉంచబడిన పండ్ల మీద కూడా అక్షరాలు కనిపించాయి.  ఎస్.ఎన్. చౌదరిగారికి శ్రీ బి.వి.ఎన్. స్వామిగారికి ఇంకా అక్కడ ఉన్న భక్తులందరికీ బాబా తమయందు ఎంతో గొప్ప అనుగ్రహాన్ని చూపారన్నదానికి ప్రత్యక్ష నిదర్శనం కనిపించింది.  బాబా నేటికీ సజీవంగానే ఉండి సహాయం చేస్తున్నారా అన్న ప్రశ్నకు సమాధానం శ్రీ ఎస్.ఎన్. చౌదరిగారికి లభించింది.  ఇపుడు ప్రత్యక్షంగా ఆయనకు అనుభవపూర్వకంగా తెలిసింది.  బాబా ఇప్పటికీ సజీవంగానే ఉన్నారనీ, భక్తులు తీసుకువచ్చిన నైవేద్యాలను స్వీకరించారని తన భక్తులకు నిగూఢంగా సహాయపడుతూ ఉంటారనీ ప్రగాఢమయిన విశ్వాసం అందరిలోను కలిగింది.  ఈ సంఘటన ఆయనలో గొప్ప మార్పుని తీసుకొనివచ్చింది.  



ఇక ఆయనలో ఉన్న మానసిక అనారోగ్యం పోయింది.  ఆయనలో ఉన్న సంకోచాలు, భయాలు మొదలయినవన్నీ పటాపంచలయిపోయి మామూలు మనిషయ్యారు.  ఆరోజునుంచి ఎప్పటిలాగే కోర్టుకు కూడా వెళ్ళడం మొదలుపెట్టారు.  ఆయన ప్రాక్టీసు కూడా బాగా పెరిగింది.  ఆవిధంగా ఇంకా చాలామందికి పై ప్రశ్నకి నమ్మకమయిన సమాధానం లభించింది.  పూజ పూర్తవుతుండగా కృష్ణాబాయిగారు అనర్గళంగా చాలా వేగంగా తెలుగులో అనేక వేదాంత విషయాలు, దైవభక్తి గురించి ఇచ్చిన ఉపన్యాసం స్వామిగారు ఆలకించారు.  అక్కడ ఉన్న న్యాయవాదులు, పండితులు ఆమె ఉపన్యాసాన్ని తిరిగి చెప్పలేకపోవడమే కాక అనువాదం కూడా చేయలేకపోయారు.  రెండవరోజున ఆమె ద్వారా బాబాని  ప్రశ్నలు అడిగారు.  ఆరోగ్యం గురించి, మానవ సంబంధ బాంధవ్యాలు ఇంకా ఇతర విషయాలు గురించి కొంతమంది భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు లభించాయి.  బాబా ఇచ్చిన సమాధానాలు ఎంతో విశదంగాను. తృప్తికరంగాను వచ్చాయి.  పై ప్రశ్నకు ఖచ్చితమయిన సమాధానం ఇపుడు మనకి లభించింది.  ఇక అసలు విషయం శ్రీ వి.వి.ఎన్. స్వామిగారిని పిలిపించడానికి గల కారణం, దానికి సమాధానం -  శ్రీ వి.వి.ఎన్.స్వామిగారు ఇక ముందు ఏపని చేయనవసరం లేదని, ఆయన తన ప్రధాన కార్యాలయంలోనే ఉండి భక్తులకు, తోటి స్నేహితులకు బాబాకి సంబంధించిన పనిని అప్పగించమని చెప్పారు.  అన్ని పనులు సవ్యంగా జరుగుతాయని చెప్పారు.  క్రొత్తగా బాబా మందిర నిర్మాణ బాధ్యతను పెట్టుకున్న శ్రీ బి.వి.ఎన్. స్వామిగారి ప్రశ్నకు తగిన పరిష్కారం లభించింది.  శ్రీ బి.వెంకటరత్నంగారు కూడా అక్కడే ఉన్నారు.  ఆయన రామచంద్రపురంలో ఉన్న కో ఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు.  ఆయన ఇంకా మరికొందరి సహాయసహకారాలతో అతి సుందరమయిన బాబా మదిరాన్ని నిర్మించారు.  ఆ మందిరంలో పాలరాతి సాయిబాబా, రాధాకృష్ణుల విగ్రహాలను ప్రతిష్టించారు.  మందిర నిర్మాణంనుంచి విగ్రహ ప్రతిష్ట దాకా సాయిబాబా ఇచ్చిన సూచనల ప్రకారం అమలు చేసారు.  1954 ఏప్రిల్ 11 వ.తారీకు రామనవమి నాడు విగ్రహ ప్రతిష్ట జరిగింది.  కృష్ణాబాయిగారు ఆమందిరంలో పూజలు జరపసాగారు. 

పిఠాపురం రైల్వేస్టేషన్ నుంచి 20 మైళ్ళదూరంలో తోటపల్లి హిల్స్ అనే ప్రాంతం ఉంది.  అక్కడ శ్రీ ఓంకారస్వామిగారు శాంతి ఆశ్రమాన్ని నెలకొల్పారు.  అదే ముఖ్యమయిన ఆశ్రమం.  

            Image result for images of totapalli hills


          Image result for images of totapalli hills

ఆంగ్లంలో ‘పీస్’ తెలుగులో ‘శాంతి’ అనే వార్తా పత్రికల ద్వారా శాంతి గురించి ప్రచారం చేస్తూ, ఆయన ప్రశాంతమయిన జీవితం గడుపుతూ ఉండేవారు.  ఆయనయొక్క ప్రధానమయిన పని తాత్వికమైనది.  తత్వజ్ఞానానికి సంబంధించిన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండేవారు.  ‘కాస్మిక్ ఫ్లాషెస్’ అనే పుస్తకానికి ఆయన గ్రంధకర్త.  అరుదుగా కనిపించే ఆయన శైలి, పాండిత్యంలో ఆయన ఆలోచనలు గొప్పతనం ఉన్నత స్థానంలో ఉండేవి.  స్వామీజీకి సాయితో ఉన్న అనుబంధం వల్ల సాయిబాబా అనుగ్రహంతో ఆయన మరింతగా ఆధ్యాత్మికంగా పురోగతి సాధించారు.  ఆ విధంగా బాబా అనుగ్రహం ఆయనకు కలగడంవల్ల బాబా తన లీలలను చూపించసాగారు.  తోటపల్లి శాంతి ఆశ్రమంలో చాలా అసాధారణమయిన రీతిలో చమత్కారాలు ప్రారంభమయ్యాయి. 

ఆశ్రమంలో పుట్టినరోజు వేడుకలు జరుగుతున్న సందర్భంగా స్వామీజీగారి మహిళా భక్తులు కొందరు అక్కడికి వెళ్ళారు.  వారంతా సాయిబాబాకు గొప్ప భక్తులు.  అందు వల్ల వారంతా తమతోపాటుగా సాయిబాబా ఫోటోలు పట్టుకుని వెళ్ళారు.  ఆశ్రమంలో ఎప్పటిలాగే పూజలు పూర్తయిన తరువాత స్త్రీలందరూ చిన్న గదిలో కూర్చుని సాయిబాబా పూజ ప్రారంభించారు.  ఆశ్రమంలోనివారు ఇంకా మరికొందరు ఎంతోమంది సాయిపూజకు హాజరయ్యారు.  వచ్చిన భక్తులందరికీ ఆచిన్న గది సరిపోకపోవడంతో స్వామీజీ కొందరిని పై అంతస్థులో ఉన్న తను ధ్యానం చేసుకునే గదిలోకి వెళ్ళమని చెప్పారు.  బహుశ తను ధ్యానం చేసుకునే మందిరాన్ని ఇవ్వడంవల్ల కావచ్చు బాబా లీలలు చాలా విస్తారంగా కన్పించడం ప్రారంభమయాయి.  నైవేద్యానికి పెట్టిన అరటిపండ్ల మీద తెలుగులో ‘సాయి’ అక్షరాలు కనిపించాయి.  పూజ చేయడానికి తెచ్చిన పువ్వుల మీద కూడా అదేవిధంగా అక్షరాలు కన్పించాయి.  బాబా చూపించే లీలలకు భక్తులందరూ ఆశ్చర్యపడ్డారు.  వారిలో ఒక భక్తుడు ఒక వెలగపండును బాబా నైవేద్యంకోసం ఆయన ముందు పెట్టి దానిమీద కూడా ‘సాయి’ అక్షరాలు కనిపించేలా చేయమని బాబాను ప్రార్ధించాడు.  
                         Image result for images of wood apple

అతను ఆవిధంగా ప్రార్ధించగానే ఆ వెలగపండు మీదకూడా ‘సాయి’ అనే అక్షరాలు ప్రత్యక్షమయ్యాయి.  ఓంకార స్వామీజీ కూడా బాబా నైవేద్యానికి ఒక కొబ్బరికాయను తీసుకునివచ్చి బాబా ముందు ఉంచారు.  కొబ్బరికాయకు రెండు వైపులా ‘సాయి’ అనే అక్షరాలు కనిపించాయి.  ఆ అక్షరాలు ఉన్న కొబ్బరికాయను స్వామీజీ భద్రపరచుకొన్నారు.  అందరిలోను సాయిమీద పరిపూర్ణమయిన విశ్వాసం పెరగసాగింధి  ఆశ్రమంలోని శ్రీ రాజాజీగారు తన వ్రేలికి ఉన్న ఉంగరాన్ని తీసి బాబా  ఫోటోముందు ఉంచి “బాబా ఈ ఉంగరంమీద నీపేరు వ్రాస్తే ఈ ఉంగరాన్ని నీకు సమర్పించేస్తాను” అని ప్రార్ధించారు.  ఆయన ఆవిధంగా ప్రార్ధించిన వెంటనే ఆ ఉంగరంమీద ‘సాయి’ అనే అక్షరాలు కనిపించాయి.  నమ్మశక్యం లేక కొంతమంది తమ తమ వాచీలను, గొలుసులను బాబాముందు పెట్టి ప్రార్ధించిన వెంటనే అన్నిటిమీదా ‘సాయి’ అక్షారలు కనిపించాయి. 

అక్కడ ఉన్న భక్తులలో ఒకతనికి బాబా తన లీలలను చమత్కారాలను బాగా ధనికులకి మంచి హోదాలో ఉన్నవారికే చూపుతున్నారని ఆవిధమయిన లీలలు బీదవారికి, దరిద్రనారాయణులకి కూడా ఏదయిన చూపించాలని కోరుకొన్నాడు.  అతను ఒక విభూదిపండును బాబా ముందు ఉంచాడు.  కొద్ది క్షణాలలోనే ఆ విభూదిపండు మీద తెలుగులో ‘సాయిమందు’ అనే అక్షరాలు కనిపించాయి.  ఆ విభూదిపండు బాబా పవిత్రం చేసిన ఔషధం.
                        Image result for images of vibhuti pandu
బాబా పవిత్రం చేసిన ఆమందుని అందరికీ ఉపయోగంచవచ్చు.  ఆశ్రమంలో ఉన్న ఆవుకు ఒక విధమయిన జబ్బు చేసింది.  దానివల్ల అది ఇచ్చే పాలు నల్లగా రాసాగాయి.  అపుడు బాబా పవిత్రం చేసిన ఈ విభూదిని ఆ ఆవుకు రాసారు.  ఆ ఊదీ మహత్యం వల్ల ఆవు ఎప్పటిలాగానే తీయటి పాలను ఇవ్వడం మొదలుపెట్టింది.  ఆవిధంగా బాబా మూగవారికి, బీదవారికి, నిస్సహాయులకు, మంచి శక్తివంతమయిన ఔషధాన్ని ప్రసాదించారు.  ఆశ్రమంలో ఉన్నవారందరికి సాయిమీద ఉన్న నమ్మకం ఈ సంఘటనతో మరింత శక్తివంతంగా ధృఢపడింది.  ఒకరోజు సాయంకాలం మరపురాని సంఘటన ఒకటి జరిగింది.  సంధ్యవేళ ఒకామె స్వామీజీ వద్ద శలవు తీసుకుని పచ్చికబయలు దారిలో తనగదికి వెడుతూ ఉంది.  దారిలో ఒక సర్పం ఆమె కాలుమీద ప్రాకుకుంటూ వెడుతూ ఉండగా ఆమె రెండవపాదం ఆసర్పం తోకమీద  పడింది.  ఒక్కసారిగా తన కాలుమీదనుంచి ప్రాకుతూ వెడుతున్నది పామని గుర్తించింది.  వెంటనే ఆమె ‘ఓమ్ సాయి’ అని గట్టిగా అరిచింది.  ఆమెను కాటువేయబోతున్న ఆసర్పం నెమ్మదిగా తలను క్రిందకు వంచుకుని వెనుకకు మళ్ళి ఒక చెట్టుమీదకి ప్రాకుకుంటూ వెళ్ళిపోయింది. 

“బాబా ఇక్కడ ఎన్నో చమత్కారాలను ప్రదర్శిస్తున్నారు.  అందువల్ల ఇక్కడ ఆయనకు శాశ్వతంగా ఒక మందిరాన్ని నిర్మించవలసినదే” అన్నారు భక్తులందరూ.  అపుడు భక్తులందరి ముందు ఒక కాగితం కనిపించింది.  దానిమీద ‘ఇది సాయి సన్నిధి’ అనే అక్షరాలు తెలుగులో కనిపించాయి.  ఇవే అక్షరాలు పూజాగదిలో గోడమీద కూడా కనిపించాయి. 

నిస్సందేహంగా బాబా అక్కడే కొలువై ఉన్నారనీ, మనఃపూర్వకంగాను, భక్తితోను భక్తులు చేసే ప్రార్ధనలకు స్పందిస్తూ ఉన్నారనే నమ్మకం భక్తులందరికీ కలిగింది.  స్వామీజీ చెప్పినట్లుగా బాబా భగవంతుని అవతారం.  ఆయన ఒక్కచోటనే ఉండరు. అతటా నిండి ఉంటారు.  అందువల్ల ప్రజలు ఆయన చూపించే అత్యధ్భుతమయిన లీలలకు విస్మయం చెంది ఇంకా ఇంకా అధ్బుతాలను, చమత్కారాలను, చూపిస్తే బాగుండుననే అధికమయిన ఆలోచనలు అవసరం లేదని, ఆశ్రమంలో ఆయన చాలా సులభంగానే అందరితోను సంభాషిస్తారని చెప్పారు.  ఆవిధంగా ఓంకారస్వామి, బాబాతో సన్నిహిత సంబంధం కలిగి ఉండవచ్చని చెప్పి అందరినీ అక్కడికి పంపిస్తూ ఉండేవారు.  శ్రీరామనవమి అర్ధరాత్రి ఆయన లేచి ఒక కాగితం మీద బాబా చూపించిన లీలలన్నిటినీ వివరంగా వ్రాసారు.  అవన్నీ తెలియ చేస్తూ భక్తులందరినీ ఆశ్రమానికి ఆహ్వానిస్తూ ఒక ఆహ్వాన పత్రికను కూడా విడుదల చేసారు.  అందులో ఒక సూచన కూడా వ్రాసారు.
“వాచీలమీద, బంగారు గొలుసుల మీద బాబా అక్షరాలు కనిపిపిస్తే చూడాలనే ఉత్సుకతతో రావద్దనీ శ్రీసాయిబాబాతో మాట్లాడదామనే కోరికతోనే రమ్మని" రాసారు.  తనకు మాత్రం తన లోపల, బయట అన్ని వైపుల ఒక విధమయిన దైవసంబంధమయిన ఉనికిని అనుభవిస్తున్నట్లుగా చెప్పారు.

ఒక విధమయిన బ్రహ్మానందస్థితిలో సాయితో తాదాత్మ్యం చెంది తాను ఆంగ్లంలోను, తెలుగులోను, పాటలను రచించానని చెప్పారు.  తెలుగు పత్రిక ‘శాంతి’ లో ఈ విషయం గురించి ప్రస్తావింపబడింది.  బాబా నేటికీ జీవించే ఉండి సహాయం చేస్తున్నారా లేక చేయగలరా అని సందేహంచే వారికి ఇది ప్రశస్తమయిన సమాధానం. మందమతులకు కూడా అటువంటి ప్రశ్నలు తెలివితక్కువగాను. అసంబధ్ధమయిననవిగాను కనిపిస్తాయి.  బాబా సహాయం చేసిన మరికొన్ని సందర్భాలను మనం మళ్ళి మళ్ళి చెప్పనవసరం లేదు.  అటువంటి సంఘటనలు వెల్లువగా వస్తూనే ఉన్నాయి.  కోయంబత్తూరు, మద్రాసు ఇంకా ఎన్నో ప్రదేశాలలో బాబా తన లీలలను ప్రదర్శించారు.  కోయంబత్తూర్, అహమ్మదాబాద్ లలో జరిగిన విశేషాలను తెలుసుకుందాము.

(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)








Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List