26.11.2018 సోమవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
శ్రీ
సాయి సత్ చరిత్ర – బాబా సమాధానాలు, అభయ హస్తమ్
నా
స్వీయానుభవమ్
ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
ఫోన్ : 9440375411 , 8143626744
అక్టోబరు
2వ.తారీకున మన బ్లాగులో ప్రచురించిన తరువాత మరలా ప్రచురించడానికి అవకాశం చిక్కలేదు. సాయి బంధువులకు బాబావారి లీలలు మనసుకు హత్తుకునేలా
ఉండాలని నా కోరిక. ఆంగ్లంలోనుంచి తెలుగులోనికి
అనువాదం చేయడానికి కొంతమంది పెర్మిషన్ ఇవ్వలేదు.
ఇచ్చి ఉన్నట్లయితే ప్రతిరోజు కాకపోయినా కనీసం రెండు మూడు రోజులకయినా ప్రచురిస్తూ
ఉండేవాడిని. అంతా బాబా దయ.
అమెరికా
నుంచి నవంబరు 12 వ.తారీకున బయలుదేరి 14వ. తేదీ ఉదయానికి హైదరాబాదుకి బాబా ఆశీర్వాద
బలంతో క్షేమంగా చేరుకున్నాము. ఈ సందర్బంగా
బాబావారు మాకు తమ ఆశీర్వాదం ఏవిధంగా ఇచ్చారో మీకు వివరిస్తాను.
నాకు విమాన ప్రయాణం అంటే చాలా భయం. మా రెండవ కుమార్తె అమెరికా, అట్లాంటాలో ఉంటుంది. మా అమ్మాయి అల్లుడు నన్ను మా శ్రీమతిని అమెరికా రమ్మని పిలిచినా నేను వెళ్ళడానికి ఇష్ట పడలేదు. కాని వారు ఆరునెలల కాలానికి అక్కడ ఉండేలా టిక్కెట్లు బుక్ చేసేసారు. హైదరాబాద్ నుంచి లండన్ కి లండన్ నుంచి మరొక ఫ్లైట్ లో అట్లాంటాకి వెళ్ళాలి. లండన్ లో నాలుగు గంటల విరామం కాక విమాన ప్రయాణం 18 గంటలు. టిక్కెట్లు బుక్ చేసిన రోజునుంచి ప్రతిరోజు వెబ్ సైట్ లో హైదరాబాద్ నుంచి లండన్ వెళ్ళే విమానం ఎలా ప్రయాణిస్తున్నది, ఎంత ఎత్తులో ప్రయాణం చేసున్నది, లండన్ లో ఎప్పుడు చేరుకుందనే విషయాలన్నీ చూస్తూ ఉండేవాడిని. ప్రతిరోజు శ్రీ సాయి సత్ చరిత్ర పారాయణ చేసుకుంటూ ఉన్నాను. ఇక ప్రయాణ తేదీ (25.05.2018) కి వారం రోజుల ముందు అనుకుంటా బాబా చరిత్రలోని ఆరోజు అధ్యాయాన్ని పూర్తి చేసిన తరువాత బాబాని ఇలా ప్రార్ధించాను. “బాబా, నాకు విమాన ప్రయాణం భయం. నువ్వు ఇప్పుడు నాకు ధైర్యాన్నివ్వాలి. నేను నీ ప్రక్కనే ఉన్నాను. నీకేమీ భయం లేదు అనే మాటలు నువ్వు నాకు వినిపించాలి. అప్పుడే నేను ధైర్యంగా ప్రయాణం చేయగలను. చెప్పు బాబా చెప్పు బాబా” అని వేడుకున్నాను. ఆయన మాటలను వినాలని నాకోరిక. తరువాత శ్రీ సాయి సత్ చరిత్ర గ్రంధాన్ని బాబా విగ్రహానికి తాకించి కళ్ళు మూసుకుని ఒక పేజీ తెరచి ఒక చోట వ్రేలు ఉంచి కళ్ళు తెరచి చూసాను. ఆశ్చర్యం 13 వ.అధ్యాయంలోని ఈ మాటల వద్ద నా వ్రేలు ఉంది. “నిత్యం సాయి సాయి అని తలిస్తే సప్త సముద్రాలు దాటిస్తాను. ఈ మాటలయందు విశ్వాసముంచితే నిశ్చయంగా శుభాన్ని పొందుతారు” అని వచ్చింది. ఇక నాకు కొండంత ధైర్యం వచ్చింది. ఇక అప్పటి నుంచి హైదరాబాద్ నుంచి లండన్ కి వెళ్ళే విమానం వివరాలను లాప్ టాప్ లో చూడటం మానేసాను. అక్టోబర్ 25వ.తారీకున హైదరాబాద్ నుంచి అమెరికా చేరుకునేంత వరకు వరకు ప్రయాణంలో సాయి నామ స్మరణ చేసుకుంటూనే ఉన్నాను. సీటుకి ఎదర టి వి ఉన్నా అందులో ఊరికే బొమ్మలు కాసేపు చూడటం తప్ప హెడ్ ఫోన్ కూడా పెట్టుకోకుండా నామ స్మరణలోనే కాలం గడిపేసాను.
ఇక
అమెరికాలో ఉన్న కాలంలో కూడా సాయి సత్ చరిత్ర నిత్య పారాయణ చేస్తూనే ఉన్నాను. కొన్ని రోజులు కుదరకపోయినా మొత్తానికి చదవని అధ్యాయాలను
తరువాతి రోజులలో పూర్తి చేసి మొత్తం చరిత్ర పారాయణ చేసాను. ఆ తరువాత ప్రతిరోజు క్రమం తప్పకుండా ఏ రోజూ వదలకుండా
పారాయణ చేస్తూనే ఉన్నాను. ఇక తిరుగు ప్రయాణం
నవంబరు 12 వ.తారీకు రాత్రి 9 గంటలకు ఫ్లైట్. ప్రయాణానికి వారం రోజుల ముందు మరలా బాబాని
అడిగాను. బాబా నాకు నువ్వు ధైర్యాన్నివ్వాలి
అని పూజ సమయంలో ఆరోజు అధ్యాయాన్ని పూర్తి చేసిన తరువాత మరలా అడిగాను. కళ్ళు మూసుకుని ఒక పేజీ తెరజొ వ్రేలు పెట్టి కళ్ళుతెరచి
చూసాను. అది 19 అధ్యాయం. అందులోని వాక్యాలు “ బాబా యొక్క అనుగ్రహ పధ్ధతి
అగాధం. భక్తులు వారి వద్ద ఉన్నా, లేక దేశాంతరాలలో
ఉన్నా బాబా వారి అంతరంగంలో ఉన్నట్లే ఉపదేశాలిస్తారు” అని సమాధానం వచ్చింది. నాకెంతో సంతోషం కలిగింది.
నవంబరు
11 వ.తారీకుతో శ్రీ సాయి సత్ చరిత్ర పారాయణ పూర్తయింది. అనగా 53 అధ్యాయాలు పూర్తి పారాయణ అయింది. గత నాలుగయిదు రోజుల నుంచి బాగా మబ్బు, పట్టి అప్పుడప్పుడు
కాస్త వర్షం పడుతూ ఉంది. 11 వ.తారీకున శ్రీసాయి
సత్ చరిత్ర నా శ్రీమతి కూడా పూర్తి కావించింది.
ఆరోజు బాబాని ప్రార్ధించుకున్నాను.
బాబా ఈ రోజుతో పారాయణ పూర్తయింది. ఈ
సందర్భంగా నువ్వు మాకు ప్రయాణ సందర్భంగా నీ ఆశీర్వాదం కావాలి. సాయిబానిస శ్రీ రావాడ
గోపాలరావుగారికి శ్రీ సాయి సత్ చరిత్ర పారాయణ పూర్తి అయిన సందర్బాలలో నువ్వు ఏదో రూపంలో
అనగా పావురం రూపంలో ఒకసారి కీటకం రూపంలో కూడా వచ్చి ఆశీర్వాదాన్నిచ్చావు. సాయిభక్తురాలయిన LORRAINE WALSHE (ఆష్ట్రేలియా)
ఆమెకు కూడా అడిగిన వెంటనే సమాధానాలనిస్తున్నావు. (బాబా ఆవిడకు ప్రతిరోజు అడిగిన వెంటనే నిదర్శనాలను ఇవ్వడం, సందేశాలను ఇవ్వడం జరుగుతూ ఉంది. వాటినన్నిటిని ఒక డైరీ క్రమంలో పుస్తకాన్ని కూడా ప్రచురించారు. YOU BRING US JOY MERE KHWAJA , FRIENDSHIP WITH GOD) శ్రీ సాయి సత్ చరిత్ర పారాయణ 53 అధ్యాయాలు
పూర్తయిన సందర్భంగా నువ్వు నాకు ఏదో రూపంలో వచ్చి ఆశీర్వదించాలి అని ప్రార్ధించాను. ఏదో ఒక పక్షి రూపంలో రావడానికి ఆస్కారం లేకుండా విపరీతమయిన
చలిగాలి వల్ల ఇంట్లో తలుపులు వేసుకుని ఉన్నాము.
మరి ఆయన ఏవిధంగా వస్తారు అని ఆలోచిస్తూ ఉన్నాను. సాయంత్రం
4 గంటలకి మా అమ్మాయి స్నేహితురాలు, ఆమె భర్త వచ్చి ఇండియాలో ఉన్న తమ నాన్నగారికి
ఇవ్వమని కొన్ని మందులు ఇచ్చారు. వారు హాపీ
జర్నీ అని చెప్పి వెళ్ళారు. బాబా ఆరూపంలో వచ్చి
చెప్పారని నన్ను నేను సమాధాన పరచుకోలేకపోయాను.
నాకు సంతృప్తి కలుగలేదు. వాతావరణం రిపోర్టు
ప్రకారం మరునాడు కూడా వర్షం వస్తుందనే ఉంది.
మరి వర్షంలో విమాన ప్రయాణం క్షేమదాయకమేనా అని నాలో కాస్త భయం కూడా ఉంది. ఇక
సాయంత్రం 6 గంటలయింది. బాబా వారి ఆశీర్వాదం
ఏరూపంలోను నాకు లభించలేదు. ఒక గదిలో మా మనవడి
టేబుల్ కి ఎదురు గోడమీద చిన్న బాబా ఫోటో అతికించి ఉంచాను. అక్కడికి వెళ్ళి బాబాను కన్నీళ్ళతో ప్రార్ధించాను. బాబా నాకు చాలా భయంగా ఉంది. సాయంత్రమయింది ఇప్పటికీ నువ్వు ఏ రూపంలోను రాలేదు. మీ ఆశీర్వాదాన్ని అందించలేదు. అని కన్నీళ్ళను ఆయన పాదాలకి రాసాను. అంతకుముందు గంట సేపటి క్రితం నా భార్య మా అమ్మాయి
షాపింగ్ కి వెళ్ళారు. షాపింగ్ కి నేను వాళ్ళకి నా ఫారెక్స్ కార్డ్ ఇచ్చి పంపించాను.
కొన్నవాటికి డబ్బు కార్డు ద్వారా చెల్లిస్తారు కాబట్టి వెంటనే నా మైల్ కి సమాచారం వస్తుంది. వాళ్ళు రావడం ఆలశ్యమవడం వల్ల ఆ సమాచారం చూద్దామనే
ఉద్దేశ్యంతో మైల్ చూసుకున్నాను. ఆశ్చర్యం బాబా వారి ఆశీర్వాదం మైల్ ద్వారా లభించింది. సాయి బంధువు ఒకామె వద్దనుంచి మైల్ వచ్చింది. Thank you so much uncle, have safe flight and happy journey” అని మైల్ ద్వారా బాబావారి ఆశీర్వాదం లభించింది.
ఆమె
అంతకు ముందు అర్వాచీన భక్త లీలామృతం పి డి ఎఫ్ పైల్ ఉంటే పంపమని అడగటం వల్ల నేను ఇండియాకి
వెళ్ళాక చూసి పంపిస్తానని సమాధానం ఇచ్చాను.
ఆ తరువాత నాకు గుర్తుకు వచ్చింది. ఎప్పుడో
సంవత్సరం క్రితం సాయిబంధువు ఒకరు నాకు పంపించారు.
దానిని నా మైల్ లో వెతికి ఆమెకు పంపించాను. అది నేను ఆమెకు నవంబరు 9 వ.తారీకున పంపించాను. వెంటనే ఆమె నాకు ధన్యవాదాలు తెలుపుతూ Thank you so much uncle అని మైల్ ఇవ్వడం జరిగింది. 9వ.తారీకున
ధన్యావాదాలు తెలుపుతూ మైల్ ఇచ్చినామె మరలా 11 వ.తారీకున సాయంకాలం పైన చెప్పిన విధంగా
మైల్ ఇవ్వడం బాబావారి ఆశీర్వాదం కాక మరేమిటి.
ఇక నాకు కొండంత ధైర్యం వచ్చింది.
ఈ
సందర్భంగా నాకు శ్రీ సాయి సత్ చరిత్రలోని 20వ.అధ్యాయంలోని సంఘటన గుర్తుకు వచ్చింది.
దాసగణుకి
ఈశావాస్యోపనిషత్ లో కలిగిన కొన్ని సంశయాలకి సమాధానం కాకాసాహెబ్ దీక్షిత్ ఇంటిలోని పని
పిల్ల తీరుస్తుందని చెప్పారు బాబా. కాకాసాహెబ్ ఇంటిలోని పనిపిల్ల ద్వారా ఆయనకు
సమాధానం లభించింది. ఆ సందర్భంగా బాబా అన్న
మాటలు. “కాకాయొక్క పనిపిల్ల, నేను కాక మరెవ్వరు.
ఆమెలో ఉన్నది నేనే అన్న మర్మాన్ని తెలిపి ఈశావాస్యోపనిషత్తు తెలుసుకునేలా చేసారు. అదే విధంగా నాకు మైల్ ఇచ్చిన సాయిబంధువు ఆమెలొ ఉన్నది
కూడా బాబాయే కదా. ఆయనే ఆమె ద్వారా మాకు తమ
ఆశీర్వాదాన్ని పంపించారని నేను గ్రహించుకున్నాను.
12వ.తారీకున
మరలా శ్రీసాయి సత్ చరిత్ర పారాయణ మొదటి అధ్యాయం నుంచి ప్రారంభించాను. ఆరోజు పొద్దుటినుంచి బాగా వర్షం పడుతూనే ఉంది. సాయంత్రం 4 గంటలకి ఎయిర్ పోర్టుకు బయలుదేరాము. రాత్రి
9 గంటలకి ఫ్లైట్. అప్పటికి ఇంకా వర్షం పడుతూనే
ఉంది. కాని పొద్దున్న పడినంత పెద్దగా పడటంలేదు. బాబా వారు ఇచ్చిన కొండంత ధైర్యంతో వాన కాస్త పడుతూ
ఉన్నా నా మననుసులో ఇక ఎటువంటి భయాందోళనలు కలుగలేదు. విమానంలో ఉన్నంత సేపు అసలు టి.వి.
చూడకుండా సాయినామ జపం, మృత్యుంజయ మంత్రం, శ్రీవిష్ణుసహస్రనామంలో ప్రయాణ సమయంలో పఠించదగ్గ
“వనమాలీ గదీ శాంజ్ఞీ శంఖీ చక్రీచనందకీ, శ్రీమన్నారాయణో విష్ణుః వాసుదేవోభిరక్షతు,” ఒక్కక్షణం
కూడా విరామం ఇవ్వకుండా జపించుకుంటూనే ఉన్నాను.
విమానంలో రెండు రాత్రులు ఒక్క క్షణం కూడా కంటి మీదకు కునుకు రాలేదు.
ఆవిధంగా బాబా మమ్మల్ని క్షేమంగా ఇండియాకు చేర్చారు. అడిగిన వెంటనే ఆయన చేసిన సహాయాన్ని జన్మ జన్మలకూ మరచిపోలేను.
ఓమ్
సాయిరామ్
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment