24.11.2019 ఆదివారమ్
ఓమ్ సాయి
శ్రీ సాయి జయజయ
సాయి
సాయి బంధువులకు
బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి
సత్ చరిత్రకు అందని
రహస్యాలు – 5 వ.భాగమ్
(సాయి భక్తుల కోరికపై ఇకనుండి శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలను బాబా అందిస్తూన్నంతవరకు ప్రతి గురువారమ్, మరియు ఆదివారమ్ ప్రచురిస్తూ ఉంటాను.)
శ్రీ సాయి సత్ చరిత్రలో మదరాసు భజన సమాజము యజమాని అహంకారమును ఒక పోలీసు ఆఫీసరు రూపంలో దర్శనము ఇచ్చి అహంకారమును తొలగించి అతనిని భక్తి మార్గములో పెట్టిన సంగతి మనందరికి తెలిసినదే. కాని, శ్రీ సాయిబానిసగారి విషయములో వారికి ఒక పోలీసు ఆఫీసరుగా స్వప్నములో దర్శనము ఇచ్చి కాపాడిన విషయము మీకు తెలియచేస్తాను.
“అది 1994 వ.సంవత్సరము. ఒక ఆదివారమునాడు మధ్యాహ్నము ఆయన హైదరాబాద్ మౌలాలీలోని తన మిత్రుడు శ్రీపార్ధసారధి గారి ఇంట సత్సంగము పూర్తిచేసి ప్రసాదము సేవించి అరటిపండు తిని దాని తొక్కను ప్రక్కింటివారి పెరటిలోనికి విసిరివేసారు. ఆ అరటిపండుతొక్క ప్రక్క ఇంటివారి బావిలో పడింది. ఈ సంఘటనను ప్రక్కింటివారు చూసి గొడవపెట్టారు. ఆ గొడవ బస్తీలో కలకలం రేపింది. అపుడు ఆగొడవకు భయపడి సాయిబానిసగారు తన మిత్రుడు పార్ధసారధిగారి ఇంటి అటకపై భయముతో తలదాచుకొన్నారు. సాయంత్రం 6 గంటలకు భయముతో మెయిన్ రోడ్డు మీదకు కుంటుతూ వచ్చి తనను బస్తీవారి గొడవనుండి కాపాడమని శ్రీసాయిని ప్రార్ధించారు. ఆసమయములో వారి దగ్గరకు ఒక పోలీసు జీపు వచ్చి ఆగింది. సాయిబానిసగారు తన కాలికి దెబ్బతగిలినదని తనను E C I L జంక్షన్ లో దింపమని వేడుకొన్నారు. ఆజీపులోని పోలీసు ఆఫీసరు ఆయనను తన జీపు వెనకభాగములో కూర్చోపెట్టుకొని వారిని E C I L రోడ్ మీద దించుతూ “అరటిపండు తొక్కను ఎక్కడపడితె అక్కడ వేయవద్దు” అన్నారు.
ఇక్కడ పాఠకులు ఒక విషయాన్ని గ్రహించగలరు. సాయిబానిసగారు తను సాయి సత్సంగమును
పూర్తి చేసుకొని ప్రసాదమును తిని ఆప్రసాధములోని అరటిపండు తిని ఆతొక్కను శ్రీపార్ధసారధిగారి
ప్రక్క ఇంటివారి పెరటిలోని బావిలో వేసిన సంగతి ఆ పోలీసు ఆఫీసరుకు ఏవిధముగా తెలిసిందనేది చాలా ఆశ్చర్యకరమయిన విషయము. నా ఉద్దేశ్యములో ఆయనను కాపాడటానికి
శ్రీసాయి స్వయంగా పోలీసు ఆఫీసరు రూపంలో వచ్చి వారిని E C I L మెయిన్ రోడ్ దగ్గరలో ఉన్న సాయిబానిస
ఇంటిదగ్గర దిగపెట్టారని భావిస్తున్నాను.
మానవుడు బహుదూరపు బాటసారి.
తన అంతులేని ప్రయాణములో అనేక జన్మలు ఎత్తుతాడు. ప్రతిజన్మలోను తన శరీరాన్ని భూమిపై
ఉన్న మట్టిలో కలిపివేస్తాడు. ఈ మట్టిలోనుండే తిరిగి పునర్జన్మలు ఎత్తుతాడు. మరణము ఈ శరీరానికి మాత్రమే. ఆత్మకు మరణము లేదు. బాబా లక్ష సంవత్సరాల వయసులో అనేక
జన్మలు ఎత్తారు. భవిష్యత్
లో ఇంకా అనేక జన్మలు ఎత్తుతారు. బాబా తన భక్తుడు మాధవరావు దేశ్ పాండేతో తనకు వానికి 72 జన్మలబంధము ఉంది అని చెప్పారు.
సాయిబానిసగారు అనేక సార్లు తనకు బాబాతో వెనకటి నాలుగు జన్మల అనుబంధమని
చెప్పారు. భవిష్యత్ జన్మలో
తాను తిరిగి శ్రీసాయి తత్వప్రచారకుడిగానే జన్మించుతానని చెప్పారు.
ఇక ఈ భూమండలముపై పుట్టిన ప్రతిప్రాణి ఒకనాడు మట్టిలో కలసిపోవలసినదే. అందుచేతనే బాబా ఊపిరి
గాలిలో కలిసిపోతుంది. శరీరం మట్టిలో కలిసిపోతుంది కాని ఆత్మ శాశ్వతము అనేవారు.
శ్రీ సాయి సత్ చరిత్రలోని చెన్నబసప్ప వీరభద్రప్పల కధనుండి మనము నేర్చుకోవలసిన విషయాలు
ఏమిటి అని నేను సాయిబానిసగారిని అడిగాను. వారు ఇచ్చిన వివరాలు నాకు చాలా ఆశ్చర్యాన్ని
కలిగించాయి. అవి…..
1 ధనికులను ధనాపేక్ష తప్పుడు మార్గములో పయనించేలాగ చేస్తుంది. వారు ధనాన్ని అక్రమ మార్గముతో
సంపాదించి సమాజానికి మేలు చేయకపోగా కీడు మాత్రము చేస్తారు అని చెప్పడానికి ఆకధలో ధనవంతుడు మందిర పునర్నిర్మాణానికి
వసూలు చేసిన ధనమును తన స్వంతానికి వాడుకొన్నాడు. అంతే కాకుండా తన భార్య పుట్టింటివారు
ఇచ్చిన ఆమె సొమ్మును అక్రమ మార్గములో కాజేసి తన భార్యకు కూడా అన్యాయము చేసాడు. దుబకి అనే స్త్రీ పొలమును కారు చవకగా
కొనివేసి ఆమెకు అన్యాయము చేసి ఆమెతో వైరము పెంచుకొని మరుజన్మలో వీరభద్రప్ప చెన్నబసప్పలుగా
జన్మించి వైరము కొనసాగించుకొన్నారు.
దీనివలన మనము తెలుసుకోవలసినది, మనము మన
స్నేహమును సమ ఉజ్జీగల వారితో మాత్రమే చేయాలి. ధనవంతులతో స్నేహము మనకు ఏనాటికయిన చికాకులనే కలిగించుతుంది. అందుచేత మనము ధనవంతుల
స్నేహాన్ని కోరరాదు.
చెన్నబసప్ప వీరభద్రప్పలు తమ వైరాన్ని కొనసాగించి మరు జన్మలో పాము, కప్పలుగా జన్మించి తమ వైరాన్ని కొనసాగించారు అని బాబా మనకు చెప్పిన సంగతిని మనము మర్చిపోరాదు. బాబా తన భక్తులలోని కోటీశ్వరులను, బీదవారిని సమదృష్టితో చూసారు. మనము కనీసము ధనవంతులను చూసి అసూయ చెందవద్దు. బీదవారిని చూసి అసహ్యించుకోవద్దు అన్నారు.
శ్రీ సాయి సత్ చరిత్రలో శ్రీసాయి తన ముగ్గురు స్నేహితులతో కలసి తమ గురువుగారి అన్వేషణ
నిమిత్తం అడవిలో దారితప్పి తిరుగుతున్న సమయంలో ఒక బంజారా వారిని ఆపి, ఖాళీ కడుపుతో
అన్వేషణ చేయవద్దని, తాను ఇచ్చె ఆహారముతిని అన్వేషణ చేయమని సలహా ఇచ్చాడు. శ్రీసాయియొక్క ముగ్గురు స్నేహితులు ఆ బంజారావాని
మాటలు వినకుండా అడవిలో దారితెన్ను లేకుండా తిరగనారంభించారు. కాని శ్రీసాయి ఆ బంజారావాని మాటలను నమ్మి, అతను
పెట్టిన భోజనం తిని తిరిగి ఏకాంతముగ ఆ అడవిలో అన్వేషణను పూర్తిచేసి తన గురువును కలసికొన్నారు. ఇటువంటి సంఘటన బాబాగారు సాయిబానిసగారికి కలిగించారు.
ఆ వివరాలు ::
సాయిబానిసగారు 2000 సంవత్సరములో భారతప్రభుత్వ శాఖనుండి స్వచ్చంద పదవీవిరమణ చేసారు. ఆ సమయములో వారికి ప్రభుత్వమువారు ఇచ్చిన ధనముతో
ఒక ఇంటిస్థలము కొనాలనుకొన్నారు. బాబావారు
2001 వ.సంవత్సరములో కలలో వారికి ఇచ్చిన అనుభూతి అందరిని ఆశ్చర్యపరచక తప్పదు. ఆవివరాలు మీకు తెలియచేస్తాను.
“2001వ.సంవత్సరములో ఒకనాటి రాత్రి స్వప్నములో ఇ సి ఐ ఎల్ రోడ్ నుండి 20 కి.మీ.దూరములో ఉన్న గ్రామం బొమ్మలరామవరంలో
చవకగా వస్తున్న 400 గజాల ఇంటిస్థలము కొనాలనే కోరికతో ఉదయము 11 గంటలకు తన స్కూటర్ మీద
బొమ్మల రామవరానికి వెళ్ళారు. ఎండలో చాలాసేపు
ఆ ఇళ్ళస్థలాల కోసం వెతికి అలసిపోయారు. ఆ సమయంలో
ఆగ్రామములో నివసించుతున్న అరుణ్ కుమార్ అనే వ్యక్తి (అతను సాయిబానిసగారి ఆఫీసులో పనిచేసే
వ్యక్తి) వచ్చి సాయిబానిసగారిని పలకరించి వారిని తన పెంకుటింటికి తీసుకొనివెళ్ళాడు. శ్రీఅరుణ్ కుమార్ ఎస్ సి కులమునకు చెందిన వ్యక్తి. అతను సాయిబానిసగారికి మంచి స్నేహితుడు. అతను ఆయనకు త్రాగటానికి మంచినీరు ఇచ్చి, మీరు అగ్రవర్ణము
అయిన బ్రాహ్మణకులములో పుట్టినవారు. మేము పెట్టే
భోజనం స్వీకరించగలరా అని అడిగాడు. ఆయన చాలా
ఆకలితో ఉన్నారు. భోజనము చేయమని ఎవరయిన ఆహ్వానించిన
కాదనవద్దు అని శ్రీసాయి చెప్పిన మాటలు గుర్తుకువచ్చి, సంతోషముగా నీవు ప్రేమతో భోజనం
పెట్టినట్లయితే తింటానని అన్నారు. శ్రీఅరుణ్
కుమార్ సంతోషముతో గౌరవపూర్వకముగా తన శిరస్సు సాయిబానిసగారి పొత్తికడుపై ఉంచి నమస్కరించి
తన భార్యను పిలిచి ఒక అల్యూమినియం గిన్నెలో పెరుగన్నమును తెప్పించి ఒక స్టీలుపళ్ళెములో
ఆపెరుగన్నమును వడ్డించి ఆయనకు పెట్టారు. సాయిబానిసగారు
ఆ పెరుగన్నమును తిని తన ఇంటికి బయలుదేరారు.
ఆ సమయంలో అరుణ్ కుమార్ వచ్చి, సార్, మీరు చూసిన ఇళ్ళస్థలాలు ప్రభుత్వమువారు
ఎస్ సి, ఎస్ టి వారికి ఉచితంగా ఇచ్చినవి. వాటిని కొందరు కబ్జాచేసి అమ్ముతున్నారు. దయచేసి ఆభూములను కొనవద్దని సలహా ఇచ్చాడు.
బాబా అరుణ్ కుమార్ రూపంలో తనకు భోజనం పెట్టి మంచి సలహా ఇచ్చాడని భావించి ఆగ్రామంలోని
భూములను కొనరాదని నిర్ణయించుకొని అరుణ్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపి తన ఇంటికి వెళ్ళిపోయారు. ఇది కలలో జరిగిన సంఘటన.
ఈసంఘటన జరిగిన ఒక సంవత్సరము తరువాత బ్యాంక్ లో అరుణ్ కుమార్ ను సాయిబానిసగారు కలవడం
జరిగింది. ఆయన అరుణ్ కుమార్ తో తాను బొమ్మలరామవరంలో
వాని ఇంట పెరుగన్నం తిన్న సంఘటన గురించి వివరించి చెప్పారు. ఆయనమాటలకు అరుణ్ కుమార్ ఆశ్చర్యపడి తనకు బొమ్మలరామవరంలో
ఇల్లు లేదని, తాను చాంద్రాయణ గుట్ట దగ్గర తన స్వంత ఇంటిలో ఉంటానని చెప్పడము సాయిబానిసగారికి
చాలా ఆశ్చర్యము కలిగించింది. బాబా సాయిబానిసగారికి
మంచి సలహా ఇవ్వడానికి శ్రీ అరుణ్ కుమార్ రూపంలో బొమ్మల రామవరంలో దర్శనము ఇచ్చారు అని
మనం గ్రహించగలము.
(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment