12.12.2019 గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
దత్తాత్రేయుల వారి ఆశీర్వాదములు
శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 10 వ.భాగమ్
25. ధనవ్యామోహం విడనాడు
శ్రీషిరిడీ సాయి తన అంకిత భక్తుడు మహల్సాపతితో మాట్లాడుతున్న సమయములో హంసరాజు అనే సాయిభక్తుడు ఒక పళ్ళెమునిండా వెయ్యి వెండి రూపాయనాణాలు తీసుకువచ్చాడు. బాబా అనుమతితో ఆ నాణాలను మహల్సాపతికి బహూకరించదలచాడు. మహల్సాపతి సంతోషముగా ఆ నాణాలను స్వీకరించడానికి సిధ్ధపడ్డాడు. బాబా హంసరాజుని పిలిచి మహల్సాపతికి ఆ నాణాలను ఇవ్వవద్దని ఆదేశించి మహల్సాపతికి గల ధనవ్యామోహాన్ని తొలగించారు.
ఇటువంటి సంఘటన సాయిబానిసగారికి స్వప్నములో బాబా కలిగించారు. ఆ వివరాలు మీకు తెలియచేస్తాను. సాయిబానిసగారు తన మిత్రునితో కలిసి ఒక పెద్దహోటల్ లో భోజనానికి వెళ్ళారు. భోజన సమయములో సాయిబానిసగారికి భోజనటేబుల్ క్రింద ఒక చేతిసంచి కనపడింది. ఆయన ఆ సంచీని పైకి తీసి చూసారు. అందులో అమెరికా డాలర్ల కట్టలు వంద డాలర్లు విలువ గలవి వంద కట్టలు ఉన్నాయి.
సాయిబానిసగారి మిత్రులు ఆ నోట్లకట్టలో తమ వాటా తమకు ఇవ్వమని కోరారు. ఒక్కొక్కరు 20 కట్టలు తీసుకొని తమ తమ సంచులలో వేసుకొని తమ ఇళ్ళకు బయలుదేరారు. బాబా గారు సాయిబానిసగారి మనసులో ప్రవేశించి వెంటనే ఆనోట్లకట్టలను ఆ హోటల్ లోని మురికి కాలవలో పారవేయమన్నారు.
సాయిబానిసగారి స్నేహితులు హోటల్ బయటకు వచ్చి తమ కార్లు ఎక్కుతున్న సమయంలో పోలీసులు వచ్చి తమకు ఈ హోటల్ లో దొంగసొమ్ము ఉందని తెలిసింది. బయటకు వచ్చే ప్రతివారిని సోదా చేయాలి అని చెప్పి ఆ నలుగురు మిత్రులను సోదాచేసి వారివద్ద ఉన్న డాలర్ల కట్టలను స్వాధీనం చేసుకొని వారిని పోలీసు స్టేషన్ కు తీసుకుని వెళ్ళారు. బాబా ఆదేశము ప్రకారం సాయిబానిసగారు తన వద్ద ఉన్న డాలర్ల కట్టలను హోటల్ బయట ఉన్న మురికి కాలవలో పారవేయటం వల్ల పోలీసులకు సాయిబానిసగారి వద్ద డాలర్లు దొరకలేదు.
పోలీసులు ఆయనను వదలివేసారు. సమయానికి శ్రీషిరిడీ సాయిబాబా తన మనసులో ప్రవేశించి తనకు ఉన్న ధనవ్యామోహాన్ని తొలగించి ఆ డాలర్లను పారవేసేలాగ చేసి తనను పోలీసుల బాధనుండి తప్పించినందులకు ఆయన శ్రీషిరిడీ సాయిబాబాకు ధన్యవాదాలు తెలియచేసుకొన్నారు.
26. ధనము, కీర్తి, శాశ్వతము కాదు.
శ్రీ సాయిసత్ చరిత్రలో గురుస్థానంలోని వేపచెట్టుక్రింద బాబా పాలరాతి పాదుకలు ప్రతిష్టించినపుడు ఆపాదుకల పలకపై “సదా నింబ వృక్షస్య’ అనే శ్లోకము వ్రాసిన సాయి అంకిత భక్తుడు ఉపాసనీ మహరాజ్, శ్రీసాయి మహాసమాధి అనంతరం, సకోరి గ్రామంలో ఒక ఆశ్రమము స్థాపించి గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదించారు. వీరి దర్శనార్ధము అనేకమంది జమీందార్లు వచ్చి వీరి ఆశ్రమానికి ఆర్ధిక సహాయం చేస్తూ ఉండేవారు.
వీరి ఆశ్రమం నిర్వహణలో అనేక అపోహల కారణంగా, కొందరు సకోరి గ్రామవాసులు శ్రీఉపాసని మహరాజ్ పై కోర్టులో అనేక కేసులు పెట్టారు. ఈ కోర్టుల వ్యవహారాలతో శ్రీఉపాసని మహరాజ్ అనేక మానసిక బాధలకు గురయ్యి, ఆశ్రమానికి ధనసహాయం లేక ఆఖరులో అనారోగ్యముతో తన 72 వ.ఏట మరణించారు. ఈయన మరణము ద్వారా మనము తెలుసుకోవలసినది మానవ జన్మలో కీర్తిప్రతిష్టలు, ధనసంపాదన శాశ్వతము కావు అని. దీనికి ఉదాహరణగా మనము శ్రీనాధ కవిసార్వభౌముని జీవితమును గుర్తు చేసుకొందాము.
శ్రీనాధ కవి సార్వభౌముడు తన జీవితములో కీర్తిప్రతిష్టలు, ధనసంపాదన చేసి ఆఖరులో రాజుగారికి కప్పము కట్టలేక రాజుగారి కోపమునకు గురయ్యి, రాజభటుల చేత కొరడా దెబ్బలు తిని మానసిక వేదనతో నదిలో పడి ఆత్మహత్య చేసుకొన్నాడు. అందుచేత జీవితములో కీర్తి ప్రతిష్టలు, ధనసంపాదన శాశ్వతము కావు అని మనము శ్రీసాయి అంకిత భక్తుడు ఉపాసని మహరాజ్ మరియు శ్రీనాధ కవి సార్వభౌముని జీవితాలనుండి గ్రహించగలము.
(శ్రీనాధకవి సౌర్వభౌమ చిత్రం లోని ఈ సన్నివేశాన్ని తిలకించండి)
(మరికొన్ని వచ్చే ఆదివారమ్)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment