Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, August 20, 2020

బాబానే ఆశ్రయించాలి

Posted by tyagaraju on 7:47 AM
Shirdi Sai baba: Images of Shirdi Saibaba
Download Pink Rose Hd HQ PNG Image | FreePNGImg

20.08.2020  గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
బాబానే ఆశ్రయించాలి
ఈ రోజు బాబా భక్తుడొకరు వివరించిన అనుభవాన్ని, అతని అభిప్రాయాలను ప్రచురిస్తున్నాను.  ఇది శ్రీసాయి లీల త్రైమాసపత్రిక జనవరి, ఫిబ్రవరి, మార్చ్, 1952వ.సంవత్సరంలో ప్రచురితమయింది.  ఇందులో ఆ భక్తుడు వివరించినదాని ప్రకారం ఆరోజులలోనే తామే బాబా శిష్యులమని తిరిగేవారు ఉన్నారని వారు తమ మాటల గారడీతో ప్రజలను ఆకర్షించేవారని మనకి తెలుస్తుంది.  బాబా తాను ఉన్న రోజులలోనే ఎవరినీ తన శిష్యులుగాను, ఫలానావారు తమ శిష్యుడని గాని ఎప్పుడూ ప్రకటించలేదు.  ఏ సందేహమున్నా నేరుగా తననే అడగమని బాబా చెప్పారన్న విషయం శ్రీ సాయి సత్ చరిత్ర చదివినవారందరికి తెలుసు.  మరి అటువంటప్పుడు తామే గురువులమని, బాబా బోధనలను వినిపిస్తూ ప్రజలను ఆకర్షించి తమ శిష్యులుగాచేసుకొనే వారి వద్దకు వెళ్ళినట్లయితే ఎటువంటి ఫలితం ఉంటుందో ఈ భక్తుడు వివరంగా తెలియ చేస్తున్నాడు.  ఇక చదవండి.
తెలుగు అనువాదమ్ ః ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫోన్.  9440375411  &  8143626744

శ్రీ షిరిడీ సాయిబాబా వారి అనురాగానికి, ఆయన శక్తికి, చేసే అధ్భుతాలకి సంబంధించి నేను పంపుతున్న నా అనుభవాన్ని మీ శ్రీసాయిలీల త్రైమాసపత్రికలో ప్రచురించినట్లయితే అది నా భాగ్యంగా భావిస్తాను.  అంతే కాదు నేను మీకెంతో ఋణపడిఉంటాను.   దీనిని దయచేసి మీ పత్రికలో ప్రచురించవలసినదిగా కోరుతున్నాను.

నాకు సాయిబాబా మీద పరిపూర్ణమయిన నమ్మకం ఉన్నప్పటికి నేను మొట్టమొదటిసారిగా 1951వ.సంవత్సరంలో షిరిడీ వెళ్ళాను.  నా చిన్నతనంనుంచి 15 సంవత్సరాలకు పైగా నేనాయన గురించి విన్నాను.  అసాధారణమయిన రీతిలో కనిపించే బాబా వారి ఫొటో సాధారణంగా మనం ఎక్కడా చూడము, కొందామన్నా ఎక్కడా దొరకదు.  అటువంటి ఫోటోని నా మేనమామ నాకు కానుకగా ఇచ్చాడు.  


         Original Photos of Shirdi Sai BabaZeven dagen Shirdi Sai
అప్పుడు నావయసు 15 సంవత్సరాలు.  అప్పటినుండి నాకు తెలియకుండానే నేనాఫోటోలో ఉన్న బాబాకు భక్తితో ప్రార్ధిస్తూ ఉండేవాడిని.  ఆ ఫోటోని ఇప్పటికీ నేను చాలా భద్రంగా దాచుకొన్నాను.  ఇక ఇప్పటి విషయానికొస్తే ఇపుడు నావయస్సు 29 సంవత్సరాలు.  శ్రీసాయిబాబా అంటే ఎవరో ఎక్కడినుంచి వచ్చారో అనే విషయాలు ఏమీ తెలియకపోయినా నేనాయనని పూజిస్తూ ఉన్నాను.  అలా సంవత్సరాలు గడిచిపోయాయి.  శ్రీసాయిబాబా మీద నాకు ధృఢమయిన నమ్మకం ఉంది.  ఆయన గురించిన విషయాలను నేనెంతో శ్రధ్ధగా ఆలకిస్తూ ఉంటాను.  శ్రీషిరిడీ సాయిబాబావారి కీర్తి ఉత్తర దిశలోని బొంబాయినుండి దక్షిణ దిశలో ఉన్న మద్రాసు వరకు దూరదూర ప్రాంతాలలో శరవేగంగా వ్యాప్తి చెందుతూ ఉన్నదనే విషయం అందరికీ తెలుసు.

దాని ప్రభావం వల్లనే సాయిబాబాకు ఎంతోమంది భక్తులు లెక్కలేనంతమంది పెరగసాగారు. భక్తులందరికీ బాబావారు ఎన్నో అనుభూతులను, అనుభవాలను ఇవ్వడం ఒక కారణమే కాక, వారంతా సాయిబాబా సర్వాంతర్యామి అని గుర్తించడంవల్ల కూడా బాబామీద వారందరికి అచంచలమయిన నిస్వార్ధమయిన విశ్వాసం, నమ్మకం కలిగాయి.

ఈ మధ్య చాలామంది తాము శ్రీషిరిడీ సాయిబాబాకు శిష్యులమని తమకుతామే ప్రకటించుకుని ప్రజలను తమ వద్దకు రప్పించుకొంటున్నారు.  ఈ సందర్భంగా నేను కూడా అటువంటివారి వద్దకు, వారున్న ప్రదేశాలకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి.  1949వ.సంవత్సరంలో నా చదువు పూర్తయింది.  చదువు పూర్తయిన వెంటనే ఏదయినా మంచి ఉద్యోగంలో చేరదామనే నా తాపత్రయం.  ఆకోరిక నాలో బలీయంగా ఉండటం వల్ల బాబా శిష్యులమని చెప్పుకునేవారివద్దకు వెళ్ళి వారి ఆశీర్వాదాలు తీసుకున్నట్లయితే నా కోరిక నెరవేరుతుందని భావించాను.  వారి దీవెనలు ఫలిస్తాయనే ఒక గుడ్డి నమ్మకం వల్ల నాకు ఉద్యోగం తప్పకుండా వస్తుందని అనుకునేవాడిని. కాని నేనొక విషయం చెప్పడానికి చాలా విచారిస్తున్నాను. నాకు కలిగిన అనుభవాన్ని బట్టి నేను భక్తితో చేసే ప్రార్ధనలు నిష్ప్రయోజనమయ్యి, ఏఫలితం లేకపోగా,  బాబా శిష్యులమని చెప్పుకునేవారిని ఆశ్రయించినందువల్ల నాకు ఉద్యోగం రాలేదు సరికదా ఎన్నో దుష్ఫలితాలు,  చెడు ప్రభావాలు  కలిగాయి.  తీవ్రనిరాశకు లోనయ్యాను.  కాని ఒక్కటి మాట్రం ఘంటాపధంగా చెప్పగలను.  సరైన సమయంలో శ్రీషిరిడీ సాయిబాబా తన అనుగ్రహాన్ని నామీద చూపించారు.  దాని ప్రభావం వల్లనే నేను అటువంటి వ్యక్తులనుండి, నా దీనావస్థనుండి బయటపడగలిగాను.  నేను ఇపుడు ఇంత మంచి స్థితిలో ఉన్నానంటే దానికి కారణం బాబా తప్ప మరెవరూ కాదు.  నేను అటువంటి వ్యక్తులు ఉన్న చోటకు వెళ్ళడం వారిని ఆశ్రయించడం వల్ల కలిగిన అతి భయంకరమయిన అఘాతం ఎంత భయంకరమయినదంటే  , వారిమీద నాకు అంతకుముందు ఉన్నటువంటి గౌరవం అంతా ఒక్క దెబ్బతో తుడిచిపెట్టుకొనిపోయింది. నాకు తగిలిన దెబ్బలు శరాఘాతమనే చెప్పాలి.  నాకు జ్ఞానోదయమయింది.  నేను చేసిన తప్పును సరిదిద్దుకోమని నా అంతరాత్మ సలహా ఇచ్చింది.  నా అంతరాత్మ నేను చేసిన పెద్ద తప్పు ఏమిటో నాకు తెలియచేసింది.  శ్రీసాయిబాబావారి పుణ్యభూమి అయిన షిరిడీకి వెళ్ళి నేరుగా ఆయననే ఆశ్రయించాలి.  అలాకాకుండా మధ్యలో వచ్చి, తామే సాయిబాబా శిష్యులమని, తామే మహాత్ములమని చెప్పుకుని తిరిగే మోసకారుల వద్దకు వెళ్లడమేమిటి? నా అంతరాత్మ చెప్పిన ఈ బోధ నాకళ్ళు తెరిపించింది.   బాబా తాను జీవించి ఉన్న రోజులలో కూడా ఎవరినీ తన శిష్యులుగా చేసుకోలేదు, ప్రకటించలేదు.  అటువంటప్పుడు వీరందరూ చెప్పేమాటలకు మనం విలువ ఇవ్వనవసరం ఎంతమాత్రం లేదు.

గత 10 సంవత్సరాలుగా నేను పూనాలోనే ఉంటున్నాను.  షిరిడీ, పూనాకి చాలా దగ్గర.  అంత దగ్గరగా ఉన్నా నాకెప్పుడూ షిరిడీ వెళ్ళాలనే ఆలోచనే రాలేదు.  బహుశ సాయిబాబా అంత త్వరగా నన్ను తన వద్దకు రప్పించుకుందామని అనుకుని ఉండరు.  తాను ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలని నన్ను గ్రహించుకునేలా చేద్దామనే, నన్ను ఎక్కడెక్కడికో దూరప్రదేశాలకి వెళ్ళేలా చేసారు.  ఆవిధంగా చేసి నన్ను కొన్ని సంకటాలకు గురిచేసి నాకు నేనే తెలుసుకునేలా నాకళ్ళు తెరిపించారు.  ఆ విధంగా ఇంతకు ముందు చెప్పినట్లుగా తామే బాబా శిష్యులమని చెప్పుకునేవారివల్ల నేను పడిన బాధలనుంచి కోలుకోవడానికి అవకాశం కలిగించారు బాబా.  నేను షిరిడీ వెళ్లడానికి సమయం దగ్గరలోనే ఉంది.  బాబా అదృశ్యంగా నాపై తన అనుగ్రహాన్ని కురిపిస్తున్నారు.  1951 వ.సంవత్సరం జనవరిలో నేను మొట్టమొదటిగా షిరిడీ రావడానికి గల కారణాన్ని మీకు సంగ్రహంగా వివరించాను.

నేను షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకున్న తరువాత జరిగిన అధ్భుతాన్ని మీకు కాస్త వివరిస్తాను.  నేను షిరిడీ వెళ్ళిన రెండు నెలలలోపే నాకు బొంబాయిలో మంచి ఉద్యోగం వచ్చింది.  అదంతా బాబా నామీద కురిపించిన కృపవల్లనే అని ఖచ్చితంగా చెప్పగలను.  ఇంకా గొప్ప విచిత్రం ఏమిటంటే నేను బొంబాయిలో 3 నెలలు మాత్రమే పనిచేసాను.  ఆ వెంటనే నాకు పూనాలోనే సెమి-గవర్నమెంటు ఉద్యోగం వచ్చింది.  జీతం కూడా ఎక్కువే.  అంతే కాదు, పూనాలోనే నాకు స్వంత ఇల్లు కూడా ఉంది.  ఈ సందర్భంగా మరొక విషయం చెబుతాను.  నాకు అన్ని విద్యార్హతలు ఉన్నా, ఎంతోమంది గొప్ప హోదాలో తెలుసున్నవాళ్ళు, పరిచయస్తులు ఉన్నా గాని వారెవరూ నాకు ఉద్యోగం ఇవ్వడంలో ఏవిధమయిన సాయం చేయలేదు.  వారివన్నీ మాటలే తప్ప చేతలు కావని నిరూపితమయింది.

వాస్తవంగా చెప్పాలంటే నేను షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకున్న తరవాతనే బాబా నాకు ఉద్యోగం ఇప్పించారు.  బాబామీద నా నమ్మకం ఇంకా బలీయమయింది.  ఇప్పటి వరకు నేను మా అమ్మగారితోను, సోదరితోను, షిరిడీకి దాదాపు అయిదు సార్లు వెళ్ళాను.  ఎప్పుడు సెలవులు వచ్చినా, లేక నేను సెలవు పెట్టినా షిరిడీ వెళ్ళి అక్కడ సాయిపాదాల చెంత కొన్ని రోజులు గడపాలని నాకు అనిపిస్తూ ఉండేది.  అక్కడ నాకెంతో ప్రశాంతత లభించేది.  ఎప్పుడు షిరిడీ వెళ్లినా నేనక్కడ ఎంతో ఆనందాన్ని, మానసిక ప్రశాంతతని అనుభవిస్తూ ఉండేవాడిని.

నేను ఏమీ తెలియని ఒక సామాన్య మానవుడిని.  నాభావాలను ఎలా వ్యక్తీకరించాలో నాకు తెలియదు.  నాకు కలిగిన అనుభూతులను, నా అభిప్రాయాలను మీకు తెలియచెప్పడానికి నా శాయశక్తులా ప్రయత్నించాను.  ఈ నా అనుభవాలను మిగతా సాయిభక్తులందరికీ తెలియచేయాలనే కోరికతో మీకు పంపిస్తున్నాను.  మీరు దీనిని మీ శ్రీసాయిలీల త్రైమాసపత్రికలో ప్రచురించమని, అది సాయిభక్తులకి ఎంతో మేలు చేస్తుందని నేను భావిస్తున్నాను.

శ్రీషిరిడీ సాయిబాబా మీద మన నమ్మకం దినదినాభివృధ్ధి చెందాలని ఆ సాయిని మనసారా ప్రార్ధిస్తున్నాను.
ఓమ్ శ్రీ షిరిడీ బాబా ప్రసన్న
మీ విధేయుడు
ఎన్.ఎ. హెబ్లింకర్
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

సాయి సాగరం నుండి వెలికి తీసిన ఆణిముత్యాలు 14 వ.భాగమ్ ఈ లింక్ ద్వారా చదవండి.

http://teluguvarisaidarbar.blogspot.com/2020/08/14.html#more

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List