04.09.2020 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి సత్ చరిత్రలో మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి.
బాబా
అంకిత భక్తులు తమంత తాముగా చెప్పిన కొన్ని విషయాలను సంఘటనలను మరాఠీలో మిస్. ముగ్ధా సుధీర్ దివాద్కర్ గారు
వ్రాసిన
వాటిని ఆంగ్లంలోనికి అనువదించినవారు శ్రీ సుధీర్ గారు.
సాయిలీల ద్వై మాసపత్రిక మార్చ్ – ఏప్రిల్ 2013 వ.సం. సంచికనుండి గ్రహింపబడినది.
తెలుగు అనువాదమ్..
ఆత్రేయపురపు
త్యాగరాజు,
నిజాంపేట, హైదరాబాద్
రావుబహద్దూర్ సాఠే – 4 వ.భాగమ్
సమర్ధ చెప్పిన వృత్తాంతం ---
పైథాన్ గ్రామంలో నేను ఒక బ్రాహ్మణునితో
కలిసి ఉన్నాను. అతను చాలా మంచివాడు. అతను నాకు సహాయం చేసాడు. నేను కూడా అతనితో కలిసి పని చేయసాగాను. మధ్యాహ్నం నేను ఒక పావుభాగం రొట్టె
తిన్న తరువాత స్థిమితంగా పడుకునేవాడిని.
ఈ రోజుల్లో మీకు అటువంటి బ్రాహ్మణులు ఎవరూ కనపడరు. అందరూ స్వార్ధపరులుగా తయారయ్యారు.
ఒక భక్తుడు అడిగిన ప్రశ్న – ఆ బ్రాహ్మణుడు ఇప్పటికీ జీవించే ఉన్నాడా?
బాబా సమాధానం – ఇది 200 సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పటికీ అతనుపైథాన్ లోనే ఉంటాడా? అతను ఇపుడు ఎక్కడో జన్మించే ఉంటాడు. అంతా అల్లా మియాకే తెలుసు.
భక్తుడు – 200 సంవత్సరాల క్రితం జరిగినది మీరు చెబుతున్నారు. అటువంటపుడు ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు
ఎక్కడ ఉన్నాడో మీరు మాకెందుకు చెప్పరు? అతని పేరు ఏమిటి?
బాబా సమాధానమ్ – ఇదంతా ఆ అల్లామియా లీల – మనమేమి చేయగలం?
భక్తుడు – కాని, ఆ సమయంలో మీరు అక్కడే ఉన్నారు కదా, మీకు ఇప్పటికీ దాని గురించి బాగా తెలుసు. మీకింకా ఈరోజుకి కూడా గుర్తుండే ఉంటుంది.
బాబా - అరే! నేను దానికిముందు వెయ్యి సంవత్సరాల క్రితం కూడా అక్కడే ఉన్నాను. నీకేమి తెలుసు? నేను ప్రయాగలో ఉన్నపుడు ఎంతో సరదాగా ఉండేది. నిజంగానే ఎంతో సరదాగా ఉండేది. నీకేమి తెలుసు?
భక్తుడు - బాబా! మీరు మాకు చెప్పకపోతే మాకెలా తెలుస్తుంది? దయచేసి చెప్పండి బాబా…
బాబా – ప్రయాగలో నేను ఒక చెట్టుక్రింద కూర్చుని చిలుము పీలుస్తూ ఉన్నాను. అప్పుడు అక్కడికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. అతని చేతిలో ఒక పెద్ద వీణ ఉంది. అతను ఆవీణను పట్టుకుని భజన పాట పాడుకుంటూ ఉన్నాడు. అతను నాకు నమస్కరించి, “బాబా ఇక్కడికి దగ్గరలో ముకుంద్ అనే బ్రాహ్మణుడు భగవన్నామ స్మరణ చేసుకుంటూ జపం చేసుకుంటున్నాడు. అతని దగ్గరకు వెళ్ళి నామస్మరణ చేసినంత మాత్రాన అతనికి ఫలితం ఏమీ ఉండదని చెప్పు”. అతను రేపు ఉద్యాపన చేయాలి. అపుడే అతను ప్రశాంతంగా జీవిస్తాడు.” అని అన్నాడు.
అపుడు నేను అతనితో “ఈబాధంతా ఎవడు పడతాడు? నాకేమీ అంత అవసరం లేదు. నువ్వే వెళ్ళి ఎందుకు చెప్పకూడదు?” అన్నాను. అపుడా బ్రాహ్మణుడు నామాట వినలేదు. అతను “మహరాజ్ – ఈపని నువ్వే చేయాలి. నాకోసం చెయ్యి” అని నన్ను బలవంత పెట్టాడు. ‘”ఇపుడు నువ్వు ధరించిన దుస్తులను బట్టీ, నువ్వు ఇక్కడ ఉండటం గమనిస్తే, నువ్వు ఆ కార్యం చేయడం కోసమే వచ్చినట్లుగా తెలుస్తోంది. నేను సరిగానే ఊహించాను. కాకపోతే నువ్వు నేను చెప్పినదానికి అంగీకరించనట్లుగా నటిస్తున్నావు. ఇపుడు నువ్వు ధరించిన దుస్తులను బట్టి నీ రాకయొక్క అసలు ఉద్దేశ్యం నాకర్ధమయింది.
నేనప్పుడు అతనితో “అయితే సరే – నువ్వు వెళ్లు, నేనన్నీ సవ్యంగా జరిగేలా చూస్తాను” అన్నాను. నేను చెప్పినది విన్న తరువాత అతను
నాకు నమస్కరించి భజన పాట పాడుకుంటూ వెళ్ళిపోయాడు. అతని భజన వినడానికి చాలా శ్రావ్యంగా
ఉంది. అతను ఎంతో వినయంగా
ఉన్నాడు.
ఆ తరువాత నేను అతను చెప్పినట్లే చేసాను. నేను ముకుంద్ ఉంటున్న గదికి వెళ్ళాను. అతను ఉన్నగది నేను ఉన్న చోటునుంచి షిరిడీ నుంచి నీమ్ గావ్ కు ఉన్నంత దూరంలో ఉంది. (నీమ్ గావ్ షిరిడీకి ఉత్తరంగా ఒక మైలు దూరంలో ఉంది). నేను గదిలోకి ప్రవేశించిన మరుక్షణమే ముకుంద్ బువా లేచి నిలబడి “ఇదిగో చూడు, లోపలికి రావద్దు. నేను అనుష్టానం చేసుకుంటున్నాను. వెంటనే బయటకు వెళ్ళు” అన్నాడు.
“ఏమిటి ఈ గోల, అక్కడ ఆ బ్రాహ్మణుడేమో నాకు ఏదో చెప్పాడు. ఇక్కడ ఇతనేమో మరొక విధంగా మాట్లాడుతున్నాడు. నేనేమి చేయాలి? అల్లాయే యజమాని. ఆయనకు అన్నీ తెలుసు” అన్నాను. నేను ఈవిధంగా అన్న వెంటనే ముకుంద్ నాముందుకు వచ్చాడు. క్రిందకు వంగి నాకాళ్ళు పట్టుకున్నాడు. అలాగే వంగి తనలో తనే ఏదో గొణుగుకుంటున్నాడు. అల్లామియా అనుగ్రహం వల్ల అతని మనసులో ఏముందో నేను గ్రహించుకోగలిగాను. నేను చెప్పదలచుకున్నదేమిటో (అల్లా ఆజ్ఞ) అతనికి నామనస్సు ద్వారానే తెలియచేసి అక్కడినుండి తప్పించుకుని వచ్చేసాను.
ఒక్క నిమిషంలోనే ముకుంద్ శిష్యుడు పరిగెత్తుకుంటూ నాదగ్గరకు వచ్చి, “సాయిమహరాజ్, మా ముకుంద్ మహరాజ్ గారికి మీరేమి చెప్పారు? మీరు వెళ్ళిన మరుక్షణమే ఆయన పవిత్రమయిన అగ్నిని ప్రజ్వరిల్ల చేసి ఆ అగ్నిలోకి దూకేసారు. ఆయన శరీరం బూడిదయిపోయింది. ఇప్పుడు మేమేమి చేయాలి?” అన్నాడు.
అపుడు నేను, “ఎలా జరగాలో అలాగే జరిగింది. ఏది ఎలా జరగాలో అదే విధంగా జరిగింది. అల్లాయే ప్రతీదీ సవ్యంగా జరిగేలా ఏర్పాటు చేస్తాడు.’
ఇది వినగానే ఆ శిష్యుడు సందర్బం లేకుండా
మాట్లాడటం మొదలుపెట్టాడు. “ఇపుడు
ఆయన శిష్యులమయిన మేము కూడా అదే విధంగా చేస్తాము. మేము కూడా ఆ పవిత్రాగ్నిలోకి దూకుతాము. దీనికంతటికీ
మీరే బాధ్యులవుతారు. జాగ్రత్త” అన్నాడు.
“సరే అయితే – అల్లాయే యజమాని”
అన్నాను.
ఇది వినగానే అతను వెనుకకు తిరిగి వెళ్ళిపోయాడు. నేను ఉమర్ కోట్ వైపు నడుచుకుంటూ వెళ్లసాగాను. ఒకటి రెండు రోజులు అలా నడుచుకుంటూ వెళ్ళిన తరువాత నేను ఒక ప్రదేశానికి చేరుకున్నాను. ఆ ప్రదేశమంతా ఇసుకతో నిండి ఉంది. అక్కడ ఒక వ్యక్తి కనిపించాడు. ఆవ్యక్తి మంచి అందగాడు, స్ఫురద్రూపి. అతను ఎంతో మర్యాదస్తుడిలా ఉన్నాడు. అతని ప్రక్కన ఒక స్త్రీ ఉంది. ఆమె క్రింద పడి దొర్లుతూ, “మంచినీళ్ళు, మంచినీళ్ళు” అని అరుస్తూ ఉంది. అక్కడ ఒకరిద్దరు సేవకులు ఉన్నారు. కాని వాళ్ళు ఏమీ చేయకుండా అలా నిలబడి చూస్తూ ఉన్నారు. అపుడా పెద్దమనిషి నాతో “నీదగ్గర మంచినీళ్ళు ఉన్నాయా? ఒక్క గుక్కెడు ఉంటే చాలు. నా రాణికి చాలా దాహంగా ఉంది. అంతేకాదు ఆమె గర్భవతి. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని స్థితిలో ఉంది” అన్నాడు.
నాదగ్గర ఉన్న పాత్రలో కాసిని మంచినీళ్ళు ఉన్నాయి. నేను ఆ స్త్రీ నోటిలో వాటిని పోసాను. ఆమె వెంటనే తేరుకుంది. ఆమె క్రింద కూర్చుని నన్ను చూడగానే తన శిరసును నాపాదాల వద్ద ఉంచింది. నేను ఆమె శిరసుపై నా చేతిని ఉంచి, వారిని ఉమర్ కోట్ వైపు వెళ్ళమని ఆదేశించాను. ఆమె భర్త జరుగుతున్నదంతా మొత్తం చూస్తూనే ఉన్నాడు. అతను మోకాళ్ళమీద
కూర్చుని తన చేతిని ఆకాశంవైపు చూపిస్తూ “బాబా ఇపుడు మాగతి ఏమిటి? ఇపుడు మేమేమి చేయాలి. మేమిపుడు ఎక్కడికి వెళ్ళాలి? మాకిప్పుడు దిక్కెవరు?” అన్నాడు.
అతని కళ్ళంబట కన్నీళ్ళు ధారగా కారుతున్నాయి. అతని శిరసుపై నా చేతిని ఉంచి, “ఏడవకు, నీయోగక్షేమాలన్నీ అల్లా చూసుకుంటాడు. మీరందరూ ఇప్పుడు ఉమర్ కోట్ కు వెళ్ళండి. అక్కడ మీరు ఉండటానికి మంచి ఆశ్రయం లభిస్తుంది. అక్కడకు వెళ్ళిన తరువాత ఈమెకు ఒక మగబిడ్డ జన్మిస్తాడు. దారిలో మీకెటువంటి కష్టాలు రావు. ఇక మీరు బయలుదేరండి” అని చెప్పాను. ఆ పిల్లవాడు ప్రపంచమంతా గుర్తించదగ్గ చక్రవర్తి అవుతాడు. దారిలో మీకెటువంటి కష్టాలు రావు. ఇక మీరు బయలుదేరండి” అని చెప్పాను.
(ఆ చక్రవర్తి ఎవరో రేపటి సంచికలో)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment