05.11.2020
గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి లీల ద్వైమాసపత్రిక సెప్టెంబర్ – అక్టోబర్, 2014 వ.సంవత్సరంలో ప్రచురింపబడిన శ్రీ సెందూర్ నాగరాజన్ గారి లీల రెండవభాగాన్ని ఈ రోజు ప్రచురిస్తున్నాను.
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
బాబా నాకు ప్రసాదించిన అద్భుతమయిన ఉన్నత స్థాయి… 2 భాగమ్
అనువాదం చేసిన ఆరతులన్నిటినీ కంప్యూటర్ లో టైప్ చేసాను. వాటిలో ఏమన్న తప్పులు దొర్లి ఉంటే సరిచేయడానికి ఒక రోజు ఉదయం 9 గంటలకు వేలయ్య ఇంటికి వెళ్లాను. సాయంత్రం 6 గంటలవరకు నేను, వేలయ్య, అతని భార్య మరొక మరాఠీ స్నేహితుడు నలుగురం కూర్చుని తప్పులు దిద్దుతూ కంప్యూటర్ లో డి టి పి చేసాను. సరిదిద్దిన తప్పులన్నిటిని చాలా జాగ్రత్తగా గమనించుకుంటు ఎప్పటికప్పుడు సేవ్ చేసాము. సాయంత్రం 6 గంటలకు, నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తానని, ఆతరువాత మిగిలిన పని కంప్యూటర్ లో పూర్తిచేస్తానని నా తోటివారందరికీ చెప్పి బయలుదేరాను.
నేను ఇంటికి వెళ్ళి భోజనం చేసిన తరువాత రాత్రి 9 గంటలకి వేలయ్య ఇంటికి వచ్చాను. మళ్ళీ పని మొదలుపెట్టడానికి కంప్యూటర్ దగ్గర కూర్చుని అంతకు ముందు చేసినది చూస్తే ఏదీ సేవ్ కాలేదు. సరిచేసిన తప్పులన్నీ సరి అవకుండా ఎలా ఉన్నవి అలానే ఉన్నాయి. సేవ్ చేసినా సేవ్ కాకపోవడమేమిటో మాకేమీ అర్ధం కాలేదు. అంతకుముందు అక్షరదోషాలు, తప్పులు ఏమైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ కనిపిస్తున్నాయి. మాలో మేమే దాని గురించి చర్చించుకున్నాము. ఇక ఏమైతే అది అయిందని మరింత ఉత్సాహం తెచ్చుకొని ఎలాగయిన సరే ఈ రోజుకి పూర్తి చేయవలసిందేనని బాబాని ప్రార్ధించుకొని మళ్ళీ మొదటినుంచి పని మొదలుపెట్టాము. ఆశ్చర్యకరమయిన విషయమేమిటంటే అంతకు ముందు మేము సరిచేసిన తప్పులు కాక ఇంకా సరిచేయవలసిన తప్పులు మరికొన్ని కొత్తవి కనిపించాయి. ఆఖరికి అర్ధరాత్రి 12 గంటలకి పని పూర్తయింది. ఈ రోజుకీ నేను ఆ ఆరతులను పాడుతున్నాను. అందులోని పదాలను చదువుతుంటే నేనేనా వీటిని రాసినది అని నాకే నమ్మకం కుదరలేదు. బాబానే నాచేత ఈ పనినంతా పూర్తి చేయించారని నా ప్రగాఢమయిన నమ్మకం.
ఈ పుస్తకం ప్రచురింపబడిన తరువాత నా స్నేహితులు, బంధువులు "నువ్వింత
గొప్ప పని చేసావు కదా మరి బాబా నీకేమిచ్చాడయ్యా అని అంటూ ఉండేవారు. దీని ఫలితంగా బాబానుంచి నువ్వు పొందిన లాభం ఏమిటి? నువ్వింకా అద్దె ఇంటిలోనే ఉంటున్నావు." ఈ విధంగా
మాట్లాడటం మొదలుపెట్టారు. కాని నాకు మాత్రమే
తెలుసు నేనేమి పొందానో. ఆధ్యాత్మికమయిన ఆనందం
నాకు లబించింది. ఎటువంటి లౌకిక విషయాలతోను ఆ
ఆనందాన్ని సరిపోల్చలేము. అది వెలకట్టలేనిది. అనుభవించిన వాళ్ళకే అందులోని మాధుర్యం ఏమిటో తెలుస్తుంది. ఈ పుస్తకం ద్వారా నేడు, బాబా నా పేరుని ప్రపంచవ్యాప్తం
చేసారు. ఇంతకన్నా నాకేమి కావాలి? కాని నా స్నేహితులు, నా బంధువులు నన్నిలా సాధించడం
బాబాకు ఇష్టం లేకపోయింది. నాలుగయిదు నెలల్లోనే
నేను సొంత ఇంటిలోకి మారాను. నేను సొంతంగా ఇల్లు
కట్టుకోవడానికి ఆర్ధికపరమయిన సద్దుబాట్లు ఎలా నిర్వహించగలిగానో నాకే అర్ధం కాదు.
గొప్ప గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలు చదవడమంటే నాకెంతో ఇష్టం. ఆవిధంగా జీవిత చరిత్రలు చదివే క్రమంలో ప్రముఖ జాతీయ నాయకుడు శ్రీ కామరాజు నాడార్ గారి జీవిత చరిత్ర చదవడం తటస్థించింది.
ఆయన నిస్వార్ధపరుడయిన కర్మయోగి. ఆయన 1954 నుంచి 1963 వరకు తమిళనాడు రాష్ట్రానికి
ముఖ్యమంత్రిగా పనిచేసారు. ఆయన జీవిత చరిత్ర
చదివిన తరువాత ఆయన చేసిన అసమానమయిన కార్యాల గురించి అసాధారణమయిన రీతిలో ఒక సుదీర్ఘమయిన
పద్య కావ్యం రచిద్దామనే ప్రేరణ కలిగింది. ఆప్రేరణ
నాలో ఉదయించగానే ఇక ఆలస్యం చేయకుండా ఏకబిగిన ఎక్కడా ఆపకుండా పద్యకావ్యాన్ని రచించాను. ఆవిధంగా 1200 పేజీల పుస్తకం ముద్రించబడింది. అన్ని పేజీల పుస్తకం నేనే రాసానా అని నాకే ఆశ్చర్యం
కలిగింది. అన్ని పేజీల పుస్తకం రాయగలిగానంటే
అది కేవలం బాబా అనుగ్రహం తప్ప మరేదీ కాదు.
బాబాని నేనెప్పుడు పిలిచినా ఆయన వెంటనే పరిగెత్తుకుంటూ నాకోసం
వస్తూ ఉంటారు.
ఒకరోజు నేను భయంకరమయిన పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. ఆరోజున నాకు సి.ఎస్.టి. (వి.టి.) రైల్వే స్టేషన్
నుంచి ఒక ఫోన్ వచ్చింది. నాకు తెలియని వ్యక్తి
ఒకతను నాతో తమిళంలో మాట్లాడాడు. మీవర్గానికి
సంబంధించిన కొంతమంది ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి
సహాయం చేయాలి. అందువల్ల మీరు మాకు సహాయం అందించాలి
అంటూ, మీరు సి.ఎస్.టి. స్టేషన్ కి రండి అన్నాడు.
అతని మాటలను బట్టి నేనాలోచించినదేమంటే అతనికే కనక సహాయం కావాల్సి వస్తే నేరుగా
నాదగ్గరకే రావచ్చు కదా? నన్నే అక్కడికి రమ్మనడం
దేనికి? ఈ ఆలోచన రాగానే నాలో అనుమానం కలిగింది. నా అనుమానం నివృత్తి చేసుకోవడానికి మా వర్గంలోని
నలుగురైదుగురు వ్యక్తుల పేర్లు చెప్పి మీరు వారినెవరినైనా కలిసారా అని అడిగాను. అతడు లేదని సమాధానమిచ్చాడు. దాంతో నా అనుమానం ఇంకా బలపడి ఇక అతనితో సంభాషణ ముగించేసాను. ఆ తరువాత అతను మాటిమాటికి నా మొబై ల్ కు ఫోన్ చేయసాగాడు. ఆ విధంగా ఒకరోజు నేను సహాయం చేయకపోతే హత్య చేస్తానని
నన్ను బెదిరించాడు. అతని మాటలకు నాకు చాలా
భయం వేసింది. వళ్ళంతా వణకసాగింది. నాభార్య వచ్చి విషయం తెలిసి తను ఇంకా భయపడింది. మాకేమి చేయాలో అర్ధంకాలేదు. ఆసమయంలో బాబా తప్ప మరెవరూ సహాయం చేయలేరనిపించింది. ఇక వేరే మార్గం లేదు. ఈ పరిస్థితినుండి ఆయనే తప్పించగలరని నాప్రగాడమయిన
విశ్వాసం. నా భార్యకు ఒక సాయిభక్తురాలు సాయి వచనాలను ఇచ్చింది. బాబా
తన భక్తులను దీవిస్తూ ఇచ్చిన ఆ పదకొండు వచనాలను భక్తితో చదువుతూ ఈ గండంనించి గట్టెక్కించమని
బాబాను వేడుకొంది. ఆశ్చర్యంగా ఆరోజునుండి ఆ
అపరిచిత వ్యక్తి నించి ఫోన్ రావడం ఆగిపోయింది.
2013వ.సంవత్సరం డిసెంబరులో మా మరదలు, ఆమె భర్త మా ఇంటికి వచ్చారు. వారిని షిరిడీ తీసుకు వెళ్ళాము. మా మరదలికి తమిళనాడులోనే ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం
చేద్దామనే కోరిక ఉంది. నీకోరికను బాబాకు విన్నవించుకో
ఆయన నీకు తప్పకుండా సహాయం చేస్తారని నా భార్య చెప్పింది. నా భార్య చెప్పినట్లుగానే
నా మరదలు బాబాకు తన కోరికను చెప్పుకున్న ఒక్క నెలలోనే తమిళనాడులోనే ఉద్యోగం వచ్చింది.
మా మామగారు శ్రీ నారాయణన్ గారికి ఎనిమిది సంవత్సరాల క్రితం కాన్సర్ సోకింది. మాగ్రామానికే చెందిన డా.రాజా కోయంబత్తూరులో ప్రాక్టీస్ చేస్తున్నారు. మా మామగారికి ఆయనే వైద్యం చేస్తున్నారు. ఆయన కూడా సాయిభక్తుడవటం వల్ల మా మామగారికి వైద్యంతో పాటుగా సాయిబాబా పుస్తకాలను ఇచ్చి చదవమని చెప్పేవారు. ఆకారణంగా మా మామగారికి సాయిబాబా మీద భక్తి ఏర్పడింది. ఆయనకు వైద్యం కొనసాగిస్తూనే మా మామగారిని కోయంబత్తూరులో ఉన్న సాయిబాబా మందిరానికి తీసుకువెళ్లారు. అక్కడ సాయిబాబా విగ్రహాన్ని చూపిస్తూ బాబా అసాధ్యమయిన వాటిని కూడా సాధ్యం చేయగలరని మా మామగారికి చెప్పారు. ఆయన మాటలు మా మామగారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాయి. బాబా కళ్ళలో కనిపించే కరుణ కొన్ని క్షణాలపాటు మా మామగారిని కట్టిపడేసింది.
ఆక్షణంలో బాబా ఇచ్చిన
మాట, “నాయందెవరి దృష్టి కలదో వారియందే నాదృష్టి” గుర్తుకు వచ్చింది. మా మామగారు కాన్సర్ నుండి కోలుకొని షిరిడీ వెళ్ళి
బాబాను దర్శించుకొన్నారు.
అదే బాబాలో ఉన్నటువంటి మహత్యం. ఆయన మనలో ఎంతో మార్పుని తీసుకువస్తారు. బాబా ఉన్నారు కాబట్టే మనం ఆయన ఉనికిని అనుభవిస్తున్నాము,
అనుభూతి చెందుతున్నాము.
సెందూర్ నాగరాజన్
(సమాప్తం)
(సర్వం శ్రీ సాయినాధార్పనమస్తు)
1 comments:
Om sri sai ram
Post a Comment