Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, November 4, 2020

బాబా నాకు ప్రసాదించిన అద్భుతమయిన ఉన్నత స్థాయి… 1 భాగమ్

Posted by tyagaraju on 3:45 AM

 



04.11.2020 బుధవారమ్

ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి లీల ద్వైమాసపత్రిక సెప్టెంబర్అక్టోబర్, 2014 .సంవత్సరంలో ప్రచురింపబడిన శ్రీ సెందూర్ నాగరాజన్ గారి లీలను రోజు ప్రచురిస్తున్నాను.

తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

బాబా నాకు ప్రసాదించిన అద్భుతమయిన ఉన్నత స్థాయి… 1 భాగమ్

నేను మాస్వంతగ్రామమయిన మావడిలోనే 12.తరగతి వరకు చదువుకున్నాను.  మావడి గ్రామం తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా కాలకడు తాలూకాలో ఉంది.  ముందునుంచీ నేను చాలా శ్రధ్ధగానే చదుకునేవాడిని.  అందువల్లనే నాకు ఇంజనీరు కావాలనే కోరిక.  కాని మాకుటుంబ ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే.  పెద్దపెద్ద చదువులు చదవడమంటె అది మాకు తీరని కోరిక.  నాకిష్టమయిన చదువును నేను చదవలేకపోతున్నాననే బాధ నాకు తీరని వ్యధగా పరిణమించింది.


మా పెద్దనాన్నగారబ్బాయి ( నా కజిన్) శ్రీరామచంద్రన్ గారు ప్రొఫెసర్ గా అప్పట్లో ముంబాయిలో ఉద్యోగం చేస్తున్నారు.  ఆయన నన్ను పై చదువులు చదివిస్తానని నా బాధ్యతను తీసుకున్నారు.  అందువల్ల నాపైచదువులకోసం నన్ను ఆయన వద్దకు పంపించారు.  1993.సంవత్సరంలో నేను ముంబాయికి వచ్చాను.  ముంబాయిలో నాకు చాలా చోట్ల శ్రీసాయిబాబా మందిరాలు కనిపించాయి.  అప్పటివరకు నాకు సాయిబాబా ఎవరో తెలీదు.  ఆయన ఎవరు, ఎక్కడినుంచి వచ్చారు అన్న విషయాలు ఏమీ తెలీవు.  భక్తులందరూ ఆయనను పూజించడం, ఆయనకు నైవేద్యాలు సమర్పించడం చూసిన తరువాత ఆయనను ఒక సాధువుగా భావించాను.

క్రమంలో నేను సీటు కోసం అన్ని ఇంజనీరింగ్ కళాశాలలకి దరఖాస్తు పెట్టాను.  వాటిలో కోవర్ గావ్ లో ఉన్న ఎస్.జి.ఎస్. ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వచ్చింది.  ఆవిధంగా నేను కోపర్ గావ్ వెళ్లడం, అక్కడ నేను నా చదువుకొనసాగించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది.  వినోద్ అనే విద్యార్ధి గదిలో నేను చేరాను.  వినోద్ తో కూడా అతని తండ్రి వచ్చారు.  ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతున్న సందర్భంగా వినోద్ ని వాళ్ళనాన్నగారు షిరిడికి తీసుకు వెడుతూ నన్ను కూడా రమ్మన్నారు.  నేను రాను అని చెబుదామనుకున్నాను గాని కోపర్ గావ్ నుండి షిరిడీ 12 కి.మీ. దూరంలోనే ఉండటం వల్ల వెళ్ళి వెంటనే తిరిగి వచ్చేయచ్చు, అదీ కాక గదిలో మేమిద్దరం నాలుగు సంవత్సరాలు కలిసి ఉండి చదువుకోవాలి, అందువల్ల వినోద్ తో స్నేహంగా కలిసి ఉండాల్సిన అవసరం ఎంతయినా ఉంది, ఇవన్నీ ఆలోచించి వాళ్ళతో కూడా షిరిడీకి వెళ్లడానికి ఒప్పుకున్నాను.  ఆరోజుల్లో షిరిడీ భక్తులతో ఎక్కువగా క్రిక్కిరిసి ఉండేది కాదు.  మేము చాలా సులభంగానే దర్శనం చేసుకొన్నాము.  బాబాను దర్శించుకోగానే నామనసుకు ఎంతో ప్రశాంతత లభించింది.  శ్రీసాయిబాబా అనుగ్రహంతో నా ఉన్నత చదువును కోపర్ గావ్ లో ప్రారంభిస్తున్నందుకు నాకెంతో సంతోషం కలిగింది.

ఆతరువాతనుంచి ప్రతినెల మాస్నేహితులం (నేను, వినోద్, అరుణ్) తెల్లవారుజామునే లేచి షిరిడీకి నడచుకుంటూ వెళ్ళి బాబాను దర్శించుకునేవాళ్ళం.  రోజులన్ని చాలా సరదాగా గడిచాయి.

ఆఖరి పరీక్ష అయిపోయింది.  అన్ని పేపర్లు బాగా రాశాను.  పరీక్షా ఫలితాలు వచ్చాయి. ఫలితాలు చూడగానే హతాశుడినయ్యాను.  ఒకే ఒక్క సబ్జెక్టులో తప్పాను.  నన్ను నేనే నమ్మలేకపోయాను.  ఒక్కసారిగా స్పృహ తప్పినట్లయింది.  అప్పుడు నాపరిస్థితి ఎలా ఉందో ఎవారైనా చాలా సులభంగానే ఊహించుకోగలరు.  నా చదువుకు అయ్యే ఖర్చంతా నా కజిన్ భరిస్తున్నాడు.  ఇపుడు నేను నా సోదరుడికి నామొహం ఎలా చూపించగలను?  నన్ను గురించి ఏమనుకుంటాడో అని ఊహించుకోవడానికే చాలా భయం వేసింది.  ప్రతినెల షిరిడికి వెడుతున్నట్లుగానే మరుసటి రోజే షిరిడికి వెళ్లాము.  నా మనసులో ఎన్నో ఆలోచనలు గందరగోళపరుస్తు ఉన్నాయి.  షిరిడీ వెళ్ళేటపుడు బాబాకు సమర్పించడానికి ప్రసాదం తీసుకుని వెడుతూ ఉంటాము.  కాని ఆరోజు తీసుకురావడం మర్చిపోయాము.  అప్పటికే షిరిడీకి బయలుదేరిపోవడం వల్ల వెనుకకు వెళ్లలేని పరిస్థితి.  అందువల్ల ముందుకు సాగిపోయాము.  నామనసులోనే బాబాతో మాట్లాడాను, “నేను ఇంతబాగా చదివి రాసినా కూడా ఎందుకని పరీక్ష తప్పాను?”  వెంటనే నాకళ్ళల్లో నీళ్ళు ఉబికాయి.  షిరిడి చేరుకున్న తరువాత బాబా విగ్రహం ముందు నిలుచుని మనసులోనే సాష్టాంగ నమస్కారం చేసుకొంటూ ప్రక్కకు వెళ్లబోతుండగా పూజారి నా చేతిలో ప్రసాదం ఉన్న సంచీ పెట్టాడు.  నేను బాబాకు సమర్పించడానికి ఏమీ తీసుకురాలేదు.  ఇది నాకెందుకు ఇస్తున్నారు?” అని పూజారిని అడిగాను.  కాని పూజారి నామాటలు వినిపించుకోకుండా సంచీని బలవంతంగా నాచేతిలో పెట్టాడు.  అదే సమయంలో నేను తప్పిన సబ్జెక్టు పేపరును తిరిగి రీవాల్యూయేషన్ చేయిద్దామనాలోచన కలిగింది.  తిరిగి వచ్చిన తరువాత రీ వాల్యూయేషన్ కి పెట్టాను.  బాబా అనుగ్రహంతో ఆపరీక్షలో ఉత్తీర్ణుడినయ్యాను.

కాలేజీ చదువులు పూర్తి చేసుకొని ఇంజనీరుగా ముంబాయికి తిరిగివచ్చాను.  బాబా ఆశీర్వాదంతో నాకు ఉద్యోగం వచ్చింది.  కాలేజీలో చదువుకునే రోజుల్లో ప్రతినెల షిరిడీకి వెడుతుండేవాడిని.  ముంబాయికి వచ్చి అయిదు సంవత్సరాలయిపోయింది కాని షిరిడీకి మాత్రం వెళ్లలేకపోయాను.  కాని శ్రీసాయిబాబా మీద నాభక్తి మాత్రం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది.

నేను మహారాష్ట్రలోని థానే జిల్లా కళ్యాణ్ తాలూకాలో ఉన్న డోంబ్ విలీలో ఒక ఇల్లును అద్దెకు తీసుకున్నాను.  వేలయ్య అనే నా స్నేహితుడు కూడా డోంబివిలీ లోనే ఉంటున్నాడు.  మేమిద్దరం సాయిభక్తులమని మాకు ఒకరికొకరికి తెలియదు.  నేను తమిళంలో సాహిత్య రచనలు చేస్తుండటంతో నేనొక కవిని అని తమిళులందరికీ తెలిసింది.  ఆవిధంగా నాకు వేలయ్యతో పరిచయం కలిగి ఆసాన్నిహిత్యం మమ్మల్ని స్నేహితులను చేసింది.  ఒకసాయి శ్రీ వేలయ్య మాఇంటికి వచ్చాడు.  శ్రీ సాయిబాబా సంస్థానం షిరిడివారు మరాఠీలో ప్రచురించిన శ్రీసాయి ఆరతుల పుస్తకాన్ని తమిళ భాషలోకి అనువాదం చేయించుదామనుకుంటున్నారని చెప్పాడు.  ఇటువంటి వెలకట్టలేని అవకాశం నాకు లభించినందుకు నాసంతోషం చెప్పనలవికాదు.  నా ఒడలంతా పులకరించింది.  అనుకోనివిధంగా ఈ అవకాశం నాకు లభించడం అంతా బాబా అనుగ్రహం తప్ప మరేమీ కాదు.  అది నా అదృష్టంగా భావించాను.  బాబా అనుగ్రహంతో ఆరతులను తమిళభాషలోకి నాలుగయిదు నెలల్లోనే అనువాదం పూర్తి చేసాను.

(అనువాద సమయంలో బాబా చేసిన లీల రేపటి సంచికలో)

(ఇంకా ఉంది)

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)


 


Kindly Bookmark and Share it:

1 comments:

Raja on November 4, 2020 at 5:10 AM said...

మరువను నీ నామం సాయి మరువను నీ నామం

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List