17.01.2021
ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 28 వ.భాగమ్
(పరిశోధనా
వ్యాస కర్త … శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ- కోపర్ గావ్ – షిరిడీ
శనివారమ్ – అక్టోబరు, 19, 1985
శివనేశన్
స్వామి చెబుతున్న వివరాలు…
బాబా
చెప్పిన మాటలు … “నేను పదివేల సంవత్సరాల క్రితమే
ఈ ద్వారకామాయిలో ఉన్నాను”. బాబా అన్న ఈ మాటలు
పుస్తకాలలో కూడా వ్రాయబడి ఉన్నాయి. మీరు చూడచ్చు.
ప్రశ్న --- అయితే
చరిత్రపరంగా గమనిస్తే ఆయన పుట్టుపూర్వోత్తరాలు రహస్యంగానే ఉండిపోయాయి. ప్రత్యేకంగా గుర్తుంచుకోదగిన బోధనలు బాబా బోధించినవి
ఏమయినా ఉన్నాయా? ఉదాహరణకి భక్తిమార్గం…అనగా
భక్తి, శరణాగతి, లేక జ్ఞానమార్గం. ఇటువంటివాటికి
సంబంధించినవి ఉన్నాయా?
జవాబు --- బాబా
ప్రత్యేకించి బోధించినవాటి గురించే మీరు అడిగారు.
నేను అనుకునేదేమిటంటే భగవంతుడిని ప్రతిక్షణం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవడం. అదే నామస్మరణ అనగా భగవంతునియొక్క నామాన్ని నిరంతరం
స్మరిస్తూ ఉండటం. బాబా తనే ఎల్లప్పుడూ అల్లా
నామస్మరణ చేస్తూ ఉండేవారు. ఉర్దూ భాషలో అల్లా
అంటె భగవంతుడు అని అర్ధం. ఆవిధంగా బాబా పెదవులపై
నిరంతరం అల్లా నామస్మరణే జపించబడుతూ ఉండేది.
ఆయనే స్వయంగా తను ఆచరించి తన భక్తులకి, తనను నమ్ముకున్నవారికి ఒక ఉదాహరణగా నిలిచారు. భగవంతుడిని అనుక్షణం గుర్తు చేసుకోవడం అతి ముఖ్యమయిన
విషయమని బాబా ఎప్పుడూ చెబుతూ ఉండెవారు. ఇది
అధ్యాత్మిక మార్గ అభ్యాసంలో సాధన అనీ, చాలా సులభమని చెప్పారు. ఎవరు ఏపని చేస్తున్నా
సరె ప్రతిరోజూ మనం గడుపుతున్న సామాజిక జీవనంలో మన ఉద్యోగ, వ్యాపార విషయాలలో తలమునకలై
ఉన్నా సరే ఈ భగవన్నామ స్మరణని సాధన చేస్తూ ఉండాలి. శారీరకంగా ఎంతో శ్రమిస్తున్నా సరే మానసికంగా తనకిష్టమయిన
భగవంతుడి నామం ఏదయినా సరే సాయిబాబా, రామ, శివ, దానిని స్మరించుకుంటూ ఉండాలి. ఆ భగవన్నామస్మరణ అనేది ఎడతెగకుండా జరుగుతూనే ఉండాలి. ఆవిధంగా మన ఉచ్చ్వాస నిశ్వాసలు జరుగుతున్న సమయంలో
కూడా ఆనామస్మరణ అలవాటయిపోయేటంతగా సాధన చేయాలి.
ప్రశ్న --- అది
నిరంతర సాధన అవుతుందా?
తుకారామ్ --- అవును. ఆవిధంగ సాధన చేసిన సాధకునికి మరణసమయంలో కూడా ఆనామస్మరణ జరుగుతూనే ఉంటుంది. మరణసమయంలో ఎవరయితే భగవంతుని స్మరిస్తూ ప్రాణాలు విడుస్తారో మన శాస్త్రాలలో చెప్పబడినట్లుగా “అంత్యసమయంలో దేనిని స్మరిస్తారో దానినే వారు పొందుతారు”. అనగా సాధకునియొక్క అంతిమ కోర్కె అయిన మోక్షాన్ని పొందుతాడు. అనగా ఆభగవంతునిలో ఐక్యమవుతాడు. అందుచేత ఆలక్ష్యాన్ని చేరుకోవాలంటే జీవితమంతా ఆభగవంతుని స్మరిస్తూ నామస్మరణ చేయవలసిన అవసరం ఉంది. ఆవిధంగా సాధన చేసినట్లయితే మరణసమయంలో భగవంతుని నామస్మరణ దానంతటదే జరుగుతుంది. బాబా చెప్పిన బోధనలలో ముఖ్యంగా గుర్తు పెట్టుకోదగిన విషయం ఇదే. మహారాష్ట్రలోని స్వామి రామదాసు ఎల్లప్పుడూ రామనామాన్నే జపిస్తూ ఉండేవారని మీకు తెలుసు. అందువల్లనే ఆయనకు జ్ఞానసిధ్ధి కలిగి శ్రీరామచంద్రులవారు దర్శనమిచ్చారు.
ఆయన మహారాష్ట్రలో చాలా ప్రసిధ్ధి
చెందారు. అందుచేత హృదయపూర్వకంగా నామజపం చేసినవారు
ఎవరయినా సరే వారికి అందులోని అసాధారణమయిన శక్తిప్రభావం అర్ధమవుతుంది. బాబా ఈవిషయం గురించే ప్రముఖంగా బోధించారు. ఆయన మరొక విషయాన్ని కూడా చెప్పారు. అదే, అన్నదానం. బాబా తనే స్వయంగా వండి అందరినీ పిలిచి అన్నాదానం
చేసేవారు.
ప్రశ్న --- ఆయనే
స్వయంగా వండేవారా?
తుకారామ్ --- అవును. అయనే స్వయంగా శ్రమించి, అన్నీ సిధ్ధం చేసుకునేవారు. వంటకు సంబంధించిన విషయాలలో ఎవరినీ జోక్యం చేసుకోనిచ్చేవారు
కాదు. వంటకు కావలసిన దినులులు, కూరలు అన్నీ
సమస్తం బజారుకు వెళ్ళి తన డబ్బుతో కొని తెచ్చేవారు. ఆయన ఒక్కరే స్వయంగా వండేవారు. వంటకాలన్నీ సిధ్ధమయిన తరువాత అక్కడున్నవారినందరినీ
పిలిచి, ధనిక, బీద తేడాలేకుండా అందరికీ భోజనాలు పెట్టేవారు.
ప్రశ్న --- బాబా
హిందూ దేవుళ్లయిన రామ, కృష్ణ మొదలయిన నామాలను ఏమీ స్మరించకుండా నిరంతరం అల్లా నామాన్నే
ఎందుకని జపించేవారో దీని గురించి స్వామి అభిప్రాయం ఏమిటో ఆయనను అడిగి చెబుతారా?
జవాబు --- రెండుమతాలవారు
ఐకమత్యంగా ఉండాలని బాబా కోరుకొన్నారు. అందువల్ల
ఆయన ముస్లిమ్స్ తో “రామ రామ అని స్మరించమని, అల్లా మీకు మేలు చేస్తాడు” అని అనేవారు
హిందువులతో “అల్లామాలిక్” అనేవారు. (స్వామి, దుబాసీ ఇద్దరూ నవ్వారు). “భగవంతుడు ఒకడే”
అని బాబా ఎల్లప్పుడూ చెబుతూ ఉండేవారు. భగవంతుడు
ఒకడే అయినా ఆయనను చేరుకునే దారులు మాత్రమే వేరు అని చెప్పారు. మతం గురించి వాదించడానికి కారణమంటూ లేదు. ఉదాహరణకి బాబా మసీదులో ధుని నిరంతరం మండుతూ ఉండేలా
ఏర్పాటు చేసారు. తులసీ బృందావనం నిర్మించారు. క్రైస్తవుల చర్చిలో ఉన్నట్లుగా పెద్దగంటను కూడా
కట్టారు. శిక్కు భక్తులు ద్వారకామాయిని ఒక
గురుద్వారాగా భావిస్తారు. మసీదులోకి అందరికీ
ప్రవేశం ఉంటుందని చెప్పడానికి బాబా దానికి ద్వారకామాయి అని పేరుపెట్టారు. బాబా హిందూ దేవుళ్ళని కూడా స్మరిస్తూ ఉండేవారు. కొంతమంది భక్తులతో ఆయన “నేను స్వఛ్చమయిన బ్రాహ్మణుడిని”
అనేవారు. మరికొందరితో “నేను ముస్లిమ్”ని అనేవారు. “నేను ముస్లిమ్ ని అయినా మీరు మీ గురువునే ఆరాధిస్తూ
ఉండండి అనేవారు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment